Saturday, December 24, 2011

మద్యం సిండి‘కేటు’లకు ఐటి దడ

కొత్త మలుపు తిరిగిన సిండికేట్ కుంభకోణం 
 
రంగంలోకి దిగనున్న ఆదాయ పన్నుల శాఖ?
 
టాస్క్ఫోర్సు చిట్టాలో జీరో వ్యాపారుల గుట్టు?
 

కరీంనగర్, డిసెంబర్ 17: మద్యం సిండికేట్ల కుంభకోణం కొత్త మలుపు తిరుగుతోందా? ఎసిబి దాడుల్లో భాగంగా వెంట తీసుకెళ్లిన రికార్డుల ఆధారంగా సిండి‘కేటు’ల గుట్టు బయటపెట్టేందుకు రంగం సిద్ధం అవుతోందా? అంటే అవుననే చెబుతున్నాయి తాజా పరిణామాలు. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో మునిగిన వివిధ శాఖల అధికారులకు తోడుగా ప్రజాప్రతినిధులు కూడా ఈ కుంభకోణంతో సంబంధాలు కలిగి ఉన్నట్లు వార్తలు వస్తుండటం కలకలం రేకిత్తిస్తోంది. మరీ ముఖ్యంగా అడ్డగోలు ధరలకు మద్యం విక్రయించి అక్రమాలకు పాల్పడిన సిండికేట్లపై ఐటి కొరడా ఝులిపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో మద్యం వ్యాపారుల్లో దడ మొదలైంది. ఇక ఐటి నిజంగానే రంగంలోకి దిగినట్లైతే మద్యం వ్యాపారుల రూపంలో ఉన్న బడాబాబుల ఆస్తుల గుట్టు కూడా తేలడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదంతా ఒక ఎతె్తైతే ఏడాదికోసారి మద్యం షాపులు, గీత కార్మిక సంఘాలపై ఆరోపణలు వచ్చినపుడు మాత్రమే దాడులు నిర్వహించే స్పెషల్ టాస్క్ఫోర్సు(ఎస్‌టిఎఫ్) ఎసిబి ట్రాప్‌లో పడటం, ఎసిబి స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌లో జీరో దందా చేస్తున్న ‘పెద్ద’ మనుషుల బండారం కూడా నమోదు చేసి ఉండటం వంటి పరిణామాలను భేరీజు వేసి చూస్తే రాబోయే రోజుల్లో సిండికేట్ల మెడకు ఉచ్చు బిగుసుకోవడం ఖాయమనే చెప్పాలి. నిన్నటి వరకు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన సిండికేట్ నిర్వాహకులు ప్రమాదాన్ని గ్రహించి హుటాహుటిన రాజధానికి పరుగులు తీసి ఉచ్చు నుంచి బయట పడేందుకు మార్గానే్వషణ ప్రారంభించారు.ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఓ మంత్రి సహాయంతో బయట పడేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
రాష్ట్రంలో ప్రకంపనలు రేకెత్తిస్తున్న ఈ మద్యం సిండికేట్ కుంభకోణం మూలాలు మొట్టమొదటగా కరీంనగర్ జిల్లాలోనే వెలుగు చూసాయి. ఈ కుంభకోణంలో క్షేత్రస్థాయి అధికారుల నుండి మొదలుకుని రాష్టస్థ్రాయి ఉన్నతాధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధుల హస్తం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో జిల్లాలో కొత్త చర్చకు తెరలేచింది. ఎసిబి దాడుల్లో భాగంగా సిండికేట్ వ్యాపారులకు సంబంధించిన రికార్డులు, కంప్యూటర్ హార్ట్ డిస్క్‌లను సీజ్ చేసి తీసికెళ్లిన విషయం తెలిసిందే. మద్యం వ్యాపారులకు సంబంధించిన రికార్డులలో నెలవారీ వ్యాపార లావాదేవీలు, ఖర్చుల వివరాలతోపాటు శాఖల వారీగా ఏయే శాఖలకు ఎంతెంత సొమ్ము ముట్టజెప్తున్నారో అందులో సవివరంగా నమోదు చేసి ఉండడంతో, ఈ కుంభకోణంతో ప్రమేయం ఉన్న అధికారులు భయంతో వణికిపోతున్నారు. అంతేకాకుండా మద్యం వ్యాపారులకు సంబంధించి ఐఎంఎల్ డిపో నుండి కొనుగోలు చేసిన స్టాక్, ధరల వివరాలు తిరిగి అమ్మకాలకు సంబంధించిన ధరల వంటి వివరాలు కూడా సిండికేటు రికార్డులలో భద్రపరిచినట్లు తెలుస్తోంది.వాస్తవానికి ఐఎంఎల్ డిఫో ద్వారా జారీ చేసే మద్యం ధరలకు రిటేల్ అమ్మకపు ధరలకు మధ్య భారీ తేడా ఉంటోంది. ఎంఆర్‌పి ధరలకు విక్రయించకుండా వ్యాపారులంతా సిండికేట్లుగా మారి వాస్తవ ధరలకు రెట్టింపు మొత్తానికి విక్రయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రిటైల్ షాపులకు కేసుల లెక్కన ఐఎంఎల్ డిపో మద్యం సరఫరా చేస్తుంది. కరీంనగర్ జిల్లాలో ఎక్కువగా బీర్ అమ్మకాలదే అగ్రస్థానం. ఉదాహరణకు బీరు అమ్మకాలను తీసుకుంటే 12 లైట్ బీర్లు కలిగిన కేసును 680 రూపాయలకు వ్యాపారులకు అందిస్తుండగా, స్ట్రాంగ్ బీరు కేసును 780 రూపాయలకు జారీ చేస్తుంది. విడిగా ఒక్కో లైట్ బీరు సిసాను 56 రూపాయలు, స్ట్రాంగ్ బీరును 65 రూపాయలకు అందిస్తుండగా వాటి ఎమ్మార్పీ ధర లైట్ బీరు 71 రూపాయలు కాగా, 90 రూపాయలకు విక్రయిస్తున్నారు. అదే స్ట్రాంగ్ బీరు ధర 82 రూపాయలు కాగా 110 రూపాయలకు విక్రయిస్తున్నారు. బార్ అండ్ రెస్టారెంట్‌లలో ఎమ్మార్పీ ధర కంటే 50 శాతం నుంచి 75 శాతం వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. బార్ అండ్ రెస్టారెంట్‌లకు సంబంధించి మద్యం విక్రయాలను ఎమ్మార్పీకి మించి అమ్మకూడదన్న నిబంధనలేవీ లేకపోవడంతో ఇష్టంవచ్చినట్లు ధరలు నిర్ణయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రిటేల్ షాపుల్లో మాత్రం ఎమ్మార్పీకి మించి ఒక్క పైసా అదనంగా వసూలు చేసినా ఆయా షాపుల లైసెన్స్‌లను రద్దు చేసే అవకాశం ఉంటుంది. అయితే గడిచిన ఏడాది కాలంగా జిల్లాలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి పరిస్థితులను మద్యం వ్యాపారులు తమకు అనుకూలంగా మలుచుకుని గతంలో ఎప్పుడూ లేనంత భారీగా మద్యం ధరలు పెంచి యథేచ్చగా దోపిడీ సాగిస్తున్నారు. దీనిపై ఎన్నిసార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా సంబంధిత అధికారులు స్పందించిన దాఖలాలు లేవు. తాజాగా ఎసిబి దాడులతో ఆయా శాఖల సిబ్బంది ఎందుకు కళ్లుమూసుకున్నారన్న విషయం బట్టబయలు కావడంతో సిండికేట్లలో గుబులు మొదలైంది. ఇదంతా ఒకెతె్తైతే మహారాష్ట్ర, ఛత్తీష్‌ఘ్ఢ్ రాష్ట్రాలకు సమీపంలో ఉన్న సరిహద్దు మండలాలైన మంథని, మహాదేవపూర్, మహాముత్తారం, కాటారం, ముత్తారం తదితర మండలాలతో పాటు ఆదిలాబాద్ జిల్లాలోనూ కొన్ని ప్రాంతాల్లో ఆయా రాష్ట్రాలకు చెందిన జీరో మద్యం పెద్ద ఎత్తున తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి గతంలో పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో తూర్పు డివిజన్‌లో దాడులు నిర్వహించిన స్పెషన్ టాస్క్ఫోర్సు నజరానాలు పుచ్చుకుని దోషులను వదిలేశారన్న విమర్శలున్నాయి. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి కోట్లల్లో గండిపడేందుకు ఎక్సైజ్ అధికారులు సహకరించారన్న విషయం తేటతెల్లమైంది. ఇదిలా ఉండగా సిండికేట్ రహస్యాలు చేజిక్కించుకున్న ఎసిబి మద్యం లావాదేవీల చిట్టాను ఆదాయ పన్నుల శాఖకు అప్పగించిన పక్షంలో జిల్లాలో ‘పెద్ద’ మనుషులుగా చలామణి అవుతున్న బినామీ మద్యం వ్యాపారుల అక్రమాల పుట్ట పగిలే అవకాశం లేకపోలేదు. గతంలో నిర్ణయించిన మద్యం షాపుల వేలం కంటే ఈ సారి రెట్టింపు ధర వెచ్చించి షాపులను చేజిక్కించుకున్న బడాబాబులకు అంత పెద్ద మొత్తంలో సొమ్ము ఎక్కిడినుంచి వచ్చిందన్న అనుమానాలున్నాయి. బినామీ పేర్లపై జిల్లాకు చెందిన రాజకీయ ‘ప్రముఖులు’ నల్ల ధనాన్ని పెట్టుబడిగా పెట్టి వైట్ మనీ చేసుకునే ప్రయత్నంలో బాగంగానే బినామీ పేర్లపై కోట్లు వెచ్చించి షాపులను దక్కించుకున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఆదాయ పన్ను శాఖ గనుక రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో విచారణ జరిపితే బ్లాక్ మనీ బాబుల బండారం బయటపడక తప్పదనే చెప్పాలి.

No comments:

Post a Comment