Showing posts with label మైనింగ్ అండ్ మాఫియా. Show all posts
Showing posts with label మైనింగ్ అండ్ మాఫియా. Show all posts

Monday, March 5, 2012

కోల్ బెల్ట్ లో జార్ఖండ్ తరహా బొగ్గు మాఫియా

బొగ్గు మాఫియా..!

  • 05/03/2012
కరీంనగర్, మార్చి 4: రామగుండం పారిశ్రామిక ప్రాంతం క్రమంగా కోల్ మాఫియాకు అడ్డాగా మారుతోంది. బహిరంగ మార్కెట్‌లో టన్నుల బొగ్గుకు 1500 రూపాయల పై చిలుకు ధర పలుకుతుండటం బొగ్గు దొంగల పంట పండిస్తోంది. దాంతో రామగుండం, సెంటినరి కాలనీ, ఎన్‌టిపిసి ప్రాంతాల్లో బొగ్గు చౌర్యం ఒక వృత్తిగా మారింది. ఇదంతా ఒకెత్తయితే ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లికి చెందిన ఓ వ్యాపారి ఏకంగా కూలీలను పెట్టి మరీ బొగ్గు చౌర్యం చేయిస్తూ తాను రెండు చేతులా ఆర్జించటమే కాకుండా స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు, పోలీసులకు ముడుపులు ముట్టజెపుతూ ధర్జాగా అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సింగరేణి, ఎన్‌టిపిసి సిబ్బంది కూడా శక్తి వంచన లేకుండా యధాశక్తి సహకరిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఫలితంగా సింగరేణి విస్తరించి ఉన్న నాలుగు జిల్లాల్లో ఏటా బొక్కసానికి దాదాపు 12 కోట్ల రూపాయల పైచిలుకు చిల్లు పడుతున్నట్లు అంచనా. బెల్లంపల్లి, మందమర్రి, భూపాలపల్లి, కొత్తగూడెం, ఇల్లందు ప్రాంతాల్లోనూ దాదాపు ఇదే తరహాలో బొగ్గు తస్కరించబడుతున్నట్లు తెలుస్తోంది.
నల్ల బంగారంగా పిలువబడుతున్న బొగ్గు అక్రమార్కులకు కాసుల పంట పండిస్తోంది. సింగరేణి గనులు విస్తరించి ఉన్న రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కొంతమంది బడా రాజకీయ నాయకులు, పోలీస్ అధికారుల దన్నుతో జార్ఖండ్ కోల్ మాఫియాను తలదనే్న రీతిలో ఏటా సుమారు 12 కోట్ల రూపాయల విలువైన బొగ్గు లూటీ యదేశ్చగా సాగిపోతోంది. ఈ తతంగంలో రాజకీయ నేతలతో పాటు సింగరేణి, నేషనల్ థర్మల్ పవర్ స్టేషన్ సిబ్బంది, సింగరేణి సెక్యూరిటీఫోర్స్, సిఐఎస్‌ఎఫ్ సిబ్బంది పాత్ర కూడా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల మాటలను బట్టి అర్థమవుతోంది. కరీంనగర్ జిల్లాలో ఈ వ్యవహారం గడచిన కొనే్నళ్లుగా గుట్టుగా సాగిపోతున్నప్పటికి ఇటీవలి కాలంలో మరీ అధికంగా చౌర్యం జరుగుతున్నట్లు గుర్తించారు. ప్రధానంగా రైళ్ల వ్యాగన్ల నుండే బొగ్గును తస్కరించడం ఎక్కువైపోయినట్లు గుర్తించారు. అదిలాబాద్ జిల్లా బెల్లంపల్లికి చెందిన ఓ వ్యాపారి సగటున రోజుకు 2 లక్షల నుండి 3 లక్షల రూపాయల వరకు బొగ్గు చౌర్యం కోసం కూలీలకు పెట్టుబడి పెడుతున్నట్లు తెలుస్తోంది. సుమారు రెండు వందల మంది కూలీలకు రోజుకు 200ల నుంచి 250 రూపాయల వేతనం చెల్లించి ఎన్‌టిపిసికి బొగ్గు రవాణా చేస్తున్న రైళ్ల వ్యాగన్ల నుండి 3 కిలోమీటర్ల పొడవునా బొగ్గును డంపింగ్ చేయిస్తున్నట్లు చెబుతున్నారు. రామగుండం థర్మల్ స్టేషన్‌కు విద్యుత్ ఉత్పాదన కోసం ప్రతిరోజు సుమారు రెండు రేకులు అంటే 40 వేల టన్నుల బొగ్గు అవసరమవుతుంది. దానికి అవసరమైన బొగ్గు నిల్వలు రామగుండం పరిధిలోని ఒపెన్‌కాస్ట్-1, 2, 3ల ద్వారా సరఫరా చేస్తున్నారు. రోజుకు మూడు రైళ్లద్వారా ఎన్‌టిపిసికి ఈ పరిమాణాన్ని రవాణా చేస్తున్నారు. అయితే అక్రమ బొగ్గు వ్యాపారంలో అరితేరిన బెల్లంపల్లికి చెందిన వ్యాపారి కూలీలను నియోగించి ఎల్కలపల్లి గేట్, లక్ష్మిపూర్, సెంటినరీ కాలనీ తదితర ప్రాంతాల్లో రైల్వే వ్యాగన్ల నుండి కిందపడేసి సంచుల్లో నింపి చెట్లపొదల్లో దాచిపెట్టి రాత్రి కాగానే ఆయా బ్యాగుల్లో ఉన్న బొగ్గు నిల్వలను లారీల్లోకి మార్చి రాష్ట్ర రాజదాని పరిసరాల్లో ఉన్న వివిధ రకాల పరిశ్రమలు, ఫెర్రోఅల్లాయిస్ ఫ్యాక్టరీలకు విక్రయిస్తున్నారు. అంతేకాకుండా కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని ఇటుక బట్టీ వ్యాపారులకు టన్నుకు 15 వందల రూపాయలు మొదలుకుని 1650 వరకు విక్రయిన్నట్లు తెలుస్తోంది. తన అక్రమ తతంగానికి అడ్డు తగలకుండా ఉండేందుకు సదరు వ్యాపారి స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసులకు ప్రతి నెలా నజరానగా భారీ మొత్తంలో సొమ్ములు ముట్టజెబుతున్నట్లు చెబుతున్నారు. అంతే కాదు కంచే చేను మేసిందన్నట్లుగా సాక్షాత్తు సింగరేణి అదికారులకు కూడా ఈ పాపంలో వాటాలున్నట్లు అరోపణలున్నాయి. అలాగే సింగరేణి ఆస్తుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన సెక్యూరిటీ సిబ్బందికి కూడా భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఒసిపి-2 డంప్ యార్డు నుండే బొగ్గు చౌర్యం అధికంగా జరుగుతున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసినా సంబందిత పోలీస్ అధికారులు గాని, సింగరేణి యాజమాన్యం కాని పట్టించుకున్న పాపాన పోలేదు. పైపెచ్చు బొగ్గు అక్రమ డంపింగ్‌కు పాల్పడే ముఠాలు ముందుగానే సంబందిత పోలీసులు, సిబ్బందికి సమాచారం అందిస్తారని, తద్వారా దొంగతనం జరుగుతున్నప్పుడు సిబ్బంది ఆ ప్రాంతాల వైపు కనె్నత్తికూడా చూడరని స్థానికులు చెబుతుండటం ఈ సందర్బంగా ఎంతైనా గమనించదగ్గ విషయమే. ఎన్‌టిపిసికి బొగ్గు సరఫరా చేసే రైల్వే వ్యాగన్లలో ముందుగానే పథకం ప్రకారం ఎక్కే కూలీలు ఎల్కలపల్లి అండర్ బ్రిడ్జ్, లక్ష్మీపూర్ ప్రాంతాల్లో లారీలను సిద్ధంగా ఉంచి నేరుగా వ్యాగన్ల నుంచి లారీల్లోకి డంప్ చేస్తున్నట్లు సమాచారం. ఇలా సగటున రోజుకు కనీసం రెండు, మూడు లారీలైనా చౌర్యం జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో బొగ్గు చౌర్యం కొత్త కాకపోయినా జార్ఖండ్ తరహాలో మాఫియా ముఠా సంస్కృతి పెరుగుతుండటమే అందోళన కలిగించే విషయం. జార్ఖండ్‌లోని బొగ్గు గనులు రాజకీయ నేతల కనుసన్నల్లోనే పనిచేస్తాయి. అక్కడ వాస్తవిక బొగ్గు ఉత్పత్తిలో దాదాపు 35 శాతం బొగ్గు మాఫియా తస్కరించి సొమ్ముచేసుకుంటోంది. అక్కడి గనులన్నీ కూడా మారుమూల అటవీ ప్రాంతాల్లో ఉండటం, నక్సల్ సమస్య అధికంగా ఉండటం వంటి అంశాల నేపథ్యంలో క్క్రడి ప్రభుత్వం బొగ్గు మాఫియా ముఠాలపై చర్యలు తీసుకోలేకపోతోంది. దాంతో గత దశాబ్ద కాలంగా చిన్నచిన్న దొంగతనాలతో కార్యకలాపాలు నెరిపిన ముఠాలు ఆయుదాలు సంపాదించి సమాంతర వ్యవస్థనే నడుపుతున్నాయి. తాజాగా రామగుండం ప్రాంతంలోనూ ముఠా సంస్కృతి పాదుకుంటున్నట్లు ఇటీవలి సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఇకపోతే బొగ్గును రేల్ వ్యాగన్ల నుండి క్రిందపడేసే క్రమంలో కూలీలు ప్రమాదవశాత్తు రైలు క్రిందపడి మరణిస్తున్న సంఘటనలు ఇటీవల కాలంలో తరుచుగా సంభవిస్తున్నాయి. గతంలో విద్యుత్ గాతానికి గురై అవయువాలు కోల్పోయి జీవశ్చావాలుగా బ్రతుకులీడుస్తున్న కూలీలు రామగుండం ప్రాంతంలో చాలా మంది కనిపిస్తారు.
పెరుగుతున్న తుపాకీ సంస్కృతి
ఉపాధి లేక ఖాళీగా ఉండే నిరుద్యోగులను ట్రాప్‌లో పడేస్తున్న కోల్ మాఫియా లీడర్లు యువకుల చేతికి అక్రమ ఆయుధాలను ఇచ్చి అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడుతుండడం గోదావరిఖని ప్రాంతంలో సర్వసాధారణమైపోయింది. ఇన్‌ఫార్మర్ల పేరుతో సదరు యువకులకు పోలీస్ శాఖ అండదండలు కూడా పుష్కలంగా లభిస్తుండడంతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఈ వసూళ్ల వ్యవహారంలోనే ఐడి పార్టీ కానిస్టేబుల్ రమేష్ హత్య జరిగినట్లు ప్రచారం జరిగింది. హంతకుల వద్ద లభ్యమైన తుపాకి లైసెన్స్ జార్ఖండ్‌కు చెందిన ఓ బొగ్గు వ్యాపారి పేరుమీద ఉండడం సింగరేణిలోనూ మాఫియా సంస్కృతి వేళ్లూనుకుంటుందనడానికి తార్కాణంగా పేర్కొనవచ్చు. 

Tuesday, February 28, 2012

చైనాకు పుంజుకుంటున్న గ్రానైట్ ఎగుమతులు

 

కరీంనగర్, ఫిబ్రవరి 23: కలర్ గ్రానైట్ పరిశ్రమకు ప్రసిద్ధిగాంచిన కరీంనగర్ జిల్లా నుండి చైనాకు తిరిగి ఎగుమతులు పుంజుకున్నాయి. జిల్లాలో 370కి పైగా ఉన్న గ్రానైట్ క్వారీల నుండి ప్రతి ఏటా దాదాపు రెండు లక్షల క్యూబిక్ మీటర్ల పైచిలుకు గ్రానైట్ బ్లాకులు చైనాకు ఎగుమతి అవుతున్నాయి. తద్వారా ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం సీనరేజీ రూపంలోమొత్తం 110 కోట్ల ఆదాయం సమకూరుతోంది. అయితే గతంలో ఉన్న సెల్ఫ్ రిమూవల్ విధానం కారణంగా గ్రానైట్ కంపెనీల యజమానులు ప్రభుత్వానికి తప్పుడు కొలతలతో విలువైన బ్లాకులను తరలించేవి. ఈ క్రమంలో మైనింగ్ అక్రమాలపై పెద్దఎత్తున విమర్శలు రావడంతో విజిలెన్స్ యంత్రాంగం స్టాక్‌యార్డులు, పోర్టులపై దాడులు జరిపింది. దాంతో గ్రానైట్ బ్లాకుల కొలతల్లో చోటుచేసుకున్న అవకతవకలు వెలుగుచూశాయి.
ప్రధానంగా చైనాకు ఎగుమతి చేసేందుకు కరీంనగర్ నుండి కాకినాడ పోర్టుకు తరలించిన బ్లాకులకు సంబంధించి కొలతల్లో భారీ వ్యత్యాసం కనుగొనడంతో ప్రభుత్వం ఎగుమతులకు బ్రేక్ వేసింది. ఫలితంగా నిన్న.. మొన్నటి వరకు కాకినాడ పోర్టు స్టాక్‌యార్డులో కరీంనగర్ గ్రానైట్ బ్లాకు నిల్వలు పెద్దఎత్తున పేరుకుపోయాయి. ఎగుమతులు స్తంభించిపోవడంతో గ్రానైట్ పరిశ్రమ సంక్షోభంలో పడింది. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా సుమారు రెండు వందలకు పైగా క్వారీలు మూతపడే దశకు చేరుకున్నాయి. ఎగుమతులు పూర్దిగా నిలిచిపోవడంతో కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టిన వ్యాపారులు ఆర్థికంగా దివాళతీసే పరిస్థితికి చేరుకున్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం పేనాల్టీలతో వదిలేయడంతో నిర్ణీత మొత్తాన్ని చెల్లించిన వ్యాపారులు తిరిగి తమ కార్యకలాపాలను ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 370 కలర్ గ్రానైట్ క్వారీలుండగా ఇందులో 168 క్వారీలు నగర శివారులోని ఓడ్యారం ప్రాంతంలోనే ఉన్నాయి. జిల్లా మొత్తంలో లభించే విలువైన కలర్ గ్రానైట్‌లో దాదాపు 80 శాతం డిపాజిట్స్ ఇక్కడే ఉన్నట్లు మైనింగ్ నిపుణుల మాటల్ని బట్టి అర్థమవుతోంది. ఇక్కడ గ్రానైట్ రాళ్లను బ్లాకులుగా కత్తిరించి 1మీటర్ నుండి 10 క్యూబిక్ మీటర్ల పరిమాణంలో చైనాకు ఎగుమతి చేస్తున్నారు. చైనాలో గ్రానైట్ పాలిషింగ్ కుటీర పరిశ్రమగా ఉండటంతో చైనాకు అవసరమైన ముడి బ్లాకుల్లో 70 శాతం ఆంధ్రప్రదేశ్ నుండి ఎగుమతి అవుతోంది. ఇందులో కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఏటా మూడు వేల కోట్ల విలువైన 2లక్షల యాబై వేల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ బ్లాకులు ఎగుమతి అవుతున్నాయి. ఇక్కడ లభిస్తున్న గ్రానైట్‌కు చైనాలో మార్కెట్ మంచి డిమాండ్ లభించడంతో జిల్లాకు చెందిన చాలా మంది వ్యాపారులు గ్రానైట్ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ వరసలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు చెందిన శే్వత గ్రానైట్స్ ముందు వరసలో ఉంది.

Saturday, December 24, 2011

ఇసుక తీస్తే ఇక ఉక్కు పాదమే


* ‘భూమి’ కథనాలతో అధికారుల్లో కదలిక
* అక్రమ రవాణా నిరోధానికి తహశీల్దార్లకు ప్రత్యేక అధికారాలు  
* జిల్లా వ్యాప్తంగా 19 మందిపై క్రిమినల్ కేసులు
* నిఘాకోసం ప్రత్యేక బృందాలు
* నేడో, రేపో విడిసిలపైనా కేసులు
* వెల్లడించిన జాయింట్ కలెక్టర్
-ఆంధ్రభూమి బ్యూరో -

కరీంనగర్, డిసెంబర్ 23: జిల్లాలో ప్రవహిస్తున్న రెండు ప్రధాన నదులైన గోదావరి, మానేరు పరివాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న ముఠాల ఆట కట్టించేందుకు రంగం సిద్ధమైంది. జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలపై ‘ఆంధ్రభూమి’ ప్రచురించిన వరుస కథనాలతో అధికారుల్లో చలనం మొదలైంది. దాంతో జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఇసుక అక్రమ మైనింగ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులపై చర్యలు చేపట్టే దిశగా అడుగులు ప్రారంభించింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మొత్తం 19 వాహనాలను స్వాధీనం చేసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ఇందులో కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ, సుల్తానాబాద్, ధర్మపురి వంటి ప్రాంతాల్లో గురువారం విస్తృతంగా దాడులు నిర్వహించి 14 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. అంతేకాకుండా వాటి యజమానులపై క్రిమినల్ కేసులు కూడా మోపారు. అలాగే జమ్మికుంట మండలంలోని రెండు ర్యాంప్‌ల నుంచి ఇసుకను తరలిస్తున్న మరో ఐదు వాహనాలను రెవెన్యూ సిబ్బంది దాడులు జరిపి పట్టుకున్నారు. వాటిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. వీరిపై ఎపి వాల్టా చట్టాన్ని అనుసరించి కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అలాగే జగిత్యాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని రాయికల్ మండలం కొత్తపేట, బోర్నపల్లి, మల్లాపూర్ మండలం వివిరావుపేట, కోరుట్ల మండలం పైడిమడుగు, మెట్‌పల్లి మండలం ఆత్మకూరు తదితర ప్రాంతాల్లో విడిసిలు వేళం వేసినట్లు ఆరోపణలు రావడంతో వాటిపై విచారణ జరిపి కేసులు నమోదు చేయడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ అరుణ్ కుమార్ ‘ఆంధ్రభూమి’ ప్రతినిధికి వెల్లడించారు. అయితే వేలంలో ర్యాంపులు దక్కించుకున్న అక్రమ తవ్వకందారులపై చర్యలు తీసుకునే విషయాన్ని మాత్రం ధృవీకరించలేదు. వారంతా కూడా అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలకు అనుచరులుగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే జిల్లావ్యాప్తంగా మొత్తం 34 పాయింట్లలో అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ఇకపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి అక్రమ ఇసుక మైనింగ్‌కు పాల్పడేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సంబంధిత తహశీల్దార్లకు ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా అక్రమ మైనింగ్‌కు పాల్పడే వ్యక్తులకు సంబంధించిన వాహనాలు పట్టుబడితే వాటిని సీజ్ చేయడంతో పాటు పెద్దమొత్తంలో జరిమానా విధించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ట్రాక్టర్లు మొదటిసారి పట్టుబడితే ఎనిమిది వేలు, రెండవ సారి పట్టుబడితే పది వేల చొప్పున, లారీలు మొదటిసారి పట్టుబడితే 20 వేలు, రెండవసారి పట్టుబడితే అంతకంటే ఎక్కువ జరిమానా విధిస్తూ క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అక్రమ రవాణా నిరోధానికి తహశీల్దార్‌లు, మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు, సంబంధిత ఎస్‌ఐలకు వాహనాలను సీజ్ చేసే అధికారాలు ఇవ్వాలని నిర్ణయించారు.

షరా‘మామూల్’..

* పోలీసులు, రెవెన్యూలకే సింహభాగం

* విడిసిల ముసుగులో అక్రమ అనుమతులు

* యథేచ్ఛగా ఇసుక మాఫియా


కరీంనగర్, డిసెంబర్ 22: నిన్న లిక్కర్ సిండికేట్ కుంభకోణం..నేడు ఇసుక మాఫియా..ఇలా ఏ కుంభకోణం వెలుగులోకి వచ్చినా అందులో అధికార పార్టీ ముద్ర కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాలో కాంగ్రెస్‌కు చెందిన చోటా మోటా నాయకులదే ప్రధాన పాత్రగా చెప్పవచ్చు. చోటా మోటా నాయకులే కదా! అని తీసిపారేయకండీ. వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లుకమ్మక తప్పదు. సగటున రోజుకు వారి ఆర్జించేది అక్షరాల లక్ష రూపాయల పై మాటే. ఇందుకు భూగర్భ జలవనరుల శాఖ, గనుల శాఖ అధికారుల తోడ్పాటు షరా‘మామూల్’గా జరిగిపోయేదే. ప్రతిఫలంగా అక్రమార్కులను చూసి చూడనట్లుగా వదిలివేయటమే. ఇదంతా ఒకెత్తయితే జగిత్యాల రెవెన్యూ సబ్ డివిజన్ పరిధిలోని రాయికల్ మండలం మూటపల్లి, కొత్తపేట, బోర్నపల్లి, కోరుట్ల మండలం పైడిమడుగు, మెట్‌పల్లి మండలం ఆత్మకూరు తదితర గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీల పేరిట అధికార పార్టీకి చెందిన నేతలు అనధికారికంగా ఇసుక రీచ్‌లకు వేలం పాటలు నిర్వహించి కాంట్రాక్టర్లకు కట్టబెడుతున్నారు. ఇందుకుగాను కేవలం లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల వరకు విడిసికి చెల్లించి ఇక ఆ ఏడాది పొడవునా కావాల్సినంత ఇసుకను తోడుకుపోయే వెసులుబాటును కల్పించారు. దాంతో పెద్దవాగు, మానేరు వాగు, గోదావరి నదీ పరిసరాల్లో ఈ అక్రమ క్వారీలు వెలిశాయి. విడిసిల ద్వారా క్వారీలను చేజిక్కించుకున్న వ్యక్తులు పెద్దఎత్తున అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారు. అయితే ఆరోపణలు వచ్చిన సందర్భాల్లో మాత్రమే పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ అధికారులు అప్పుడప్పుడు దాడులు నిర్వహించి తమ పని చక్కబెట్టుకున్నాక చూసీ చూడనట్లు వదిలేస్తున్నారని, అందుకు ప్రతిఫలంగా ప్రతీ నెలా ఇసుక కాంట్రాక్టర్లు ఆయా ప్రాంతాల్లోని సంబంధిత అధికారులకు 45 నుంచి 60 వేల వరకు మామూళ్లు ముట్టజెప్పుతున్నట్లు ఆరోపణలున్నాయ. అయితే గ్రామాభివృద్ధి పేరుతో స్థానిక సంస్థలకు పోటీగా పెత్తనం చెలాయిస్తున్న ఈ విడిసిలపై సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తులే ఆధిపత్యం చెలాయిస్తున్నారు. వారి కనుసన్నల్లోనే గ్రామానికి సంబంధించిన లావాదేవీలన్నీ నిర్వహిస్తారు. ఈ క్రమంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గ్రామాల్లో ఇసుక క్వారీలకు టెండర్లు నిర్వహించి చౌకధరలకు కట్టబెట్టి లోపాయికారిగా లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారనేది నగ్న సత్యం. ఉదాహరణకు రాయికల్ మండలంలోని మూటపల్లి, కొత్తపేట, బోర్నపల్లి ప్రాంతాల్లో ఇసుక తవ్వుకునేందుకు వేలం పాటలు నిర్వహించి కేవలం 2.45 లక్షల రూపాయలకే క్వారీని కట్టబెట్టడం గమనార్హం. అయితే సగటున ఈప్రాంతం నుంచి సదరు కాంట్రాక్టర్ రోజుకు 50 ట్రాక్టర్లకంటే ఎక్కువ మొత్తంలో ఇసుకను తరలిస్తూ విడిసికి చెల్లించిన మొత్తం రుసుంను రెండు, మూడు రోజుల్లోనే వసూలు చేసుకోగలిగారు. దీన్నిబట్టి విడిసిలు ఇసుక మాఫియా అనుబంధం ఎంత గాఢంగా బలపడి ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
ఇకపోతే వీణవంక మండలం ఇప్పలపల్లి, కోర్కల్, కొండపాక, బోయినపల్లి మండలం వరదవెల్లి, శభాష్‌పల్లి, కొదురుపాక, కరీంనగర్, గంగాధర, బోయినపల్లి మండల సరిహద్దుల్లోని బావుపేట, ఒద్యారం, ఖాజీపూర్, మల్లాపూర్ తదితర ప్రాంతాలతో పాటు ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్, జమ్మికుంట మండలం  విలాసాగర్, తనుగుల, తిమ్మాపూర్ మండలం రేణికుంట, కొత్తపల్లి తదితర ప్రాంతాల నుంచి సగటున రోజుకు ఒక్కో ఇసుక రీచ్ నుంచి 60 నుంచి 70 ట్రాక్టర్ల వరకు ఇసుక తవ్వకాలు, తరలింపు అడ్డూ అదుపులేకుండా సాగిపోతోంది. ఒక్కో ట్రాక్టర్‌కు రెండు వేల చొప్పున ఇసుక విక్రయిస్తూ ఒక్కో కాంట్రాక్టర్ సగటున రోజుకు లక్ష రూపాయల వరకు ఆదాయం గడిస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ అనుమతిలేని చిన్న చిన్న వాగులు, వంకలపై జరుగుతున్న తతంగం. ఈ వ్యవహారంలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతీ ఒక్కరి హస్తం ఉన్నట్లు అర్థమవుతోంది. వీణవంక మండలం ఇప్పలపల్లిలో ఓ రాజకీయ నాయకుడు రోజుకు 60-70 ట్రాక్టర్ల వరకు ఇసుకను తరలిన్నారు. అలాగే ఇదే మండలంలోని కోర్కల్‌లో ఓ స్థానిక నేత ఏకంగా మానేరులో జెసిబిలు మోహరించి ఇసుక తవ్వకాలను జరుపుతున్నారు. సదరు వ్యక్తి కూడా షరా మామూలుగా సంబంధిత అధికారులకు భారీగానే ముడుపులు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే కొండపాక గ్రామంలో ఓ నాయకుడు రోజుకు పది ట్రాక్టర్ల చొప్పున ఇసుకను తరలించి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఆరోపణలు రావడంతో ఇటీవల అధికారులు గ్రామాన్ని సందర్శించి మానేరుకు వాహనాలు వెళ్లకుండా పెద్దఎత్తున కందకాలు తవ్వినప్పటికీ నిరాటంకంగా ఇసుక తరలింపు కొనసాగుతోంది.
ఇకపోతే ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లో ముగ్గురు వ్యక్తులు గ్రామాభివృద్ధి కమిటీకి నాలుగు లక్షల 80 వేల రూపాయలు చెల్లించి సగటున రోజుకు 20-30 ట్రాక్టర్లు ఇసుక తరలిస్తున్నారు. ఇక్కడ సదరు కాంట్రాక్టర్లు సంబంధిత అధికారులకు నెలకు రెండున్నర లక్షలకు పైగా మామూళ్లు ముట్టజెబుతున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇక బోయినపల్లి మండలంలోని వరదవెల్లి, శాభాష్‌పల్లి, కొదురుపాక గ్రామాల్లోని ఇసుక రీచ్‌ల నుంచి పెద్దమొత్తంలో కరీంనగర్ శివారులోని బావుపేట గ్రానైట్ క్వారీల్లో కుప్పలుగా పోసి అక్కడి నుంచి లారీల్లో రాజధానికి తరలిస్తున్నారు. ఇక్కడ ఇసుక మాఫియా ప్రతీ నెల లక్షల్లో అధికారులకు ముట్టజెబుతోంది. వారే అన్ని వర్గాలకు పర్సెంటేజీల చొప్పున మామూళ్లు పంచుతున్నట్లు ఆరోపణలున్నాయ.

ఖద్దర్..కాంట్రాక్టర్ చెట్టపట్టాల్..!

* కోట్లు కొల్లగొడుతున్న ఇసుక మాఫియా

 * ప్రజాప్రతినిధుల అనుచరులదే కీలక పాత్ర

 * అధికారులకూ నెల నెల మామూళ్లు

 * ఇందిరమ్మ పేరుతో రాజధానికి లారీల తరలింపు

ఆంధ్ర భూమి బ్యూరో
-----------------------

కరీంనగర్, డిసెంబర్ 20: ఖద్దర్ చొక్కాలు, కాంట్రాక్టర్‌లు కూడబలుక్కుంటే ఎలా ఆర్జించవచ్చో..ఇసుక మాఫియాను చూసి ఎంచక్కా నేర్చేసుకోవచ్చు. ఇసుకేస్తే కాసులు రాలుతుండడంతో ఇసుక క్వారీలు మాఫియాకు బంగారు గనులుగా మారిపోయాయి. అధికారికంగా కొంత, అనధికారికంగా కొండంత అన్నట్లుగా రాజకీయ పలుకుబడిని అడ్డం పెట్టుకొని కాంట్రాక్టర్లు అధికారులను నయానో, భయానో గుప్పిట్లో పెట్టుకొని యదేశ్ఛగా అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడుతున్నారు. జిల్లాలో ఇటీవల నిర్వహించిన వేలం పాటల్లో తొమ్మిది ఇసుక రీచ్‌లకు సంబంధించి పది కోట్లకు పైనే ఆదాయం లభించింది. అయితే టెండర్లలో రాజకీయ జోక్యం మితిమీరిపోవడంతో అక్రమాలు జరిగాయంటూ కొంత మంది వ్యాపారులు హైకోర్టుకెక్కారు. దాంతో అక్కడ తవ్వకాలకు అధికారికంగా బ్రేక్ పడింది. ఇవి కాకుండా వెల్గటూరు మండలం ముత్తునూరు, ముక్కట్రావుపేట, రామగుండం మండలం పొట్యాల రీచ్‌ల నుంచి మాత్రమే ఇసుకను తవ్వేందుకు అనుమతించారు. జిల్లాలో ప్రస్తుతం అధికారిక ఇసుక క్వారీలు ఈ రెండు మాత్రమే. కానీ హైకోర్టు బ్రేక్ వేసిన తొమ్మిది రీచ్‌ల్లో ప్రధానమైన రీచ్‌గా భావిస్తున్న కొదురుపాక రీచ్ నుండి ఇప్పటికీ అధికార పార్టీకి చెందిన ఓ ప్రముఖ ప్రజాప్రతినిధి అనుచరులు యదేశ్ఛగా ప్రోక్లైన్లు పెట్టి మరీ ఇసుకను వందలాది లారీల్లో ప్రతీ రోజు రాజధానికి తరలిస్తూ కాసుల పంట పండించుకుంటున్నారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు తరలించిన తరువాత ఒక్కో లారీ ఇసుకకు సగటున 15 వేల నుంచి 18 వేల రూపాయల మధ్య వసూలు చేస్తారు. అలాగే స్థానికంగా ఇసుక ట్రాక్టర్ల చొప్పున విక్రయించడం జరుగుతుంది. ఒక్కో ట్రాక్టర్‌కు రెండు వేల నుంచి మూడు వేల రూపాయల మధ్య ఇసుక నాణ్యతను బట్టి వసూలు చేస్తారు. ఇలా జిల్లాలోని మానేరు, గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో వందలాది అనధికారిక ఇసుక రీచ్‌ల నుంచి లారీల్లో తరలిస్తున్నా అధికారులు కనీస చర్యలు చేపట్టలేని ధైన్య స్థితిలో ఉన్నారు. కళ్ల ముందు నుండి లారీలు తరలివెళ్తున్నా పట్టించుకోవడం లేదంటే ఇసుక మాఫియా అధికార యంత్రాంగాన్ని ఏ స్థాయిలో ప్రభావితం చేస్తుందో ఊహించవచ్చు. ఎవరు నమ్మినా, నమ్మకపోయినా ఇసుక మాఫియా ప్రతీ నెలా గ్రామ కార్యదర్శి మొదలుకొని జిల్లా ఉన్నతాధికారి వరకు, కానిస్టేబుల్ మొదలుకొని పోలీస్ ఉన్నతాధికారుల వరకు లక్షల్లో మామూళ్లు ముట్టచెబుతూ పని చక్కబెట్టుకుంటున్నారనేది నగ్న సత్యం.
మాఫియాకు కాసులు కురిపిస్తున్న రియల్ భూం..

నాలుగేళ్ల క్రితం వరకు ఇసుక దందాపై జిల్లాలో పెద్దగా ఎవరికి అవగాహన ఉండేది కాదు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ భూం మొదలైన తరువాత భవన నిర్మాణాలు పెద్దఎత్తున ప్రారంభం కావడంతో హైదరాబాద్‌కు చెందిన ఇసుక వ్యాపారులు కరీంనగర్ జిల్లాపై దృష్టి సారించడంతో దీని వెనుక సాగుతున్న ఆర్థిక లావాదేవీలపై జిల్లా నేతలు దృష్టి సారించారు. ఈ వ్యాపారంలో కోట్ల పంట పండుతోందనే విషయాన్ని పసిగట్టడంతో ఏడాది క్రితం నిర్వహించిన వేలం పాటల్లో నేరుగా తమ అనుచరుల పేరుతో ఇసుక దందాలోకి అడుగుపెట్టారు. ఇందులో ప్రధానంగా అధికార పార్టీకి చెందిన ఓ కీలక నాయకుడి అనుచరులే ఇసుక మాఫియాకి శ్రీకారం చుట్టారు. వేలం పాటల్లో కొన్ని రీచ్‌ల్లో వీరికి టెండర్లు దక్కినప్పటికీ హైకోర్టు ఉత్తర్వుల పుణ్యమా అని బ్రేక్ పడడంతో అక్రమ తవ్వకాలకు తెరలేపారు. దాంతో జిల్లాలో అనధికారికంగా వందకు పైగా రీచ్‌ల నుంచి యథేచ్ఛా ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా గ్రామాల్లో రాజకీయంగా ఘర్షణలు తలెత్తిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఆయా సందర్భాల్లో ఇసుక మాఫియాపై కఠినంగా వ్యవహరించాల్సిన అధికారులు, పోలీస్ సిబ్బంది ఆ మాఫియా వెనుక ఉన్న పెద్ద తలకాయను చూసి మనకెందులే అన్న నిర్లిప్తతను ప్రదర్శిస్తున్నారు.
రూల్స్..గీల్స్ జాన్తానై..

జిల్లాలో ఇసుక రవాణాకు అనుమతి లేదు. అత్యవసరం కింద ఇందిరమ్మ గృహాలకు, గ్రామాల్లో ఇళ్లు కట్టుకునే వారికి అధికారులు అనుమతిస్తారు. దానికనుగుణంగా ఇసుకను తీసుకోవాలి. ప్రభుత్వం అనుమతిచ్చిన క్వారీలు జిల్లాలో మూడు మాత్రమే ఉన్నాయి. వాటిలో వెల్గటూర్ మండలంలో ముత్తునూర్. ముక్కట్రావ్‌పేట , రామగుండం మండలంలో పొట్యాల ఒకటి ఇసుక క్వారీలు ఉన్నాయి. వీటి ద్వారా మాత్రమే ఇసుకను తరలించాలి. దానికి అధికారులు అనుమతి ఇస్తారు. మిగితా చోట్ల ఇసుక తరలింపునకు అనుమతులు లేవు. కానీ జిల్లాలోని ఇల్లంతకుంట మండలం మల్లాపూర్ కొత్త బ్రిడ్జి వద్ద ఇష్టం వచ్చిన రీతిలో ఇసుకను తోడేస్తున్నారు. అలాగే బోయినపల్లి మండలం మాన్వాడ, సుల్తానాబాద్ మండలం నారాయణపూర్, మంథని, మహదేవ్‌పూర్, జమ్మికుంట మండలం వావిలాల, వీణవంక వద్ద ఉన్న మానేరు నుండి ఈ ఇసుక తరలింపును చేస్తున్నారు. అలాగే కరీంనగర్ నగర శివారు నుంచి కూడా పెద్దఎత్తున ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా అధికారులకు మాత్రం కనిపించడం లేదు. రెవెన్యూ, పంచాయతీ, మైన్స్ అండ్ జియాలజీ శాఖ అధికారులు, ఉద్యోగుల సహకారంతో మాఫియా ఇష్టం వచ్చిన రీతిలో తవ్వకాలు జరుపుతూ యదేశ్ఛగా తరలిస్తున్నారు. వీరికి అధికార పార్టీ నేతలు అండగా నిలుస్తున్నారు. గత నలబై రోజులుగా పెద్దఎత్తున జరుగుతున్న ఈ దందాలో వందలాది లారీలు హైదరాబాద్‌కు తరలిపోయాయి. జిల్లాలోని పలుచోట్ల నుండి కళ్లముందే ఇసుక తరలివెళుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. గతంలో అక్రమంగా ఇసుక తరలించే లారీలను, ట్రాక్టర్లను సీజ్ చేసి 5వేల నుంచి 15వేల వరకు జరిమానా వేసేవారు. ట్రాక్టర్స్, లారీలను సీజ్ చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో అక్రమార్కులు వందలాది లారీల ఇసుకను తరలించి కోట్లాది రూపాయలను ఆర్జిస్తున్నారు. ఈ దందాలో వచ్చిన డబ్బుల్లోంచి కొంత శాతం అధికార పార్టీ నేతలకు రాయల్టీగా చెల్లిస్తున్నట్లు తెలిసింది. అదేకాకుండా ఆయా గ్రామాల పరిదిలో ఇసుకను తీసినప్పుడు అడ్డుకోకుండా ఉండేందుకుగాను గ్రామాల్లోని ప్రజాప్రతినిధులకు కూడా కొంత ముట్టజెప్పుతున్నట్లు సమాచారం. ఇసుకను తోడేందుకు జెసిబిలను వినియోగిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దీనిని అరికట్టకపోతే భూగర్భ జలాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది.