Saturday, December 24, 2011

ఖద్దర్..కాంట్రాక్టర్ చెట్టపట్టాల్..!

* కోట్లు కొల్లగొడుతున్న ఇసుక మాఫియా

 * ప్రజాప్రతినిధుల అనుచరులదే కీలక పాత్ర

 * అధికారులకూ నెల నెల మామూళ్లు

 * ఇందిరమ్మ పేరుతో రాజధానికి లారీల తరలింపు

ఆంధ్ర భూమి బ్యూరో
-----------------------

కరీంనగర్, డిసెంబర్ 20: ఖద్దర్ చొక్కాలు, కాంట్రాక్టర్‌లు కూడబలుక్కుంటే ఎలా ఆర్జించవచ్చో..ఇసుక మాఫియాను చూసి ఎంచక్కా నేర్చేసుకోవచ్చు. ఇసుకేస్తే కాసులు రాలుతుండడంతో ఇసుక క్వారీలు మాఫియాకు బంగారు గనులుగా మారిపోయాయి. అధికారికంగా కొంత, అనధికారికంగా కొండంత అన్నట్లుగా రాజకీయ పలుకుబడిని అడ్డం పెట్టుకొని కాంట్రాక్టర్లు అధికారులను నయానో, భయానో గుప్పిట్లో పెట్టుకొని యదేశ్ఛగా అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడుతున్నారు. జిల్లాలో ఇటీవల నిర్వహించిన వేలం పాటల్లో తొమ్మిది ఇసుక రీచ్‌లకు సంబంధించి పది కోట్లకు పైనే ఆదాయం లభించింది. అయితే టెండర్లలో రాజకీయ జోక్యం మితిమీరిపోవడంతో అక్రమాలు జరిగాయంటూ కొంత మంది వ్యాపారులు హైకోర్టుకెక్కారు. దాంతో అక్కడ తవ్వకాలకు అధికారికంగా బ్రేక్ పడింది. ఇవి కాకుండా వెల్గటూరు మండలం ముత్తునూరు, ముక్కట్రావుపేట, రామగుండం మండలం పొట్యాల రీచ్‌ల నుంచి మాత్రమే ఇసుకను తవ్వేందుకు అనుమతించారు. జిల్లాలో ప్రస్తుతం అధికారిక ఇసుక క్వారీలు ఈ రెండు మాత్రమే. కానీ హైకోర్టు బ్రేక్ వేసిన తొమ్మిది రీచ్‌ల్లో ప్రధానమైన రీచ్‌గా భావిస్తున్న కొదురుపాక రీచ్ నుండి ఇప్పటికీ అధికార పార్టీకి చెందిన ఓ ప్రముఖ ప్రజాప్రతినిధి అనుచరులు యదేశ్ఛగా ప్రోక్లైన్లు పెట్టి మరీ ఇసుకను వందలాది లారీల్లో ప్రతీ రోజు రాజధానికి తరలిస్తూ కాసుల పంట పండించుకుంటున్నారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు తరలించిన తరువాత ఒక్కో లారీ ఇసుకకు సగటున 15 వేల నుంచి 18 వేల రూపాయల మధ్య వసూలు చేస్తారు. అలాగే స్థానికంగా ఇసుక ట్రాక్టర్ల చొప్పున విక్రయించడం జరుగుతుంది. ఒక్కో ట్రాక్టర్‌కు రెండు వేల నుంచి మూడు వేల రూపాయల మధ్య ఇసుక నాణ్యతను బట్టి వసూలు చేస్తారు. ఇలా జిల్లాలోని మానేరు, గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో వందలాది అనధికారిక ఇసుక రీచ్‌ల నుంచి లారీల్లో తరలిస్తున్నా అధికారులు కనీస చర్యలు చేపట్టలేని ధైన్య స్థితిలో ఉన్నారు. కళ్ల ముందు నుండి లారీలు తరలివెళ్తున్నా పట్టించుకోవడం లేదంటే ఇసుక మాఫియా అధికార యంత్రాంగాన్ని ఏ స్థాయిలో ప్రభావితం చేస్తుందో ఊహించవచ్చు. ఎవరు నమ్మినా, నమ్మకపోయినా ఇసుక మాఫియా ప్రతీ నెలా గ్రామ కార్యదర్శి మొదలుకొని జిల్లా ఉన్నతాధికారి వరకు, కానిస్టేబుల్ మొదలుకొని పోలీస్ ఉన్నతాధికారుల వరకు లక్షల్లో మామూళ్లు ముట్టచెబుతూ పని చక్కబెట్టుకుంటున్నారనేది నగ్న సత్యం.
మాఫియాకు కాసులు కురిపిస్తున్న రియల్ భూం..

నాలుగేళ్ల క్రితం వరకు ఇసుక దందాపై జిల్లాలో పెద్దగా ఎవరికి అవగాహన ఉండేది కాదు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ భూం మొదలైన తరువాత భవన నిర్మాణాలు పెద్దఎత్తున ప్రారంభం కావడంతో హైదరాబాద్‌కు చెందిన ఇసుక వ్యాపారులు కరీంనగర్ జిల్లాపై దృష్టి సారించడంతో దీని వెనుక సాగుతున్న ఆర్థిక లావాదేవీలపై జిల్లా నేతలు దృష్టి సారించారు. ఈ వ్యాపారంలో కోట్ల పంట పండుతోందనే విషయాన్ని పసిగట్టడంతో ఏడాది క్రితం నిర్వహించిన వేలం పాటల్లో నేరుగా తమ అనుచరుల పేరుతో ఇసుక దందాలోకి అడుగుపెట్టారు. ఇందులో ప్రధానంగా అధికార పార్టీకి చెందిన ఓ కీలక నాయకుడి అనుచరులే ఇసుక మాఫియాకి శ్రీకారం చుట్టారు. వేలం పాటల్లో కొన్ని రీచ్‌ల్లో వీరికి టెండర్లు దక్కినప్పటికీ హైకోర్టు ఉత్తర్వుల పుణ్యమా అని బ్రేక్ పడడంతో అక్రమ తవ్వకాలకు తెరలేపారు. దాంతో జిల్లాలో అనధికారికంగా వందకు పైగా రీచ్‌ల నుంచి యథేచ్ఛా ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా గ్రామాల్లో రాజకీయంగా ఘర్షణలు తలెత్తిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఆయా సందర్భాల్లో ఇసుక మాఫియాపై కఠినంగా వ్యవహరించాల్సిన అధికారులు, పోలీస్ సిబ్బంది ఆ మాఫియా వెనుక ఉన్న పెద్ద తలకాయను చూసి మనకెందులే అన్న నిర్లిప్తతను ప్రదర్శిస్తున్నారు.
రూల్స్..గీల్స్ జాన్తానై..

జిల్లాలో ఇసుక రవాణాకు అనుమతి లేదు. అత్యవసరం కింద ఇందిరమ్మ గృహాలకు, గ్రామాల్లో ఇళ్లు కట్టుకునే వారికి అధికారులు అనుమతిస్తారు. దానికనుగుణంగా ఇసుకను తీసుకోవాలి. ప్రభుత్వం అనుమతిచ్చిన క్వారీలు జిల్లాలో మూడు మాత్రమే ఉన్నాయి. వాటిలో వెల్గటూర్ మండలంలో ముత్తునూర్. ముక్కట్రావ్‌పేట , రామగుండం మండలంలో పొట్యాల ఒకటి ఇసుక క్వారీలు ఉన్నాయి. వీటి ద్వారా మాత్రమే ఇసుకను తరలించాలి. దానికి అధికారులు అనుమతి ఇస్తారు. మిగితా చోట్ల ఇసుక తరలింపునకు అనుమతులు లేవు. కానీ జిల్లాలోని ఇల్లంతకుంట మండలం మల్లాపూర్ కొత్త బ్రిడ్జి వద్ద ఇష్టం వచ్చిన రీతిలో ఇసుకను తోడేస్తున్నారు. అలాగే బోయినపల్లి మండలం మాన్వాడ, సుల్తానాబాద్ మండలం నారాయణపూర్, మంథని, మహదేవ్‌పూర్, జమ్మికుంట మండలం వావిలాల, వీణవంక వద్ద ఉన్న మానేరు నుండి ఈ ఇసుక తరలింపును చేస్తున్నారు. అలాగే కరీంనగర్ నగర శివారు నుంచి కూడా పెద్దఎత్తున ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా అధికారులకు మాత్రం కనిపించడం లేదు. రెవెన్యూ, పంచాయతీ, మైన్స్ అండ్ జియాలజీ శాఖ అధికారులు, ఉద్యోగుల సహకారంతో మాఫియా ఇష్టం వచ్చిన రీతిలో తవ్వకాలు జరుపుతూ యదేశ్ఛగా తరలిస్తున్నారు. వీరికి అధికార పార్టీ నేతలు అండగా నిలుస్తున్నారు. గత నలబై రోజులుగా పెద్దఎత్తున జరుగుతున్న ఈ దందాలో వందలాది లారీలు హైదరాబాద్‌కు తరలిపోయాయి. జిల్లాలోని పలుచోట్ల నుండి కళ్లముందే ఇసుక తరలివెళుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. గతంలో అక్రమంగా ఇసుక తరలించే లారీలను, ట్రాక్టర్లను సీజ్ చేసి 5వేల నుంచి 15వేల వరకు జరిమానా వేసేవారు. ట్రాక్టర్స్, లారీలను సీజ్ చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో అక్రమార్కులు వందలాది లారీల ఇసుకను తరలించి కోట్లాది రూపాయలను ఆర్జిస్తున్నారు. ఈ దందాలో వచ్చిన డబ్బుల్లోంచి కొంత శాతం అధికార పార్టీ నేతలకు రాయల్టీగా చెల్లిస్తున్నట్లు తెలిసింది. అదేకాకుండా ఆయా గ్రామాల పరిదిలో ఇసుకను తీసినప్పుడు అడ్డుకోకుండా ఉండేందుకుగాను గ్రామాల్లోని ప్రజాప్రతినిధులకు కూడా కొంత ముట్టజెప్పుతున్నట్లు సమాచారం. ఇసుకను తోడేందుకు జెసిబిలను వినియోగిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దీనిని అరికట్టకపోతే భూగర్భ జలాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది.

No comments:

Post a Comment