Monday, August 8, 2011

చైనాదాకా వస్తే..


తనదాకా వస్తే కానీ తత్త్వం బోధపడదు- అన్న సూక్తిని ఇప్పుడు చైనా నిజం చేస్తోంది.పాకిస్తాన్ బీభత్సం గురించి ఇప్పుడు చైనా ప్రభుత్వం నిరసన తెలుపుతోంది. గత నెల చివరి రెండురోజులలో చైనాలోని సింకియాంగ్-ఝింజియాంగ్-ప్రాంతంలో జిహాదీ బీభత్సకారులు జరిపిన హత్యాకాండకు దాదాపు ఇరవైమంది ‘హాణ్’ చైనీయులు బలైపోయారు. చైనీయ భాష మాట్లాడేవారు హాణ్ చైనీయులు. సింకియాంగ్‌పై చైనా దురాక్రమణ కొనసాగుతోందని భావిస్తున్న ఇస్లాం మతస్థులు ‘హూణ్’ తెగకు చెందినవారు. శతాబ్దుల తరబడి చైనాలో కలసిపోయిన సింకియాంగ్ ప్రాంతాన్ని మళ్లీ స్వతంత్ర దేశంగా రూపొందించాలన్న లక్ష్యంతో జిహాదీలు, వారి మద్దతుదారులు బీభత్సకాండను కొనసాగిస్తుండడం నడుస్తున్న చరిత్ర. జిహాదీ బీభత్సకారులు దాడి చేయడం ఇది మొదటిసారి కాదు. దాదాపు రెండు దశాబ్దులుగా చిటపటలను కలిగిస్తున్న జిహాదీలు ఐదేళ్లుగా తరచుగా పటపటలను ప్రజ్వరిల్లచేస్తున్నారు. అయితే ఈ బీభత్సకాండ వెనుక పాకిస్తాన్ ప్రభుత్వం విభాగాల హస్తం ఉందని చైనా ప్రభుత్వం ఆరోపించడం మాత్రం ఇదే మొదటిసారి! 2008 ఆగస్టులో జిహాదీలు జరిపిన దాడులకు ఇరవై ఏడుమంది హాణ్ చైనీయులు బలైపోయిన తరువాత, చైనా ప్రభుత్వం అనుమానం ఉన్న ముస్లింలను తీవ్రంగా అణచివేసే కార్యక్రమం ఆరంభించింది. జిహాదీ టెర్రరిస్టులన్నసాకుతో సాధారణ ముస్లిం ప్రజలను సైతం సైనిక దళాలు, పోలీసులు భారీగా మట్టుపెట్టినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. చైనా సైనిక దళాలవారు ఈ ఆరోపణలను లక్ష్యపెట్టకుండా అమిత కర్కశంగా అనేక వారాలపాటు బీభత్స వ్యతిరేక కలాపాలను కొనసాగించారు. బీభత్సకారులకు స్థావరాలుగా మారిపోయాయన్న అనుమానంతో ఝింజియాంగ్ ప్రాంతంలోని అనేక మసీదులలోకి పోలీసులు సైనికులు చొరబడి గాలింపు చర్యలను జరిపారు. కొన్ని మసీదులను నేలమట్టం కూడ చేశారు. ఈ ప్రభుత్వ చర్యల కారణంగా ఆగ్రహించిన ముస్లింలు- ఉయఘర్‌లు-ఫెద్దఎత్తున నిరసనలు తెలిపారు, ప్రదర్శనలు జరిపారు. చరిత్రలో హూణులుగా ప్రసిద్ధి చెందిన వారిని ప్రస్తుతం సింకియాంగ్‌లో ‘ఉయిఘర్’లని పిలుస్తున్నారు! జిహాదీలు ఒకవైపు, చైనా ప్రభుత్వ భద్రతాదళాలు మరోవైపు సృష్టించిన భయోత్పాతం చివరికి ఉయిఘార్‌లకు, హాణ్ చైనీయులకు మధ్య మత కల్లోలాలకు దారి తీసింది! ఇంత జరిగినప్పటికీ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని మాత్రం చైనా ప్రభుత్వం అప్పుడు విమర్శించలేదు. అంతేకాక 2009లో పెద్దఎత్తున చెలరేగిన మతకల్లోలాల సందర్భంగా కూడ చైనా ప్రభుత్వం పాకిస్తాన్‌ను నిందించలేదు! ఇప్పుడు మళ్లీ మొదలైన జిహాదీ దాడుల తరువాత చైనా ప్రభుత్వ వైఖరి మారి పోయింది!
సింకియాంగ్‌లోని పట్టుబాట - సిల్క్‌రోడ్- ను ఆనుకుని ఉన్న కష్గర్ నగరంలో గతనెల 30వ, 31వతేదీలలోహత్యాకాండ జరిపినవారు పాకిస్తాన్‌లోని శిబిరాలలో శిక్షణ పొందిన వారని చైనా ప్రభుత్వం ఆరోపించింది. టెర్రరిస్టులను అణచివేసే కార్యక్రమాన్ని, గాలింపు చర్యలను సింకియాంగ్ ప్రాంతీయ పోలీసులు, చైనా సైనికులు మళ్లీ ముమ్మరం చేయడం వేరుసంగతి. 2009లో జరిగిన విధంగా సింకియాంగ్‌లో హూణుల -ఉయిఘర్‌లు- కూ, హాణచైనీయులకూ మధ్య మత కల్లోలాలు చెలరేగే ప్రమాదం కూడ ఉందన్నది జరుగుతున్న ప్రచారం! 2009 జూలై నాటి మత కల్లోలాలకు దాదాపు రెండు వందలమంది బలైపోయారు. వీరిలో అత్యధికులు ముస్లిమేతరులు. ఆ తరువాత చైనా ప్రభుత్వ దళాలు రంగంలోకి దిగి జరిపిన కాల్పులలో ఎక్కువ మంది ఉయిఘర్లు మరణించారట. అదే కథ ఇప్పుడు పునరావృత్తం అయినట్టయితే ఆశ్చర్యపోనక్కరలేదు. కానీ ఇంతకాలం పాకిస్తాన్‌లోని జిహాదీ బీభత్స ముఠాలను, వాటిని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్స స్వభావాన్ని నిరసించని చైనా ప్రభుత్వం అకస్మాత్తుగా పాకిస్తాన్‌ను దూషించడమే ఆశ్చర్యకరం! మన దేశానికి వ్యతిరేకంగా దశాబ్దులుగా పాకిస్తాన్ ప్రభుత్వం జరిపిస్తున్న బీభత్సకాండ ను చైనా ప్రభుత్వం ఇంతవరకు నిరసించలేదు సరికదా కనీసం ప్రస్తావించలేదు! పైపెచ్చు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి పదకొండు వేలమంది సైనికులను పంపించడం ద్వారా చైనా ప్రభుత్వం పాకిస్తాన్ భీభత్స ప్రభుత్వానికి బాసటగా నిలిచింది!
భారత వ్యతిరేక జిహాదీ బీభత్సకాండను మాత్రమేకాదు, ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న మతోన్మాద మారణకాండను సైతం చైనా ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు! 1989, 2005 సంవత్సరాల మధ్య సూడాన్‌లో ఉమర్ అల్ బషీర్ నాయకత్వంలోని మతోన్మాద సైనిక ప్రభుత్వం లక్షలాదిమంది ముస్లిమేతర ప్రజలను ఊచకోత కోయించింది. ఈ మత విద్వేషాలు కారణంగానేఇటీవల సూడాన్ మత ప్రాతిపదికపై రెండుగా చీలిపోయింది! కానీ దశాబ్దులపాటు చైనా ప్రభుత్వం సూడాన్‌లోని ఇస్లాం మత ప్రభుత్వాన్ని సమర్థ్ధించింది. చైనా మద్దతు కారణంగానే అమెరికా తదితర పాశ్చాత్య దేశాల ప్రభుత్వాల వారు ఉమర్ బషీర్‌ను ఏమీ చేయలేకపోయారు. ప్రజలను సామూహికంగా హత్యలు చే యించిన నేరానికి బషీర్‌ను అరెస్టు చేసి విచారణ జరిపించాలన్న అంతర్జాతీయ నేర నిరోధక న్యాయస్థానం-ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్-వారి ప్రయత్నాలు కూడ చైనా ప్రభుత్వం ప్రతిఘటించిన కారణంగానే వమ్మయిపోయాయి! ఇప్పుడు జిహాదీల ప్రమాదాన్ని చైనా కూడ గుర్తించిందన్న సత్యం పాకిస్తాన్‌కు నిరసన తెలపడం ద్వారా స్పష్టమైంది! చైనా ప్రభుత్వం నిరసన తెలియచేయగానే పాకిస్తాన్ నాయకులకు వెన్నున వణుకు పుట్టుకురావడం మన ప్రభుత్వం పరిశీలించి పాఠం నేర్చుకోదగిన పరిణామం. సింకియాంగ్‌లో దాడులుజరిపింది పాకిస్తాన్‌లో తర్ఫీదు పొందిన బీభత్సకారులేనని స్థానిక ప్రభుత్వం ప్రకటించగానే పాకిస్తాన్ ప్రభుత్వ నిఘా విభాగం-ఇంటర్‌సర్వీసెస్ ఇంటలిజెన్స్-ఐఎస్‌ఐ-అధిపతి షుజాపాషా చైనా రాజధాని బీజింగ్‌కు పరిగెత్తుకుని పోయాడు ! తమదేశంలోని టెర్రరిస్టులను పట్టి చైనాకు అప్పచెప్పగలమని ఇస్లామాబాద్‌లో పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖవారు చైనా అడగకుండానే హామీ ఇచ్చారు. మన ప్రభుత్వం వలె ప్రాధేయపడే ధోరణిలో కాక ఆదేశించే ధోరణిలో చైనా ప్రభుత్వం ప్రవర్తిస్తుండడమే పాకిస్తాన్ ప్రభుత్వం మోకరిల్లుతుండడనికి కారణం! చర్చల మార్గం ద్వారా కాక, చర్యల బాట ద్వారానే పాకిస్తాన్ దారికి వస్తుందన్నది కాష్గర్ బీభత్సకాండ తరువాతి పరిణామాలు స్పష్టం చేస్తున్న విషయం. టిబెట్ వలెనే ఝింజియాంగ్ కూడ చైనాలో భాగం కాదు! తూర్పు తురుష్క స్థానంగా చరిత్రలో ప్రసిద్ధికెక్కిన ఈ ప్రాంతాన్ని పంతొమ్మిదవ శతాబ్దిలో చైనా పూర్తిగా ఆక్రమించుకుంది, 1959లో టిబెట్‌ను ఆక్రమించింది. ఈ రెండు ప్రాంతాలలోను స్వతంత్ర ఉద్యమాలు బలం పుంజుకుంటున్నాయి. కానీ సింకియాంగ్‌లో బీభత్సకారులను, టిబెట్‌లో ఉద్యమకారులను చైనా ప్రభుత్వం కర్కశంగా అణచివేస్తోంది! కాశ్మీర్ మనదేశంలో అనాదిగా భాగం! అలాంటి కాశ్మీర్‌ను దేశంనుండి విడగొట్టాలని కుట్ర పన్నుతున్న ముఠాల పట్ల మన ప్రభుత్వం మాత్రం మెతక వైఖరిని ప్రదర్శిస్తోంది .  

No comments:

Post a Comment