Monday, August 8, 2011

రెండు కళ్ళ సిద్ధాంతం!

 

మన ఈ వ్యాసానికి కారకుడు, ప్రేరకుడు అయిన చంద్రబాబు కళ్ళ భాషను చెప్పటం ఆషామాషీ కాదు.. ఆయన కళ్ళు చాలా శక్తిమంతమైనవి.. ఆయన కళ్ళు చూస్తాయి.. ఎదుటివాణ్ణి చదువుతాయి.. తామేవీ చెప్పవు. వాటి భాష ఎవరికీ అర్థంకాదు.. వాటి చూపులు ఎవరికీ అందవు... ఆయన ఎదుటి వాణ్ణి కళ్ళారా చూస్తాడు. కన్నార్పకుండా చూస్తాడు. రెండు కళ్ళు కాదు.. ఎవరికీ కనపడని నేత్రం ఆయనకు మరోకటుంది!!!

ఈ మధ్యన ఉన్నట్లుండి రాష్ట్రంలో కళ్ళకు ప్రాధాన్యం పెరిగింది. అన్ని ఇంద్రియాల్లోకి నయనం ప్రధానం అని అనే వాళ్లు మనిషి శరీరంలో ఏ భాగంలో చిన్న ఇబ్బంది కలిగినా కొద్దిసేపు ఓర్చుకోగలడుగానీ కంట్లో చిన్న నలుసు పడితే లిప్తపాటు కూడా తట్టుకోలేడు. అది బైటికొచ్చిందాకా అల్లాడిపోతాడు. ఆ మధ్యన ఓ సినిమాలో ఒక హీరో 'కత్తులతో కాదురా.. కంటిచూపుతో చంపేస్తా ..' అంటూ బెదిరిస్తాడు.. కంటి పవర్ అలాంటిదన్నమాట... 'నిన్ను జీవితాంతం కళ్ళల్లో పెట్టి చూసుకుంటా..' అని అంటుంటారు. కన్ను అనేది అంత సురక్షిత ప్రాంతమన్న మాట. 'మేం బావుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటావేం..' అని తిట్టిపోస్తారు.

కన్ను అసూయపరురాలు.. 'నీ కళ్ళు చెబుతున్నాయి'.. అంటే కళ్ళు గొప్ప భావ ప్రకటనా సాధనాలు.. 'కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే' అన్న పాట కళ్ళు ఓ నలభై రెండు అంగుళాల టి.వి. అని చెప్పకనే చెబుతుంది.. 'కనుపాప కరవైన కనులెందుకు' అనే పాట నేత్రరహిత జీవిత నిష్ప్రయోజకత్వాన్ని చెబుతుంది... ఇలా చె ప్పుకుంటూపోతే కంటి గురించి ఓ పి.హెచ్.డి. చేయొచ్చు.. ఓ గ్రంథం రాయొచ్చు... కొంతమంది కళ్ళతోనే అనేక భావాలు పలికిస్తుంటారు. కొంతమంది ఎన్ని భావాలు పలికించినా అర్థం కావు. అలాంటి వాళ్ళ కంటి భావాల్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేసిన వాళ్ళ కళ్ళు తిరగాల్సిందే గానీ ఆ ప్రయత్నం ఫలించదు..."నువ్వెంత కోపంగా ఉన్నావో నీ ముఖం చూస్తే తెలుస్తోంది'' అని కొంతమంది అంటారు.

ఇక్కడ ముఖం అంటే నూటికి నూరు పాళ్ళు కళ్ళే... కళ్ళు లేకుండా భావాన్ని ప్రకటించే సామర్థ్యం వట్టి ముఖానికి లేదు. అలసట, ఆత్మ విశ్వాసం, ఆత్మీయత, ఆగ్రహం, ఆవేశం, ఆపేక్ష, అసూయ ఇలా.. ఏ భావాన్నయినా, ఏ రసాన్నయినా ప్రదర్శించగల కెపాసిటీ కళ్ళకే ఉంది. భగవంతుడు ఇంత గొప్ప కళ్ళను మనిషికిచ్చి మళ్ళీ వాటికి చత్వారం అనీ, శుక్లాలనీ, కండ్లకలకలనీ రకరకాల జబ్బుల్నిచ్చాడు. అందమైన కళ్ళకు అద్దాలిచ్చాడు.. వాటిల్లో మళ్ళీ ప్లస్సులు, మైనసులు... ఇవన్నీ మైనసులు.. ఇవ న్నీ ఒక ఎత్తయితే దేవుడు చేసిన పెద్దపొర బాటు అంధత్వం.. సరే.. ఆ విషయాలన్నీ కొద్దిసేపు పక్కన పెట్టి ప్రస్తుతానికొద్దాం.. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో జరుగుతున్న ప్రాంతీయ ఉద్యమాల నేపథ్యంలో 'రెండు కళ్ళ సిద్ధాంతం' తెరమీదికొచ్చింది.

అటు తెలంగాణవాదులు, ఇటు సమైక్యాంధ్రవాదులు ఓకే ఒక అజెండాతో ఒంటికంటి పోరాటం చేస్తుంటే చంద్రబాబు నాయుడు మాత్రం రెండుకళ్ళ పోరాటం చేస్తున్నారనే వివాదం ప్రధానంగా వినిపిస్తోంది. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలు రెండూ తనకు రెండు కళ్ళులాంటివనీ, రెండు ప్రాంతాలలో పార్టీని కాపాడుకోవటం తనకు ప్రధానమనీ చంద్రబాబు చెబుతూనే వచ్చారు. మొన్నీ మధ్యన జరిగిన మహానాడు వేదిక మీద మరోసారి బల్ల గుద్ది మరీ చెప్పారు.. మూడ్రోజుల క్రితం నా దగ్గరకు మంచి ఊపుమీద వచ్చిన మా సత్తిబాబు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ "రెండు కళ్ళ మ్యాటర్ బాబు ఆదినుంచీ చాలా క్లియర్‌గానే చెబుతున్నాడు.

ఇంకా గట్టిగా చెప్పాలంటే తెలంగాణ, సీమాంధ్ర విషయాల్లో అన్ని పార్టీలకంటె చంద్రబాబే స్పష్టంగా ఉన్నారు. నీకది కావాలా.. ఇది కావాలా.. అంటే రెండూ కావాలి అని ఖచ్చితంగా చెబుతున్నారు.. ఇంతకంటె క్లారిటీ ఏం కావాలి?'' అంటూ హై పిచ్‌లో అరిచేశాడు. వాణ్ణి కొంచెం కూల్ చేసి "రాజకీయాల్లో అలాంటిదాన్ని కప్పదాటు వైఖరి అంటారు. మంచో చెడో ఏదో ఒకదాని మీద నిలబడాలి...'' అని ప్రవచించాను.. వాడు ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా " నేను నీకు మంచి స్నేహితుడినే కదా..'' అనడిగాడు. "దాంట్లో సందేహమేముంది...'' అన్నాను. "నేనేమడిగినా ఇస్తావా..'' మళ్ళీ అడిగాడు సత్తిబాబు.. "నా దగ్గరుంటే ఇస్తాను.'' చెప్పాన్నేను. "నీ ద గ్గరున్నదే.. నీ రెండు కళ్ళల్లో ఒకదానిని నాకివ్వు.. కుడి కన్నిస్తావా.. ఎడమ కన్నిస్తావా..?'' అడిగాడు వాడు.

నేను అదిరిపాటును కప్పిపుచ్చుకుంటూ 'ఏ కన్నయినా ఎలా ఇస్తాను?' అన్నాన్నేను. "నేను చేప్పేది అదే... నువ్వివ్వలేనిది చంద్రబాబు ఎలా ఇస్తాడు.. తన కంటిదాకా వస్తేగానీ తెలియదనీ..'' అంటూ ముక్తాయించాడు.. నాకు కోపం వచ్చింది. "నువ్వు వితండంగా వాదిస్తున్నావు.. రెండు కళ్ళ సిద్ధాంతం అంటే కళ్ళు, కనుగుడ్లు, రెప్పలు అని కాదు.. చంద్రబాబు ధోరణికి ఇతర పార్టీల వాళ్ళు పెట్టుకున్న ముద్దుపేరది....'' అంటూ వాడికి వివరించే ప్రయత్నం చేశాను.. వాడు పెద్దగా నవ్వేసి "అంటే ఆ పార్టీల వాళ్ళ ఉద్దేశ్యం ఏవిటి.. చంద్రబాబును తెలంగాణకు ఒక కన్నూ సీమాంధ్రకు ఒక కన్నూ ఇచ్చేయమనా... మరీ దుర్మార్గం కాదూ... అంటే ఆ తర్వాత చంద్రబాబు ఏదయినా మాట్లాడితే 'గుడ్డి కన్ను తీస్తే ఎంత....? మూస్తే ఎంత? అందామనా..?' అంటూ కొత్తర్థం తీశాడు సత్తిబాబు.

చర్చ వేరే దారి మళ్ళుతోందని అనిపించి వాణ్ణి పంపేందుకు ప్రిపేరయ్యాను. "ఎవడి కన్ను ఎట్టాపోతే మనకెందుగ్గానీ నువ్వు బయల్దేరు..'' అన్నాను. అంతే... వాడొక్కసారిగా ఫైర్ అయ్యాడు. "అందరూ ఇలా అనుకోబట్టే మన స్టేట్ ఇలా అయిపోతోంది... ఎంతసేపటికీ కళ్ళ సిద్ధాంతం చెప్పి చంద్రబాబును ఇబ్బందుల్లో పెడదామా.. లేక మరో నాయకుణ్ణి ఇరకాటంలో పెడదామా.. అని తప్పితే రాష్ట్రాన్ని కళ్ళల్లో పెట్టి చూసుకుందామని అలోచించకపోతే ఎలా???'' అని అరిచాడు. "నువ్వు మాట్లాడుతోంది తప్పు.. ఎవరి ఉద్యమాలు వాళ్ళవి. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి మనకు ఆ రాజకీయాలు వద్దు'' నిష్కర్షగా చెప్పాన్నేను.

నాతో వాదించి ఉపయోగం లేదనుకున్నాడో ఏమో మరి వాడు విసుక్కుంటూ విసా విసా వెళ్ళిపోయాడు... రెండు కళ్ళ గురించి రెండు చెవులు వాచిపోయేంతగా వాదించుకున్నాం అనిపించింది. సత్తిబాబు ముందు అంటే వాడు మరీ రెచ్చిపోతాడేమోనని మాట్లాడలేదు గానీ వాడు చెప్పిందాంట్లోకూడా ఎంతో కొంత సమర్థనీయమైన వాదన లేకపోలేదు అనిపించింది. రాష్ట్రం మొత్తం మీద బలంగా ఉన్న ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీని 'నీకే ప్రాంతం కావాలో కోరుకో..' అంటే ఏది కోరుకుంటుంది....? ఇద్దరు పిల్లలున్న ఒక తల్లిని నీకే బిడ్డ కావాలో తేల్చుకో... అంటే ఏ నిర్ణయం తీసుకుంటుంది? నాయకుడన్నవాడు పార్టీని, క్యాడర్‌ను కంటిపాపలాగా చూసుకోవాలి అంటారు.

కళ్ళు రెండయినా చూపు ఒకటే.. గుడ్లు రెండయినా పయనం ఒకటే.... రెప్పలు రెండయినా ఒకేసారి మూసుకుంటాయి. తెరుచుకుంటాయి... మరి దీన్ని రెండుగా విభజించటం ఎలా.. అన్నది మిలియన్ డాలర్ ప్రశ్న.. ఒక విధంగా చంద్రబాబు అదృష్టవంతుడు. కాంగ్రెస్ పరిస్థితి మరీ దయనీయం.. తెలంగాణలో కె.కె. కన్ను.. సీమలో టి.జి. వెంకటేష్ కన్ను.. ఆంధ్రలో కావూరి కన్ను.. ఉత్తరాంధ్రలో బొత్స కన్ను.... ఇవికాక జగన్ పరంగా ఒక దెబ్బతిన్న కన్ను.. ఇలా అయిదు కళ్లు.. కాంగ్రెస్ పంచనేత్రి... కొన్నాళ్ళ తరవాత తెలంగాణతోపాటు సీమ, ఆంధ్ర, ఉత్తరాంధ్ర, మన్యం ప్రాంతీయ ఉద్యమాలు బలపడితే అన్ని పార్టీలకు అయిదేసి కళ్ళు కావాలేమో.. అంకితభావంతో ఒక ప్రాంతానికి పరిమితమై సిన్సియర్‌గా ఉద్యమాలు చేస్తున్న పార్టీల పరిస్థితి ఫరవాలేదు గానీ రాష్ట్రం మొత్తం మీద విస్తరించి ఉన్న పార్టీలకు ఈ సంకటస్థితి తప్పదేమో.. అయినా అవన్నీ రాజకీయాలు.. నాకు పెద్దగా అవగాహన లేదు కాబట్టి లోతుల్లోకి వెళ్ళటం కరెక్ట్‌కాదు.. అనుకుంటాంగానీండి.

తను అర్చకత్వం చేస్తున్న గుళ్ళోనే దొంగతనం చేసిన గుడి అర్చకుడికి ఒక కంట్లో వెంకటేశ్వరస్వామి, మరో కంట్లో పస్తులు పడుకుంటున్న తన కుటుంబ సభ్యులు ఉంటే చివరికి కుటుంబ నేత్రానికే ప్రాధాన్యం ఇచ్చాడు గదా. నా దృష్టిలో రెండు కళ్ళ సిద్ధాంతం అంటే అదీ... డీజిల్, పెట్రోల్ రేటు రోజురోజుకు ఆకాశానికి అంటుతున్నా.. అందుకు తన పాకెట్ పర్మిట్ చేయకపోయినా బండి నడవనిదే బతుకుబండి నడవదు కాబట్టి కడుపుమంటను అదిమిపెట్టి ఒక కంట్లో 'జేబులో పైసల్' మరో కంట్లో 'బండిలో ఆయిల్' అనే కాన్సెప్ట్‌లో ఆయిల్ వైపే మొగ్గుచూపుతాడు మధ్యతరగతి జీవి. ఇదీ రెండు కళ్ళ సిద్ధాంతం.... ఇలా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో ఎన్నో లక్షల జతల కళ్ళు.. వాటి వెనుక కళ్ళు చెమర్చే కథలు.. గమ్మత్తేవిటంటే... మన ఈ వ్యాసానికి కారకుడు, ప్రేరకుడు అయిన చంద్రబాబు కళ్ళ భాషను చెప్పటం ఆషామాషీ కాదు.. ఆయన కళ్ళు చాలా శక్తిమంతమైనవి.. ఆయన కళ్ళు చూస్తాయి.. ఎదుటివాణ్ణి చదువుతాయి.. తామేవీ చెప్పవు. వాటి భాష ఎవరికీ అర్థంకాదు.. వాటి చూపులు ఎవరికీ అందవు... ఆయన ఎదుటి వాణ్ణి కళ్ళారా చూస్తాడు. కన్నార్పకుండా చూస్తాడు. రెండు కళ్ళు కాదు.. ఎవరికీ కనపడని నేత్రం ఆయనకు మరోకటుంది!!!

No comments:

Post a Comment