Sunday, February 19, 2012

జలయజ్ఞం పూర్తయ్యేనా..


కరీంనగర్, ఫిబ్రవరి 17: ముక్కుతూ మూలుగుతూ నడుస్తున్న జలయజ్ఞం ప్రాజెక్టులకు ఈసారైనా పూర్తి స్థాయిలో నిధులు కేటాయించపోవడంతో కరీంనగర్ జిల్లాలో దీనికింద చేపట్టిన ప్రాజెక్టుల పరిస్థితి మరోసారి గందరగోళంలో పడినట్లు కనిపిస్తోంది. జిల్లాలో ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, కాళేశ్వర-ముక్తీశ్వర మినీ ఎత్తిపోతల ప్రాజెక్టులను చేపట్టిన ప్రభుత్వం నిధుల కేటాయింపులో చేస్తున్న తాత్సారం వల్ల పనులు మందకొడిగా సాగుతున్నాయి. అంతేకాకుండా మిడ్ మానేరుకు సంబంధించి 70 కోట్ల మేర మట్టి పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లు ఖర్చు పెరిగిందన్న సాకుతో అంచనాలు పెంచితేనే పనులు చేస్తామని మొండికేయడంతో ప్రభుత్వం టెండర్లను రద్దు చేసి తాజాగా మరోసారి టెండర్లు పిలిచింది. అటు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి మట్టిగడ్డ నిర్మాణ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం 80 శాతం పనులు పూర్తికాగా మరో 20 శాతం మేర మైనర్ పనులు పూర్తి కావాల్సి ఉంది. షటర్లను బిగించే దశలో దాని నిర్మాణ పనులను చేపట్టిన కంపెనీ చేతులెత్తేయడంతో ప్రాజెక్టు మట్టి పనులు నిర్వహిస్తున్న ‘ష్యూ’ కంపెనీకే పనులు అప్పగించారు. అయితే నిధులు విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్ ఉద్ధేశపూర్వకంగానే పనులు జాప్యం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ప్రస్తుత బడ్జెట్‌లో జలయజ్ఞం ప్రాజెక్టుల కోసం 15 వేల కోట్లు నీటిపారుదల శాఖకు కేటాయించారు. ఇందులో కరీంనగర్ జిల్లాకు సంబంధించి ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 360 కోట్లు, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కోసం 1100 కోట్లు, శ్రీరాంసాగర్ వరద కాలువకు 330 కోట్ల చొప్పున కేటాయింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఏ మేరకు కేటాయింపులు జరిపారన్న విషయం అసెంబ్లీలో జలయజ్ఞంపై చర్చ సందర్భంలోనే వెలుగు చూసే అవకాశముంది. రాష్ట్ర బడ్జెట్ తీరుతెన్నులను పరిశీలిస్తే మరోసారి సంక్షేమానికి రంగానికి మొండిచేయే చూపిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలుకు సంబంధించి నిర్ధష్టమైన కార్యాచరణ రూపం ఇవ్వకుండా నిధులు దారి మళ్లించేందుకు ప్రయత్నిస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో తాజా బడ్జెట్‌లో జరిపిన కేటాయింపులనైనా సక్రమంగా ఖర్చు చేస్తారా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టిన లక్షా 45 వేల కోట్ల బడ్జెట్‌ను పరిశీలిస్తే ఇందులో వ్యవసాయం, కరువు, విద్య, వైద్యం వంటి కీలక రంగాలకు కంటితుడుపు కేటాయింపులు జరిపారన్న విషయం అర్థమవుతోంది. అంతేకాకుండా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా కేటాయింపులు నామమాత్రంగానే జరిగాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం సాంఘీక సంక్షేమ శాఖకు 2677 కోట్లు కేటాయించగా, బిసి సంక్షేమానికి 2101 కోటి, మైనారిటీ సంక్షేమానికి 488 కోట్లు, వికలాంగుల సంక్షేమానికి 66 కోట్లు, గిరిజన మహిళా సంక్షేమ పథకాల కోసం 2285 కోట్ల చొప్పున కేటాయింపులు జరిపింది. అలాగే అటవీశాఖలో వివిధ అభివృద్ది కార్యక్రమాల అమలుకోసం 500 కోట్లు ఖర్చు చేసేందుకు కేటాయింపులు జరుపగా మత్స్యశాఖకు 234 కోట్లు, శుసంవర్థక శాఖకు 1106 కోట్లు కేటాయింపులు జరిపింది. రోడ్లు, భవనాలు, రవాణా శాఖలకు సుమారు ఐదు వేల కోట్లు కేటాయింపులు జరుపగా, విద్యార్థుల స్కలర్‌షిప్‌లు, ఫీజు రీయంబర్స్‌మెంటు కోసం 3820 కోట్లు, శాసనసభా నియోజకవర్గాల అభివృద్ధికోసం ఒక్కో నియోజకవర్గానికి కేటాయించింది. అలాగే ఇందిరా జలప్రభ పథకం కింద ఎస్సీ,ఎస్టీల భూముల్లో నీటి వసతి కల్పించేందుకు లక్ష బోర్లను తవ్వించాలని నిర్ణయించింది. యువజన, ఉపాధికల్పనకోసం రాజీవ్ యువశక్తి పథకానికి 150 కోట్లు కేటాయించింది. వ్యవసాయ శాఖకు సంబంధించి కరువు సహాయం క్రింద 3500 కోట్లు, వ్యవసాయ రంగానికి 3175 కోట్లు కేటాయింపులు జరిపింది. అలాగే పట్టణాభివృద్ధి కోసం 6,586 కోట్లు కేటాయించడం జరిగింది.
సంక్షేమ రంగానికి పెద్దపీట
*మంత్రి శ్రీ్ధఠ్ బాబు
ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి 2011-12 సంవత్సరానికి ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ చాలా బాగుందని పౌరసరఫరాలు, శాసన సభావ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీ్ధర్ బాబు అన్నారు. సంక్షేమ రంగానికి పెద్దపీట వేశారని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బిసి, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ, మహిళా సంక్షేమానికి గత ఏడాది కంటే ఎక్కువమొత్తంలో నిధులు కేటాయించారని చెప్పారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది అత్యుత్తమ సంక్షేమ బడ్జెట్ అని మంత్రి పేర్కొన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి గత సంవత్సరం కేటాయింపుల కంటే 43 శాతం, మహిళా సంక్షేమానికి 22 శాతం, వికలాంగుల సంక్షేమానికి 37 శాతం, మైనారిటీల సంక్షేమానికి 62 శాతం అధికంగా నిధులు కేటాయించారని అన్నారు. పౌరసరఫరాల శాఖకు గత ఏడాది రూ.2667 కోట్ల కేటాయించగా ఈ ఏడాది రూ.3175 కోట్లు కేటాయించారని చెప్పారు. సంక్షేమ రంగంతో పాటు వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రవాణా, రోడ్లు, భవనాలు, పట్టణాభివృద్ధి తదితర రంగాలకు ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించారని తెలిపారు. హైదరాబాద్-కరీంనగర్-రామగుండం రహదారి నాలుగు లైన్లు విస్తరణకు బడ్జెట్‌లో 1,358.19 కోట్లు కేటాయించారని తెలిపారు.
కొత్త సీసాలో పాత సారా
* ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య
రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో కొత్తదనం ఏమీ కనిపించడం లేదని, సం క్షేమ రంగానికి కేటాయించిన నిధులను ఇతర రంగాలకు కేటాయించారని చొప్పదండి ఎమ్మె ల్యే సుద్దాల దేవయ్య ఆరోపించారు. రాష్ట్ర బడ్జెట్‌పై ‘ఆంధ్రభూమి’తో ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. బడ్జెట్ కేటాయింపులను చూస్తుంటే కొత్తసీసాలో పాత సారా అన్నట్లుగానే ఉందని, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలుకు సంబంధించి నిర్ధిష్టమైన కార్యాచరణ రూపం ఇవ్వలేదని ఎత్తి చూపారు. ఈ సారి జరిపిన కేటాయింపులనైనా సక్రమంగా ఖర్చు చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రారంభించిన ఏ సంక్షేమ కార్యక్రమాన్నైనా మద్యలో వదిలేసి నిర్వీర్యం చేయడం సరైన పంథా కాదని, సమర్థవంతంగా దాన్ని అమలుచేసేందుకు ప్రయత్నించాలే తప్ప దాన్ని చెడగొట్టకూడదని అభిప్రాయపడ్డారు.
ఆర్థిక సంక్షోభాన్ని పెంచే బడ్జెట్ :
ఎకనామిక్స్ ఫోరం
రాష్ట్ర ప్రభుత్వం 1,45,854 కోట్లతో ప్రవేశపెట్టిన 2012-13 వార్షిక బడ్జెట్ సామాన్యునిపై ప న్నుల భారాన్ని పెంచి కొనుగోలు శక్తి, జీవన ప్రమాణాన్ని, తలసరి ఆదాయాన్ని తగ్గించి సామాజిక, ఆర్థిక సంక్షోభాలను పెంచేదిగా ఉందని జిల్లా ఎకనామిక్స్ ఫోరం అధ్యక్షులు నేదునూరి కనుకయ్య అన్నారు. శుక్రవారం స్థానిక ఎకనామిక్స్ ఫోరం కార్యాలయంలో ‘రాష్ట్ర బడ్జెట్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం’ అనే అంశంపై జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడుతూ బడ్జెట్‌లో అమ్మకపు పన్ను, ఎక్సైజ్ పన్ను, స్టాంపు డ్యూటి 25 శాతానికి పెంచటం వల్ల ప్రజలపై అదనపు పన్నుల భారం పడుతోందని, బడ్జెట్‌లో గ్రామీణ రుణభారం, రైతు ఆత్మహత్యలు, గిట్టుబాటు ధర, పంట విరామం, కరువు నివారణ, రైతాంగానికి ఉత్పాదకాల సరఫరాలో కొరత, మారుమూల మెట్ట ప్రాంతాల అభివృద్ధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి దోహదపడే గ్రామ పారిశ్రామికీకరణ, గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాల కల్పన, సహజ వనరుల రక్షణ, చిన్ననీటి వనరుల పరిరక్షణ, గ్రామీణ వలసను అరికట్టే చర్యలు, వైద్య ఆరోగ్య సంరక్షణకు అరకొర కేటాయింపులు కేంద్ర నిధుల దుర్వినియోగం, మళ్లింపు అమలులో అవకతవకలను అరికట్టే చర్యలు బడ్జెట్‌లో ప్రస్తావించకపోవటం వల్ల సాంఘీక, ఆర్థిక, పంపిణీ న్యాయానికి తీవ్ర విఘాతం ఏర్పడుతుందని అన్నారు. జిల్లా ఎకనామిక్స్ ఫోరం కార్యదర్శి డాక్టర్ సిహెచ్.శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రకృతి సంరక్షణ, వరదల నివారణ, పర్యావరణ పరిరక్షణ, మురుగునీటి కాలువల నిర్వహణకు సంబంధించి ప్రస్తావన లేకపోవటం శోచనీయం. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సంవత్సర ఆర్థిక, సాంఘీక, సామాజిక సమస్యల నుండి విముక్తి పొందటానికి, సమగ్రాభివృద్ధికి సరైన కేటాయింపులు, కార్యచరణ లోపించిందన్నారు. బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కేవలం 3175 కోట్లు 2 శాతం నిధులు, విద్యుత్‌కు 5935 కోట్లు, ఉన్నత విద్యకు 1841 కోట్లు కేటాయించి సంక్షోభంలోగల వ్యవసాయ, విద్యుత్, విద్యారంగాలను విస్మరించటం వల్ల మానవ వనరుల అభివృద్ధికి విఘాతం కలుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ దశరథం, కె.రాంచంద్రం, రవీందర్ రెడ్డి, శకుంతల, కల్పన తదితరులు పాల్గొన్నారు.

జలయజ్ఞం పూర్తయ్యేనా.. | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi

జలయజ్ఞం పూర్తయ్యేనా.. Andhrabhoomi - Telugu News Paper Portal Daily Newspaper in Telegu Telugu News Headlines Andhra Bhoomi

Saturday, December 24, 2011

సిండికేట్లే విలన్లు

టార్గెట్లే నియంత్రణకు అవరోధం వ్యాపారులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు ఎక్సైజ్‌శాఖ జెఎసి ఆరోపణ

హైదరాబాద్, డిసెంబర్ 23: మద్యం సిండికేట్లు ఎక్సైజ్‌శాఖను శాసించేస్థాయికి చేరుకున్నాయని, వాటివల్లనే తమ శాఖకు చెడ్డపేరు వస్తోందని ఎక్సైజ్‌శాఖ జెఎసి ఆరోపించింది. ప్రభుత్వం తన ఆదాయం పెంచుకోవడం కోసం మద్యం అమ్మకాలకు టార్గెట్స్ పెట్టిందని, దీనివల్లనే వ్యాపారులు నిబంధనలను ఉల్లంఘించినా చూసీ చూడనట్లుగా వ్యవహరించాల్సి వస్తుందని ఎక్సైజ్ జెఎసి పేర్కొంది. ఎక్సైజ్‌శాఖకు చెందిన ఎగ్జిక్యూటివ్ అఫీసర్స్ సంఘం, గెజిటెడ్ అధికారుల సంఘం, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్స్ సంఘాలు కలిసి శుక్రవారం హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఉద్యోగుల జెఎసిగా ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా జెఎసి చైర్మన్‌గా ఎన్నికైన ఎస్‌ఎం రామేశ్వర్‌రావు, సెక్రటరీ జనరల్ ఆర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, తాజాగా ఎక్సైజ్‌శాఖపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు. మద్యం అమ్మకాలు పెంచడం ద్వారా ప్రభుత్వం తన ఆదాయం పెంచుకునేందుకు తమకు టార్గెట్స్‌ను విధించిందని, దీనివల్ల వ్యాపారులు నిబంధనలను ఉల్లంఘించినా కఠినంగా వ్యవహరించలేదని వారు వాపోయారు. పైగా తమశాఖకు సిబ్బంది కొరత వేధిస్తోందని దీనిని కూడా సిండికేట్లు తమకు సానుకూలంగా మలుచుకుని నిబంధనలను ఉల్లంఘించిన మాట వాస్తవమేనని వారు అంగీకరించారు. ఇక నుంచి అలా జరగకుండా కఠినంగా వ్యవహరించక తప్పదని రామేశ్వర్‌రావు హెచ్చరించారు. ఎమ్మార్పీ రేట్లు, మద్యం షాపుల సమయపాలన, విడి అమ్మకాలపై దృష్టి సారించి మద్యం సిండికేట్ల ఆటకట్టిస్తామని వారు పేర్కొన్నారు. మద్యం సిండికేట్లకు,తమ సిబ్బందికి ఎలాంటి సంబంధం లేదని వారు ఖండించారు. సిబ్బంది కొరత, వనరులు, సౌకర్యాలు కల్పించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఇసుక తీస్తే ఇక ఉక్కు పాదమే


* ‘భూమి’ కథనాలతో అధికారుల్లో కదలిక
* అక్రమ రవాణా నిరోధానికి తహశీల్దార్లకు ప్రత్యేక అధికారాలు  
* జిల్లా వ్యాప్తంగా 19 మందిపై క్రిమినల్ కేసులు
* నిఘాకోసం ప్రత్యేక బృందాలు
* నేడో, రేపో విడిసిలపైనా కేసులు
* వెల్లడించిన జాయింట్ కలెక్టర్
-ఆంధ్రభూమి బ్యూరో -

కరీంనగర్, డిసెంబర్ 23: జిల్లాలో ప్రవహిస్తున్న రెండు ప్రధాన నదులైన గోదావరి, మానేరు పరివాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న ముఠాల ఆట కట్టించేందుకు రంగం సిద్ధమైంది. జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలపై ‘ఆంధ్రభూమి’ ప్రచురించిన వరుస కథనాలతో అధికారుల్లో చలనం మొదలైంది. దాంతో జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఇసుక అక్రమ మైనింగ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులపై చర్యలు చేపట్టే దిశగా అడుగులు ప్రారంభించింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మొత్తం 19 వాహనాలను స్వాధీనం చేసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ఇందులో కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ, సుల్తానాబాద్, ధర్మపురి వంటి ప్రాంతాల్లో గురువారం విస్తృతంగా దాడులు నిర్వహించి 14 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. అంతేకాకుండా వాటి యజమానులపై క్రిమినల్ కేసులు కూడా మోపారు. అలాగే జమ్మికుంట మండలంలోని రెండు ర్యాంప్‌ల నుంచి ఇసుకను తరలిస్తున్న మరో ఐదు వాహనాలను రెవెన్యూ సిబ్బంది దాడులు జరిపి పట్టుకున్నారు. వాటిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. వీరిపై ఎపి వాల్టా చట్టాన్ని అనుసరించి కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అలాగే జగిత్యాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని రాయికల్ మండలం కొత్తపేట, బోర్నపల్లి, మల్లాపూర్ మండలం వివిరావుపేట, కోరుట్ల మండలం పైడిమడుగు, మెట్‌పల్లి మండలం ఆత్మకూరు తదితర ప్రాంతాల్లో విడిసిలు వేళం వేసినట్లు ఆరోపణలు రావడంతో వాటిపై విచారణ జరిపి కేసులు నమోదు చేయడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ అరుణ్ కుమార్ ‘ఆంధ్రభూమి’ ప్రతినిధికి వెల్లడించారు. అయితే వేలంలో ర్యాంపులు దక్కించుకున్న అక్రమ తవ్వకందారులపై చర్యలు తీసుకునే విషయాన్ని మాత్రం ధృవీకరించలేదు. వారంతా కూడా అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలకు అనుచరులుగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే జిల్లావ్యాప్తంగా మొత్తం 34 పాయింట్లలో అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ఇకపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి అక్రమ ఇసుక మైనింగ్‌కు పాల్పడేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సంబంధిత తహశీల్దార్లకు ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా అక్రమ మైనింగ్‌కు పాల్పడే వ్యక్తులకు సంబంధించిన వాహనాలు పట్టుబడితే వాటిని సీజ్ చేయడంతో పాటు పెద్దమొత్తంలో జరిమానా విధించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ట్రాక్టర్లు మొదటిసారి పట్టుబడితే ఎనిమిది వేలు, రెండవ సారి పట్టుబడితే పది వేల చొప్పున, లారీలు మొదటిసారి పట్టుబడితే 20 వేలు, రెండవసారి పట్టుబడితే అంతకంటే ఎక్కువ జరిమానా విధిస్తూ క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అక్రమ రవాణా నిరోధానికి తహశీల్దార్‌లు, మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు, సంబంధిత ఎస్‌ఐలకు వాహనాలను సీజ్ చేసే అధికారాలు ఇవ్వాలని నిర్ణయించారు.

షరా‘మామూల్’..

* పోలీసులు, రెవెన్యూలకే సింహభాగం

* విడిసిల ముసుగులో అక్రమ అనుమతులు

* యథేచ్ఛగా ఇసుక మాఫియా


కరీంనగర్, డిసెంబర్ 22: నిన్న లిక్కర్ సిండికేట్ కుంభకోణం..నేడు ఇసుక మాఫియా..ఇలా ఏ కుంభకోణం వెలుగులోకి వచ్చినా అందులో అధికార పార్టీ ముద్ర కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాలో కాంగ్రెస్‌కు చెందిన చోటా మోటా నాయకులదే ప్రధాన పాత్రగా చెప్పవచ్చు. చోటా మోటా నాయకులే కదా! అని తీసిపారేయకండీ. వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లుకమ్మక తప్పదు. సగటున రోజుకు వారి ఆర్జించేది అక్షరాల లక్ష రూపాయల పై మాటే. ఇందుకు భూగర్భ జలవనరుల శాఖ, గనుల శాఖ అధికారుల తోడ్పాటు షరా‘మామూల్’గా జరిగిపోయేదే. ప్రతిఫలంగా అక్రమార్కులను చూసి చూడనట్లుగా వదిలివేయటమే. ఇదంతా ఒకెత్తయితే జగిత్యాల రెవెన్యూ సబ్ డివిజన్ పరిధిలోని రాయికల్ మండలం మూటపల్లి, కొత్తపేట, బోర్నపల్లి, కోరుట్ల మండలం పైడిమడుగు, మెట్‌పల్లి మండలం ఆత్మకూరు తదితర గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీల పేరిట అధికార పార్టీకి చెందిన నేతలు అనధికారికంగా ఇసుక రీచ్‌లకు వేలం పాటలు నిర్వహించి కాంట్రాక్టర్లకు కట్టబెడుతున్నారు. ఇందుకుగాను కేవలం లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల వరకు విడిసికి చెల్లించి ఇక ఆ ఏడాది పొడవునా కావాల్సినంత ఇసుకను తోడుకుపోయే వెసులుబాటును కల్పించారు. దాంతో పెద్దవాగు, మానేరు వాగు, గోదావరి నదీ పరిసరాల్లో ఈ అక్రమ క్వారీలు వెలిశాయి. విడిసిల ద్వారా క్వారీలను చేజిక్కించుకున్న వ్యక్తులు పెద్దఎత్తున అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారు. అయితే ఆరోపణలు వచ్చిన సందర్భాల్లో మాత్రమే పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ అధికారులు అప్పుడప్పుడు దాడులు నిర్వహించి తమ పని చక్కబెట్టుకున్నాక చూసీ చూడనట్లు వదిలేస్తున్నారని, అందుకు ప్రతిఫలంగా ప్రతీ నెలా ఇసుక కాంట్రాక్టర్లు ఆయా ప్రాంతాల్లోని సంబంధిత అధికారులకు 45 నుంచి 60 వేల వరకు మామూళ్లు ముట్టజెప్పుతున్నట్లు ఆరోపణలున్నాయ. అయితే గ్రామాభివృద్ధి పేరుతో స్థానిక సంస్థలకు పోటీగా పెత్తనం చెలాయిస్తున్న ఈ విడిసిలపై సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తులే ఆధిపత్యం చెలాయిస్తున్నారు. వారి కనుసన్నల్లోనే గ్రామానికి సంబంధించిన లావాదేవీలన్నీ నిర్వహిస్తారు. ఈ క్రమంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గ్రామాల్లో ఇసుక క్వారీలకు టెండర్లు నిర్వహించి చౌకధరలకు కట్టబెట్టి లోపాయికారిగా లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారనేది నగ్న సత్యం. ఉదాహరణకు రాయికల్ మండలంలోని మూటపల్లి, కొత్తపేట, బోర్నపల్లి ప్రాంతాల్లో ఇసుక తవ్వుకునేందుకు వేలం పాటలు నిర్వహించి కేవలం 2.45 లక్షల రూపాయలకే క్వారీని కట్టబెట్టడం గమనార్హం. అయితే సగటున ఈప్రాంతం నుంచి సదరు కాంట్రాక్టర్ రోజుకు 50 ట్రాక్టర్లకంటే ఎక్కువ మొత్తంలో ఇసుకను తరలిస్తూ విడిసికి చెల్లించిన మొత్తం రుసుంను రెండు, మూడు రోజుల్లోనే వసూలు చేసుకోగలిగారు. దీన్నిబట్టి విడిసిలు ఇసుక మాఫియా అనుబంధం ఎంత గాఢంగా బలపడి ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
ఇకపోతే వీణవంక మండలం ఇప్పలపల్లి, కోర్కల్, కొండపాక, బోయినపల్లి మండలం వరదవెల్లి, శభాష్‌పల్లి, కొదురుపాక, కరీంనగర్, గంగాధర, బోయినపల్లి మండల సరిహద్దుల్లోని బావుపేట, ఒద్యారం, ఖాజీపూర్, మల్లాపూర్ తదితర ప్రాంతాలతో పాటు ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్, జమ్మికుంట మండలం  విలాసాగర్, తనుగుల, తిమ్మాపూర్ మండలం రేణికుంట, కొత్తపల్లి తదితర ప్రాంతాల నుంచి సగటున రోజుకు ఒక్కో ఇసుక రీచ్ నుంచి 60 నుంచి 70 ట్రాక్టర్ల వరకు ఇసుక తవ్వకాలు, తరలింపు అడ్డూ అదుపులేకుండా సాగిపోతోంది. ఒక్కో ట్రాక్టర్‌కు రెండు వేల చొప్పున ఇసుక విక్రయిస్తూ ఒక్కో కాంట్రాక్టర్ సగటున రోజుకు లక్ష రూపాయల వరకు ఆదాయం గడిస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ అనుమతిలేని చిన్న చిన్న వాగులు, వంకలపై జరుగుతున్న తతంగం. ఈ వ్యవహారంలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతీ ఒక్కరి హస్తం ఉన్నట్లు అర్థమవుతోంది. వీణవంక మండలం ఇప్పలపల్లిలో ఓ రాజకీయ నాయకుడు రోజుకు 60-70 ట్రాక్టర్ల వరకు ఇసుకను తరలిన్నారు. అలాగే ఇదే మండలంలోని కోర్కల్‌లో ఓ స్థానిక నేత ఏకంగా మానేరులో జెసిబిలు మోహరించి ఇసుక తవ్వకాలను జరుపుతున్నారు. సదరు వ్యక్తి కూడా షరా మామూలుగా సంబంధిత అధికారులకు భారీగానే ముడుపులు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే కొండపాక గ్రామంలో ఓ నాయకుడు రోజుకు పది ట్రాక్టర్ల చొప్పున ఇసుకను తరలించి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఆరోపణలు రావడంతో ఇటీవల అధికారులు గ్రామాన్ని సందర్శించి మానేరుకు వాహనాలు వెళ్లకుండా పెద్దఎత్తున కందకాలు తవ్వినప్పటికీ నిరాటంకంగా ఇసుక తరలింపు కొనసాగుతోంది.
ఇకపోతే ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లో ముగ్గురు వ్యక్తులు గ్రామాభివృద్ధి కమిటీకి నాలుగు లక్షల 80 వేల రూపాయలు చెల్లించి సగటున రోజుకు 20-30 ట్రాక్టర్లు ఇసుక తరలిస్తున్నారు. ఇక్కడ సదరు కాంట్రాక్టర్లు సంబంధిత అధికారులకు నెలకు రెండున్నర లక్షలకు పైగా మామూళ్లు ముట్టజెబుతున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇక బోయినపల్లి మండలంలోని వరదవెల్లి, శాభాష్‌పల్లి, కొదురుపాక గ్రామాల్లోని ఇసుక రీచ్‌ల నుంచి పెద్దమొత్తంలో కరీంనగర్ శివారులోని బావుపేట గ్రానైట్ క్వారీల్లో కుప్పలుగా పోసి అక్కడి నుంచి లారీల్లో రాజధానికి తరలిస్తున్నారు. ఇక్కడ ఇసుక మాఫియా ప్రతీ నెల లక్షల్లో అధికారులకు ముట్టజెబుతోంది. వారే అన్ని వర్గాలకు పర్సెంటేజీల చొప్పున మామూళ్లు పంచుతున్నట్లు ఆరోపణలున్నాయ.

మద్యం సిండి‘కేటు’లకు ఐటి దడ

కొత్త మలుపు తిరిగిన సిండికేట్ కుంభకోణం 
 
రంగంలోకి దిగనున్న ఆదాయ పన్నుల శాఖ?
 
టాస్క్ఫోర్సు చిట్టాలో జీరో వ్యాపారుల గుట్టు?
 

కరీంనగర్, డిసెంబర్ 17: మద్యం సిండికేట్ల కుంభకోణం కొత్త మలుపు తిరుగుతోందా? ఎసిబి దాడుల్లో భాగంగా వెంట తీసుకెళ్లిన రికార్డుల ఆధారంగా సిండి‘కేటు’ల గుట్టు బయటపెట్టేందుకు రంగం సిద్ధం అవుతోందా? అంటే అవుననే చెబుతున్నాయి తాజా పరిణామాలు. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో మునిగిన వివిధ శాఖల అధికారులకు తోడుగా ప్రజాప్రతినిధులు కూడా ఈ కుంభకోణంతో సంబంధాలు కలిగి ఉన్నట్లు వార్తలు వస్తుండటం కలకలం రేకిత్తిస్తోంది. మరీ ముఖ్యంగా అడ్డగోలు ధరలకు మద్యం విక్రయించి అక్రమాలకు పాల్పడిన సిండికేట్లపై ఐటి కొరడా ఝులిపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో మద్యం వ్యాపారుల్లో దడ మొదలైంది. ఇక ఐటి నిజంగానే రంగంలోకి దిగినట్లైతే మద్యం వ్యాపారుల రూపంలో ఉన్న బడాబాబుల ఆస్తుల గుట్టు కూడా తేలడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదంతా ఒక ఎతె్తైతే ఏడాదికోసారి మద్యం షాపులు, గీత కార్మిక సంఘాలపై ఆరోపణలు వచ్చినపుడు మాత్రమే దాడులు నిర్వహించే స్పెషల్ టాస్క్ఫోర్సు(ఎస్‌టిఎఫ్) ఎసిబి ట్రాప్‌లో పడటం, ఎసిబి స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌లో జీరో దందా చేస్తున్న ‘పెద్ద’ మనుషుల బండారం కూడా నమోదు చేసి ఉండటం వంటి పరిణామాలను భేరీజు వేసి చూస్తే రాబోయే రోజుల్లో సిండికేట్ల మెడకు ఉచ్చు బిగుసుకోవడం ఖాయమనే చెప్పాలి. నిన్నటి వరకు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన సిండికేట్ నిర్వాహకులు ప్రమాదాన్ని గ్రహించి హుటాహుటిన రాజధానికి పరుగులు తీసి ఉచ్చు నుంచి బయట పడేందుకు మార్గానే్వషణ ప్రారంభించారు.ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఓ మంత్రి సహాయంతో బయట పడేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
రాష్ట్రంలో ప్రకంపనలు రేకెత్తిస్తున్న ఈ మద్యం సిండికేట్ కుంభకోణం మూలాలు మొట్టమొదటగా కరీంనగర్ జిల్లాలోనే వెలుగు చూసాయి. ఈ కుంభకోణంలో క్షేత్రస్థాయి అధికారుల నుండి మొదలుకుని రాష్టస్థ్రాయి ఉన్నతాధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధుల హస్తం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో జిల్లాలో కొత్త చర్చకు తెరలేచింది. ఎసిబి దాడుల్లో భాగంగా సిండికేట్ వ్యాపారులకు సంబంధించిన రికార్డులు, కంప్యూటర్ హార్ట్ డిస్క్‌లను సీజ్ చేసి తీసికెళ్లిన విషయం తెలిసిందే. మద్యం వ్యాపారులకు సంబంధించిన రికార్డులలో నెలవారీ వ్యాపార లావాదేవీలు, ఖర్చుల వివరాలతోపాటు శాఖల వారీగా ఏయే శాఖలకు ఎంతెంత సొమ్ము ముట్టజెప్తున్నారో అందులో సవివరంగా నమోదు చేసి ఉండడంతో, ఈ కుంభకోణంతో ప్రమేయం ఉన్న అధికారులు భయంతో వణికిపోతున్నారు. అంతేకాకుండా మద్యం వ్యాపారులకు సంబంధించి ఐఎంఎల్ డిపో నుండి కొనుగోలు చేసిన స్టాక్, ధరల వివరాలు తిరిగి అమ్మకాలకు సంబంధించిన ధరల వంటి వివరాలు కూడా సిండికేటు రికార్డులలో భద్రపరిచినట్లు తెలుస్తోంది.వాస్తవానికి ఐఎంఎల్ డిఫో ద్వారా జారీ చేసే మద్యం ధరలకు రిటేల్ అమ్మకపు ధరలకు మధ్య భారీ తేడా ఉంటోంది. ఎంఆర్‌పి ధరలకు విక్రయించకుండా వ్యాపారులంతా సిండికేట్లుగా మారి వాస్తవ ధరలకు రెట్టింపు మొత్తానికి విక్రయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రిటైల్ షాపులకు కేసుల లెక్కన ఐఎంఎల్ డిపో మద్యం సరఫరా చేస్తుంది. కరీంనగర్ జిల్లాలో ఎక్కువగా బీర్ అమ్మకాలదే అగ్రస్థానం. ఉదాహరణకు బీరు అమ్మకాలను తీసుకుంటే 12 లైట్ బీర్లు కలిగిన కేసును 680 రూపాయలకు వ్యాపారులకు అందిస్తుండగా, స్ట్రాంగ్ బీరు కేసును 780 రూపాయలకు జారీ చేస్తుంది. విడిగా ఒక్కో లైట్ బీరు సిసాను 56 రూపాయలు, స్ట్రాంగ్ బీరును 65 రూపాయలకు అందిస్తుండగా వాటి ఎమ్మార్పీ ధర లైట్ బీరు 71 రూపాయలు కాగా, 90 రూపాయలకు విక్రయిస్తున్నారు. అదే స్ట్రాంగ్ బీరు ధర 82 రూపాయలు కాగా 110 రూపాయలకు విక్రయిస్తున్నారు. బార్ అండ్ రెస్టారెంట్‌లలో ఎమ్మార్పీ ధర కంటే 50 శాతం నుంచి 75 శాతం వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. బార్ అండ్ రెస్టారెంట్‌లకు సంబంధించి మద్యం విక్రయాలను ఎమ్మార్పీకి మించి అమ్మకూడదన్న నిబంధనలేవీ లేకపోవడంతో ఇష్టంవచ్చినట్లు ధరలు నిర్ణయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రిటేల్ షాపుల్లో మాత్రం ఎమ్మార్పీకి మించి ఒక్క పైసా అదనంగా వసూలు చేసినా ఆయా షాపుల లైసెన్స్‌లను రద్దు చేసే అవకాశం ఉంటుంది. అయితే గడిచిన ఏడాది కాలంగా జిల్లాలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి పరిస్థితులను మద్యం వ్యాపారులు తమకు అనుకూలంగా మలుచుకుని గతంలో ఎప్పుడూ లేనంత భారీగా మద్యం ధరలు పెంచి యథేచ్చగా దోపిడీ సాగిస్తున్నారు. దీనిపై ఎన్నిసార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా సంబంధిత అధికారులు స్పందించిన దాఖలాలు లేవు. తాజాగా ఎసిబి దాడులతో ఆయా శాఖల సిబ్బంది ఎందుకు కళ్లుమూసుకున్నారన్న విషయం బట్టబయలు కావడంతో సిండికేట్లలో గుబులు మొదలైంది. ఇదంతా ఒకెతె్తైతే మహారాష్ట్ర, ఛత్తీష్‌ఘ్ఢ్ రాష్ట్రాలకు సమీపంలో ఉన్న సరిహద్దు మండలాలైన మంథని, మహాదేవపూర్, మహాముత్తారం, కాటారం, ముత్తారం తదితర మండలాలతో పాటు ఆదిలాబాద్ జిల్లాలోనూ కొన్ని ప్రాంతాల్లో ఆయా రాష్ట్రాలకు చెందిన జీరో మద్యం పెద్ద ఎత్తున తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి గతంలో పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో తూర్పు డివిజన్‌లో దాడులు నిర్వహించిన స్పెషన్ టాస్క్ఫోర్సు నజరానాలు పుచ్చుకుని దోషులను వదిలేశారన్న విమర్శలున్నాయి. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి కోట్లల్లో గండిపడేందుకు ఎక్సైజ్ అధికారులు సహకరించారన్న విషయం తేటతెల్లమైంది. ఇదిలా ఉండగా సిండికేట్ రహస్యాలు చేజిక్కించుకున్న ఎసిబి మద్యం లావాదేవీల చిట్టాను ఆదాయ పన్నుల శాఖకు అప్పగించిన పక్షంలో జిల్లాలో ‘పెద్ద’ మనుషులుగా చలామణి అవుతున్న బినామీ మద్యం వ్యాపారుల అక్రమాల పుట్ట పగిలే అవకాశం లేకపోలేదు. గతంలో నిర్ణయించిన మద్యం షాపుల వేలం కంటే ఈ సారి రెట్టింపు ధర వెచ్చించి షాపులను చేజిక్కించుకున్న బడాబాబులకు అంత పెద్ద మొత్తంలో సొమ్ము ఎక్కిడినుంచి వచ్చిందన్న అనుమానాలున్నాయి. బినామీ పేర్లపై జిల్లాకు చెందిన రాజకీయ ‘ప్రముఖులు’ నల్ల ధనాన్ని పెట్టుబడిగా పెట్టి వైట్ మనీ చేసుకునే ప్రయత్నంలో బాగంగానే బినామీ పేర్లపై కోట్లు వెచ్చించి షాపులను దక్కించుకున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఆదాయ పన్ను శాఖ గనుక రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో విచారణ జరిపితే బ్లాక్ మనీ బాబుల బండారం బయటపడక తప్పదనే చెప్పాలి.