Tuesday, November 29, 2011

చిదంబర రహస్యం

January 1st, 2011

‘చిదంబర రహస్యం’ గురించి వినివిని అదేమిటో తెలుసుకుందామని పోయినవాళ్లకు చిదంబరం గుళ్లో ఒక తెర కనపడుతుంది. దాని వెనక ఆకాశలింగం ఉన్నదంటారు. కాని ఏమీ కనపడదు. అదేమంటే శివుడున్నది ఆకాశరూపంలో కదా, అందుకని కంటికి కనపడడంటారు.
శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు కూడా అలాంటి చిదంబర రహస్యమే.
కమిటీ రిపోర్టు డిసెంబరు 31 కల్లా ఠంచనుగా వచ్చేస్తున్నదనేసరికి రాష్ట్రంలో ఎక్కడెక్కడి వారికీ బ్లడ్‌ప్రెషరు పెరిగింది. తెలంగాణపై తాడోపేడో తేలిపోతుంది; తెలంగాణ ఇవ్వాలన్నా, వద్దన్నా అటో ఇటో భూమి బద్దలవుతుంది; రాష్ట్రం అల్లకల్లోలమవుతుంది కాబోలని తెలివిలేనివాళ్లు తల్లడిల్లిపోయారు. చేతికందిన నివేదికను అఖిలపక్ష భేటీలో బట్టబయలు చేస్తామని చిదంబరామాత్యుడు అనేసరికి ఇప్పుడందరూ ఊపిరి ఉగ్గబట్టుకుని జనవరి 6 మీద దృష్టి పెట్టారు. ఆ రోజున ఏమి తేలుతుందో, కొంపలెక్కడ మునుగుతాయోనని చాలా మంది తెగ హడలి చస్తున్నారు.
ఇది అనవసరపు భయం. ఆ రోజున ఏమీ తేలదు. ఎవరి కొంపా మునగదు. పేరు గొప్ప కమిటీ రిపోర్టులో ఏమీ లేదన్నదే చిదంబరం పెట్టిన పార్టీల పేరంటంలో బయటపడబోయే ‘చిదంబర రహస్యం’!
ఇది చెప్పటానికి దివ్యదృష్టి అక్కర్లేదు. కొంచెం కామన్‌సెన్సు ఉంటే చాలు.
తెలంగాణ ఇవ్వాలన్నా, ఇవ్వవద్దన్నా మొట్టమొదట మునిగేది కాంగ్రెసు కొంప. తెలంగాణ ఇస్తే సీమాంధ్రలో దానికి ఉప్పు పుట్టదు. ఇవ్వకపోతే తెలంగాణలో దానికి పుట్టగతులుండవు. ఇచ్చినా- గతిలేక ఇచ్చారనే తెలంగాణ వాళ్లు అనుకుంటారు; కె.సి.ఆర్.కే వీరపూజ చేస్తారు తప్ప కాంగ్రెసును ఏనుగు అంబారీమీద ఊరేగించి నెత్తినెక్కించుకోరు.
కాబట్టి ఏమీ తేలకుండా ఉండటమే కాంగ్రెసు వారికి కావలసింది. తెలంగాణను ఇచ్చెయ్యమనో, ఇవ్వవద్దనో శ్రీకృష్ణ కమిటీ కరాఖండిగా చెబితే... ఆ సంగతి బయటికొస్తే కాంగ్రెసు ప్రభువులు ఇరుకున పడతారు. కమిటీ చెప్పిన ప్రకారం అడుగు వేయకపోతే పాలకపక్షానికి పరువు దక్కదు. ఏదో ఒక ప్రాంతం ప్రజలు మొగాన పేడ నీళ్లు కొట్టక మానరు. దానికి భయపడి అడుగువేస్తే రెండో ప్రాంతం వాళ్లు అదే సత్కారం చేయకుండా ఉండరు. ఏమి చేసినా, చేయకున్నా తంటాయే అవుతుంది. అలాంటి సంకటాన్ని తెలివిమీరిన చిదంబరం కోరి కొని తెచ్చుకోడు. కమిటీ రిపోర్టులో తమను ఇబ్బందిపెట్టే అంశమేదైనా ఉంటుందన్న అనుమానం ఏకోశాన ఉన్నా చూస్తాం, ఆలోచిస్తాం, త్వరలో చెబుతాం అనే ఆయన దాట వేస్తాడు. అలా కాకుండా రిపోర్టు ఈ చేత్తో అందుకుని, ఆ చేత్తో బయటపెట్టేస్తానని బేఫర్వాగా అనడాన్నిబట్టే అందులోని సరుకు గురించి సర్కారుకు ఎలాంటి దిగులూ లేదని స్పష్టం.
కమిటీ రిపోర్టులో ఏమున్నదో చదివితే గదా తెలిసేది? మీడియా వాళ్లందరి ముందూ కమిటీ వాళ్లు రిపోర్టు తన చేతిలో పెట్టగానే, దాని అట్ట అయినా తీసి చూడకుండానే అన్ని పార్టీల్నీ పిలిచేస్తాం, రిపోర్టు చూపిస్తాం అని చిదంబరం ఏ ధీమాతో అన్నాడు? తీరిగ్గా చదివి, ఏమి చేయాలన్నది ఆలోచించి ఏ మూడు నెలల తరవాతో చెబుతామని హోంమంత్రి అన్నా ఎవరూ ఆక్షేపించగలిగే వాళ్లు కాదు. ఆ వెసులుబాటు తీసుకోకుండా వారానికల్లా రిపోర్టు అందరి ముందూ పెట్టేస్తామని అక్కడికక్కడే ఆయన ఎందుకు ప్రకటించేశాడు? తీరా తెరిచి చూశాక ఇరకాటం ఎదురవుతే ప్రభుత్వం పులుసులో పడదా?
పడదు. ఆ సంగతి చిదంబరానికి బాగా తెలుసు. రిపోర్టులో ఏమున్నదీ అతీంద్రియ శక్తితో గ్రహించి కాదు. రిపోర్టు కాపీని ముందురోజే రహస్యంగా తెప్పించుకుని చదివాడేమోననీ అనుమానించక్కరలేదు. శ్రీకృష్ణకమిటీకి పురమాయించిన పని ఏమిటన్నది ఒక్కసారి గుర్తు చేసుకుంటే చాలు చిదంబర రహస్యం మిస్టరీ ఇట్టే తెలిసిపోతుంది.
కమిటీకి ఇచ్చిన పరిశీలనాంశాలు ఇవి:
1. తెలంగాణ రాష్ట్ర వేర్పాటు డిమాండు దృష్ట్యా రాష్ట్రంలో పరిస్థితిని పరీక్ష చెయ్యటం.
2.రాష్ట్రం పుట్టినప్పటి నుంచీ నడిచిన పరిణామాలను, వివిధ ప్రాంతాల అభివృద్ధిపై వాటి ప్రభావాలను సమీక్షించటం.
3.మహిళలు, పిల్లలు, విద్యార్థులు, మైనారిటీలు, ఎస్.సి.లు, ఎస్.టి.లు తక్కుంగల వర్గాల ప్రజలపై ఇటీవలి పరిణామాల ప్రభావాన్ని పరీక్షించడం.
4. పైన పేర్కొన్న మూడు విషయాలను పరిశీలించేటప్పుడు పట్టించుకోవలసిన కీలకాంశాలను గుర్తించటం.
5. అన్ని వర్గాల ప్రజలను, అన్ని రాజకీయ పార్టీలను, ఇతర సంస్థలను పై విషయాల్లో సంప్రదించి ప్రస్తుత క్లిష్ట పరిస్థితిని ఎలా గట్టెక్కాలన్న దానిపై అభిప్రాయాలు సేకరించటం.
6. పరిశ్రమ, వ్యాపార, కార్మిక, కర్షక సంస్థలను, మహిళా, విద్యార్థి సంఘాలను సంప్రదించి, వివిధ ప్రాంతాల అభివృద్ధికి ఏమి చేయాలంటారని అభిప్రాయాలను పోగెయ్యటం.
7. ఉచితమని తోచిన సలహాలు, సిఫార్సులు ఇవ్వడం.
ఇంతే సంగతులు.
వీటిలో తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలో వద్దో తేల్చమని కమిటీని అడిగిందెక్కడ? ఇవ్వాల్సి వస్తే ఎలా ఇవ్వాలో, ఏమి చెయ్యాలో చెప్పమని కోరిందెక్కడ? ఏ కమిటీ అయినా తనకు అప్పగించిన పనినే, అప్పగించిన మేరకే కదా చేసేది? అందరినీ కలవమన్నారు. కలిసింది. అభిప్రాయాలు సేకరించమన్నారు. కట్టల కొద్దీ రాబట్టింది. వారలా అన్నారు, వీరిలా అన్నారు, కావాలంటే అలా చేయొచ్చు, కాదనుకుంటే ఇలా కూడా చేయొచ్చు. ఏమి చేస్తారన్నది మీ ఇష్టం అని చేటభారతమంతటి రిపోర్టులో కమిటీ చివరికి చేట కొడుతుంది. దాంతో కథ మళ్లీ మొదటికొస్తుంది. నిరుడు జనవరి 5 ఢిల్లీ అఖిలపక్ష పేరంటంలో వదిలేసిన చోటికి రేపు జనవరి 6 అఖిలపక్షం పేరంటంలో తెలంగాణ వ్యవహారం మళ్లీ చేరుతుంది. రిపోర్టు దాఖలుతో కమిటీ పేరిట 11 నెలలపాటు సాగిన విరామ సంగీతం ముగుస్తుంది. మళ్లీ పార్టీకి ఇద్దర్ని చొప్పున ఢిల్లీ పేరంటానికి పిలిచారు కనుక ప్రతి పార్టీ షరామామూలుగా, రెండునోళ్లతో, రెండు నాలికలతో మాట్లాడుతుంది. చివరికి ఏదీ తేల్చలేక అంతా కలిసి ఇంకో కమిటీనో, కమిషనునో ఆవాహన చేసి సరికొత్త విరామ సంగీతం మొదలెట్టిస్తారు. పార్టీలూ హాపీ, చిదంబరమూ హాపీ. జనానికి జోల. కాంగ్రెసుకు హేల. పార్టీల పవరు పాలిటిక్సు షరామామూలు. ప్రజల చెవిలో పూలు. భలే!
-సాక్షి

No comments:

Post a Comment