Saturday, December 24, 2011

షరా‘మామూల్’..

* పోలీసులు, రెవెన్యూలకే సింహభాగం

* విడిసిల ముసుగులో అక్రమ అనుమతులు

* యథేచ్ఛగా ఇసుక మాఫియా


కరీంనగర్, డిసెంబర్ 22: నిన్న లిక్కర్ సిండికేట్ కుంభకోణం..నేడు ఇసుక మాఫియా..ఇలా ఏ కుంభకోణం వెలుగులోకి వచ్చినా అందులో అధికార పార్టీ ముద్ర కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాలో కాంగ్రెస్‌కు చెందిన చోటా మోటా నాయకులదే ప్రధాన పాత్రగా చెప్పవచ్చు. చోటా మోటా నాయకులే కదా! అని తీసిపారేయకండీ. వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లుకమ్మక తప్పదు. సగటున రోజుకు వారి ఆర్జించేది అక్షరాల లక్ష రూపాయల పై మాటే. ఇందుకు భూగర్భ జలవనరుల శాఖ, గనుల శాఖ అధికారుల తోడ్పాటు షరా‘మామూల్’గా జరిగిపోయేదే. ప్రతిఫలంగా అక్రమార్కులను చూసి చూడనట్లుగా వదిలివేయటమే. ఇదంతా ఒకెత్తయితే జగిత్యాల రెవెన్యూ సబ్ డివిజన్ పరిధిలోని రాయికల్ మండలం మూటపల్లి, కొత్తపేట, బోర్నపల్లి, కోరుట్ల మండలం పైడిమడుగు, మెట్‌పల్లి మండలం ఆత్మకూరు తదితర గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీల పేరిట అధికార పార్టీకి చెందిన నేతలు అనధికారికంగా ఇసుక రీచ్‌లకు వేలం పాటలు నిర్వహించి కాంట్రాక్టర్లకు కట్టబెడుతున్నారు. ఇందుకుగాను కేవలం లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల వరకు విడిసికి చెల్లించి ఇక ఆ ఏడాది పొడవునా కావాల్సినంత ఇసుకను తోడుకుపోయే వెసులుబాటును కల్పించారు. దాంతో పెద్దవాగు, మానేరు వాగు, గోదావరి నదీ పరిసరాల్లో ఈ అక్రమ క్వారీలు వెలిశాయి. విడిసిల ద్వారా క్వారీలను చేజిక్కించుకున్న వ్యక్తులు పెద్దఎత్తున అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారు. అయితే ఆరోపణలు వచ్చిన సందర్భాల్లో మాత్రమే పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ అధికారులు అప్పుడప్పుడు దాడులు నిర్వహించి తమ పని చక్కబెట్టుకున్నాక చూసీ చూడనట్లు వదిలేస్తున్నారని, అందుకు ప్రతిఫలంగా ప్రతీ నెలా ఇసుక కాంట్రాక్టర్లు ఆయా ప్రాంతాల్లోని సంబంధిత అధికారులకు 45 నుంచి 60 వేల వరకు మామూళ్లు ముట్టజెప్పుతున్నట్లు ఆరోపణలున్నాయ. అయితే గ్రామాభివృద్ధి పేరుతో స్థానిక సంస్థలకు పోటీగా పెత్తనం చెలాయిస్తున్న ఈ విడిసిలపై సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తులే ఆధిపత్యం చెలాయిస్తున్నారు. వారి కనుసన్నల్లోనే గ్రామానికి సంబంధించిన లావాదేవీలన్నీ నిర్వహిస్తారు. ఈ క్రమంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గ్రామాల్లో ఇసుక క్వారీలకు టెండర్లు నిర్వహించి చౌకధరలకు కట్టబెట్టి లోపాయికారిగా లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారనేది నగ్న సత్యం. ఉదాహరణకు రాయికల్ మండలంలోని మూటపల్లి, కొత్తపేట, బోర్నపల్లి ప్రాంతాల్లో ఇసుక తవ్వుకునేందుకు వేలం పాటలు నిర్వహించి కేవలం 2.45 లక్షల రూపాయలకే క్వారీని కట్టబెట్టడం గమనార్హం. అయితే సగటున ఈప్రాంతం నుంచి సదరు కాంట్రాక్టర్ రోజుకు 50 ట్రాక్టర్లకంటే ఎక్కువ మొత్తంలో ఇసుకను తరలిస్తూ విడిసికి చెల్లించిన మొత్తం రుసుంను రెండు, మూడు రోజుల్లోనే వసూలు చేసుకోగలిగారు. దీన్నిబట్టి విడిసిలు ఇసుక మాఫియా అనుబంధం ఎంత గాఢంగా బలపడి ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
ఇకపోతే వీణవంక మండలం ఇప్పలపల్లి, కోర్కల్, కొండపాక, బోయినపల్లి మండలం వరదవెల్లి, శభాష్‌పల్లి, కొదురుపాక, కరీంనగర్, గంగాధర, బోయినపల్లి మండల సరిహద్దుల్లోని బావుపేట, ఒద్యారం, ఖాజీపూర్, మల్లాపూర్ తదితర ప్రాంతాలతో పాటు ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్, జమ్మికుంట మండలం  విలాసాగర్, తనుగుల, తిమ్మాపూర్ మండలం రేణికుంట, కొత్తపల్లి తదితర ప్రాంతాల నుంచి సగటున రోజుకు ఒక్కో ఇసుక రీచ్ నుంచి 60 నుంచి 70 ట్రాక్టర్ల వరకు ఇసుక తవ్వకాలు, తరలింపు అడ్డూ అదుపులేకుండా సాగిపోతోంది. ఒక్కో ట్రాక్టర్‌కు రెండు వేల చొప్పున ఇసుక విక్రయిస్తూ ఒక్కో కాంట్రాక్టర్ సగటున రోజుకు లక్ష రూపాయల వరకు ఆదాయం గడిస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ అనుమతిలేని చిన్న చిన్న వాగులు, వంకలపై జరుగుతున్న తతంగం. ఈ వ్యవహారంలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతీ ఒక్కరి హస్తం ఉన్నట్లు అర్థమవుతోంది. వీణవంక మండలం ఇప్పలపల్లిలో ఓ రాజకీయ నాయకుడు రోజుకు 60-70 ట్రాక్టర్ల వరకు ఇసుకను తరలిన్నారు. అలాగే ఇదే మండలంలోని కోర్కల్‌లో ఓ స్థానిక నేత ఏకంగా మానేరులో జెసిబిలు మోహరించి ఇసుక తవ్వకాలను జరుపుతున్నారు. సదరు వ్యక్తి కూడా షరా మామూలుగా సంబంధిత అధికారులకు భారీగానే ముడుపులు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే కొండపాక గ్రామంలో ఓ నాయకుడు రోజుకు పది ట్రాక్టర్ల చొప్పున ఇసుకను తరలించి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఆరోపణలు రావడంతో ఇటీవల అధికారులు గ్రామాన్ని సందర్శించి మానేరుకు వాహనాలు వెళ్లకుండా పెద్దఎత్తున కందకాలు తవ్వినప్పటికీ నిరాటంకంగా ఇసుక తరలింపు కొనసాగుతోంది.
ఇకపోతే ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లో ముగ్గురు వ్యక్తులు గ్రామాభివృద్ధి కమిటీకి నాలుగు లక్షల 80 వేల రూపాయలు చెల్లించి సగటున రోజుకు 20-30 ట్రాక్టర్లు ఇసుక తరలిస్తున్నారు. ఇక్కడ సదరు కాంట్రాక్టర్లు సంబంధిత అధికారులకు నెలకు రెండున్నర లక్షలకు పైగా మామూళ్లు ముట్టజెబుతున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇక బోయినపల్లి మండలంలోని వరదవెల్లి, శాభాష్‌పల్లి, కొదురుపాక గ్రామాల్లోని ఇసుక రీచ్‌ల నుంచి పెద్దమొత్తంలో కరీంనగర్ శివారులోని బావుపేట గ్రానైట్ క్వారీల్లో కుప్పలుగా పోసి అక్కడి నుంచి లారీల్లో రాజధానికి తరలిస్తున్నారు. ఇక్కడ ఇసుక మాఫియా ప్రతీ నెల లక్షల్లో అధికారులకు ముట్టజెబుతోంది. వారే అన్ని వర్గాలకు పర్సెంటేజీల చొప్పున మామూళ్లు పంచుతున్నట్లు ఆరోపణలున్నాయ.

No comments:

Post a Comment