Sunday, August 14, 2011

సగం రాష్ట్రంకరువు నీడలో

  • ఆగస్టు రెండో వారంలోనూ వర్షాభావం
  • సాగని ఖరీఫ్‌ సేద్యం
  • సగటు లెక్కలతో సర్కార్‌ సంతృప్తి
  • ప్రత్యామ్నాయాలపై నిర్లక్ష్యం
రాష్ట్రంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఒక పక్క రాష్ట్ర, జిల్లాల స్థాయిలో సగటున సాధారణ వర్షపాతం నమోదు కాగా మరోపక్క మండలాల స్థాయిలో వర్షాభావం తాండవిస్తోంది. రాష్ట్ర, జిల్లా సగటు వర్షపాతం అంకెలను చూపించి కరువు సమస్య నుండి రాష్ట్రం బయట పడిందని ప్రభుత్వం వితండవాదం చేస్తోంది. వ్యవసాయశాఖ ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించే పనికి స్వస్తి పలికింది. మున్సిపల్‌, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది తదితర శాఖలు కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టకుండా మీనమేషాలు లెక్కిస్తున్నాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ప్రారంభం నుండి వర్షాభావం వెంటాడుతోంది. జూన్‌ నెలాఖరుకు 17 జిల్లాల్లో వర్షాభావం నెలకొంది. అప్పటికి రాష్ట్రంలో సగటున పడాల్సిన దానికంటే 37 శాతం తక్కువ వర్షం పడింది. జులై చివరికి తొమ్మిది జిల్లాల్లో వర్షాభావం ఉంది. అప్పటికి రాష్ట్ర స్థాయిలో సగటున కురవాల్సిన దాని కంటే 18 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ఈ నెల 10కి వచ్చే సరికి ఒక్క హైదరాబాద్‌ మినహా మిగిలిన 22 జిల్లాల్లో సాధారణ స్థాయిలో వర్షాలు పడ్డట్లు అంకెలు చెబుతున్నాయి. అయితే దాదాపు సగం రాష్ట్రంలో వర్షాభావం నెలకొందని మండల స్థాయి వర్షపాతం లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1,128 మండలాలుంటే 547 మండలాల్లో ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులున్నాయి. 23 మండలాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. మొత్తంగా రాష్ట్రంలోని 48 శాతం మండలాల్లో సాధారణ స్థాయి కంటే తక్కువ వర్షాలు కురిశాయి.
ప్రాంతాలవారీగా చూస్తే తెలంగాణాలో 464 మండలాలుండగా 273 మండలాల్లో వర్షాభావం ఉంది. ఈ ప్రాంతంలోని 59 శాతం మండలాల్లో కరువు ఛాయలు అలముకున్నాయి. రాయలసీమలో 234 మండలాలకుగాను 91 మండలాలు (38 శాతం), కోస్తాంధ్రలో 430 మండలాలకుగాను 183 మండలాల్లో (42 శాతం) తీవ్ర వర్షాభావం కొనసాగుతోంది.
తెలంగాణాలో అధికం
ప్రాంతాలవారీగా చూస్తే తెలంగాణాలో 464 మండలాలుండగా 273 మండలాల్లో వర్షాభావం ఉంది. ఈ ప్రాంతంలోని 59 శాతం మండలాల్లో కరువు ఛాయలు అలముకున్నాయి. రాయలసీమలో 234 మండలాలకుగాను 91 మండలాలు (38 శాతం), కోస్తాంధ్రలో 430 మండలాలకుగాను 183 మండలాల్లో (42 శాతం) తీవ్ర వర్షాభావం కొనసాగుతోంది. హైదరాబాద్‌లో 16 మండలాలకుగాను మొత్తం మండలాల్లో వర్షాభావం నెలకొంది. కరీంనగర్‌ జిల్లాలో 57 మండలాలకు 45 మండలాల్లో కరువు తాండవిస్తోంది. ఆగస్టు రెండోవారం గడుస్తున్నా రాష్ట్రంలోని సగం మండలాల్లో వర్షాభావం కొనసాగుతుండటంతో ఆ ప్రభావం పంటల సాగుపై పడింది. ఈ నెల 10 నాటికి రాష్ట్రంలో సగటున 352.7 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 298.9 మిమీ కురిసింది. సాధారణ స్థాయికంటే 15 శాతం తక్కువ వర్షం పడింది. ఇదే సమయానికి ముందటేడు 155.9 మిమీ, నిరుడు 472.2 మిమీ వర్షం పడింది. ఈ సంవత్సరం జూన్‌లో 108.4 మిమీకి 66.1 మిమీ, జులైలో 188.8కి 198 మిమీ, ఆగస్టు 10 నాటికి 55.5 మిమీలకు 3.8 మిమీ వర్షం కురిసింది. సీజన్‌ మొదటి నెలలో దాదాపు అన్ని జిల్లాల్లోనూ వర్షాభావ పరిస్థితులు ఏర్పడగా ఆ తర్వాత కొద్దికొద్దిగా సగటు లెక్కల్లో మార్పొచ్చింది. ఆగస్టు 10 వచ్చే సరికి రాష్ట్ర స్థాయిలో సగటు వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌ మినహా తతిమ్మా జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. మండలాలకొచ్చేసరికి రాష్ట్రంలోని సగం మండలాల్లో వర్షాభావం నెలకొంది.
డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1,128 మండలాలుంటే 547 మండలాల్లో ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులున్నాయి. 23 మండలాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. మొత్తంగా రాష్ట్రంలోని 48 శాతం మండలాల్లో సాధారణ స్థాయి కంటే తక్కువ వర్షాలు కురిశాయి.
సాగని సాగు
వర్షాభావం, క్రాప్‌హాలిడే తదితర కారణాల వల్ల ఖరీఫ్‌లో పంటల సాగు మందకొడిగా సాగుతోంది. సీజన్‌ మొత్తమ్మీద 78.11 లక్షల హెక్టార్లలో పంటలు సాగు కావాలి. ఇప్పటి వరకు 57.28 లక్షల హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా 53.39 లక్షల హెక్టార్లలోనే పంటలు సాగయ్యాయి. నిరుడు ఇదే సమయానికి 65.11 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. వరి నాట్లు 11.97 లక్షల హెక్టార్లకు 9.97 లక్షల హెక్టార్లలో పడ్డాయి. జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న, రాగులు తదితర చిరుధాన్యాలు కొంత మేరకు సాగైనప్పటికీ వర్షాభావం వల్ల చాలాచోట్ల విత్తనాలు మొలకెత్తలేదు. కొన్ని ప్రాంతాల్లో మొలకలొచ్చినప్పటికీ మొక్కలు పైకి రాలేదు. పప్పుధాన్యాలు 6.81 లక్షల హెక్టార్లకు 5.39 లక్షల హెక్టార్లలోనే సాగయ్యాయి. సాగైనవాటిలో సగం ఎండిపోయాయి. మొత్తంగా ఆహార ధాన్యాలు 25.8 లక్షల హెక్టార్లకు 21.11 లక్షల హెక్టార్లలో సాగయ్యాయి. వేరుశనగ 11.5 లక్షల హెక్టార్లకు 8.85 లక్షల హెక్టార్లలో సాగైంది. ఈ ఏడాది పత్తి సాగు అసాధారణంగా పెరిగిపోయింది. 12.93 లక్షల హెక్టార్లు సాగవుతుందని అంచనా వేయగా ఇప్పటికే 16.48 లక్షల హెక్టార్లలో సాగైంది. 

అమెరికా వైఖరిపై భగ్గుమన్న భారతీయులు


పలు దేశాల వ్యవహారాల్లో అప్రజాస్వామికంగా జోక్యం చేసుకుని రక్తపాతానికి పాల్పడిన అమెరికా ఈసారి భారత ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకుంది. అన్నాహజారే ఈనెల 16వ తేదీ నుంచి చేపట్టనున్న నిరాహార దీక్షను ఎలా ఎదుర్కోవాలో చేసిన వ్యాఖ్యలపై భారత్‌కు సూచనలు చేసింది. దీనిపై భారతీయులు భగ్గుమన్నారు. అమెరికా విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి విక్టోరియా న్యులాండ్‌ శుక్రవారం ఉదయం రోజువారీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ''ప్రపంచ వ్యాప్తంగా శాంతియుతంగా, అహింసాయుతంగా జరిగే నిరసనలకు మేము మద్దతిస్తాం. భారత్‌ ఒక ప్రజాస్వామ్య దేశం. శాంతియుత ఆందోళనలను నిలువరించేందుకు భారత్‌ తగిన ప్రజాస్వామ్య విధానాన్ని అనుసరించాలి'' అని వ్యాఖ్యానించారు. భారత్‌లో జరుగుతున్న ఆందోళనలు, శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న వారి పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. పోలీసుల దారుణాలపై, అవినీతికి వ్యతిరేకంగా అన్నాహజారే దీక్ష చేయనున్న నేపథ్యంలో అడిగిన ప్రశ్నకు ఆమె పైవిధంగా స్పందించారు. విక్టోరియా న్యూలాండ్‌ చేసిన వ్యాఖ్యలపై భారత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు ప్రాంతాల్లో అన్నాహజరే మద్దతుదారులు నిరసన ర్యాలీలు నిర్వహించారు. దీంతో ఈ వ్యవహారంపై భారత ప్రభుత్వం స్పందించింది. విదేశీ వ్యవహారాల విభాగానికి చెందిన అధికార ప్రతినిధి మాట్లాడుతూ అమెరికా వ్యాఖ్యలను 'అవసరం లేనివి'గా అభివర్ణించారు. 'భారత్‌లో శాంతియుత నిరసన పట్ల ఏ విధంగా వ్యవహరించాలన్న విషయంపై అమెరికా నుంచి అనవసరపు వ్యాఖ్యలను మనం చూశాము. వాక్‌ స్వాతంత్య్రం, భావవ్యక్తీకరణతో పాటు శాంతియుతంగా గుమిగూడే స్వేచ్ఛను భారత రాజ్యాంగం కల్పించింది. ఈ అవకాశాన్ని 120 కోట్ల మంది దేశ ప్రజలు వినియోగించుకుంటున్నారు' అన్నారు.