Monday, March 5, 2012

కోల్ బెల్ట్ లో జార్ఖండ్ తరహా బొగ్గు మాఫియా

బొగ్గు మాఫియా..!

  • 05/03/2012
కరీంనగర్, మార్చి 4: రామగుండం పారిశ్రామిక ప్రాంతం క్రమంగా కోల్ మాఫియాకు అడ్డాగా మారుతోంది. బహిరంగ మార్కెట్‌లో టన్నుల బొగ్గుకు 1500 రూపాయల పై చిలుకు ధర పలుకుతుండటం బొగ్గు దొంగల పంట పండిస్తోంది. దాంతో రామగుండం, సెంటినరి కాలనీ, ఎన్‌టిపిసి ప్రాంతాల్లో బొగ్గు చౌర్యం ఒక వృత్తిగా మారింది. ఇదంతా ఒకెత్తయితే ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లికి చెందిన ఓ వ్యాపారి ఏకంగా కూలీలను పెట్టి మరీ బొగ్గు చౌర్యం చేయిస్తూ తాను రెండు చేతులా ఆర్జించటమే కాకుండా స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు, పోలీసులకు ముడుపులు ముట్టజెపుతూ ధర్జాగా అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సింగరేణి, ఎన్‌టిపిసి సిబ్బంది కూడా శక్తి వంచన లేకుండా యధాశక్తి సహకరిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఫలితంగా సింగరేణి విస్తరించి ఉన్న నాలుగు జిల్లాల్లో ఏటా బొక్కసానికి దాదాపు 12 కోట్ల రూపాయల పైచిలుకు చిల్లు పడుతున్నట్లు అంచనా. బెల్లంపల్లి, మందమర్రి, భూపాలపల్లి, కొత్తగూడెం, ఇల్లందు ప్రాంతాల్లోనూ దాదాపు ఇదే తరహాలో బొగ్గు తస్కరించబడుతున్నట్లు తెలుస్తోంది.
నల్ల బంగారంగా పిలువబడుతున్న బొగ్గు అక్రమార్కులకు కాసుల పంట పండిస్తోంది. సింగరేణి గనులు విస్తరించి ఉన్న రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కొంతమంది బడా రాజకీయ నాయకులు, పోలీస్ అధికారుల దన్నుతో జార్ఖండ్ కోల్ మాఫియాను తలదనే్న రీతిలో ఏటా సుమారు 12 కోట్ల రూపాయల విలువైన బొగ్గు లూటీ యదేశ్చగా సాగిపోతోంది. ఈ తతంగంలో రాజకీయ నేతలతో పాటు సింగరేణి, నేషనల్ థర్మల్ పవర్ స్టేషన్ సిబ్బంది, సింగరేణి సెక్యూరిటీఫోర్స్, సిఐఎస్‌ఎఫ్ సిబ్బంది పాత్ర కూడా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల మాటలను బట్టి అర్థమవుతోంది. కరీంనగర్ జిల్లాలో ఈ వ్యవహారం గడచిన కొనే్నళ్లుగా గుట్టుగా సాగిపోతున్నప్పటికి ఇటీవలి కాలంలో మరీ అధికంగా చౌర్యం జరుగుతున్నట్లు గుర్తించారు. ప్రధానంగా రైళ్ల వ్యాగన్ల నుండే బొగ్గును తస్కరించడం ఎక్కువైపోయినట్లు గుర్తించారు. అదిలాబాద్ జిల్లా బెల్లంపల్లికి చెందిన ఓ వ్యాపారి సగటున రోజుకు 2 లక్షల నుండి 3 లక్షల రూపాయల వరకు బొగ్గు చౌర్యం కోసం కూలీలకు పెట్టుబడి పెడుతున్నట్లు తెలుస్తోంది. సుమారు రెండు వందల మంది కూలీలకు రోజుకు 200ల నుంచి 250 రూపాయల వేతనం చెల్లించి ఎన్‌టిపిసికి బొగ్గు రవాణా చేస్తున్న రైళ్ల వ్యాగన్ల నుండి 3 కిలోమీటర్ల పొడవునా బొగ్గును డంపింగ్ చేయిస్తున్నట్లు చెబుతున్నారు. రామగుండం థర్మల్ స్టేషన్‌కు విద్యుత్ ఉత్పాదన కోసం ప్రతిరోజు సుమారు రెండు రేకులు అంటే 40 వేల టన్నుల బొగ్గు అవసరమవుతుంది. దానికి అవసరమైన బొగ్గు నిల్వలు రామగుండం పరిధిలోని ఒపెన్‌కాస్ట్-1, 2, 3ల ద్వారా సరఫరా చేస్తున్నారు. రోజుకు మూడు రైళ్లద్వారా ఎన్‌టిపిసికి ఈ పరిమాణాన్ని రవాణా చేస్తున్నారు. అయితే అక్రమ బొగ్గు వ్యాపారంలో అరితేరిన బెల్లంపల్లికి చెందిన వ్యాపారి కూలీలను నియోగించి ఎల్కలపల్లి గేట్, లక్ష్మిపూర్, సెంటినరీ కాలనీ తదితర ప్రాంతాల్లో రైల్వే వ్యాగన్ల నుండి కిందపడేసి సంచుల్లో నింపి చెట్లపొదల్లో దాచిపెట్టి రాత్రి కాగానే ఆయా బ్యాగుల్లో ఉన్న బొగ్గు నిల్వలను లారీల్లోకి మార్చి రాష్ట్ర రాజదాని పరిసరాల్లో ఉన్న వివిధ రకాల పరిశ్రమలు, ఫెర్రోఅల్లాయిస్ ఫ్యాక్టరీలకు విక్రయిస్తున్నారు. అంతేకాకుండా కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని ఇటుక బట్టీ వ్యాపారులకు టన్నుకు 15 వందల రూపాయలు మొదలుకుని 1650 వరకు విక్రయిన్నట్లు తెలుస్తోంది. తన అక్రమ తతంగానికి అడ్డు తగలకుండా ఉండేందుకు సదరు వ్యాపారి స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసులకు ప్రతి నెలా నజరానగా భారీ మొత్తంలో సొమ్ములు ముట్టజెబుతున్నట్లు చెబుతున్నారు. అంతే కాదు కంచే చేను మేసిందన్నట్లుగా సాక్షాత్తు సింగరేణి అదికారులకు కూడా ఈ పాపంలో వాటాలున్నట్లు అరోపణలున్నాయి. అలాగే సింగరేణి ఆస్తుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన సెక్యూరిటీ సిబ్బందికి కూడా భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఒసిపి-2 డంప్ యార్డు నుండే బొగ్గు చౌర్యం అధికంగా జరుగుతున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసినా సంబందిత పోలీస్ అధికారులు గాని, సింగరేణి యాజమాన్యం కాని పట్టించుకున్న పాపాన పోలేదు. పైపెచ్చు బొగ్గు అక్రమ డంపింగ్‌కు పాల్పడే ముఠాలు ముందుగానే సంబందిత పోలీసులు, సిబ్బందికి సమాచారం అందిస్తారని, తద్వారా దొంగతనం జరుగుతున్నప్పుడు సిబ్బంది ఆ ప్రాంతాల వైపు కనె్నత్తికూడా చూడరని స్థానికులు చెబుతుండటం ఈ సందర్బంగా ఎంతైనా గమనించదగ్గ విషయమే. ఎన్‌టిపిసికి బొగ్గు సరఫరా చేసే రైల్వే వ్యాగన్లలో ముందుగానే పథకం ప్రకారం ఎక్కే కూలీలు ఎల్కలపల్లి అండర్ బ్రిడ్జ్, లక్ష్మీపూర్ ప్రాంతాల్లో లారీలను సిద్ధంగా ఉంచి నేరుగా వ్యాగన్ల నుంచి లారీల్లోకి డంప్ చేస్తున్నట్లు సమాచారం. ఇలా సగటున రోజుకు కనీసం రెండు, మూడు లారీలైనా చౌర్యం జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో బొగ్గు చౌర్యం కొత్త కాకపోయినా జార్ఖండ్ తరహాలో మాఫియా ముఠా సంస్కృతి పెరుగుతుండటమే అందోళన కలిగించే విషయం. జార్ఖండ్‌లోని బొగ్గు గనులు రాజకీయ నేతల కనుసన్నల్లోనే పనిచేస్తాయి. అక్కడ వాస్తవిక బొగ్గు ఉత్పత్తిలో దాదాపు 35 శాతం బొగ్గు మాఫియా తస్కరించి సొమ్ముచేసుకుంటోంది. అక్కడి గనులన్నీ కూడా మారుమూల అటవీ ప్రాంతాల్లో ఉండటం, నక్సల్ సమస్య అధికంగా ఉండటం వంటి అంశాల నేపథ్యంలో క్క్రడి ప్రభుత్వం బొగ్గు మాఫియా ముఠాలపై చర్యలు తీసుకోలేకపోతోంది. దాంతో గత దశాబ్ద కాలంగా చిన్నచిన్న దొంగతనాలతో కార్యకలాపాలు నెరిపిన ముఠాలు ఆయుదాలు సంపాదించి సమాంతర వ్యవస్థనే నడుపుతున్నాయి. తాజాగా రామగుండం ప్రాంతంలోనూ ముఠా సంస్కృతి పాదుకుంటున్నట్లు ఇటీవలి సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఇకపోతే బొగ్గును రేల్ వ్యాగన్ల నుండి క్రిందపడేసే క్రమంలో కూలీలు ప్రమాదవశాత్తు రైలు క్రిందపడి మరణిస్తున్న సంఘటనలు ఇటీవల కాలంలో తరుచుగా సంభవిస్తున్నాయి. గతంలో విద్యుత్ గాతానికి గురై అవయువాలు కోల్పోయి జీవశ్చావాలుగా బ్రతుకులీడుస్తున్న కూలీలు రామగుండం ప్రాంతంలో చాలా మంది కనిపిస్తారు.
పెరుగుతున్న తుపాకీ సంస్కృతి
ఉపాధి లేక ఖాళీగా ఉండే నిరుద్యోగులను ట్రాప్‌లో పడేస్తున్న కోల్ మాఫియా లీడర్లు యువకుల చేతికి అక్రమ ఆయుధాలను ఇచ్చి అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడుతుండడం గోదావరిఖని ప్రాంతంలో సర్వసాధారణమైపోయింది. ఇన్‌ఫార్మర్ల పేరుతో సదరు యువకులకు పోలీస్ శాఖ అండదండలు కూడా పుష్కలంగా లభిస్తుండడంతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఈ వసూళ్ల వ్యవహారంలోనే ఐడి పార్టీ కానిస్టేబుల్ రమేష్ హత్య జరిగినట్లు ప్రచారం జరిగింది. హంతకుల వద్ద లభ్యమైన తుపాకి లైసెన్స్ జార్ఖండ్‌కు చెందిన ఓ బొగ్గు వ్యాపారి పేరుమీద ఉండడం సింగరేణిలోనూ మాఫియా సంస్కృతి వేళ్లూనుకుంటుందనడానికి తార్కాణంగా పేర్కొనవచ్చు. 

ఇందిర జలప్రభలో అవినీతి!

  • సదానంద్ బి.
  • 05/03/2012
కరీంనగర్, మార్చి 4: సమగ్ర భూ అభివృద్ధి పథకం ఇందిర జలప్రభ కార్యక్రమం ద్వారా పాడుపడిన భూములను సాగులోకి తెచ్చేందుకు సంకల్పించిన బృహత్తర కార్యక్రమంలో అవినీతి ఊటలు కనిపిస్తున్నాయి. స్వాతంత్య్రం వచ్చిననాటి నుంచి ఇప్పటివరకు ట్యాంక్ మేనేజ్‌మెంటు పథకం కింద భూగర్భ జలాల పెంపుకోసం అనేక కార్యక్రమాలు చేపడుతూ వస్తుండగా అందుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం జలప్రభ ద్వారా బోర్ల తవ్వకానికి అనుమతివ్వడం విమర్శలకు దారి తీస్తోంది. ప్రస్తుతం ట్యాంక్ మేనేజ్‌మెంటు పథకం కింద 12 వేల కోట్లతో చెరువుల మరమ్మతు, పూడికతీత పనులు జరుగుతున్నాయి. తద్వారా భూగర్భజలాలు పెంపొందించాలనేది లక్ష్యం. అయితే ప్రభుత్వ తాజా నిర్ణయం దాన్ని నీరుగార్చేదిగా తయారైంది. ఇదంతా ఒకెత్తయితే జలప్రభలో పది ఎకరాలను ఒక యూనిట్‌గా తీసుకొని సామూహిక సాగు పద్ధతి కింద బోర్లు తవ్వడం వల్ల రైతుల మధ్య నీటి నిర్వహణ, బోర్ల నిర్వహణపై తగాదాలు ఉత్పన్నమవుతున్నాయి. అంతేకాకుండా ఈ పథకం ప్రారంభమైన తరువాత బ్రోకర్లు, రాజకీయంగా ప్రాబల్యం ఉన్నవారికే యూనిట్లు కేటాయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూగర్భ జలాల నీటి మట్టాన్ని కాపాడేందుకు వాల్టా చట్టాన్ని ప్రభుత్వమే తూట్లు పొడిచేలా వ్యవహరించడంపై భూగర్భ జలవనరుల శాఖ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే హార్డ్‌రాక్ ఫార్మేషన్ ప్రభావం అధికంగా ఉన్న తెలంగాణ జిల్లాల్లో పరిమితికి మించి బోర్లువేయడం వల్ల భూగర్భజలాలు దారుణంగా పడిపోయాయని చెబుతున్నారు. ఈ కారణంగానే భూగర్భ జలవనరుల శాఖ జలప్రభ పథకం ఆచరణ సాధ్యం కాదంటూ తేల్చి చెప్పింది.
ప్రస్తుతం ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన బీడు భూములన్నీ కూడా కొండలు, గుట్టల ప్రాంతాల్లో ఉండడం, అక్కడ బోర్లు వేసినా ఫలితం ఉండదని, ప్రభుత్వానికి స్పష్టంగా తెలిసినప్పటికీ పథకాన్ని అమలు చేయడం వెనుక ఆంతర్యమేమిటన్నది ఎవరికీ అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ఈ పథకాన్ని అమలు చేయలేమంటూ పంచాయతీరాజ్, భూగర్భ జలవనరుల శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖలు చేతులెత్తేసినప్పటికీ డ్వామాలకు అప్పగించడం ఆశ్చర్యం కలిగిస్తోందని భూగర్భ జలవనరుల శాఖ అధికారులు ప్రస్తావిస్తుండడం ఈ సందర్భంగా గమనార్హం. ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లాల్లో నాబార్డు ద్వారా 900 కోట్లు, ఉపాధిహామీ పథకానికి సంబంధించిన 900 కోట్లు మొత్తం 1800 కోట్ల రూపాయల అంచనాతో లక్ష బోర్లు వేయాలని తలపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం సాధ్యాసాధ్యాలు బేరీజు వేసుకోకుండా కోట్లాది రూపాయలు దుబారా చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఉపాధిహామీ నిధులను కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా దారి మళ్లించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్సీ, ఎస్టీలకు చెందిన పది లక్షల ఎకరాలను సాగుయోగ్యంగా మలచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకు సంబంధించి పది ఎకరాలకు ఒక బోరు చొప్పున సామూహిక బావుల తవ్వకానికి శ్రీకారం చుట్టింది. అయితే నిర్దేశిత ఎస్సీ, ఎస్టీల భూముల్లో బోర్ల తవ్వకానికి సంబంధించి ఫీజబులిటీ పాయింట్లను గుర్తించేందుకు జియాలజిస్టుల అవసరముంటుంది. భూగర్భ జలవనరుల శాఖ తమ వద్ద సిబ్బంది లేరంటూ చేతులెత్తేయడంతో రాష్ట్ర నీటి నిర్వహణ సంస్థ కేంద్ర కార్యాలయం మొత్తం 65 మంది జియాలజిస్టులను నిర్ణీత కాలవ్యవధితో నియమించింది. వీరికి నెలకు 24 వేల రూపాయల వేతనం చెల్లించేందుకు నిర్ణయించింది. అలాగే మరో 35 మంది ప్రైవేటు జియాలిస్టులతో కమీషన్ పద్ధతిపై ఒప్పందం కుదుర్చుకోగా భూగర్భ జలవనరుల శాఖకు చెందిన 40 మందిని డిప్యూటేషన్‌పై నీటి నిర్వహణ సంస్థలకు అప్పగించారు. వీరంతా ఆయా జిల్లాల్లోని ఎస్సీ, ఎస్టీల భూముల్లో సర్వే నిర్వహించి జలవనరులు లభ్యమయ్యే అవకాశమున్న మూడు పాయింట్లను గుర్తిస్తారు.
వర్టికల్ ఎలక్ట్రికల్ సౌండింగ్ పద్ధతిలో బోర్ పాయింట్లను గుర్తించిన తరువాతే డ్రిల్లింగ్ చేయాల్సి ఉండగా, ఫిక్స్‌డ్ టైమ్ ఎంప్లాయిమెంటు పద్ధతిపై తీసుకున్న సిబ్బందితో కాకుండా ఆయా జిల్లాల్లోని ప్రైవేటు జియాలజిస్టులతో సర్వేలు జరిపించి డ్రిల్లింగ్‌లు నిర్వహిస్తుండడం వల్ల ఒక్కో బోర్ పాయింట్‌కు లక్షా 70 వేల రూపాయల వరకు ఖర్చు పెడుతోంది. అయితే అసలు కిటుకంతా ఇక్కడే ఉంది. ప్రైవేటు జియాలజిస్టులకు ఒక్కో పాయింట్‌కు వేయి రూపాయల చొప్పున ఫీజు చెల్లిస్తుండడంతో సదరు జియాలజిస్టులు రిగ్గు ఓనర్లతో కుమ్మక్కై ఒకటి కంటే ఎక్కువ డ్రిల్లింగ్‌లు జరిపేలా సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో ఒక్కో బ్లాక్‌పై రిగ్గు ఓనర్లు కనీసం రెండు లక్షల ఆదాయం సమకూరేలా సంబంధిత అధికారులతో లాలూచి పడుతున్నట్లు భోగట్టా. వాస్తవానికి బోరుపాయింట్ గుర్తించిన తరువాత డ్రిల్లింగ్ జరిపేటప్పుడు రిగ్గు యజమానులు ఎంతలోతు డ్రిల్లింగ్ చేస్తున్నారనే విషయాన్ని గుర్తించేందుకు సాంకేతికంగా అవగాహన కలిగిన సిబ్బంది అక్కడే ఉండాలి. కానీ ఆచరణలో అలాంటిదేమీ కనిపించడం లేదు. రిగ్గు యజమాని ఇచ్చిన కొలతలనే ప్రామాణికంగా చేసుకొని బిల్లులు చెల్లిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అదీ కాకుండా చాలా జిల్లాల్లో ఒకరిద్దరు రిగ్గు ఓనర్లతోనే ఎంఓయులు చేసుకొని పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎఫ్‌టిహెచ్, రోటరీ పద్ధతుల్లో బోర్‌వెల్ డ్రిల్లింగ్ జరుపుతున్నారు. ఒక్కో జిల్లాలో సగటున 50వేల ఎకరాలను ఈ పథకం కింద సాగులోకి తెచ్చేందుకు నిర్ణయించగా కరీంనగర్ జిల్లాలో 31వేల ఎకరాలకు 48 వేల కోట్ల రూపాయలతో 175 బోర్లు, 47 ఓపెన్ వెల్స్, మూడు ఫిల్టర్ పాయింట్లను వేయాలని నిర్ణయించారు. కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో మెదక్ జిల్లా బోర్ల తవ్వకంలో అగ్రస్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ వంద బ్లాక్‌లకు కోటి 69 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఆ తరువాతి స్థానంలో కరీంనగర్‌లో 146 బ్లాక్‌లకు గాను 65 డ్రిల్లింగ్ పూర్తి చేశారు. అలాగే ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో కూడా పెద్దఎత్తున పురోగతిలో ఉన్నట్లు తెలుస్తోంది.