Sunday, August 14, 2011

అమెరికా వైఖరిపై భగ్గుమన్న భారతీయులు


పలు దేశాల వ్యవహారాల్లో అప్రజాస్వామికంగా జోక్యం చేసుకుని రక్తపాతానికి పాల్పడిన అమెరికా ఈసారి భారత ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకుంది. అన్నాహజారే ఈనెల 16వ తేదీ నుంచి చేపట్టనున్న నిరాహార దీక్షను ఎలా ఎదుర్కోవాలో చేసిన వ్యాఖ్యలపై భారత్‌కు సూచనలు చేసింది. దీనిపై భారతీయులు భగ్గుమన్నారు. అమెరికా విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి విక్టోరియా న్యులాండ్‌ శుక్రవారం ఉదయం రోజువారీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ''ప్రపంచ వ్యాప్తంగా శాంతియుతంగా, అహింసాయుతంగా జరిగే నిరసనలకు మేము మద్దతిస్తాం. భారత్‌ ఒక ప్రజాస్వామ్య దేశం. శాంతియుత ఆందోళనలను నిలువరించేందుకు భారత్‌ తగిన ప్రజాస్వామ్య విధానాన్ని అనుసరించాలి'' అని వ్యాఖ్యానించారు. భారత్‌లో జరుగుతున్న ఆందోళనలు, శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న వారి పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. పోలీసుల దారుణాలపై, అవినీతికి వ్యతిరేకంగా అన్నాహజారే దీక్ష చేయనున్న నేపథ్యంలో అడిగిన ప్రశ్నకు ఆమె పైవిధంగా స్పందించారు. విక్టోరియా న్యూలాండ్‌ చేసిన వ్యాఖ్యలపై భారత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు ప్రాంతాల్లో అన్నాహజరే మద్దతుదారులు నిరసన ర్యాలీలు నిర్వహించారు. దీంతో ఈ వ్యవహారంపై భారత ప్రభుత్వం స్పందించింది. విదేశీ వ్యవహారాల విభాగానికి చెందిన అధికార ప్రతినిధి మాట్లాడుతూ అమెరికా వ్యాఖ్యలను 'అవసరం లేనివి'గా అభివర్ణించారు. 'భారత్‌లో శాంతియుత నిరసన పట్ల ఏ విధంగా వ్యవహరించాలన్న విషయంపై అమెరికా నుంచి అనవసరపు వ్యాఖ్యలను మనం చూశాము. వాక్‌ స్వాతంత్య్రం, భావవ్యక్తీకరణతో పాటు శాంతియుతంగా గుమిగూడే స్వేచ్ఛను భారత రాజ్యాంగం కల్పించింది. ఈ అవకాశాన్ని 120 కోట్ల మంది దేశ ప్రజలు వినియోగించుకుంటున్నారు' అన్నారు.

No comments:

Post a Comment