Monday, August 8, 2011

బుర్జ్ ఖలీఫా అగ్ర భాగాన అంతే!


రంజాన్ ఉపవాస కాలం మరింత ఎక్కువ

దుబాయి, ఆగస్టు 7: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఆకాశ హర్య్మం.. బుర్జ్ ఖలీఫా అగ్ర భాగాన నివసించే వారు అందరికన్న ఎక్కువ సమయం రంజాన్ ఉపవాసాన్ని ఆచరించాల్సి ఉంటుంది. ఎందుకంటే అతి ఎత్తయిన ప్రాంతంలో ఉన్నవారికి, నేలమీద ఉన్న వారికన్నా ముందే సూర్యోదయం, అలాగే అందరి తరువాత సూర్యాస్తమయం అవుతాయి. ఈ కారణంగా మిగతా వారందరితో పోలిస్తే వారి దిన ప్రమాణం హెచ్చుగా ఉంటుంది. ఈ కారణంగా బుర్జ్ చివర ఉన్న వారు అందరికన్న ఎక్కువ సమయం ఉపవాసం పాటించకతప్పదు. అంతేకాదు,

ఈ 160 అంతస్తుల టవర్‌లో కిందనుంచి పైవరకు వివిధ ఎత్తుల్లో ఉన్నవారికి రకరకాల రంజాన్ ఉపవాస కాలాలు నిర్దేశిస్తూ దుబాయ్ ఇస్లామిక్ వ్యవహారాల విభాగం ప్రకటన జారీ చేసింది. దీని ప్రకారం, 80వ అంతస్తునుంచి 150వ అంతస్తు వరకు ఉన్న వారికి, వారి దిగువనల ఉన్న వారి కన్న రెండేసి నిమిషాలు అదనంగా (ఉదయం ఉపవాస ప్రారంభం రెండు నిమిషాల ముందుగా, అలాగే చివరలో ఉపవాస విరమణ మరో 2 నిమిషాల తరువాతగా) మొత్తం నాలుగు నిమిషాలు అదనంగా పాటించాలి. ఆపైనగల 151 నుంచి 160వ అంతస్తుల వరకు నివసించే వారు 3 నిమిషాల వంతున మొత్తం అదనంగా 6 నిమిషాల పాటు ఉపవాసం పాటించాల్సి ఉంటుంది. 

మమకారానికి.. కారాగారం


100 కొరడా దెబ్బలు.. 4 నెలలు జైలు

జెడ్డా, జూన్ 12 : తండ్రి నుంచి విడాకులు పొంది వేరుగా ఉంటున్న తల్లితో కలిసి ఉంటానని చెప్పినందుకు 18 ఏళ్ల యువకుడికి సౌదీ అరేబియా కోర్టు 100 కొరడా దెబ్బలు, 4 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. తన తల్లికి విడాకులిచ్చిన తండ్రి మరో ఇద్దరు భార్యలు, అనేక మంది సవతి అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లతో కలిసి ఉంటున్నాడని అక్కడ తనకు ఇబ్బందిగా ఉందని, తన తల్లికి తాను ఏకైక సంతానమని, కాబట్టి తల్లితో కలిసి ఉండడానికి తనను అనుమతించాలని ఆ యువకుడు మదీన కోర్టులో మొరపెట్టుకున్నాడు.

తండ్రి ఆదేశాల ధిక్కారం కింద తండ్రి యువకుడిపై కేసు దాఖలు చేయగా అసలు వాదనలు వినకముందే న్యాయమూర్తి పై విధంగా తీర్పునిచ్చినట్లుగా ఒకాజ్ అరబ్బి పత్రిక తెలిపింది. గల్ఫ్ దేశాలలో ఉన్న ఇస్లామిక్ చట్టాల ప్రకారం సంతానం అభీష్టంతో సంబంధం లేకుండా ఏడేళ్ల వయస్సు దాటిన తర్వాత పిల్లలు తప్పనిసరిగా తండ్రి వద్ద ఉండాలని చట్టం నిర్దేశిస్తుంది.

ఎడతెగని పంచాయితీ


-
కేరళ రాష్ట్రంలోని తొట్టపల్లి గ్రామంలో ఉన్న క్రైస్తవ కుటుంబానికి, ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా సుండుపల్లి గ్రామంలో ఉన్న హిందూ కుటుంబానికి మధ్య ఉన్న దూరం 900 కిలోమీటర్లు. భిన్న భాషలు, సంస్కృతి వీరి మధ్య ఉన్నప్పటికీ కువైట్‌లో జరిగిన హత్య కేసులో వీరి మధ్య రాజీ కుదిరింది. కరీంగనర్ జిల్లా మానేరు నదీ తీరంలోని గ్రామం, బంగ్లాదేశ్‌లోని బ్రహ్మపుత్ర నదీ తీరంలోని మరో గ్రామంలో కుటుంబానికి మధ్య బంగాళాఖాతమంత వ్యత్యాసం ఉంది.

అయినా దుబాయిలోని ఒక హత్య కేసులో రాజీ కుదిరింది. భారత్, పాకిస్తాన్‌ల మధ్య భౌగోళిక దూరం పెద్దగా లేకున్నా సరిహద్దు ప్రాంతంలో రెండు దేశాల మధ్య పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా, ఘర్షణపూరితంగా ఉంటాయి. ఇంత ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగిన ఒక హత్య కేసులో ఇరు వర్గాల మధ్య రాజీ కుదిరింది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఇరుగుపొరుగున ఉన్న గ్రామాలు, అందునా సొంత గిరిజన తెగకు చెందిన వారి మధ్య ఒమాన్‌లోని ఒక హత్య కేసులో సయోధ్య కుదరడం లేదు.

గల్ఫ్ దేశాలలోని ఇస్లామిక్ చట్టాల ప్రకారం హత్య కేసుల్లో నయా పైసా లేకుండా హతుడి కుటుంబసభ్యులు క్షమాభిక్ష పెట్టి హంతకుడి ప్రాణాన్ని కాపాడవచ్చు లేదా 100 కోట్లు ఇవ్వజూపినా తిరస్కరించి శిక్షకు పట్టుపట్టవచ్చు. రియాద్‌లో ఒక సౌదీ జాతీయుడి మృతికి కారణమైన భారతీయుడిని నయాపైసా లేకుండా సౌదీ కుటుంబం క్షమి ంచి వదిలిపెట్టింది. మ రో కేసులో 120 మిలియన్ డాలర్ల దియా ను హంతకుని కుటుం బం ఇవ్వజూపినా హతుని కుటుంబం ససేమిరా అనడంతో హంతకుడికి మరణ శిక్ష అమలు చేశారు.

ముంబాయి మాఫియా డాన్లు ఛోటా రాజన్, దావూద్ ఇబ్రహీంల మధ్య తలెత్తిన వివాదంలో ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. మృతుని భార్య కోట్ల రూపాయల దియాకు ఆశపడి రాజీకి సిద్ధపడింది. దావూద్ ఇబ్రహీం ముఠా హెచ్చరికలతో రాజీ కుదరకపోవడంతో హంతకునికి దుబాయిలో మరణ శిక్షను అమలు చేశారు. దుబాయిలో ప్రమాదవశాత్తూ ఒక బంగ్లాదేశీ జాతీయుడి మృతికి కారణమైన కరీంనగర్ జిల్లా గంభీరావుపేట మండలానికి చెందిన అంబోట్టి శ్రీనివాస్‌ను మృతుని కుటుంబం 12 లక్షల రూపాయలు తీసుకొని క్షమించడంతో జైలు నుంచి విడుదలయ్యాడు.

తనపై అత్యాచారానికి ప్రయత్నించిన ఒమానీ జాతీయుడిని 17 సార్లు దారుణంగా పొడిచి హత్య చేసిన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలానికి చెందిన శ్రీనివాస్‌ను మస్కట్ న్యాయస్థానం ఎలాంటి శిక్ష లేకుండా విడుదల చేసింది. దురుద్దేశపూర్వకంగా చేసే హత్యలలో మాత్రం ఎలాంటి సానుభూతి లభించదు. కానీ దియా ద్వారా ఇరుపక్షాలు పరస్పరం సయోధ్య కుదుర్చుకుంటే హంతకులను విడుదల చేసే విధానం గల్ఫ్‌దేశాలలో ఉంది.

ఈ రకంగా నిన్న షార్జాలో మరణశిక్షను ఎదుర్కొంటున్న 17 మంది భారతీయులు ప్రాణగండం నుంచి తప్పించుకొన్నారు. లేబర్ క్యాంపులలో సారా విక్రయం కోసం ఆధిపత్య పోరులో భాగంగా ఒక పాకిస్తానీ జాతీయుడిని దారుణంగా హత్యచేసిన 16 మంది పంజాబీలు (ఒకరు హర్యానా వాసి) పాకిస్తాన్‌లో ని మృతుని కుటుంబానికి ముప్పై నా లుగు లక్షల దిర్హాం లు (సుమారు నా లుగు కోట్ల 15 లక్ష ల రూపాయలు) దియా చెల్లించడానికి ఒప్పుకోవడం తో న్యాయస్థానం శిక్షను రద్దు చేసేందుకు అంగీకరించింది. ఇం దులో ఒక్క నయాపైసా కూడా కేంద్రం గానీ పంజాబ్ ప్రభుత్వం గానీ ఇవ్వలేదు.

దుబాయిలో ఉన్న పంజాబీ సిక్కులు ఈ భారీ మొత్తాన్ని చెల్లిస్తున్నారు. సరిహద్దులకు ఇరువైపుల ఉన్న పంజాబీలు సయోధ్య కుదుర్చుకోనున్నారు. అంతకు ముందు కువైట్‌లో జరిగిన కడప జిల్లాకు చెందిన సుండుపల్లి సురేశ్ హత్య కేసులో కేరళకు చెందిన సీమాల్ రాజీని మొదట రెండు లక్షల రూపాయలు ది యాగా తీసుకొని క్షమిస్తామని సురేశ్ కుటుంబం ఒప్పుకుంది.

తర్వాత ఆరు లక్షలు, చివరకు 15 లక్షల రూపాయలు తీసుకొని అతనిని క్షమించింది. ఈ కేసులో కేరళ ప్రభుత్వం అధికారికంగా ఏమీ చేయలేదు, అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి వ్యక్తిగత శ్రద్ధ తీసుకున్నారు. ఈ 15 లక్షలకు తోడుగా కువైట్ న్యాయస్థానంలో కేసును వాదించిన న్యాయవాదికి అదనంగా రూ.6 లక్షలను సౌదీలోని ఒక మలయాళీ చెల్లించారు.

కానీ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేసరికి ఈ రకమైన రాజీ పరిష్కార మార్గాలు కనిపించడం లేదు. తీవ్ర నేరారోపణలు, ప్రత్యేకించి దొంగతనం చేస్తున్న సందర్భాలలో హత్యలు చేస్తూ ఆం«ద్రులు పలు కేసుల్లో ఇరుక్కుపోతున్నారు. రెండు సంవత్సరాల క్రితం షార్జాలో జరిగిన నిజామాబాద్ జిల్లా దెగ్గాం కేసులో హంతకులందరూ దొంగలే. ప్రస్తుతం ఉన్న కేసులో కూడా తమ దొంగతనానికి అడ్డుపడడంతో సెక్యూరిటీ గార్డును హతమార్చిన కేసులో అయిదుగురు కరీంనగర్ జిల్లా వాసులు శిక్షను అనుభవిస్తున్నారు.

ఇప్పుడు ఒమాన్ న్యాయస్థానంలో నడుస్తున్న ఒక కేసులో కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ప్రాంతానికి చెందిన ముగ్గురు గిరిజనులు తమతో పాటు ఉంటున్న మరో గిరిజనుడు లకావత్ నారాయణను 2009లో దారుణంగా హత్య చేసారు. దీనికి సంబంధించి పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయి. మృతుడి భార్యతో సయోధ్య కుదుర్చుకొని పరస్పరం అంగీకరించుకొని దియాను చెల్లిస్తే ముగ్గురు హంతకులకు శిక్షతగ్గి విడుదలయ్యే అవకాశం ఉంది.

కానీ ఈ కుటుంబాల మధ్య రాజీ కుదరడం లేదు. రాజీ అనేది ఇరు కుటుంబాలు పరస్పరం శాంతియుతంగా, స్నేహభావంతో, విశ్వాసంతో, క్షమాగుణంతో చేయాల్సిన పని. దీనికి గల్ఫ్ చట్టాలను ఆసరాగా చేసుకుని పెద్దమొత్తంలో నష్టపరిహారం కూడా తీసుకోవచ్చు. కానీ అధికారిక లేదా రాజకీయ ఒత్తిళ్ళతో రాజీ సాధించడం అనేది తప్పు. పైగా దొంగతనం, హత్య కేసు నిందితులని కూడా మనం మరవకూడదు. ఈ రకమైన కేసులు ఇంకా ఉన్నాయి.

బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లతో పాటు మన రాష్ట్రంలోని కేరళ కేసులో రాజీ కుదరగా లేనిది కేవలం 15 కిలోమీటర్ల దూరం లేని వట్టిమల్ల, వీరన్నపల్లి లంబాడీ తండాల మధ్య ఎందుకు సాధ్యం కావడం లేదు.

రెండు కళ్ళ సిద్ధాంతం!

 

మన ఈ వ్యాసానికి కారకుడు, ప్రేరకుడు అయిన చంద్రబాబు కళ్ళ భాషను చెప్పటం ఆషామాషీ కాదు.. ఆయన కళ్ళు చాలా శక్తిమంతమైనవి.. ఆయన కళ్ళు చూస్తాయి.. ఎదుటివాణ్ణి చదువుతాయి.. తామేవీ చెప్పవు. వాటి భాష ఎవరికీ అర్థంకాదు.. వాటి చూపులు ఎవరికీ అందవు... ఆయన ఎదుటి వాణ్ణి కళ్ళారా చూస్తాడు. కన్నార్పకుండా చూస్తాడు. రెండు కళ్ళు కాదు.. ఎవరికీ కనపడని నేత్రం ఆయనకు మరోకటుంది!!!

ఈ మధ్యన ఉన్నట్లుండి రాష్ట్రంలో కళ్ళకు ప్రాధాన్యం పెరిగింది. అన్ని ఇంద్రియాల్లోకి నయనం ప్రధానం అని అనే వాళ్లు మనిషి శరీరంలో ఏ భాగంలో చిన్న ఇబ్బంది కలిగినా కొద్దిసేపు ఓర్చుకోగలడుగానీ కంట్లో చిన్న నలుసు పడితే లిప్తపాటు కూడా తట్టుకోలేడు. అది బైటికొచ్చిందాకా అల్లాడిపోతాడు. ఆ మధ్యన ఓ సినిమాలో ఒక హీరో 'కత్తులతో కాదురా.. కంటిచూపుతో చంపేస్తా ..' అంటూ బెదిరిస్తాడు.. కంటి పవర్ అలాంటిదన్నమాట... 'నిన్ను జీవితాంతం కళ్ళల్లో పెట్టి చూసుకుంటా..' అని అంటుంటారు. కన్ను అనేది అంత సురక్షిత ప్రాంతమన్న మాట. 'మేం బావుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటావేం..' అని తిట్టిపోస్తారు.

కన్ను అసూయపరురాలు.. 'నీ కళ్ళు చెబుతున్నాయి'.. అంటే కళ్ళు గొప్ప భావ ప్రకటనా సాధనాలు.. 'కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే' అన్న పాట కళ్ళు ఓ నలభై రెండు అంగుళాల టి.వి. అని చెప్పకనే చెబుతుంది.. 'కనుపాప కరవైన కనులెందుకు' అనే పాట నేత్రరహిత జీవిత నిష్ప్రయోజకత్వాన్ని చెబుతుంది... ఇలా చె ప్పుకుంటూపోతే కంటి గురించి ఓ పి.హెచ్.డి. చేయొచ్చు.. ఓ గ్రంథం రాయొచ్చు... కొంతమంది కళ్ళతోనే అనేక భావాలు పలికిస్తుంటారు. కొంతమంది ఎన్ని భావాలు పలికించినా అర్థం కావు. అలాంటి వాళ్ళ కంటి భావాల్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేసిన వాళ్ళ కళ్ళు తిరగాల్సిందే గానీ ఆ ప్రయత్నం ఫలించదు..."నువ్వెంత కోపంగా ఉన్నావో నీ ముఖం చూస్తే తెలుస్తోంది'' అని కొంతమంది అంటారు.

ఇక్కడ ముఖం అంటే నూటికి నూరు పాళ్ళు కళ్ళే... కళ్ళు లేకుండా భావాన్ని ప్రకటించే సామర్థ్యం వట్టి ముఖానికి లేదు. అలసట, ఆత్మ విశ్వాసం, ఆత్మీయత, ఆగ్రహం, ఆవేశం, ఆపేక్ష, అసూయ ఇలా.. ఏ భావాన్నయినా, ఏ రసాన్నయినా ప్రదర్శించగల కెపాసిటీ కళ్ళకే ఉంది. భగవంతుడు ఇంత గొప్ప కళ్ళను మనిషికిచ్చి మళ్ళీ వాటికి చత్వారం అనీ, శుక్లాలనీ, కండ్లకలకలనీ రకరకాల జబ్బుల్నిచ్చాడు. అందమైన కళ్ళకు అద్దాలిచ్చాడు.. వాటిల్లో మళ్ళీ ప్లస్సులు, మైనసులు... ఇవన్నీ మైనసులు.. ఇవ న్నీ ఒక ఎత్తయితే దేవుడు చేసిన పెద్దపొర బాటు అంధత్వం.. సరే.. ఆ విషయాలన్నీ కొద్దిసేపు పక్కన పెట్టి ప్రస్తుతానికొద్దాం.. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో జరుగుతున్న ప్రాంతీయ ఉద్యమాల నేపథ్యంలో 'రెండు కళ్ళ సిద్ధాంతం' తెరమీదికొచ్చింది.

అటు తెలంగాణవాదులు, ఇటు సమైక్యాంధ్రవాదులు ఓకే ఒక అజెండాతో ఒంటికంటి పోరాటం చేస్తుంటే చంద్రబాబు నాయుడు మాత్రం రెండుకళ్ళ పోరాటం చేస్తున్నారనే వివాదం ప్రధానంగా వినిపిస్తోంది. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలు రెండూ తనకు రెండు కళ్ళులాంటివనీ, రెండు ప్రాంతాలలో పార్టీని కాపాడుకోవటం తనకు ప్రధానమనీ చంద్రబాబు చెబుతూనే వచ్చారు. మొన్నీ మధ్యన జరిగిన మహానాడు వేదిక మీద మరోసారి బల్ల గుద్ది మరీ చెప్పారు.. మూడ్రోజుల క్రితం నా దగ్గరకు మంచి ఊపుమీద వచ్చిన మా సత్తిబాబు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ "రెండు కళ్ళ మ్యాటర్ బాబు ఆదినుంచీ చాలా క్లియర్‌గానే చెబుతున్నాడు.

ఇంకా గట్టిగా చెప్పాలంటే తెలంగాణ, సీమాంధ్ర విషయాల్లో అన్ని పార్టీలకంటె చంద్రబాబే స్పష్టంగా ఉన్నారు. నీకది కావాలా.. ఇది కావాలా.. అంటే రెండూ కావాలి అని ఖచ్చితంగా చెబుతున్నారు.. ఇంతకంటె క్లారిటీ ఏం కావాలి?'' అంటూ హై పిచ్‌లో అరిచేశాడు. వాణ్ణి కొంచెం కూల్ చేసి "రాజకీయాల్లో అలాంటిదాన్ని కప్పదాటు వైఖరి అంటారు. మంచో చెడో ఏదో ఒకదాని మీద నిలబడాలి...'' అని ప్రవచించాను.. వాడు ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా " నేను నీకు మంచి స్నేహితుడినే కదా..'' అనడిగాడు. "దాంట్లో సందేహమేముంది...'' అన్నాను. "నేనేమడిగినా ఇస్తావా..'' మళ్ళీ అడిగాడు సత్తిబాబు.. "నా దగ్గరుంటే ఇస్తాను.'' చెప్పాన్నేను. "నీ ద గ్గరున్నదే.. నీ రెండు కళ్ళల్లో ఒకదానిని నాకివ్వు.. కుడి కన్నిస్తావా.. ఎడమ కన్నిస్తావా..?'' అడిగాడు వాడు.

నేను అదిరిపాటును కప్పిపుచ్చుకుంటూ 'ఏ కన్నయినా ఎలా ఇస్తాను?' అన్నాన్నేను. "నేను చేప్పేది అదే... నువ్వివ్వలేనిది చంద్రబాబు ఎలా ఇస్తాడు.. తన కంటిదాకా వస్తేగానీ తెలియదనీ..'' అంటూ ముక్తాయించాడు.. నాకు కోపం వచ్చింది. "నువ్వు వితండంగా వాదిస్తున్నావు.. రెండు కళ్ళ సిద్ధాంతం అంటే కళ్ళు, కనుగుడ్లు, రెప్పలు అని కాదు.. చంద్రబాబు ధోరణికి ఇతర పార్టీల వాళ్ళు పెట్టుకున్న ముద్దుపేరది....'' అంటూ వాడికి వివరించే ప్రయత్నం చేశాను.. వాడు పెద్దగా నవ్వేసి "అంటే ఆ పార్టీల వాళ్ళ ఉద్దేశ్యం ఏవిటి.. చంద్రబాబును తెలంగాణకు ఒక కన్నూ సీమాంధ్రకు ఒక కన్నూ ఇచ్చేయమనా... మరీ దుర్మార్గం కాదూ... అంటే ఆ తర్వాత చంద్రబాబు ఏదయినా మాట్లాడితే 'గుడ్డి కన్ను తీస్తే ఎంత....? మూస్తే ఎంత? అందామనా..?' అంటూ కొత్తర్థం తీశాడు సత్తిబాబు.

చర్చ వేరే దారి మళ్ళుతోందని అనిపించి వాణ్ణి పంపేందుకు ప్రిపేరయ్యాను. "ఎవడి కన్ను ఎట్టాపోతే మనకెందుగ్గానీ నువ్వు బయల్దేరు..'' అన్నాను. అంతే... వాడొక్కసారిగా ఫైర్ అయ్యాడు. "అందరూ ఇలా అనుకోబట్టే మన స్టేట్ ఇలా అయిపోతోంది... ఎంతసేపటికీ కళ్ళ సిద్ధాంతం చెప్పి చంద్రబాబును ఇబ్బందుల్లో పెడదామా.. లేక మరో నాయకుణ్ణి ఇరకాటంలో పెడదామా.. అని తప్పితే రాష్ట్రాన్ని కళ్ళల్లో పెట్టి చూసుకుందామని అలోచించకపోతే ఎలా???'' అని అరిచాడు. "నువ్వు మాట్లాడుతోంది తప్పు.. ఎవరి ఉద్యమాలు వాళ్ళవి. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి మనకు ఆ రాజకీయాలు వద్దు'' నిష్కర్షగా చెప్పాన్నేను.

నాతో వాదించి ఉపయోగం లేదనుకున్నాడో ఏమో మరి వాడు విసుక్కుంటూ విసా విసా వెళ్ళిపోయాడు... రెండు కళ్ళ గురించి రెండు చెవులు వాచిపోయేంతగా వాదించుకున్నాం అనిపించింది. సత్తిబాబు ముందు అంటే వాడు మరీ రెచ్చిపోతాడేమోనని మాట్లాడలేదు గానీ వాడు చెప్పిందాంట్లోకూడా ఎంతో కొంత సమర్థనీయమైన వాదన లేకపోలేదు అనిపించింది. రాష్ట్రం మొత్తం మీద బలంగా ఉన్న ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీని 'నీకే ప్రాంతం కావాలో కోరుకో..' అంటే ఏది కోరుకుంటుంది....? ఇద్దరు పిల్లలున్న ఒక తల్లిని నీకే బిడ్డ కావాలో తేల్చుకో... అంటే ఏ నిర్ణయం తీసుకుంటుంది? నాయకుడన్నవాడు పార్టీని, క్యాడర్‌ను కంటిపాపలాగా చూసుకోవాలి అంటారు.

కళ్ళు రెండయినా చూపు ఒకటే.. గుడ్లు రెండయినా పయనం ఒకటే.... రెప్పలు రెండయినా ఒకేసారి మూసుకుంటాయి. తెరుచుకుంటాయి... మరి దీన్ని రెండుగా విభజించటం ఎలా.. అన్నది మిలియన్ డాలర్ ప్రశ్న.. ఒక విధంగా చంద్రబాబు అదృష్టవంతుడు. కాంగ్రెస్ పరిస్థితి మరీ దయనీయం.. తెలంగాణలో కె.కె. కన్ను.. సీమలో టి.జి. వెంకటేష్ కన్ను.. ఆంధ్రలో కావూరి కన్ను.. ఉత్తరాంధ్రలో బొత్స కన్ను.... ఇవికాక జగన్ పరంగా ఒక దెబ్బతిన్న కన్ను.. ఇలా అయిదు కళ్లు.. కాంగ్రెస్ పంచనేత్రి... కొన్నాళ్ళ తరవాత తెలంగాణతోపాటు సీమ, ఆంధ్ర, ఉత్తరాంధ్ర, మన్యం ప్రాంతీయ ఉద్యమాలు బలపడితే అన్ని పార్టీలకు అయిదేసి కళ్ళు కావాలేమో.. అంకితభావంతో ఒక ప్రాంతానికి పరిమితమై సిన్సియర్‌గా ఉద్యమాలు చేస్తున్న పార్టీల పరిస్థితి ఫరవాలేదు గానీ రాష్ట్రం మొత్తం మీద విస్తరించి ఉన్న పార్టీలకు ఈ సంకటస్థితి తప్పదేమో.. అయినా అవన్నీ రాజకీయాలు.. నాకు పెద్దగా అవగాహన లేదు కాబట్టి లోతుల్లోకి వెళ్ళటం కరెక్ట్‌కాదు.. అనుకుంటాంగానీండి.

తను అర్చకత్వం చేస్తున్న గుళ్ళోనే దొంగతనం చేసిన గుడి అర్చకుడికి ఒక కంట్లో వెంకటేశ్వరస్వామి, మరో కంట్లో పస్తులు పడుకుంటున్న తన కుటుంబ సభ్యులు ఉంటే చివరికి కుటుంబ నేత్రానికే ప్రాధాన్యం ఇచ్చాడు గదా. నా దృష్టిలో రెండు కళ్ళ సిద్ధాంతం అంటే అదీ... డీజిల్, పెట్రోల్ రేటు రోజురోజుకు ఆకాశానికి అంటుతున్నా.. అందుకు తన పాకెట్ పర్మిట్ చేయకపోయినా బండి నడవనిదే బతుకుబండి నడవదు కాబట్టి కడుపుమంటను అదిమిపెట్టి ఒక కంట్లో 'జేబులో పైసల్' మరో కంట్లో 'బండిలో ఆయిల్' అనే కాన్సెప్ట్‌లో ఆయిల్ వైపే మొగ్గుచూపుతాడు మధ్యతరగతి జీవి. ఇదీ రెండు కళ్ళ సిద్ధాంతం.... ఇలా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో ఎన్నో లక్షల జతల కళ్ళు.. వాటి వెనుక కళ్ళు చెమర్చే కథలు.. గమ్మత్తేవిటంటే... మన ఈ వ్యాసానికి కారకుడు, ప్రేరకుడు అయిన చంద్రబాబు కళ్ళ భాషను చెప్పటం ఆషామాషీ కాదు.. ఆయన కళ్ళు చాలా శక్తిమంతమైనవి.. ఆయన కళ్ళు చూస్తాయి.. ఎదుటివాణ్ణి చదువుతాయి.. తామేవీ చెప్పవు. వాటి భాష ఎవరికీ అర్థంకాదు.. వాటి చూపులు ఎవరికీ అందవు... ఆయన ఎదుటి వాణ్ణి కళ్ళారా చూస్తాడు. కన్నార్పకుండా చూస్తాడు. రెండు కళ్ళు కాదు.. ఎవరికీ కనపడని నేత్రం ఆయనకు మరోకటుంది!!!

సందర్భం


- కె. శ్రీనివాస్

ఇక సామాన్యుడేమంటున్నాడు? ఆత్మత్యాగాలు ఆత్మహత్యలు వద్దు. పారిన రక్తం చాలు. ఆత్మహింసా వద్దు పరహింసా ప్రగల్భాలూ వద్దు. అసలు ఆ మాటలే వద్దు. ఐక్యంగా ఉండండి, ఉద్యమాన్ని నిలబెట్టండి, వాస్తవికతను బట్టి వ్యూహాలను రచించండి. విజయం ఎప్పుడు లభిస్తుందో, అసలు లభిస్తుందో లేదో మీ మనసుకు ముందే తెలిస్తే దాన్ని ప్రజలకు చెప్పండి. 2014 నిజమయితే, అదే చెప్పండి. అప్పటిదాకా సహనం ఇచ్చే కార్యక్రమం ఇవ్వండి. ఒకరినొకరు ఎగదోసుకునే క్రీడకు స్వస్తి చెప్పండి. మరింతమంది మిత్రులను కూడగట్టుకోండి. ఉద్యమాన్నీ రాజకీయాన్ని రెండుపట్టాల మీద కుదురుగా నడపండి. మభ్యపెట్టకండి.

రాష్ట్రంలో నెలకొని ఉన్న అనిశ్చితి తొలగాలని కోరుకునేవారికి చిదంబరం లోక్‌సభ ప్రకటనలో ఏదన్నా ఒక సానుకూల అంశం కనిపించి ఉంటే, అది ఒకే ఒక్కటి. ఏకాభిప్రాయ సాధనకు 'రెండువారాలు పట్టవచ్చు, రెండునెలలు పట్టవచ్చు' అన్న తరువాత రెండేళ్లయినా పట్టవచ్చు అంటాడేమో అని భయపడ్డవారికి 'మూడు నెలలు పట్టవచ్చు' అని చిదంబరం అనడం ఎంతో కొంత ఊరటే కదా? ఆయన మటుకు ఆయన గరిష్ఠంగా మూడునెలల వ్యవధి కోరుతున్నారు.

ఆ వ్యవధి సమస్య పూర్తి పరిష్కారానికి అనుకుంటే పొరపాటే. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న సంప్రదింపుల ప్రక్రియ ఒక కొలిక్కి రావడానికి అంత సమయం అవసరం పడవచ్చని ఆయన అంచనా. ఆ తరువాత, రాష్ట్ర విభజన బంతిని రాష్ట్రంలోకే విసిరిన చిదంబర విన్యాసాన్ని దృష్టిలో పెట్టుకుంటే, తక్కిన పార్టీలలో అటువంటి ప్రక్రియ ఎప్పుడు మొదలయ్యేను, ఎప్పటికి పూర్తయ్యేను? కాంగ్రెస్ ముందుగా చెబితేనే తాము చెబుతామని భీష్మించుకున్న తెలుగుదేశం పార్టీ అటువంటి సహకారం అందిస్తుందా? ముందు చెప్పినవాళ్లకు ఒక ప్రాంతంలో మేలు, మరో ప్రాంతంలో కీడు జరిగే అవకాశం ఉన్నప్పుడు - అధికారపార్టీని సంకటంలో పడేసే పరిస్థితిని ప్రతిపక్షం ఉపయోగించుకోకుండా ఉంటుందా? ఏతావాతా తేలేదేమంటే, సమస్య సశేషం. కనుచూపుమేరలో పరిష్కారం లేదు.

అందుకేనేమో శనివారం నాడు కెసిఆర్, 2014 గురించి మాట్లాడారు. రెండేళ్లే కదా, ఎక్కడికి పోతారు, అప్పుడు చూపిద్దాం తడాఖా - అన్నారాయన. ఎన్నికల రంగం ఆయనకు అనువైన క్షేత్రం. అందులో ఆయనకు స్థానబలం ఎక్కువ. వీధిపోరాటాలూ మిలియన్‌మార్చ్‌లూ - వీటిమీద ఆయనకు గురి తక్కువ. చొక్కాలు చింపుకుంటేనే ఉద్యమమా - అని పార్టీ పెట్టిన తొలిరోజుల్లోనే ప్రశ్నించిన కెసిఆర్‌ను, తెలంగాణ ఉద్యమం చాలా దూరం తీసుకువచ్చింది. ఆయన నాయకహోదాకు భంగం కలిగించకుండానే, పగ్గాలు మాత్రం పూర్తిగా ఆయన చేతిలో లేకుండా చేసే పరిణామాలు పదేళ్లలో చాలానే జరిగాయి.

రాజకీయమైన లాబీయింగ్, ఎన్నికల పోరాటం- ఈ రెంటినే నమ్ముకోవడం కానీ, రాజకీయపార్టీలతో నిమిత్తం లేకుండా కేవలం ప్రజా ఉద్యమాల మీదనే ఆధారపడడం కానీ తెలంగాణ వంటి ఆకాంక్షల విషయంలో సరికాదని, రెంటినీ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలనీ కూడా అవగాహన పెరిగింది. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర నిర్వహిస్తున్న రకరకాల జెఏసీలు - ఈ అవగాహననే సూచిస్తాయి. అయితే, ఇప్పటికీ, ప్రధాన స్రవంతి రాజకీయాలకూ, ప్రజా ఉద్యమాలకూ నడుమ అంతర్గత వైరుధ్యమూ ఘర్షణా తీవ్రంగానే కనిపిస్తున్నాయి.

సకలజనుల సమ్మె - ఒక సరికొత్త భావన. ప్రజా ఉద్యమాలు కొత్త పోరాట రూపాలను సృష్టించుకున్నట్టే, కొత్త పదాలను, పదబంధాలను కూడా సృష్టిస్తాయి. అటువంటి వాటిలో సకలజనుల సమ్మె కూడా ఒకటి. 'చలో సీఎం ఇల్లు ముట్టడి' అని ఎమ్మార్పీస్ మొదటిసారి పిలుపు ఇచ్చినప్పుడు కూడా ఆ పదబంధం ఇంతే కొత్తగా వినిపించింది. తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించేవారు కూడా ముచ్చటపడవలసిన పోరాట రూపం సకలజనుల సమ్మె. ఈ నెల రెండో పక్షం లో ప్రారంభమయ్యే ఈ సమ్మె తెలంగాణ ఉద్యమానికి మరింత తీవ్రతను, ప్రభుత్వంపై మరిం త ఒత్తిడిని కలిగించనున్నది. ఉద్యమంలో తమ భాగస్వామ్యం కోసం, ఉద్యమఫలితాలలో తమ వాటా కోసం పోటీపడుతున్న విభిన్న రాజకీయశక్తులు పరస్పరం విధించుకుంటున్న ఒత్తిడుల మధ్య ఈ సమ్మె జరుగనున్నది.

తెలంగాణకు చెందిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు రాజీనామాలు చేయడంతో మొదలైన రాజకీయ ఒత్తిడి, కాంగ్రెస్ రాజీనామాలతో పుంజుకున్నది. ఎంతో కష్టం మీద ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారని, వారు దారితప్పకుండా చూడడమే తమ పని అని తెలంగాణ ఉద్యమనాయకులు బహిరంగంగానే చెప్పారు. రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలకు మద్దతుగా కావచ్చు, వారు జారిపోకుండా దిగ్బంధనం చేయడానికి కావచ్చు, విస్త­ృతమైన ఉద్యమకార్యాచరణను వివిధ వేదికలు ప్రకటించాయి. అందులో భాగంగానే సకలజనుల సమ్మె ప్రతిపాదన ముందుకు వచ్చింది.

రాజకీయపార్టీలకూ ప్రజా ఉద్యమాలకూ ఉండవలసిన సంబంధం రీత్యా ఈ వ్యూహం ప్రశంసనీయమే. పైకి వినిపిస్తున్న ప్రకటనలను పరిగణనలోకి తీసుకుంటే, రాజకీయశక్తుల మధ్య పరస్పరమైన ఒత్తిడి ఇంకా పనిచేస్తూనే ఉన్నది. కానీ, మారిన పరిస్థితులలో, రాజకీయవాదుల కట్టుబాటు సందేహాస్పదం అయిన నేపథ్యంలో సమ్మె ప్రాసంగికత ఎంత, ఫలితం ఎంత అన్నది చర్చనీయాంశాలుగా మారాయి. శాసనసభ్యుల రాజీనామాలను స్పీకర్ తిరస్కరించారు. మళ్లీ రాజీనామాలు చేయాలన్న డిమాండ్ కానీ, చేసే యోచనగానీ బలంగా కనిపించడం లేదు.

గతంలో మొదట రాజీనామా చేసి కాంగ్రెస్‌వారిని అనివార్యస్థితికి నెట్టినట్టు, తెలుగుదేశం శాసనసభ్యులు ఈ సారి కూడా చేస్తారా? చేయగలరా? సోనియా అనారోగ్యం వార్తలు వచ్చిన తరువాత కూడా కాంగ్రెస్ తెలంగాణ ఎంపీలు లోక్‌సభకు వెళ్లకుండా పట్టుదల చూపిస్తున్నారు కానీ, భావోద్వేగాలతో చేసినవన్న కారణం చెప్పి వారి రాజీనామాలను లోక్‌సభ స్పీకర్ నిరాకరిస్తే అప్పటి పరిస్థితి ఏమిటి? మళ్లీ రాజీనామాలు చేస్తారా? సోనియా అస్వస్థులై ఉన్నప్పుడు పార్టీని, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టకూడదని భావిస్తారా? అప్పుడు సమ్మెకు, ఉధృత ఉద్యమానికి దిగిన ఉద్యోగులు, విద్యార్థుల పరిస్థితి ఏమిటి? రాజీనామాల నడుమ, రాష్ట్రంలో మళ్లీ మొదలయిన ఆత్మహత్యల నడుమ కూడా చిదంబరం ద్వారా నిమ్మకు నీరెత్తినట్టు మాట్లాడించిన కేంద్రం వైఖరిని గమనించిన తరువాత, సమ్మెను అణచివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సకల సన్నాహాలను చూస్తున్న తరువాత- సకలజనుల సమ్మె సమయమూ సందర్భమూ ఉచితమైనదే అవుతుందా? నిజంగానే నిజంగానే అది అంతిమ ఫలితం ఇస్తుందా? నిజానికి రాజీనామాల వంటివి ఒక పరాకాష్ట దశలో చేపట్టవలసిన బ్రహ్మాస్త్రాలు.

తెలంగాణ ఉద్యమం తీరుతెన్నులేమిటో కానీ, బ్రహ్మాస్త్రాల దాకా వెళ్లి, తిరిగి వంటావార్పులకు దిగవలసివచ్చిన సందర్భాలు అనేకం. ప్రజల్లో ఆకాంక్ష , సహనం బలంగా ఉండడం వల్ల ఎన్నిసార్లైనా మళ్లీ మొదటికి రావడానికి సంకోచించడంలేదు. సకలజనుల సమ్మె వంటి అత్యున్నత ఉద్యమరూపం పూర్తిగా విజయవంతం కాకున్నా, విఫలం అయినా, ఫలితాలను సాధించలేకపోయినా- ప్రజల్లో కలిగే నిస్ప­ృహ అధికంగా ఉంటుంది. సహాయనిరాకరణ సందర్భంగా, ఒంటరిగా ఉద్యమం బరువును మోయవలసివచ్చిన గుణపాఠం ఉద్యోగవర్గాలకు ఉన్నది.

తెలంగాణ కోసమే పుట్టిన రాజకీయపార్టీ, పదేళ్లు గడచినా, క్షేత్రస్థాయిలో కార్యకర్తలను నిర్మించుకోవడానికి, పార్టీకి వివిధ అంచెల యంత్రాంగాన్ని ఏర్పరచుకోవడానికి విముఖంగా ఉన్న స్థితిలో తెలంగాణ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మాత్రమే ఉద్యమానికి స్థిరమైన బలగంగా ఉంటూ వచ్చారు. ఫలితంగా వచ్చిన కష్టనష్టాలను భరిస్తూ వచ్చారు. ఇంకా ఆ పరిస్థితి కొనసాగవలసిందేనా- అన్న ప్రశ్నలు ఉద్యోగనేతల నుంచే వినిపిస్తున్నాయి.

వివిధ రాజకీయశక్తులు, అనేక జేఏసీలు, వాటి మధ్య సామాజికకోణం నుంచి, నాయకత్వ పోటీ నుంచి అనేక వైరుధ్యాలు. ఇవి కాక- ఉభయప్రాంతాల రాజకీయనేతల మధ్య వాగ్యుద్ధాలు, ఆత్మాహుతిదళాల, ఆత్మరక్షణదళాల ప్రకటనలు, తెలంగాణ రాకపోతే విషం పుచ్చుకుని చస్తానని బాధ్యతారహితంగా మాటతూలే ఉద్యమనేతలు, సమ్మెకు సహకరించకపోతే భౌతికదాడులు చేయాలనే పిలుపులు, ప్రతిదాడులు చేస్తామనే స్పందనలు- ఇవన్నీ తెలంగాణ సమస్యను మరింత సంక్లిష్టమూ ప్రమాదభ రితమూ చేస్తున్నాయి. ఎట్లాగైనా హింస జరిగేట్టు చూసి అణచివేయాలని ప్రభుత్వం చూస్తున్నది- అని కలవర పడుతున్న తెలంగాణవాదులూ ఉన్నారు.

ఎంతకాలమిట్లా, ఏదైనా గట్టిగా చేయాలని అసహనంతో ఉన్న ఉద్యమకారులూ ఉన్నారు. మీడియాలో వచ్చే ప్రకటనలు చూసే గుండెలు పగులుతున్న యువకులూ ఉన్నారు. అయ్యా, హింసకు మాటల్లోనూ చేతల్లోనూ ఆస్కారం ఇవ్వకండి, ఒక చిన్న సంఘటన జరిగిందా, ఉద్యమం మళ్లీ నలభయ్యేళ్ల వెనక్కి వెడుతుంది- అని హితవు చెప్పే పరప్రాంతీయులూ ఉన్నారు. ఎంతకాలమిట్లా, ఎమ్మెల్యే అయినప్పటి నుంచి అధికారం అనుభవించిందీ లేదు, నాలుగు డబ్బులు చూసిందీ లేదు- అని చిరాకుపడుతున్న స్వప్రాంతీయనేతలూ ఉన్నారు. వీటన్నిటి మధ్య తెలంగాణ నివురుగప్పిన నిప్పులాగా ఉన్నది.

ఇక సామాన్యుడేమంటున్నాడు? ఆత్మత్యాగాలు ఆత్మహత్యలు వద్దు. పారిన రక్తం చాలు. ఆత్మహింసా వద్దు పరహింసా ప్రగల్భాలూ వద్దు. అసలు ఆ మాటలే వద్దు. ఐక్యంగా ఉండండి, ఉద్యమాన్ని నిలబెట్టండి, వాస్తవికతను బట్టి వ్యూహాలను రచించండి. విజయం ఎప్పుడు లభిస్తుందో, అసలు లభిస్తుందో లేదో మీ మనసుకు ముందే తెలిస్తే దాన్ని ప్రజలకు చెప్పండి. 2014 నిజమయితే, అదే చెప్పండి. అప్పటిదాకా సహనం ఇచ్చే కార్యక్రమం ఇవ్వండి. ఒకరినొకరు ఎగదోసుకునే క్రీడకు స్వస్తి చెప్పండి. మరింతమంది మిత్రులను కూడగట్టుకోండి. ఉద్యమాన్నీ రాజకీయాన్ని రెండుపట్టాల మీద కుదురుగా నడపండి. మభ్యపెట్టకండి.

చైనాదాకా వస్తే..


తనదాకా వస్తే కానీ తత్త్వం బోధపడదు- అన్న సూక్తిని ఇప్పుడు చైనా నిజం చేస్తోంది.పాకిస్తాన్ బీభత్సం గురించి ఇప్పుడు చైనా ప్రభుత్వం నిరసన తెలుపుతోంది. గత నెల చివరి రెండురోజులలో చైనాలోని సింకియాంగ్-ఝింజియాంగ్-ప్రాంతంలో జిహాదీ బీభత్సకారులు జరిపిన హత్యాకాండకు దాదాపు ఇరవైమంది ‘హాణ్’ చైనీయులు బలైపోయారు. చైనీయ భాష మాట్లాడేవారు హాణ్ చైనీయులు. సింకియాంగ్‌పై చైనా దురాక్రమణ కొనసాగుతోందని భావిస్తున్న ఇస్లాం మతస్థులు ‘హూణ్’ తెగకు చెందినవారు. శతాబ్దుల తరబడి చైనాలో కలసిపోయిన సింకియాంగ్ ప్రాంతాన్ని మళ్లీ స్వతంత్ర దేశంగా రూపొందించాలన్న లక్ష్యంతో జిహాదీలు, వారి మద్దతుదారులు బీభత్సకాండను కొనసాగిస్తుండడం నడుస్తున్న చరిత్ర. జిహాదీ బీభత్సకారులు దాడి చేయడం ఇది మొదటిసారి కాదు. దాదాపు రెండు దశాబ్దులుగా చిటపటలను కలిగిస్తున్న జిహాదీలు ఐదేళ్లుగా తరచుగా పటపటలను ప్రజ్వరిల్లచేస్తున్నారు. అయితే ఈ బీభత్సకాండ వెనుక పాకిస్తాన్ ప్రభుత్వం విభాగాల హస్తం ఉందని చైనా ప్రభుత్వం ఆరోపించడం మాత్రం ఇదే మొదటిసారి! 2008 ఆగస్టులో జిహాదీలు జరిపిన దాడులకు ఇరవై ఏడుమంది హాణ్ చైనీయులు బలైపోయిన తరువాత, చైనా ప్రభుత్వం అనుమానం ఉన్న ముస్లింలను తీవ్రంగా అణచివేసే కార్యక్రమం ఆరంభించింది. జిహాదీ టెర్రరిస్టులన్నసాకుతో సాధారణ ముస్లిం ప్రజలను సైతం సైనిక దళాలు, పోలీసులు భారీగా మట్టుపెట్టినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. చైనా సైనిక దళాలవారు ఈ ఆరోపణలను లక్ష్యపెట్టకుండా అమిత కర్కశంగా అనేక వారాలపాటు బీభత్స వ్యతిరేక కలాపాలను కొనసాగించారు. బీభత్సకారులకు స్థావరాలుగా మారిపోయాయన్న అనుమానంతో ఝింజియాంగ్ ప్రాంతంలోని అనేక మసీదులలోకి పోలీసులు సైనికులు చొరబడి గాలింపు చర్యలను జరిపారు. కొన్ని మసీదులను నేలమట్టం కూడ చేశారు. ఈ ప్రభుత్వ చర్యల కారణంగా ఆగ్రహించిన ముస్లింలు- ఉయఘర్‌లు-ఫెద్దఎత్తున నిరసనలు తెలిపారు, ప్రదర్శనలు జరిపారు. చరిత్రలో హూణులుగా ప్రసిద్ధి చెందిన వారిని ప్రస్తుతం సింకియాంగ్‌లో ‘ఉయిఘర్’లని పిలుస్తున్నారు! జిహాదీలు ఒకవైపు, చైనా ప్రభుత్వ భద్రతాదళాలు మరోవైపు సృష్టించిన భయోత్పాతం చివరికి ఉయిఘార్‌లకు, హాణ్ చైనీయులకు మధ్య మత కల్లోలాలకు దారి తీసింది! ఇంత జరిగినప్పటికీ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని మాత్రం చైనా ప్రభుత్వం అప్పుడు విమర్శించలేదు. అంతేకాక 2009లో పెద్దఎత్తున చెలరేగిన మతకల్లోలాల సందర్భంగా కూడ చైనా ప్రభుత్వం పాకిస్తాన్‌ను నిందించలేదు! ఇప్పుడు మళ్లీ మొదలైన జిహాదీ దాడుల తరువాత చైనా ప్రభుత్వ వైఖరి మారి పోయింది!
సింకియాంగ్‌లోని పట్టుబాట - సిల్క్‌రోడ్- ను ఆనుకుని ఉన్న కష్గర్ నగరంలో గతనెల 30వ, 31వతేదీలలోహత్యాకాండ జరిపినవారు పాకిస్తాన్‌లోని శిబిరాలలో శిక్షణ పొందిన వారని చైనా ప్రభుత్వం ఆరోపించింది. టెర్రరిస్టులను అణచివేసే కార్యక్రమాన్ని, గాలింపు చర్యలను సింకియాంగ్ ప్రాంతీయ పోలీసులు, చైనా సైనికులు మళ్లీ ముమ్మరం చేయడం వేరుసంగతి. 2009లో జరిగిన విధంగా సింకియాంగ్‌లో హూణుల -ఉయిఘర్‌లు- కూ, హాణచైనీయులకూ మధ్య మత కల్లోలాలు చెలరేగే ప్రమాదం కూడ ఉందన్నది జరుగుతున్న ప్రచారం! 2009 జూలై నాటి మత కల్లోలాలకు దాదాపు రెండు వందలమంది బలైపోయారు. వీరిలో అత్యధికులు ముస్లిమేతరులు. ఆ తరువాత చైనా ప్రభుత్వ దళాలు రంగంలోకి దిగి జరిపిన కాల్పులలో ఎక్కువ మంది ఉయిఘర్లు మరణించారట. అదే కథ ఇప్పుడు పునరావృత్తం అయినట్టయితే ఆశ్చర్యపోనక్కరలేదు. కానీ ఇంతకాలం పాకిస్తాన్‌లోని జిహాదీ బీభత్స ముఠాలను, వాటిని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్స స్వభావాన్ని నిరసించని చైనా ప్రభుత్వం అకస్మాత్తుగా పాకిస్తాన్‌ను దూషించడమే ఆశ్చర్యకరం! మన దేశానికి వ్యతిరేకంగా దశాబ్దులుగా పాకిస్తాన్ ప్రభుత్వం జరిపిస్తున్న బీభత్సకాండ ను చైనా ప్రభుత్వం ఇంతవరకు నిరసించలేదు సరికదా కనీసం ప్రస్తావించలేదు! పైపెచ్చు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి పదకొండు వేలమంది సైనికులను పంపించడం ద్వారా చైనా ప్రభుత్వం పాకిస్తాన్ భీభత్స ప్రభుత్వానికి బాసటగా నిలిచింది!
భారత వ్యతిరేక జిహాదీ బీభత్సకాండను మాత్రమేకాదు, ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న మతోన్మాద మారణకాండను సైతం చైనా ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు! 1989, 2005 సంవత్సరాల మధ్య సూడాన్‌లో ఉమర్ అల్ బషీర్ నాయకత్వంలోని మతోన్మాద సైనిక ప్రభుత్వం లక్షలాదిమంది ముస్లిమేతర ప్రజలను ఊచకోత కోయించింది. ఈ మత విద్వేషాలు కారణంగానేఇటీవల సూడాన్ మత ప్రాతిపదికపై రెండుగా చీలిపోయింది! కానీ దశాబ్దులపాటు చైనా ప్రభుత్వం సూడాన్‌లోని ఇస్లాం మత ప్రభుత్వాన్ని సమర్థ్ధించింది. చైనా మద్దతు కారణంగానే అమెరికా తదితర పాశ్చాత్య దేశాల ప్రభుత్వాల వారు ఉమర్ బషీర్‌ను ఏమీ చేయలేకపోయారు. ప్రజలను సామూహికంగా హత్యలు చే యించిన నేరానికి బషీర్‌ను అరెస్టు చేసి విచారణ జరిపించాలన్న అంతర్జాతీయ నేర నిరోధక న్యాయస్థానం-ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్-వారి ప్రయత్నాలు కూడ చైనా ప్రభుత్వం ప్రతిఘటించిన కారణంగానే వమ్మయిపోయాయి! ఇప్పుడు జిహాదీల ప్రమాదాన్ని చైనా కూడ గుర్తించిందన్న సత్యం పాకిస్తాన్‌కు నిరసన తెలపడం ద్వారా స్పష్టమైంది! చైనా ప్రభుత్వం నిరసన తెలియచేయగానే పాకిస్తాన్ నాయకులకు వెన్నున వణుకు పుట్టుకురావడం మన ప్రభుత్వం పరిశీలించి పాఠం నేర్చుకోదగిన పరిణామం. సింకియాంగ్‌లో దాడులుజరిపింది పాకిస్తాన్‌లో తర్ఫీదు పొందిన బీభత్సకారులేనని స్థానిక ప్రభుత్వం ప్రకటించగానే పాకిస్తాన్ ప్రభుత్వ నిఘా విభాగం-ఇంటర్‌సర్వీసెస్ ఇంటలిజెన్స్-ఐఎస్‌ఐ-అధిపతి షుజాపాషా చైనా రాజధాని బీజింగ్‌కు పరిగెత్తుకుని పోయాడు ! తమదేశంలోని టెర్రరిస్టులను పట్టి చైనాకు అప్పచెప్పగలమని ఇస్లామాబాద్‌లో పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖవారు చైనా అడగకుండానే హామీ ఇచ్చారు. మన ప్రభుత్వం వలె ప్రాధేయపడే ధోరణిలో కాక ఆదేశించే ధోరణిలో చైనా ప్రభుత్వం ప్రవర్తిస్తుండడమే పాకిస్తాన్ ప్రభుత్వం మోకరిల్లుతుండడనికి కారణం! చర్చల మార్గం ద్వారా కాక, చర్యల బాట ద్వారానే పాకిస్తాన్ దారికి వస్తుందన్నది కాష్గర్ బీభత్సకాండ తరువాతి పరిణామాలు స్పష్టం చేస్తున్న విషయం. టిబెట్ వలెనే ఝింజియాంగ్ కూడ చైనాలో భాగం కాదు! తూర్పు తురుష్క స్థానంగా చరిత్రలో ప్రసిద్ధికెక్కిన ఈ ప్రాంతాన్ని పంతొమ్మిదవ శతాబ్దిలో చైనా పూర్తిగా ఆక్రమించుకుంది, 1959లో టిబెట్‌ను ఆక్రమించింది. ఈ రెండు ప్రాంతాలలోను స్వతంత్ర ఉద్యమాలు బలం పుంజుకుంటున్నాయి. కానీ సింకియాంగ్‌లో బీభత్సకారులను, టిబెట్‌లో ఉద్యమకారులను చైనా ప్రభుత్వం కర్కశంగా అణచివేస్తోంది! కాశ్మీర్ మనదేశంలో అనాదిగా భాగం! అలాంటి కాశ్మీర్‌ను దేశంనుండి విడగొట్టాలని కుట్ర పన్నుతున్న ముఠాల పట్ల మన ప్రభుత్వం మాత్రం మెతక వైఖరిని ప్రదర్శిస్తోంది .