Tuesday, November 29, 2011

ఆశ్చర్య రాష్ట్రాయణం

-సాక్షి

రావణుడి చితి ఆరితే మండోదరికి వైధవ్యం వస్తుంది. అలా జరగదని (‘ఆశ్చర్య రామాయణం’లో) రాముడు వరమిచ్చాడు. కాబట్టి రావణకాష్ఠం ఎప్పటికీ కాలుతూనే ఉంటుంది-ట!
మన ‘ఆశ్చర్య రాష్ట్రాయణం’లో కాంగ్రెసుదీ కొద్ది తేడాతో అదే పరిస్థితి.
తెలంగాణ రాష్ట్రం ఇచ్చేది లేదంటే తెలంగాణలో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోతుంది. ఇస్తామంటే సీమాంధ్రలో అడ్రసు లేకుండా పోతుంది. తెలంగాణను ఇచ్చినా తెలంగాణ వారు కాంగ్రెసును నెత్తినెత్తుకుని ఊరేగరు. కాంగ్రెసు ప్రభుత్వం మెడలు వంచి, తెలంగాణను సాధించిన కీర్తి కె.సి.ఆర్.కీ, ఆయన పార్టీకే దక్కుతుంది. తాము ఎంత వద్దన్నా వినకుండా రాష్ట్రాన్ని చీల్చినందుకు సీమాంధ్ర ఎలాగూ కాంగ్రెసుకు దూరమవుతుంది.
అలాగని తెలంగాణను ఇవ్వము పొమ్మంటే...? తెలంగాణలో కాంగ్రెసుకు పుట్టగతులుండవు. ఉండకపోతే పోనీ - కనీసం సీమాంధ్ర అయినా కొండంత అండగా నిలబడుతుందనుకుందామా? ఆ ఆశా లేదు. ఇప్పటికే ఆ ప్రాంతంలో జగననేవాడు నాన్నగారి పేరు చెప్పుకుంటూ దుమ్ము లేపేస్తూ, కాంగ్రెసు వాళ్లకు పగలే చుక్కలు చూపిస్తున్నాడు. రాష్ట్రంలో యథా స్థితిని కొనసాగించినంత మాత్రాన ఈ పరిస్థితి మారుతుందన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే ఆ కుర్రవాడు కాంగ్రెసు మీద కత్తి గట్టింది తెలంగాణ అంశం మీద కానే కాదు.
కనుక తెలంగాణను ఇచ్చినా, ఇవ్వకపోయినా కాంగ్రెసుకు నష్టమే తప్ప ఒరిగేది లేదు. కరవమంటే కప్పకు కోపం - విడవమంటే పాముకు కోపం అన్నట్టు ఇస్తామంటే ఆంధ్రావాళ్లకు కోపం; ఇవ్వమంటే తెలంగాణ వాళ్లకు కోపం. ఇవ్వడం లేదని అలిగి ఇటువైపు 13 మంది ఎంపీలు రాజీనామా విసిరికొడితే... ఇచ్చే పక్షంలో అదే పని చేయడానికి అటువైపు 20 మంది ఎంపీలు రడీగా ఉన్నారు. ఎటువైపు బలం తగ్గినా సెంటర్లో కాంగ్రెసు ఓటి సర్కారుకే ఇబ్బంది.
కాబట్టి కనీసం వచ్చే ఎన్నికలదాకా మూడేళ్లపాటైనా కాంగ్రెసు సర్కారు కుదురుగా నిలబడాలంటే ఎటూ మొగ్గకుండా కాలక్షేపం చేయటమే ఉత్తమం. రావణకాష్ఠం ఆరితే మండోదరికి వైధవ్యం వచ్చినట్టు వేర్పాటు కాష్ఠాన్ని ఆర్పితే రాష్ట్రంలో కాంగ్రెసుకు రాజకీయ వైధవ్యం వస్తుంది. కాబట్టి దాన్ని ఆరనీయకుండా, ఏదీ తేల్చకుండా సాధ్యమైనంత కాలం కాంగ్రెసు సర్కారు ఠలాయిస్తూనే ఉంటుంది.
ఈ చిన్న కామన్‌సెన్సు పాయింటే కనుక అర్థమైతే ఇప్పుడు నడుస్తున్న రాజకీయ మాయా నాటకంలో అసలు కిటుకు బోధపడుతుంది. తలకో రకంగా మాట్లాడుతున్నారని, తడవకో విధంగా మాట మార్చేస్తున్నారని, కొంపలంటుకుపోతున్నా కదలక కూచున్నారని కేంద్ర నేతలను ఆడిపోసుకోవటం దండుగ. చెబితే మానం పోతుంది - చెప్పకుంటే ప్రాణం పోతుంది-లాంటి సంకటంలో నేతాశ్రీలు ఇంకోలా మాట్లాడే వీలేలేదు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామోచ్ అని ఈ దేశ హోంమంత్రి పార్లమెంటులో నిలబడి ఆధికారికంగా ప్రకటించిన ఏణ్నర్థం తరవాత తెలంగాణ ఏర్పాటుకు మిగతా ప్రాంతాల, అన్ని పార్టీల అంగీకారం కూడా కావాలని రాజ్యమేలేవారికి గుర్తుకొచ్చింది. తెలంగాణ సంగతి ఏమి చేయాలో చెప్పడానికి శ్రీకృష్ణ కమిటీని వేశాక... సంవత్సరం పాటు ఆలోచించి చించి, అందరినీ సంప్రదించి దించి ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు చేతికంది అర్ధ సంవత్సరం గడిచాక... కమిటీ చేసిన ఆరు సూచనల్లో ఏదీ పరిష్కారమార్గం కాదన్న దేవరహస్యం ప్రభువులకు అంతుబట్టింది. ఆరూ పనికిరావు కాబట్టి అసలైన పరిష్కారాన్ని సరికొత్తగా కనిపెట్టవలసిన పని పడింది. ఈ రాష్ట్రానికి ఇన్చార్జి అయిన గులాంనబీ ఆజాద్‌గారు చైనాలో చల్లగా చెప్పినట్టు తెలంగాణ వ్యవహారం సున్న నుంచి మళ్లీ మొదలుపెట్టాలి.
మొదలుపెట్టాక పూర్తి కావటానికి ఎంత కాలమైనా పట్టవచ్చు. ఆరు దారులు చూపించటానికే శ్రీకృష్ణ కమిటీకి సంవత్సరం పడితే, అన్నిటినీ తలదనే్న తిరుగులేని ఒకే ఒక పరిష్కారాన్ని గులాంనబీ గారు చెప్పిన లెవెల్లో కనుక్కోవడానికి ఎన్ని ఏళ్లయినా పట్టవచ్చు. దానికీ ఎలాంటి లక్షణాలుండాలి?! రాష్ట్రంలోని మూడు ప్రాంతాల చేతా భేష్ అనిపించేట్టుగా ఉండాలి. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలూ దాన్ని చూసి భలే భలే అనాలి. 294 మంది సభ్యులుగల అసెంబ్లీలో ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో దానికి వల్లె అనాలి. ఒక్క ఎమ్మెల్యే వద్దన్నా అది ఏకగ్రీవం కాజాలదు. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేస్తేగానీ సర్కారువారు తెలంగాణను శాంక్షను చెయ్యరు.
అన్ని రాజకీయ పార్టీలూ ఒక్కతాటిమీద నిలిచి, ఏకగ్రీవంగా పాస్ చెయ్యటానికి ఇదేమన్నా ఎంపీలూ, ఎమ్మెల్యేల జీతాలను అయినకాడికి పెంచుకునే తీర్మానమా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించిన ఏణ్నర్థం తరవాత కూడా కేంద్రాన్ని నడిపించే కాంగ్రెస్ పార్టీయే దానిమీద ఎటూ తేల్చలేదు. అసలైన ఒక పార్టీలోనే ఏకాభిప్రాయం లేనప్పుడు మిగతా అన్ని పార్టీలూ ఒక్క తాటిమీదికి వచ్చి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చెయ్యటం కలియుగాంతంలోగా అయ్యేపనేనా? అయినా ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతాన్ని విడగొట్టి, వేరే రాష్ట్రంగా ఏర్పాటుచేయడానికి ఆ రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలన్నీ, పార్టీలన్నీ ఒప్పుకోవాలనీ, అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి తీరాలనీ రాజ్యాంగంలో ఎక్కడుంది?
లేదు. అయినా కేంద్ర ప్రభువులు అలాంటి కండిషన్లు నడమంత్రంగా పెడుతున్నారంటే... అవన్నీ నెరవేరితేగానీ వ్యవహారం అంగుళం కూడా ముందుకు కదలదని రాష్ట్ర కాంగ్రెసు ఇన్చార్జే అన్నాడంటే తెలంగాణ ఏర్పాటు ఇప్పట్లో అంగుళం ముందుకు జరగదనే భావించాలి. సెకండురవుండులో తెలంగాణ డిమాండు సున్నా దగ్గర ఆగిపోతుంది లెమ్మనే సీమాంధ్రులు సంతోషించాలి. సంతోషించి కాంగ్రెసు పార్టీనే ఎప్పటివలె బలపరుస్తూ పోవాలి. ఇంకో చెంప తెలంగాణవాళ్లు తెలంగాణపై ప్రకటన త్వరలో విడుదల అని ఇంకో ఎఐసిసి పెద్దాయన పొక్కించిన వార్తనే పటంకట్టించి, అది నిజమయ్యే రోజు కోసమే ఎదురుచూస్తూ కూచోవాలి. అది నిజమయ్యేదాకా కాంగ్రెసునే పల్లకీ ఎక్కించి ఊరేగిస్తుండాలి. భలే వ్యూహం!
రాజీనామాలిస్తే రాజ్యాంగ సంక్షోభం వస్తుందనో, ఇలా రాజీనామాలందగానే సోనియమ్మ అలా తెలంగాణను ఇచ్చేస్తుందనో వారూ వీరూ చెప్పిన కబుర్లను నమ్మి ఎరక్కపోయ ఇరుకున్న టి-కాంగ్రెస్ ఎంపీలు రాజీనామాల సంకటం నుంచి ఒళ్లు చెడకుండా, పరువుగా ఎలా బయటపడతారన్నదే రాజకీయ రంగస్థలం మీద తరువాయ అంకంలో చూడబోయే తమాషా.

No comments:

Post a Comment