Saturday, September 24, 2011

రెండుకళ్ల మీడియా

రెండుకళ్ల మీడియా

-సాక్షి


చంద్రబాబు లాగే మీడియాది కూడా రెండు కళ్ల పాలిసీ. కాకపోతే కొంచెం తేడా.
మీడియా నేత్రాల్లో ఒకటి గుడ్డి కన్ను. రెండోది డేగ కన్ను. తాను భయపడేవారిని గుడ్డి కంటితోనూ, తనకు భయపడేవారిని డేగ చూపుతోనూ చూడటం మీడిమేలపు మీడియా ఆరితేరిన విద్య.
మాటవరసకో సినిమా అమ్మడు ఓ కుర్రాడితో యవ్వారం బెడిసో, ఇంకేదో కష్టమొచ్చో మింగకూడనిది మింగి ఆస్పత్రిలో పడుతుంది. ఇంకో పెద్దింటి పిల్లగాడు వయసు తిమ్మిరిలో మోటారు బైకును విమానంలా నడిపి, తలపగలగొట్టుకుని పెద్దాసుపత్రిపాలవుతాడు.
ఇలాంటి శాల్తీలంటే మీడియా వీరులకు భయంలేదు. పైగా అలుసు. ఇంకేం? కబురు అందీ అందగానే అడ్డగోలు స్క్రోలింగులను ఇష్టం వచ్చినట్టు దొర్లించి, అడ్డమైన సినిమా పాటలను బాక్‌గ్రౌండులో వినిపించి, ఏదేదో ఊహించి, అదే నిజమైనట్టు చిలవలు పలవలుగా చిత్రించి, పనిలేని పోచుకోలు రాయుళ్లను పోగేసి, వాగించి, పొద్దస్తమానం ఊదరపెడతారు. ఆగమేఘాలమీద ఓబి వాన్లతో ఆస్పత్రిపైకి దండెత్తి, కనపడ్డ డాక్టర్లను, చూడవచ్చినవారిని అడిగిందే అడుగుతూ, చెప్పిందే చెప్పిస్తూ, తల్లడిల్లుతున్న రోగి తాలూకువారిని చచ్చు ప్రశ్నలతో గుచ్చుతూ, మీకు ఎలా ఉంది, ఏమనిపిస్తున్నదంటూ ఒళ్లు మండేలా అడిగేస్తూ... జాతియావత్తూ అర్జంటుగా తెలుసుకుని తీరాల్సిన అతి ముఖ్య సమాచారం అదే అయినట్టు చూసే జనానికి పిచ్చెక్కిస్తారు. ఎందుకయ్యా ఇంత అతి, వాళ్ల ఏడుపు వాళ్లని ఏడ్చుకోనివ్వరాదా అని ఎవరైనా అడిగితే... పబ్లికు కళ్లలో పడేవాళ్ల ప్రైవేటు బతుకులను బజార్నపెట్టటమే మీడియాకు దేవుడు వేసిన డ్యూటీ అయినట్టు, ప్రజాప్రాముఖ్యంగల ఏ విషయాన్నీ వదలకుండా వెంటాడి, మొదలంటా కూపీ తియ్యటమే తమ పని అంటూ బడాయికబుర్లు బాగా చెబుతారు.
మంచిదే. ఆ మాత్రం చురుకుతనం మీడియాగణానికి ఉండాల్సిందే.
కాని - ఆఫ్టరాల్ ఒక సినిమా నటి, ఒక ఆటగాడి కొడుకు, ఒక మధ్యతరగతి కుటుంబీకుడు, పరువుగా బతికే ఒక పేదింటి ఆడపిల్ల, ఒక సాధారణ చిరుద్యోగిలాంటి మనుషులకు ఏదైనా జరిగితేనే, జరగబోతుందంటేనే ఓవరైపోయి, మందీమార్బలమంతా యుద్ధప్రాతిపదికన మోహరించి, నానా హడావుడి చేసే మీడియా జాగిలాలు... నిజంగా అతి ముఖ్యమైన వ్యక్తుల విషయాల్లో అంతకు పదింతల చొరవ, నూరింతల చురుకుతనం చూపించాలి కదా? ఒకవేళ ఎవరైనా వాస్తవాన్ని కప్పిపుచ్చజూసినా పట్టుదలతో వెంటాడి, తమ పత్తేదారు ప్రతిభ మొత్తాన్నీ ఉపయోగించి, సకల వనరులనూ సమస్త శక్తియుక్తులనూ సమీకరించి, ప్రజలకు తెలియాల్సిన విషయాన్ని ఎలాగైనా రాబట్టాలి కదా?
న్యాయంగా అయితే ‘‘ఔను’’. కాని - బతకనేర్చిన మన మీడియా మల్లుల అమోఘ దృష్టి కొందరికి సంబంధించిన కొన్ని విషయాలపైకి ప్రసరించదు. వారికి ఇబ్బంది కలిగిస్తుందనుకునే ఏ పర్సనల్ మాటర్‌నూ మీడియా బుద్ధిమంతులు వినరు. కనరు. మాట్లాడరు. ఆ విషయంలో గాంధిగారి కోతులు కూడా వారి ముందు బలాదూరు.
ఉదాహరణకు సోనియాగాంధి! దేశానే్నలే సంకీర్ణానికి ఆమే సారథి. అతి ప్రధాన అధికారపక్షానికి ఆమే సర్వాధికారి. పేరుకు సింగుగారు ప్రధాని అయినా కేంద్ర సర్కారుకు నిజానికి ఆమే కర్ణ్ధారి. వివిఐపిల్లోకెల్లా వివిఐపి అయిన అంతటి ప్రముఖ వ్యక్తికి ఈ మధ్య చాలా జబ్బు చేసింది. అత్యవసర వైద్యంకోసం హుటాహుటిన ఆమె అమెరికా పోయింది. అక్కడ పెద్ద ఆపరేషను కూడా జరిగింది. కాని - ఈ సంగతులేవీ ఆమె తరఫువాళ్లు చెప్పేదాకా మహా ఘనత వహించిన మన మీడియా డిటెక్టివులకు తెలియనే తెలియదు.
దేశంలోని పెద్దా చిన్నా పత్రికలకూ, చానెళ్లకూ ఢిల్లీలో కాంగ్రెసు బీటు కవర్ చెయ్యటానికి స్పెషల్ కరెస్పాండెంట్లూ, పొలిటికల్ ఎడిటర్లూ వగైరాలు ఎన్నో డజన్లు ఉంటారు. ఎఐసిసి పెద్దతలకాయలను పేరుపెట్టి పిలిచేవాళ్లూ, టెన్ జన్‌పథ్‌కు తాము చాలా దగ్గరనీ... తమ సలహా అడక్కుండా సోనియా, రాహుల్‌లు అడుగుతీసి అడుగు వెయ్యరని గొప్పలు చెప్పేవాళ్లూ పదుల సంఖ్యలోనే ఉంటారు. అయినా అధినేత్రికి జబ్బుముదిరి, అమెరికాపోయి ఆపరేషను చేయించుకున్న వైనం బీబీసీ, ఎఎఫ్‌పి లాంటి విదేశీ మీడియా ద్వారా ఆధికారికంగా ప్రకటించేదాకా ఈ సర్వజ్ఞుల్లో ఒక్కరూ ఎరుగరు!
పోనీ వారంతట వారే బయటపెట్టిన తరవాత, నాయకురాలి పరిస్థితి ఎలా ఉన్నదోనని యావద్దేశం ఆందోళన పడసాగినప్పుడైనా మన మీడియా వేగులు ఆమె క్షేమసమాచారాలు ఆరాతీసేందుకు చొరవ చూపారా? సోనియా చికిత్స పొందుతున్నది సప్తసముద్రాల ఆవల రహస్య నేలమాళిగలో కాదు. న్యూయార్క్ మహానగరంలో! ఆమె ఏ ఆస్పత్రిలో ఉన్నదీ, ఆమెకు ఆపరేషను చేసిన తెలుగు వైద్యుడు ఎవరన్నదీ అందరికీ తెలిసిపోయింది. కడుపు తీయించుకునేందుకో, పొట్ట తగ్గించుకునేందుకో ఏ సినిమా శాల్తీనో అలాంటిచోట చేరినట్టు ఉప్పందితేచాలు - ఎక్కడెక్కడి చానెళ్ల ఓబీ వాన్లూ, వాగుడు మేళాలూ ఎంత ఖర్చయినా వెనుదీయక హుటాహుటిన అక్కడికి చేరుకుని, ప్రత్యక్ష ప్రసారాలతో ప్రేక్షకుల దుంపతెంచేవి. అంతంత ఓవరాక్షన్లు చేయకపోతే మానె! ఆస్పత్రి అధికారులను కలిసి, (అనధికారిక) దేశాధినేత ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు అధికారిక సమాచారం రాబట్టి ప్రజలకు తెలియజేసే పాపాన కూడా మన మీడియా మోతుబరులు పోలేదు. దేవుడి దయవల్ల ఆమె క్షేమంగా తిరిగొచ్చి తన పని తాను చేసుకోవటం మొదలెట్టాకయనా కనీసం దూరం నుంచైనా ఆమె ఫోటో తీసి ప్రజలకు చూపెట్టే సాహసం ఏ పెద్ద పత్రికా, ఏ పేద్ధ ఛానలూ చెయ్యలేదు.
ఒకానొక రుగ్మతకు చికిత్స జరిగిందని పార్టీ వర్గాలు గుంభనంగా చెప్పటమే తప్ప ఆ రుగ్మత ఏమిటో ఎవరికీ తెలియదు. కర్ణాకర్ణిగా కాన్సర్ అని వినడమే, ఏ రకం కాన్సరన్న దానిపై వదంతులే తప్ప సోనియాజీకి వచ్చిన ఆరోగ్య సమస్య ఏమిటి, ఎంతవరకూ అది అదుపులోకి వచ్చిందన్నది నేటికీ అతి రహస్యమే. కాలగర్భంలో కలిసిన సోవియట్ యూనియన్ లాంటి కమ్యూనిస్టు రాజ్యాల్లో అధినేత ఆరోగ్య స్థితి ఎంత విషమించినా బయటికి చెప్పక ఇనుపతెర వెనుక తొక్కి పెట్టారంటే నియంతృత్వ వ్యవస్థలో అలాంటివి మామూలేనని సరిపెట్టుకో వచ్చు. కాని సమాచార హక్కుకు చట్టంచేసి, పారదర్శకత్వానికి పాదు చేసిన ప్రజాస్వామిక వ్యవస్థలో మీడియా తన ప్రాథమిక ధర్మాన్ని నిర్వర్తించడానికి వచ్చిపడ్డ అడ్డంకి ఏమిటి? అమెరికాలో దేశాధ్యక్షుడి ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి మెడికల్ రిపోర్టునూ రివాజుగా ప్రజల ఎదుట పెడతారు కదా? ఇండియాలో అతి ముఖ్య అధికార కేంద్రమైన సోనియాగాంధి ఆరోగ్యానికి సంబంధించిన కీలక సమాచారాన్ని ప్రజలకు తెలియ జెప్పడానికి మీడియా వెనకాడవలసిన అగత్యమేమిటి? మీడియా తన పనితాను చేస్తానంటే సోనియాగాంధిగాని, ఆమె కుమారుడు గాని వద్దంటారా? కట్టె తీసుకుని వెంటపడతారా? మీడియా చొరవను వారు అడ్డుకున్న దృష్టాంతం మనకు తెలిసినంతలో ఒక్కటైనా ఉందా? మరి మీడియా వారికి భయమెందుకు?
ఎమర్జన్సీ కాలంలో కాస్త వంగమని సర్కారు అంటే మీడియా ఏకంగా కాళ్లమీద పాకెయ్యసాగిందని అప్పుడెప్పుడో అద్వానీ అన్నాడు. ఇవాళ ఎమర్జన్సీ లేదు. వంగి తీరాలని సర్కారువారూ మెడమీద కత్తేదీ(బహిరంగంగా) పెట్టిన దాఖలాల్లేవు. ఐనా మన మీడియాకు ఎందుకీ పాకుడు ఖర్మ?

we | రెండుకళ్ల మీడియా | Andhra Bhoomi

we రెండుకళ్ల మీడియా Andhra Bhoomi

NTPC burns more coal to produce electricity