Monday, November 28, 2011

ఎన్‌కౌంటరా..పెన్‌కౌంటరా..?

ఎన్‌కౌంటరా..పెన్‌కౌంటరా..?

జర్నలిస్టు కాల్‌తో కిషన్‌జీ ఉనికి గుర్తింపు? పార్టీ ద్రోహులపైనా అనుమానం


సదానంద్ బెంబ్రే 
(ఆంధ్రభూమి బ్యూరో) 

 కరీంనగర్, నవంబర్ 26: మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వర రావు అలియాస్ కిషన్‌జీది నిజంగా ఎన్‌కౌంటరేనా? లేకపోతే కిషన్‌జీకి ఉన్న మీడియా బలహీనతను సానుకూలంగా మలచుకొన్న పోలీసులు ఫోన్‌కాల్‌ను ట్రాప్ చేయడం ద్వారా పట్టుకొని కాల్చి చంపారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. సంఘటన జరిగిన తీరుతెన్నులు, కేంద్ర కమిటి స్థాయిలో రెండవ స్థానంలో ఉన్న నాయకుడికి ఉండాల్సిన రక్షణ లేకపోవడం, కేవలం నలుగురు వ్యక్తులే సంఘటనా స్థలంలో ఉన్నట్లు పోలీసులు చెబుతుండటం అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. అంతేకాకుండా పార్టీలో ఆంధ్రప్రదేశ్, ఉత్తరాది రాష్ట్రాల క్యాడర్‌కు చెందిన నేతల మధ్య ఇటీవలి కాలంలో బేధాభిప్రాయాలు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. కిషన్‌జీ ఎన్‌కౌంటర్ వెనుక పార్టీకి చెందిన ద్రోహుల పాత్ర ఏమైనా ఉందా? అన్న అనుమానాలూ లేకపోలేదు. పీపుల్స్‌వార్ ఆవిర్భావం నుంచి రెడ్‌కార్‌డార్ నిర్మాణం వరకు పార్టీలో కీలక పాత్ర పోషించిన కిషన్‌జీ మొదటి నుంచి పార్టీలో కొంతమందికి కొరకరాని కొయ్యగానే ఉన్నట్లు ప్రచారంలో ఉంది. తాజా పరిణామాల్లో గణపతి అనారోగ్యరీత్యా బాధ్యతల నుంచి తప్పుకోవచ్చన్న ఊహాగానాలు బలంగా విన్పిస్తున్నాయి. గణపతి తరువాత ఎవరు పగ్గాలు చేపట్టాలన్న అంశంపై మావోయిస్టు పార్టీ గత రెండేళ్లుగా విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీలో గణపతి కన్నా సీనియరైన కిషన్‌జీకే పగ్గాలు అప్పగించవచ్చని వార్తలు వెలువడుతున్న తరుణంలో పూర్వ ఎంసిసి అగ్రనాయకుడైన కిషోర్‌జీ అలియాస్ కిషన్‌దా కూడా మావోయిస్టు పార్టీ సుప్రీమ్ రేసులో ఉన్నారు. ఆయనేకాకుండా మన రాష్ట్రానికే చెందిన నంబాల కేశవరావు కూడా రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో ఉత్తరాది నేతలకు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాయకులకు మధ్య నాయకత్వం విషయంలో తీవ్రమైన అగాథం ఏర్పడినట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా పోలీసులు చేస్తున్న ప్రచారమేనని గతంలో అనేక సందర్భాల్లో కిషన్‌జీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కొట్టిపారేశారు. అయితే ఇటీవలి కాలంలో లొంగిపోయిన ఛత్తీస్‌గడ్, ఎఒబి ప్రాంతాలకు చెందిన మావోయిస్టులు పార్టీలో నెలకొన్న విభేదాలను పరోక్షంగా ధ్రువీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కిషన్‌జీ ఎన్‌కౌంటర్ చర్చనీయాంశమైంది. జార్ఖండ్, పశ్చిమబెంగాల్ ప్రాంతాల్లో 21 సంవత్సరాలుగా పార్టీని ముందుకు నడిపించిన కిషన్‌జీకి మావోయిస్టు పార్టీ అగ్రనేతలకు కల్పించే రక్షణను ఎందుకు కల్పించలేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సాధారణంగా పార్టీలో కీలక స్థానంలో ఉన్న అగ్రనేతలకు బయట ప్రజాప్రతినిధులకు కల్పించే జడ్ ఫ్లస్ కేటగిరీ రక్షణ తరహాలో 40 మందికి తగ్గకుండా సాయుధుల రక్షణ ఏర్పాటు చేయాలి. కానీ కిషన్‌జీ ఎన్‌కౌంటర్ సంఘటనలో కేవలం నలుగురు మాత్రమే ఉండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇదిలా ఉంటే కిషన్‌జీ బుధవారం మిడ్నాపూర్‌కు చెందిన ఓ పాత్రికేయుడితో జరిపిన టెలీఫోన్ సంభాషణే పోలీసులకు ఆయన ఉనికిని పట్టించి ఉండవచ్చని భావిస్తున్నారు. కిషన్‌జీ మొదటి నుంచీ పార్టీ కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మీడియానే బలమైన సాధనంగా నమ్మేవాడని తెలుస్తోంది. ఈ కారణంగానే కిషన్‌జీ మీడియా ప్రతినిధులతో సన్నిహితంగా మెలిగేవాడని చెబుతున్నారు. ఈక్రమంలో ఆయన బలహీనతను పసిగట్టి పోలీస్ వర్గాలతో సన్నిహితంగా ఉండే జర్నలిస్టులను ఆయనతో సంభాషణలకు ఉపయోగించుకొని ఉండవచ్చని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ సరిగ్గా ఇదే తరహాలో అనేక ఎన్‌కౌంటర్లు జరిగినట్లు ఆరోపణలు రావడం ఈ సందర్భంగా గమనార్హం. 2004 శాంతి చర్చల తరువాత మావోయిస్టు అగ్రనేతలు మీడియాతో జరిపిన సంభాషణలే వారి ఉనికిని ఇంటిలిజెన్స్‌కు పట్టించాయి. దాంతో కేవలం మూడేళ్ల వ్యవధిలో రాష్ట్ర కార్యదర్శి బుర్ర చిన్నన్న అలియాస్ మాధవ్ సహా అనేకమంది అగ్రనేతలు, జిల్లా కార్యదర్శులు, దళాలను పోలీసులు మట్టుబెట్టగలిగారు. కిషన్‌జీ విషయంలోనూ పోలీసులు సరిగ్గా ఇదే వ్యూహాన్ని అనుసరించినట్లు బెంగాల్‌కు చెందిన ఓ ప్రముఖ దినపత్రిక సీనియర్ జర్నలిస్టు ధ్రువీకరించడం ఎంతైనా ప్రస్తావనార్హం. లాల్‌గఢ్ సంఘటన జరిగిన సందర్భంలోనూ కిషన్‌జీ ఆచూకీని పోలీసులు ఇదే తరహాలో పసిగట్టి చుట్టుముట్టినట్లుగా వార్తలు వచ్చాయి.

5 comments:

  1. సర్ మీ కథనం చాల బాగుంది. సరిగా ఆంధ్రప్రదేశ్లో ఎలా జరిగిందో బెంగాల్లోనూ అలాగే జరుగుతోంది.

    ReplyDelete
  2. విశ్వాస ఘాతుకానికి పరాకాష్టగా కిషన్జీ ఎన్కౌంటర్ ను పేర్కొనవచ్చు. ఓ వైపు చర్చలంటూనే చిదంబరం, మమత బెనర్జీ ల ముతా కిరాతకంగా కాల్చి చంపటం.. రాజ్యహింసలో భాగమే.

    ReplyDelete
  3. విశ్వాస ఘాతుకానికి పరాకాష్టగా కిషన్జీ ఎన్కౌంటర్ ను పేర్కొనవచ్చు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే. డిఐజి విజయ్ కుమార్ ఫై హత్య కేసు నమోదు చేయాలి.

    ReplyDelete
  4. చాలా చక్కని విశ్లేషణ సార్..

    ReplyDelete