Saturday, December 17, 2011

కదులుతున్న ‘ఎక్సైజ్ ఎస్టీఎఫ్’డొంక


కరీంనగర్, డిసెంబర్ 16: కరీంనగర్ జిల్లాలో జరిగిన ఎసిబి దాడుల్లో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంటుకు చెందిన ‘ప్రత్యేక నిఘా విభాగం’ (ఎస్టీఎఫ్) అధికారులు పట్టుబడడంతో తీగ లాగిన ఎసిబికి రాష్టవ్య్రాప్తంగా ఉన్న డొంకలన్నీ కదలడం ప్రారంభించాయి. ఈ నెల 13న ఎస్టీఎఫ్ సిబ్బంది అవినీతిపై పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎసిబి అధికారులకు ఓ ఉన్నతాధికారికి చెందిన లాప్‌టాప్ లభించింది. దాన్ని డీకోడింగ్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా మద్యం సిండికేట్ల నుంచి రావాల్సిన మామూళ్లకు సంబంధించిన పూర్తి జమా, ఖర్చు పద్దుల చిట్టా బట్టబయలైంది. దాంతో ఈ నెల 13న హైదరాబాద్ ఎసిబి జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ నేతృత్వంలో అధికారులు కరీంనగర్ జిల్లాలో మెరుపు దాడులు జరిపారు. దాడుల్లో మూడు లక్షల 72 వేల నగదు లభ్యమైంది. విచారణలో ఆ అధికారులు ఇచ్చిన సమాచారంతో అదే రోజు రాత్రి కరీంనగర్ సిండికేట్ కార్యాలయంపై దాడులు నిర్వహించి లావాదేవీలకు సంబంధించిన రికార్డులు, కంప్యూటర్ హార్డ్‌డిస్ట్‌లను స్వాధీనం చేసుకొని సమాచారాన్ని సేకరించింది. కోట్లాది రూపాయలు ముడుపుల రూపంలో చేతులు మారుతున్నాయన్న విషయం తేటతెల్లం కావడంతో వెంటనే అప్రమత్తమై శుక్రవారం రాష్టవ్య్రాప్తంగా మద్యం సిండికేట్ కార్యాలయాలపై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఎసిబి అధికారులకు దిమ్మదిరిగిపోయే సమాచారం లభించినట్లు తెలుస్తోంది. ఇకపోతే శుక్రవారం కరీంనగర్ జిల్లాలోని మిగతా సిండికేట్లు, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలతో పాటు కోస్తా ప్రాంతాల్లోని సిండికేట్ కార్యాలయాలపై నిర్వహించిన దాడుల్లో లభ్యమైన వివరాల ఆధారంగా అవినీతికి సంబంధించి మరింత కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. లాప్‌టాప్, సిండికేట్స్ రికార్డుల్లో లభ్యమైన సమాచారం ఆధారంగాప్రధానంగా ఎక్సైజ్, పోలీస్, రెవెన్యూ, లీగల్ మెట్రాలజీ విభాగాలతో పాటు కొంత మంది పాత్రికేయుల పేర్లు కూడా వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. దీనిపై ఎసిబి జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్‌ను సమాచారం కోరగా దీంతో ప్రమేయం ఉన్న అధికారులపై విచారణ జరుపుతున్నామని స్పష్టం చేశారు.