* ‘భూమి’ కథనాలతో అధికారుల్లో కదలిక
* అక్రమ రవాణా నిరోధానికి తహశీల్దార్లకు ప్రత్యేక అధికారాలు
* జిల్లా వ్యాప్తంగా 19 మందిపై క్రిమినల్ కేసులు
* జిల్లా వ్యాప్తంగా 19 మందిపై క్రిమినల్ కేసులు
* నిఘాకోసం ప్రత్యేక బృందాలు
* నేడో, రేపో విడిసిలపైనా కేసులు
* వెల్లడించిన జాయింట్ కలెక్టర్
-ఆంధ్రభూమి బ్యూరో -
December 24th, 2011
కరీంనగర్, డిసెంబర్ 23: జిల్లాలో ప్రవహిస్తున్న రెండు ప్రధాన నదులైన గోదావరి, మానేరు పరివాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న ముఠాల ఆట కట్టించేందుకు రంగం సిద్ధమైంది. జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలపై ‘ఆంధ్రభూమి’ ప్రచురించిన వరుస కథనాలతో అధికారుల్లో చలనం మొదలైంది. దాంతో జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఇసుక అక్రమ మైనింగ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులపై చర్యలు చేపట్టే దిశగా అడుగులు ప్రారంభించింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మొత్తం 19 వాహనాలను స్వాధీనం చేసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ఇందులో కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ, సుల్తానాబాద్, ధర్మపురి వంటి ప్రాంతాల్లో గురువారం విస్తృతంగా దాడులు నిర్వహించి 14 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. అంతేకాకుండా వాటి యజమానులపై క్రిమినల్ కేసులు కూడా మోపారు. అలాగే జమ్మికుంట మండలంలోని రెండు ర్యాంప్‌ల నుంచి ఇసుకను తరలిస్తున్న మరో ఐదు వాహనాలను రెవెన్యూ సిబ్బంది దాడులు జరిపి పట్టుకున్నారు. వాటిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. వీరిపై ఎపి వాల్టా చట్టాన్ని అనుసరించి కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అలాగే జగిత్యాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని రాయికల్ మండలం కొత్తపేట, బోర్నపల్లి, మల్లాపూర్ మండలం వివిరావుపేట, కోరుట్ల మండలం పైడిమడుగు, మెట్‌పల్లి మండలం ఆత్మకూరు తదితర ప్రాంతాల్లో విడిసిలు వేళం వేసినట్లు ఆరోపణలు రావడంతో వాటిపై విచారణ జరిపి కేసులు నమోదు చేయడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ అరుణ్ కుమార్ ‘ఆంధ్రభూమి’ ప్రతినిధికి వెల్లడించారు. అయితే వేలంలో ర్యాంపులు దక్కించుకున్న అక్రమ తవ్వకందారులపై చర్యలు తీసుకునే విషయాన్ని మాత్రం ధృవీకరించలేదు. వారంతా కూడా అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలకు అనుచరులుగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే జిల్లావ్యాప్తంగా మొత్తం 34 పాయింట్లలో అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ఇకపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి అక్రమ ఇసుక మైనింగ్‌కు పాల్పడేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సంబంధిత తహశీల్దార్లకు ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా అక్రమ మైనింగ్‌కు పాల్పడే వ్యక్తులకు సంబంధించిన వాహనాలు పట్టుబడితే వాటిని సీజ్ చేయడంతో పాటు పెద్దమొత్తంలో జరిమానా విధించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ట్రాక్టర్లు మొదటిసారి పట్టుబడితే ఎనిమిది వేలు, రెండవ సారి పట్టుబడితే పది వేల చొప్పున, లారీలు మొదటిసారి పట్టుబడితే 20 వేలు, రెండవసారి పట్టుబడితే అంతకంటే ఎక్కువ జరిమానా విధిస్తూ క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అక్రమ రవాణా నిరోధానికి తహశీల్దార్‌లు, మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు, సంబంధిత ఎస్‌ఐలకు వాహనాలను సీజ్ చేసే అధికారాలు ఇవ్వాలని నిర్ణయించారు.
No comments:
Post a Comment