Friday, August 12, 2011

మావోల ఫై ముప్పేట దాడి

                  సదానంద్ బెంబ్రే 
                 ----------------------- 
                 ఆంధ్రభూమి బ్యూరో

కరీంనగర్, జూన్ 3: దేశ అంతర్గత భద్రతకు పెనుముప్పుగా పరిణమించిన వామపక్ష తీవ్రవాదం, సీమాంతర ఉగ్రవాదాల పీచమణిచేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. నిన్న,మొన్నటి వరకు మావోయిస్టుల అణచివేత కోసం రక్షణ బలగాలను ఉపయోగించే విషయంలో మల్లగుల్లాలు పడ్డ కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల తాజా దుశ్చర్యల నేపథ్యంలో తన నిర్ణయాన్ని సమీక్షించుకున్నట్లు అర్థమవుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న మావోయిస్టు నెట్‌వర్క్‌పై ముప్పెటదాడి జరిపేందుకు రక్షణ శాఖతో కలిసి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఎ.కె.ఆంటోని త్రివిధ దళాల అధిపతులతో నిర్వహించిన సమావేశంలో మావోయిజం, సీమాంతర ఉగ్రవాదంపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అంతర్గత అసాంఘిక శక్తులను తుదముట్టించేందుకు హోంమంత్రిత్వ శాఖతో కలిసి పని చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మావోయిస్టులపై ఇప్పటికే ప్రారంభించిన ‘గ్రీన్‌హంట్’ ఆపరేషన్‌లో పారామిలటరీ బలగాలు పాల్గొంటుండగా సైనిక శాఖ తరపున యుఎవి (మానవ రహిత విమానాలు)లతో సహకరిస్తున్నారు. అయినా ‘గ్రీన్‌హంట్’ ఆపరేషన్లలో మావోయిస్టుల నిర్మూలన మాట ఎలా ఉన్నా పారా మిలటరీ బలగాలకే ఊహించని ఎదురు దెబ్బలు తగలడంతో కేంద్రం తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం..దేశంలోని 28 రాష్ట్రాలు, 636 జిల్లాలకు గాను 20 రాష్ట్రాల్లోని 223 జిల్లాల్లో మావోయిస్టులు విస్తరించినట్లు గుర్తించారు. ఇందులో 13 రాష్ట్రాల్లోని తొమ్మిది జిల్లాల్లో గల 400 పోలీస్ స్టేషన్ల పరిధిలో నక్సల్స్ సమస్య అధికంగా ఉన్నట్లు గుర్తించారు. గడిచిన మూడు నెలల వ్యవధిలోనే చత్తీస్‌గఢ్, ఒరిస్సాల్లో సిఆర్‌పిఎఫ్ జవాన్లపై దాడి చేసి పెద్ద సంఖ్యలో హతమార్చిన విషయం తెలిసిందే. మరోవైపు పశ్చిమబెంగాల్‌లో రైలును పేల్చివేసిన సంఘటనలో 170 మందికి పైగా అమాయక ప్రజలు మృతి చెందడంతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను ఉక్కుపాదంతో అణచివేసేందుకు కార్యాచరణ రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ క్రమంలో నక్సల్స్ సమస్య అధికంగా ఉన్న చత్తీస్‌గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నక్సల్స్ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తున్న అనుబంధ సంఘాలను గుర్తించేందుకు ఇంటెలిజెన్స్ ఇప్పటికే రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా దేశంలో విదేశీ ప్రేరేపిత ఉగ్రవాదం కూడా పెచ్చరిల్లుతున్న దృష్ట్యా లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఉత్తర, దక్షిణ భారతదేశానికి కేంద్ర బిందువుగా ఉన్న నాగపూర్‌లో మిలటరీ, పారా మిలటరీ, పోలీస్ బలగాలతో సంయుక్త కమాండ్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సైనిక బృందాలు అధ్యయానికి శ్రీకారం చుట్టాయి. ఒక్కో బృందంలో ఒక కెప్టెన్‌తో సహా మరో 20 మంది సభ్యులు నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో పర్యటించి ఆయా ప్రాంతాల్లోని కీలక ప్రాంతాలు, ప్రాజెక్టులు, నక్సల్స్ కదలికలు అధికంగా ఉండే అటవీ ప్రాంతాలు, రోడ్డు మార్గాలపై సునిశితంగా అధ్యయనం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం బీహార్ 8వ రెజిమెంట్‌కు చెందిన కెప్టెన్ జావెద్ ఫరీద్ ఆధ్వర్యంలో 13 మంది సభ్యులు మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా మహారాష్ట్ర-ఆంధ్రప్రదేశ్-చత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో నక్సల్స్ కార్యకలాపాలను గురించి సంబంధిత జిల్లా పోలీస్ ఉన్నతాధికారులతో కీలక సమాచారాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. మన రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాదాన్ని తుదముట్టించిన అంశంపై పోలీస్ అధికారులతో సుదీర్ఘంగా చర్చించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ సందర్భంగానే మావోయిస్టు పార్టీకి ప్రధాన వనరులుగా పరిగణిస్తున్న కవర్ సంఘాలపై కూడా ఆంధ్రాపోలీసుల అనుభవాలను రికార్డు చేసినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా మావోయిజానికి కేంద్ర స్థావరంగా ఉన్న చత్తీస్‌గఢ్ సరిహద్దు కరీంనగర్ జిల్లాకు కేవలం 150 కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో నక్సల్స్‌పై ఆపరేషన్స్ ప్రారంభిస్తే అవసరమైన పక్షంలో సైనిక బలగాలను తరలించేందుకు అనువైన భౌగోళిక పరిస్థితులు ఉన్నాయా? లేవా? అన్న కోణంలో స్థల పరిశీలన జరుపుతున్నట్లు తెలిసింది.