Tuesday, February 28, 2012

చైనాకు పుంజుకుంటున్న గ్రానైట్ ఎగుమతులు

 

కరీంనగర్, ఫిబ్రవరి 23: కలర్ గ్రానైట్ పరిశ్రమకు ప్రసిద్ధిగాంచిన కరీంనగర్ జిల్లా నుండి చైనాకు తిరిగి ఎగుమతులు పుంజుకున్నాయి. జిల్లాలో 370కి పైగా ఉన్న గ్రానైట్ క్వారీల నుండి ప్రతి ఏటా దాదాపు రెండు లక్షల క్యూబిక్ మీటర్ల పైచిలుకు గ్రానైట్ బ్లాకులు చైనాకు ఎగుమతి అవుతున్నాయి. తద్వారా ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం సీనరేజీ రూపంలోమొత్తం 110 కోట్ల ఆదాయం సమకూరుతోంది. అయితే గతంలో ఉన్న సెల్ఫ్ రిమూవల్ విధానం కారణంగా గ్రానైట్ కంపెనీల యజమానులు ప్రభుత్వానికి తప్పుడు కొలతలతో విలువైన బ్లాకులను తరలించేవి. ఈ క్రమంలో మైనింగ్ అక్రమాలపై పెద్దఎత్తున విమర్శలు రావడంతో విజిలెన్స్ యంత్రాంగం స్టాక్‌యార్డులు, పోర్టులపై దాడులు జరిపింది. దాంతో గ్రానైట్ బ్లాకుల కొలతల్లో చోటుచేసుకున్న అవకతవకలు వెలుగుచూశాయి.
ప్రధానంగా చైనాకు ఎగుమతి చేసేందుకు కరీంనగర్ నుండి కాకినాడ పోర్టుకు తరలించిన బ్లాకులకు సంబంధించి కొలతల్లో భారీ వ్యత్యాసం కనుగొనడంతో ప్రభుత్వం ఎగుమతులకు బ్రేక్ వేసింది. ఫలితంగా నిన్న.. మొన్నటి వరకు కాకినాడ పోర్టు స్టాక్‌యార్డులో కరీంనగర్ గ్రానైట్ బ్లాకు నిల్వలు పెద్దఎత్తున పేరుకుపోయాయి. ఎగుమతులు స్తంభించిపోవడంతో గ్రానైట్ పరిశ్రమ సంక్షోభంలో పడింది. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా సుమారు రెండు వందలకు పైగా క్వారీలు మూతపడే దశకు చేరుకున్నాయి. ఎగుమతులు పూర్దిగా నిలిచిపోవడంతో కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టిన వ్యాపారులు ఆర్థికంగా దివాళతీసే పరిస్థితికి చేరుకున్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం పేనాల్టీలతో వదిలేయడంతో నిర్ణీత మొత్తాన్ని చెల్లించిన వ్యాపారులు తిరిగి తమ కార్యకలాపాలను ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 370 కలర్ గ్రానైట్ క్వారీలుండగా ఇందులో 168 క్వారీలు నగర శివారులోని ఓడ్యారం ప్రాంతంలోనే ఉన్నాయి. జిల్లా మొత్తంలో లభించే విలువైన కలర్ గ్రానైట్‌లో దాదాపు 80 శాతం డిపాజిట్స్ ఇక్కడే ఉన్నట్లు మైనింగ్ నిపుణుల మాటల్ని బట్టి అర్థమవుతోంది. ఇక్కడ గ్రానైట్ రాళ్లను బ్లాకులుగా కత్తిరించి 1మీటర్ నుండి 10 క్యూబిక్ మీటర్ల పరిమాణంలో చైనాకు ఎగుమతి చేస్తున్నారు. చైనాలో గ్రానైట్ పాలిషింగ్ కుటీర పరిశ్రమగా ఉండటంతో చైనాకు అవసరమైన ముడి బ్లాకుల్లో 70 శాతం ఆంధ్రప్రదేశ్ నుండి ఎగుమతి అవుతోంది. ఇందులో కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఏటా మూడు వేల కోట్ల విలువైన 2లక్షల యాబై వేల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ బ్లాకులు ఎగుమతి అవుతున్నాయి. ఇక్కడ లభిస్తున్న గ్రానైట్‌కు చైనాలో మార్కెట్ మంచి డిమాండ్ లభించడంతో జిల్లాకు చెందిన చాలా మంది వ్యాపారులు గ్రానైట్ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ వరసలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు చెందిన శే్వత గ్రానైట్స్ ముందు వరసలో ఉంది.

*గర్భసంచి తీసేయ్ డబ్బు సంచి నింపెయ్* డబ్బుల కోసం హిస్ట్రెక్టమీ

24/02/2012

కరీంనగర్, ఫిబ్రవరి 23: తెలంగాణ జిల్లాల్లోని మహిళలకు హిస్ట్రెక్టమీ ఫోబియా పట్టి పీడిస్తోంది. మరీ ముఖ్యంగా కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ వలసలు అధికంగా ఉన్న జిల్లాల్లో దీని తీవ్రత మరీ అధికంగా కనిపిస్తోంది. ధనార్జనే పరామవదిగా పనిచేస్తున్న కొన్ని ప్రైవేట్ నర్సింగ్‌హోంలు నిరక్ష్యరాస్యులైన గ్రామీణ మహిళలను లక్ష్యంగా చేసుకొని గర్బసంచి తొలగింపు (హిస్ట్రెక్టమి) అపరేషన్లకు పాల్పడుతున్నాయి. దాంతో సహజంగానే గర్భ సంచికి ఏర్పడే ప్రతీ సమస్య క్యాన్సర్‌కే దారి తీయవచ్చన్న అపోహలు మహిళల్లో పాతుకుపోవడంతో నర్సింగ్ హోంలు దీన్ని అవకాశంగా తీసుకొని గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులుగా చెలామణి అవుతున్న ఆర్‌ఎంపి, పిఎంపిలను ఏజెంట్లుగా నియమించుకొని మహిళలను వెతికి మరీ ఆపరేషన్లు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలోనూ హిస్ట్రెక్టమీ ఆపరేషన్లు జరిగినప్పటికీ 2006లో ఈ సర్జరీలను ఆరోగ్యశ్రీలో చేర్చిన తరువాత మాత్రమే సర్జరీల సంఖ్య అధికమైనట్లు ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. ఆరోగ్య శ్రీ ప్రారంభించిన తరువాత వరంగల్ నగరానికి చెందిన ఓ నర్సింగ్ హోం 18 నెలల కాలంలో ఏకంగా వేయికి పైగా హిస్ట్రెక్టమీ సర్జరీలు చేసి కోటి 80 లక్షల రూపాయలు క్లైమ్ చేయడం హిస్ట్రెక్టమీ ఆపరేషన్ల తీరుకు తార్కాణంగా చెప్పవచ్చు. దాంతో పెద్దఎత్తున ఆరోపణలు రావటం,ప్రభుత్వం విచారణ జరిపి సంబంధిత ఆసుపత్రిపై చర్యలు తీసుకొంది. ఆ తరువాత ఆరోగ్య శ్రీ పరిధిలో ఈ తరహా సర్జరీలు చేయడానికి మహిళలకు కనీసం 35 సంవత్సరాల వయోపరిమితి నిర్ణయించారు. అలా చేసినా కూడా అదుపులోకి రాకపోవడంతో ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా 15 జిల్లాల్లో హిస్ట్రెక్టమీ ఆపరేషన్లను ఆరోగ్య శ్రీ పరిధి నుంచి తొలగించారు. ప్రస్తుతం ఉన్న ఎనిమిది జిల్లాల్లోనూ కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, మెదక్ జిల్లాల్లో సర్జరీలు జరుగుతున్నప్పటికీ వయో పరిమితిని 40 ఏళ్లకు పెంచారు. అంతేకాకుండా ఆరు నెలల పాటు వైద్యం చేయించుకోవాల్సి ఉంటుంది. అప్పటికీ తగ్గకపోతేనే సర్జరీకి అనుమతిస్తారు. కరీంనగర్ జిల్లాకు సంబంధించి 2008 నుంచి ఇప్పటివరకు 11 వేల మందికి హిస్ట్రెక్టమీ ఆపరేషన్లు జరిగినట్లు ఆరోగ్య శ్రీ కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్న డాక్టర్ అనంతరెడ్డి ‘ఆంధ్రభూమి’కి చెప్పారు. మరీ ముఖ్యంగా జగిత్యాల, సిరిసిల్ల వంటి ప్రాంతాల్లోనే ఈ తరహా సర్జరీలు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు నర్సింగ్ హోములు గతంలో హిస్ట్రెక్టమీ సర్జరీలకు ఐదు వేల నుంచి ఎనిమిది వేల రూపాయల చార్జి వసూలు చేయగా, ఆరోగ్యశ్రీలో చేర్చిన తరువాత 35 వేల నుంచి 40 వేల వరకు క్లైమ్ చేస్తున్నట్లు గుర్తించారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం క్లైమ్‌లకు బ్రేక్ వేయడంతో ప్రైవేటు నర్సింగ్ హోముల్లో ఎనిమిది వేల నుంచి 12 వేల మధ్య చార్జీలతో సర్జరీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో మొత్తం 1500 లకు పైగా నర్సింగ్ హోంలలో ఈ తరహా సర్జరీలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి 40 సంవత్సరాల పైబడిన మహిళలకు సర్జరీ చేస్తే ఎలాంటి సమస్యలు లేవు. కానీ 20 ఏళ్లు పైబడిన యువతులు కూడా ఈ ఆపరేషన్లు చేయించుకోవడం వల్ల ఆరోగ్యంపై ఇతర దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.
అవగాహన కల్పిస్తాం: డింహెచ్‌ఓ
కరీంనగర్ జిల్లాలో హిస్ట్రెక్టమీ ఆపరేషన్లపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని, డిఎంహెచ్‌ఓ నాగేశ్వర్ చెప్పారు. ఇప్పటికే గ్రామాల్లో ఉండే ఎఎన్‌ఎంలు, హెల్త్ అసిస్టెంట్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు. గర్భసంచి తొలగింపు వల్ల ఉత్పన్నమయ్యే దుష్ప్రరిణామాలు సర్వేకల్ ఇన్‌ఫెక్షన్, ఫ్రీక్వెన్ డెలీవరీలపై అవగాహన కల్పిస్తామన్నారు. అలాగే మహిళలను తప్పుదోవ పట్టిస్తున్న ఆర్‌ఎంపి, పిఎంపిలపై త్వరలోనే చట్టపరమైన చర్యలు చేపట్టబోతున్నట్లు ఆయన వెల్లడించారు.
================================
నయం చేయవచ్చు!
కరీంనగర్: గర్భసంచికి ఏర్పడే ప్రతీ ఫైబ్రాయిడ్ గడ్డ కేన్సర్ కాదని, ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స చేస్తే వందకు వంద శాతం సమర్థవంతంగా నయం చేయవచ్చునని కరీంనగర్ జిల్లాలో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ జి.శ్రీలత వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలకు అపరిశుభ్ర పరిస్థితులు, రుతు సంబంధమైన సమస్యలు, బహుళ సంబంధాల వంటి అంశాల కారణంగా ఏర్పడే ఆరోగ్య సమస్యలను కేన్సరేనన్న అపోహలతో బలవంతంగా సర్జరీ చేయించుకుంటున్నారని, దానివల్ల దీర్ఘకాలంలో అనేక శారీరక సమస్యలు ఉత్పన్నమై ప్రాణాంతకంగా పరిణమించవచ్చునని హెచ్చరించారు. సాధారణంగా ఫైబ్రాయిడ్ గడ్డల్లో మాత్రమే హెవీ బ్లీడింగ్ జరుగుతుందని, దానికి మంచి వైద్యం అందుబాటులో ఉందన్నారు. 50 ఏళ్లు పైబడిన మహిళలకు గర్భ సంచి తొలగించడం వల్ల ఎలాంటి నష్టం లేదని చెప్పారు. సాధారణంగా గర్భసంచి సంబంధిత సమస్యలు చిన్న వయస్సులో సంతానం కలుగడం, సంతానానికి సంతానానికి మధ్య కాలవ్యవధి తక్కువగా ఉండటం వంటి కారణాలవల్లే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని చెప్పారు.