టార్గెట్లే నియంత్రణకు అవరోధం వ్యాపారులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు ఎక్సైజ్‌శాఖ జెఎసి ఆరోపణ
December 24th, 2011
హైదరాబాద్, డిసెంబర్ 23: మద్యం సిండికేట్లు ఎక్సైజ్‌శాఖను శాసించేస్థాయికి చేరుకున్నాయని, వాటివల్లనే తమ శాఖకు చెడ్డపేరు వస్తోందని ఎక్సైజ్‌శాఖ జెఎసి ఆరోపించింది. ప్రభుత్వం తన ఆదాయం పెంచుకోవడం కోసం మద్యం అమ్మకాలకు టార్గెట్స్ పెట్టిందని, దీనివల్లనే వ్యాపారులు నిబంధనలను ఉల్లంఘించినా చూసీ చూడనట్లుగా వ్యవహరించాల్సి వస్తుందని ఎక్సైజ్ జెఎసి పేర్కొంది. ఎక్సైజ్‌శాఖకు చెందిన ఎగ్జిక్యూటివ్ అఫీసర్స్ సంఘం, గెజిటెడ్ అధికారుల సంఘం, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్స్ సంఘాలు కలిసి శుక్రవారం హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఉద్యోగుల జెఎసిగా ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా జెఎసి చైర్మన్‌గా ఎన్నికైన ఎస్‌ఎం రామేశ్వర్‌రావు, సెక్రటరీ జనరల్ ఆర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, తాజాగా ఎక్సైజ్‌శాఖపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు. మద్యం అమ్మకాలు పెంచడం ద్వారా ప్రభుత్వం తన ఆదాయం పెంచుకునేందుకు తమకు టార్గెట్స్‌ను విధించిందని, దీనివల్ల వ్యాపారులు నిబంధనలను ఉల్లంఘించినా కఠినంగా వ్యవహరించలేదని వారు వాపోయారు. పైగా తమశాఖకు సిబ్బంది కొరత వేధిస్తోందని దీనిని కూడా సిండికేట్లు తమకు సానుకూలంగా మలుచుకుని నిబంధనలను ఉల్లంఘించిన మాట వాస్తవమేనని వారు అంగీకరించారు. ఇక నుంచి అలా జరగకుండా కఠినంగా వ్యవహరించక తప్పదని రామేశ్వర్‌రావు హెచ్చరించారు. ఎమ్మార్పీ రేట్లు, మద్యం షాపుల సమయపాలన, విడి అమ్మకాలపై దృష్టి సారించి మద్యం సిండికేట్ల ఆటకట్టిస్తామని వారు పేర్కొన్నారు. మద్యం సిండికేట్లకు,తమ సిబ్బందికి ఎలాంటి సంబంధం లేదని వారు ఖండించారు. సిబ్బంది కొరత, వనరులు, సౌకర్యాలు కల్పించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
No comments:
Post a Comment