Tuesday, November 29, 2011

చిదంబర రహస్యం

January 1st, 2011

‘చిదంబర రహస్యం’ గురించి వినివిని అదేమిటో తెలుసుకుందామని పోయినవాళ్లకు చిదంబరం గుళ్లో ఒక తెర కనపడుతుంది. దాని వెనక ఆకాశలింగం ఉన్నదంటారు. కాని ఏమీ కనపడదు. అదేమంటే శివుడున్నది ఆకాశరూపంలో కదా, అందుకని కంటికి కనపడడంటారు.
శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు కూడా అలాంటి చిదంబర రహస్యమే.
కమిటీ రిపోర్టు డిసెంబరు 31 కల్లా ఠంచనుగా వచ్చేస్తున్నదనేసరికి రాష్ట్రంలో ఎక్కడెక్కడి వారికీ బ్లడ్‌ప్రెషరు పెరిగింది. తెలంగాణపై తాడోపేడో తేలిపోతుంది; తెలంగాణ ఇవ్వాలన్నా, వద్దన్నా అటో ఇటో భూమి బద్దలవుతుంది; రాష్ట్రం అల్లకల్లోలమవుతుంది కాబోలని తెలివిలేనివాళ్లు తల్లడిల్లిపోయారు. చేతికందిన నివేదికను అఖిలపక్ష భేటీలో బట్టబయలు చేస్తామని చిదంబరామాత్యుడు అనేసరికి ఇప్పుడందరూ ఊపిరి ఉగ్గబట్టుకుని జనవరి 6 మీద దృష్టి పెట్టారు. ఆ రోజున ఏమి తేలుతుందో, కొంపలెక్కడ మునుగుతాయోనని చాలా మంది తెగ హడలి చస్తున్నారు.
ఇది అనవసరపు భయం. ఆ రోజున ఏమీ తేలదు. ఎవరి కొంపా మునగదు. పేరు గొప్ప కమిటీ రిపోర్టులో ఏమీ లేదన్నదే చిదంబరం పెట్టిన పార్టీల పేరంటంలో బయటపడబోయే ‘చిదంబర రహస్యం’!
ఇది చెప్పటానికి దివ్యదృష్టి అక్కర్లేదు. కొంచెం కామన్‌సెన్సు ఉంటే చాలు.
తెలంగాణ ఇవ్వాలన్నా, ఇవ్వవద్దన్నా మొట్టమొదట మునిగేది కాంగ్రెసు కొంప. తెలంగాణ ఇస్తే సీమాంధ్రలో దానికి ఉప్పు పుట్టదు. ఇవ్వకపోతే తెలంగాణలో దానికి పుట్టగతులుండవు. ఇచ్చినా- గతిలేక ఇచ్చారనే తెలంగాణ వాళ్లు అనుకుంటారు; కె.సి.ఆర్.కే వీరపూజ చేస్తారు తప్ప కాంగ్రెసును ఏనుగు అంబారీమీద ఊరేగించి నెత్తినెక్కించుకోరు.
కాబట్టి ఏమీ తేలకుండా ఉండటమే కాంగ్రెసు వారికి కావలసింది. తెలంగాణను ఇచ్చెయ్యమనో, ఇవ్వవద్దనో శ్రీకృష్ణ కమిటీ కరాఖండిగా చెబితే... ఆ సంగతి బయటికొస్తే కాంగ్రెసు ప్రభువులు ఇరుకున పడతారు. కమిటీ చెప్పిన ప్రకారం అడుగు వేయకపోతే పాలకపక్షానికి పరువు దక్కదు. ఏదో ఒక ప్రాంతం ప్రజలు మొగాన పేడ నీళ్లు కొట్టక మానరు. దానికి భయపడి అడుగువేస్తే రెండో ప్రాంతం వాళ్లు అదే సత్కారం చేయకుండా ఉండరు. ఏమి చేసినా, చేయకున్నా తంటాయే అవుతుంది. అలాంటి సంకటాన్ని తెలివిమీరిన చిదంబరం కోరి కొని తెచ్చుకోడు. కమిటీ రిపోర్టులో తమను ఇబ్బందిపెట్టే అంశమేదైనా ఉంటుందన్న అనుమానం ఏకోశాన ఉన్నా చూస్తాం, ఆలోచిస్తాం, త్వరలో చెబుతాం అనే ఆయన దాట వేస్తాడు. అలా కాకుండా రిపోర్టు ఈ చేత్తో అందుకుని, ఆ చేత్తో బయటపెట్టేస్తానని బేఫర్వాగా అనడాన్నిబట్టే అందులోని సరుకు గురించి సర్కారుకు ఎలాంటి దిగులూ లేదని స్పష్టం.
కమిటీ రిపోర్టులో ఏమున్నదో చదివితే గదా తెలిసేది? మీడియా వాళ్లందరి ముందూ కమిటీ వాళ్లు రిపోర్టు తన చేతిలో పెట్టగానే, దాని అట్ట అయినా తీసి చూడకుండానే అన్ని పార్టీల్నీ పిలిచేస్తాం, రిపోర్టు చూపిస్తాం అని చిదంబరం ఏ ధీమాతో అన్నాడు? తీరిగ్గా చదివి, ఏమి చేయాలన్నది ఆలోచించి ఏ మూడు నెలల తరవాతో చెబుతామని హోంమంత్రి అన్నా ఎవరూ ఆక్షేపించగలిగే వాళ్లు కాదు. ఆ వెసులుబాటు తీసుకోకుండా వారానికల్లా రిపోర్టు అందరి ముందూ పెట్టేస్తామని అక్కడికక్కడే ఆయన ఎందుకు ప్రకటించేశాడు? తీరా తెరిచి చూశాక ఇరకాటం ఎదురవుతే ప్రభుత్వం పులుసులో పడదా?
పడదు. ఆ సంగతి చిదంబరానికి బాగా తెలుసు. రిపోర్టులో ఏమున్నదీ అతీంద్రియ శక్తితో గ్రహించి కాదు. రిపోర్టు కాపీని ముందురోజే రహస్యంగా తెప్పించుకుని చదివాడేమోననీ అనుమానించక్కరలేదు. శ్రీకృష్ణకమిటీకి పురమాయించిన పని ఏమిటన్నది ఒక్కసారి గుర్తు చేసుకుంటే చాలు చిదంబర రహస్యం మిస్టరీ ఇట్టే తెలిసిపోతుంది.
కమిటీకి ఇచ్చిన పరిశీలనాంశాలు ఇవి:
1. తెలంగాణ రాష్ట్ర వేర్పాటు డిమాండు దృష్ట్యా రాష్ట్రంలో పరిస్థితిని పరీక్ష చెయ్యటం.
2.రాష్ట్రం పుట్టినప్పటి నుంచీ నడిచిన పరిణామాలను, వివిధ ప్రాంతాల అభివృద్ధిపై వాటి ప్రభావాలను సమీక్షించటం.
3.మహిళలు, పిల్లలు, విద్యార్థులు, మైనారిటీలు, ఎస్.సి.లు, ఎస్.టి.లు తక్కుంగల వర్గాల ప్రజలపై ఇటీవలి పరిణామాల ప్రభావాన్ని పరీక్షించడం.
4. పైన పేర్కొన్న మూడు విషయాలను పరిశీలించేటప్పుడు పట్టించుకోవలసిన కీలకాంశాలను గుర్తించటం.
5. అన్ని వర్గాల ప్రజలను, అన్ని రాజకీయ పార్టీలను, ఇతర సంస్థలను పై విషయాల్లో సంప్రదించి ప్రస్తుత క్లిష్ట పరిస్థితిని ఎలా గట్టెక్కాలన్న దానిపై అభిప్రాయాలు సేకరించటం.
6. పరిశ్రమ, వ్యాపార, కార్మిక, కర్షక సంస్థలను, మహిళా, విద్యార్థి సంఘాలను సంప్రదించి, వివిధ ప్రాంతాల అభివృద్ధికి ఏమి చేయాలంటారని అభిప్రాయాలను పోగెయ్యటం.
7. ఉచితమని తోచిన సలహాలు, సిఫార్సులు ఇవ్వడం.
ఇంతే సంగతులు.
వీటిలో తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలో వద్దో తేల్చమని కమిటీని అడిగిందెక్కడ? ఇవ్వాల్సి వస్తే ఎలా ఇవ్వాలో, ఏమి చెయ్యాలో చెప్పమని కోరిందెక్కడ? ఏ కమిటీ అయినా తనకు అప్పగించిన పనినే, అప్పగించిన మేరకే కదా చేసేది? అందరినీ కలవమన్నారు. కలిసింది. అభిప్రాయాలు సేకరించమన్నారు. కట్టల కొద్దీ రాబట్టింది. వారలా అన్నారు, వీరిలా అన్నారు, కావాలంటే అలా చేయొచ్చు, కాదనుకుంటే ఇలా కూడా చేయొచ్చు. ఏమి చేస్తారన్నది మీ ఇష్టం అని చేటభారతమంతటి రిపోర్టులో కమిటీ చివరికి చేట కొడుతుంది. దాంతో కథ మళ్లీ మొదటికొస్తుంది. నిరుడు జనవరి 5 ఢిల్లీ అఖిలపక్ష పేరంటంలో వదిలేసిన చోటికి రేపు జనవరి 6 అఖిలపక్షం పేరంటంలో తెలంగాణ వ్యవహారం మళ్లీ చేరుతుంది. రిపోర్టు దాఖలుతో కమిటీ పేరిట 11 నెలలపాటు సాగిన విరామ సంగీతం ముగుస్తుంది. మళ్లీ పార్టీకి ఇద్దర్ని చొప్పున ఢిల్లీ పేరంటానికి పిలిచారు కనుక ప్రతి పార్టీ షరామామూలుగా, రెండునోళ్లతో, రెండు నాలికలతో మాట్లాడుతుంది. చివరికి ఏదీ తేల్చలేక అంతా కలిసి ఇంకో కమిటీనో, కమిషనునో ఆవాహన చేసి సరికొత్త విరామ సంగీతం మొదలెట్టిస్తారు. పార్టీలూ హాపీ, చిదంబరమూ హాపీ. జనానికి జోల. కాంగ్రెసుకు హేల. పార్టీల పవరు పాలిటిక్సు షరామామూలు. ప్రజల చెవిలో పూలు. భలే!
-సాక్షి

యువర్ అటెన్షన్ ప్లీజ్...

---సాక్షి

తెలంగాణ ఎక్కదలిచిన రైలు ఒక జీవితకాలం లేటు
మరికాసేపట్లో ప్లాట్‌ఫాం మీదికి వస్తుందని అనౌన్స్‌మెంటు అయిన రైలు రావడం అరగంటో గంటో ఆలస్యమైతేనే జనానికి చెడ్డచిరాకు వేస్తుంది. అదిగో వచ్చేస్తున్నదని 2009లో అనౌన్స్‌మెంటు అయిన స్టేట్ ఎక్స్‌ప్రెసు ఏణ్నర్థందాటినా ఇంకా అజాపజా లేదంటే చూచిచూచి కళ్లు కాయలు కాచిన తెలంగాణ జనానికి ఇంకెంత చిర్రెత్తాలి?
మామూలు రైలు ఎనౌన్స్ చేశాక కూడా లేటుఅవటానికి బలమైన కారణాలే ఉండొచ్చు. అనుకోని అవాంతరాలను నివారించటం ఎవరి చేతుల్లోనూ ఉండకపోవచ్చు. తెలంగాణ బండి సంగతి వేరు. దానికి ఢిల్లీ స్టేషనులో సిగ్నలు ఇవ్వకుండానే, ఇంకా కూత వెయ్యకముందే, అదిగో వచ్చేస్తోందని హైదరాబాదులో దొంగ అనౌన్స్‌మెంట్లు వరసపెట్టి మొదలవుతాయి. ఆడ నుంచి ఈడ దాకా అంతా బూటకమే; అందరిదీ నాటకమే.
జగమెరిగిన కె.సి.ఆర్. దీక్షతో తాజా అంకం ఆరంభం. అసలా దీక్షే నాటకమని గిట్టనివారి అభియోగం. దీక్షవల్ల తెలంగాణ అట్టుడుకుతున్న సమయాన ‘సైకిల్’బాబులోని సహజనటుడు బయటికి వచ్చాడు. తెలంగాణ తీర్మానం మీరు పెడతారా, నన్ను పెట్టమంటారా అని అసెంబ్లీలో సర్కారును ఎంచక్కా నిలదీశాడు. అది చూసి ఢిల్లీ దర్శకులు కారక్టర్ యాక్టర్ రోశయ్యకు చెప్పి ఆల్ పార్టీ పేరంటం పెట్టించారు. అన్ని పార్టీల వాళ్లూ తమతమ నటనా కౌశలాన్ని చూపించి తెలంగాణకు ఓకే కోరస్ పాడారు. అక్కడితో తెరదించకుండా, ‘సరే అయితే తెలంగాణ ఇచ్చేస్తున్నాం’ అని డైరక్టర్లు పిడుగులాంటి డైలాగు వేశారు. దాంతో రాష్ట్ర నటులకు కళ్లు తిరిగాయి. నాటకం డైలాగును పట్టుకుని నిజమంటే ఎట్లా అని వాళ్లు తెగ గింజుకున్నారు.
అక్కడి నుంచి ఢిల్లీ డ్రామా రసకందాయంలో పడింది. అసలు ప్లాట్‌ఫాం మీదికే తేని తెలంగాణ బండికి ఉత్తుత్తి సిగ్నల్ ఇచ్చినట్టు నటించి మేటి నటుడు చిదంబరం మాయ ప్రకటన చేశాడు. ‘హత్తెరీ’ అని సీమాంధ్ర నటులు- అనుకున్నట్టే దారికాచి పట్టాలకు అడ్డంపడ్డారు. రాని రైలును ఆపేసినట్టు నానాగత్తర అయ్యాక - ఎందుకు ఆగిందో, ఏమి చెయ్యాలో కనుక్కోమని శ్రీకృష్ణా అండ్ కంపెనీకి వేషాలేసి పంపారు. విచారణ ఘట్టాన్ని ఏడాది రక్తి కట్టించాక, కర్ర విరగకుండా, పాము చావకుండా వాళ్లేమో బహిరంగంలో అతి రహస్యాన్ని చొప్పించి, జంతర్‌మంతర్ చేశారు. రంగం మళ్లీ ఢిల్లీకి మళ్లింది.
కమిటీ రిపోర్టు ఇలా అందగానే, అలా తెలంగాణ ఇచ్చేయబోతున్నట్టు బిల్డప్ ఇచ్చిన కేంద్రం వారు రిపోర్టు వచ్చి అర్ధ సంవత్సరమైనా ఏదీ తేల్చరు. అటో, ఇటో, ఎటో నిర్ణయించాల్సిన సర్కారు- పార్టీల కోళ్లు వచ్చి కూస్తే తప్ప తెలంగాణ తెల్లవారదని మిషభిషలు పెడుతుంది. పార్టీలను కేకేసి రిపోర్టు చేతిలో పెట్టి పంపించి ఆరు నెలలు గడిచాక ఏమి చెయ్యాలో చెప్పడానికి పార్టీల పేరంటం మళ్లీ పెడతామన్న మాట ‘స్పీడ్ స్టార్’ చిదంబరం నోట జాలువారింది. ముహూర్తం కుదరడానికి ఇంకో ఆరు నెలలు పట్టవచ్చు. వాయిదాల పద్ధతిలో భేటీలు వేశాక ఫాయిదాలేదని ఎప్పటికి తేలుస్తారో, తదుపరి కర్తవ్యాన్ని ఎలా నిర్ణయిస్తారో రంగస్థలం మీద చూడాలి.
వాయిదాలు ఎన్ని వేసినా, నాటకాలు ఎన్ని ఆడినా కనీసం మూడేళ్లలోపల, 2014 ఎన్నికల నాటికైనా తెలంగాణను ఇవ్వక ఏమి చేస్తారన్న ధీమా ఇప్పటిదాకా తెలంగాణ వాళ్లకు ఉంది. చూడబోతే అదీ వెర్రి ఊహే అని తేలేటట్టుంది.
ఆశ పెట్టిన రాష్ట్రం తీరా తమకు ఇవ్వకపోతే తెలంగాణ జనం కోపగించి, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు మాడు పగలగొట్టటం ఖాయమే. వై.ఎస్. వారి ధాటికి ఎలాగూ సీమాంధ్రలో ధరావతులు దక్కే ఆశలేని స్థితిలో తెలంగాణలో కూడా దేవిడీమన్నా అయతే సెంటర్లో కాంగ్రెసు అధికారానికి కష్టమే. కాని దానికి మించిన ఈతిబాధ ‘పైవాళ్ల’కు ఇంకొకటి వచ్చేట్టుంది.
తెలంగాణను ఇచ్చేస్తున్నారనగానే దేశంలో ఎక్కడెక్కడి రాష్ట్రాల్లోనూ వేర్పాటు ఆశలు మోసులెత్తాయి. ముఖ్యంగా పశ్చిమబెంగాల్‌ను విడగొట్టి డార్జిలింగు రాజధానిగా గూర్ఖాలాండ్‌ను ఇవ్వాలని ఎప్పటినుంచో అడుగుతున్నవాళ్లకు మరీ హుషారు వచ్చింది. బెంగాల్‌లో ఉన్నది కమ్యూనిస్టు గవర్నమెంటు అయితే ఢిల్లీ వారికి ఏ బాధా లేకపోయేది. కాని ఇప్పుడక్కడ గద్దె మీద ఉన్నది మమతా దీదీ. సెంటర్లో యు.పి.ఎ. గుడారానికి ఆమె పెద్ద అండ. శుభమా అని రాజ్యానికి రాగానే వేర్పాటు కొరివి తనకెందుకని... తెలంగాణనిచ్చి తనకు కష్టాలు కొని తేవద్దని దీదీ నిక్కచ్చిగా చెప్పింది. ఏ కామ్రేడ్లో, మావోలో పుణ్యం కట్టుకోవటంవల్ల వేర్పాటు చిచ్చుపుట్టి 2014 ఎన్నికల్లో మమతమ్మ పుట్టి మునిగితే యు.పి.ఎ. డేరాకు పెద్ద దెబ్బే.
అలాగే తెలంగాణనిస్తే విదర్భకూ ప్రత్యేక రాష్ట్రాన్ని ఎందుకు ఇవ్వరన్న పంతం పెరుగుతుంది. అది మరాఠా మల్లుడు శరద్‌పవార్‌కు నష్టం. ఆ పవార్ కూడా యు.పి.ఎ. పవరుకు పెద్ద ఊతం. కాబట్టి ఆయనను చిక్కుల్లో పెట్టే పనికీ కాంగ్రెసు నేతలు సాహసించలేరు. అన్నట్టు ఉత్తరప్రదేశ్‌ను మూడు ముక్కలు చెయ్యాలని యు.పి.రాణి మాయావతి ఎప్పటినుంచో అడుగుతున్నది. తెలంగాణనిస్తే ఆమె కూడా గొంతు పెద్దది చేస్తుంది. ఆ అమ్మ కాంగ్రెసుకు ఎగస్పార్టీ. మాయదారి మాయకు లాభమైనది ఆటోమెటిగ్గా తమకు నష్టం కావచ్చు కనుక ఆమె ముచ్చటతీర్చటం కాంగ్రెసు వారికి ఇష్టం ఉండదు. ‘హరితప్రదేశ్’మీద కాంగ్రెసు మిత్రుడు అజిత్‌సింగు కూడా మనసుపడుతున్నమాట నిజమే. కాని - మిత్రుడుకోరేదీ శత్రువుకోరేదీ ఒకటే అయినప్పుడు ఇవ్వకపోవటమే రాజకీయం.
ఈ ప్రకారంగా ‘మమతా ఎక్స్‌ప్రెసు’ అడ్డంతగలటంవల్ల ‘తెలంగాణ పాసింజరు’ పట్టాలు ఎక్కకుండానే ఆగిపోయింది. అయినా ఆ సంగతి ఢిల్లీ మహానటులు చెప్పరు. ఎన్నిచేసినా తెలంగాణ ఉద్యమాలు ఆగేట్టు లేవు కనుక వాటిని జోకొట్టేందుకు ఇప్పుడు కొత్త జోలను ఎత్తుకున్నారు.
దానిపేరు రెండో ఎస్సార్సీ. అదీ పాతపాటే. ఇప్పుడు దాన్ని లంకించుకోవటంవల్ల ఎస్సార్సీ విచారణ తతంగం పేరిట ఇంకా కొనే్నళ్లు తెలంగాణను మాగవేయవచ్చు. ఎస్సార్సీ పేరు చెప్పి యు.పి.లో మాయావతి నోటా కరక్కాయ వేయవచ్చు. బహుశా ఈ ఎత్తుతోనే కావచ్చు కాంగ్రెసు మాతాపుత్రులు దగ్గరుండి యు.పి. కాంగ్రెసు చేత ఎస్సార్సీ సన్నాయిని నొక్కించారు.
ఈ కొత్తమేళం ఎన్నాళ్లో, తెలంగాణ రైలొచ్చేది ఏ ఏటికో చెప్పిన వారికి చక్కని బహుమతి.

ఆశ్చర్య రాష్ట్రాయణం

-సాక్షి

రావణుడి చితి ఆరితే మండోదరికి వైధవ్యం వస్తుంది. అలా జరగదని (‘ఆశ్చర్య రామాయణం’లో) రాముడు వరమిచ్చాడు. కాబట్టి రావణకాష్ఠం ఎప్పటికీ కాలుతూనే ఉంటుంది-ట!
మన ‘ఆశ్చర్య రాష్ట్రాయణం’లో కాంగ్రెసుదీ కొద్ది తేడాతో అదే పరిస్థితి.
తెలంగాణ రాష్ట్రం ఇచ్చేది లేదంటే తెలంగాణలో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోతుంది. ఇస్తామంటే సీమాంధ్రలో అడ్రసు లేకుండా పోతుంది. తెలంగాణను ఇచ్చినా తెలంగాణ వారు కాంగ్రెసును నెత్తినెత్తుకుని ఊరేగరు. కాంగ్రెసు ప్రభుత్వం మెడలు వంచి, తెలంగాణను సాధించిన కీర్తి కె.సి.ఆర్.కీ, ఆయన పార్టీకే దక్కుతుంది. తాము ఎంత వద్దన్నా వినకుండా రాష్ట్రాన్ని చీల్చినందుకు సీమాంధ్ర ఎలాగూ కాంగ్రెసుకు దూరమవుతుంది.
అలాగని తెలంగాణను ఇవ్వము పొమ్మంటే...? తెలంగాణలో కాంగ్రెసుకు పుట్టగతులుండవు. ఉండకపోతే పోనీ - కనీసం సీమాంధ్ర అయినా కొండంత అండగా నిలబడుతుందనుకుందామా? ఆ ఆశా లేదు. ఇప్పటికే ఆ ప్రాంతంలో జగననేవాడు నాన్నగారి పేరు చెప్పుకుంటూ దుమ్ము లేపేస్తూ, కాంగ్రెసు వాళ్లకు పగలే చుక్కలు చూపిస్తున్నాడు. రాష్ట్రంలో యథా స్థితిని కొనసాగించినంత మాత్రాన ఈ పరిస్థితి మారుతుందన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే ఆ కుర్రవాడు కాంగ్రెసు మీద కత్తి గట్టింది తెలంగాణ అంశం మీద కానే కాదు.
కనుక తెలంగాణను ఇచ్చినా, ఇవ్వకపోయినా కాంగ్రెసుకు నష్టమే తప్ప ఒరిగేది లేదు. కరవమంటే కప్పకు కోపం - విడవమంటే పాముకు కోపం అన్నట్టు ఇస్తామంటే ఆంధ్రావాళ్లకు కోపం; ఇవ్వమంటే తెలంగాణ వాళ్లకు కోపం. ఇవ్వడం లేదని అలిగి ఇటువైపు 13 మంది ఎంపీలు రాజీనామా విసిరికొడితే... ఇచ్చే పక్షంలో అదే పని చేయడానికి అటువైపు 20 మంది ఎంపీలు రడీగా ఉన్నారు. ఎటువైపు బలం తగ్గినా సెంటర్లో కాంగ్రెసు ఓటి సర్కారుకే ఇబ్బంది.
కాబట్టి కనీసం వచ్చే ఎన్నికలదాకా మూడేళ్లపాటైనా కాంగ్రెసు సర్కారు కుదురుగా నిలబడాలంటే ఎటూ మొగ్గకుండా కాలక్షేపం చేయటమే ఉత్తమం. రావణకాష్ఠం ఆరితే మండోదరికి వైధవ్యం వచ్చినట్టు వేర్పాటు కాష్ఠాన్ని ఆర్పితే రాష్ట్రంలో కాంగ్రెసుకు రాజకీయ వైధవ్యం వస్తుంది. కాబట్టి దాన్ని ఆరనీయకుండా, ఏదీ తేల్చకుండా సాధ్యమైనంత కాలం కాంగ్రెసు సర్కారు ఠలాయిస్తూనే ఉంటుంది.
ఈ చిన్న కామన్‌సెన్సు పాయింటే కనుక అర్థమైతే ఇప్పుడు నడుస్తున్న రాజకీయ మాయా నాటకంలో అసలు కిటుకు బోధపడుతుంది. తలకో రకంగా మాట్లాడుతున్నారని, తడవకో విధంగా మాట మార్చేస్తున్నారని, కొంపలంటుకుపోతున్నా కదలక కూచున్నారని కేంద్ర నేతలను ఆడిపోసుకోవటం దండుగ. చెబితే మానం పోతుంది - చెప్పకుంటే ప్రాణం పోతుంది-లాంటి సంకటంలో నేతాశ్రీలు ఇంకోలా మాట్లాడే వీలేలేదు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామోచ్ అని ఈ దేశ హోంమంత్రి పార్లమెంటులో నిలబడి ఆధికారికంగా ప్రకటించిన ఏణ్నర్థం తరవాత తెలంగాణ ఏర్పాటుకు మిగతా ప్రాంతాల, అన్ని పార్టీల అంగీకారం కూడా కావాలని రాజ్యమేలేవారికి గుర్తుకొచ్చింది. తెలంగాణ సంగతి ఏమి చేయాలో చెప్పడానికి శ్రీకృష్ణ కమిటీని వేశాక... సంవత్సరం పాటు ఆలోచించి చించి, అందరినీ సంప్రదించి దించి ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు చేతికంది అర్ధ సంవత్సరం గడిచాక... కమిటీ చేసిన ఆరు సూచనల్లో ఏదీ పరిష్కారమార్గం కాదన్న దేవరహస్యం ప్రభువులకు అంతుబట్టింది. ఆరూ పనికిరావు కాబట్టి అసలైన పరిష్కారాన్ని సరికొత్తగా కనిపెట్టవలసిన పని పడింది. ఈ రాష్ట్రానికి ఇన్చార్జి అయిన గులాంనబీ ఆజాద్‌గారు చైనాలో చల్లగా చెప్పినట్టు తెలంగాణ వ్యవహారం సున్న నుంచి మళ్లీ మొదలుపెట్టాలి.
మొదలుపెట్టాక పూర్తి కావటానికి ఎంత కాలమైనా పట్టవచ్చు. ఆరు దారులు చూపించటానికే శ్రీకృష్ణ కమిటీకి సంవత్సరం పడితే, అన్నిటినీ తలదనే్న తిరుగులేని ఒకే ఒక పరిష్కారాన్ని గులాంనబీ గారు చెప్పిన లెవెల్లో కనుక్కోవడానికి ఎన్ని ఏళ్లయినా పట్టవచ్చు. దానికీ ఎలాంటి లక్షణాలుండాలి?! రాష్ట్రంలోని మూడు ప్రాంతాల చేతా భేష్ అనిపించేట్టుగా ఉండాలి. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలూ దాన్ని చూసి భలే భలే అనాలి. 294 మంది సభ్యులుగల అసెంబ్లీలో ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో దానికి వల్లె అనాలి. ఒక్క ఎమ్మెల్యే వద్దన్నా అది ఏకగ్రీవం కాజాలదు. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేస్తేగానీ సర్కారువారు తెలంగాణను శాంక్షను చెయ్యరు.
అన్ని రాజకీయ పార్టీలూ ఒక్కతాటిమీద నిలిచి, ఏకగ్రీవంగా పాస్ చెయ్యటానికి ఇదేమన్నా ఎంపీలూ, ఎమ్మెల్యేల జీతాలను అయినకాడికి పెంచుకునే తీర్మానమా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించిన ఏణ్నర్థం తరవాత కూడా కేంద్రాన్ని నడిపించే కాంగ్రెస్ పార్టీయే దానిమీద ఎటూ తేల్చలేదు. అసలైన ఒక పార్టీలోనే ఏకాభిప్రాయం లేనప్పుడు మిగతా అన్ని పార్టీలూ ఒక్క తాటిమీదికి వచ్చి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చెయ్యటం కలియుగాంతంలోగా అయ్యేపనేనా? అయినా ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతాన్ని విడగొట్టి, వేరే రాష్ట్రంగా ఏర్పాటుచేయడానికి ఆ రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలన్నీ, పార్టీలన్నీ ఒప్పుకోవాలనీ, అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి తీరాలనీ రాజ్యాంగంలో ఎక్కడుంది?
లేదు. అయినా కేంద్ర ప్రభువులు అలాంటి కండిషన్లు నడమంత్రంగా పెడుతున్నారంటే... అవన్నీ నెరవేరితేగానీ వ్యవహారం అంగుళం కూడా ముందుకు కదలదని రాష్ట్ర కాంగ్రెసు ఇన్చార్జే అన్నాడంటే తెలంగాణ ఏర్పాటు ఇప్పట్లో అంగుళం ముందుకు జరగదనే భావించాలి. సెకండురవుండులో తెలంగాణ డిమాండు సున్నా దగ్గర ఆగిపోతుంది లెమ్మనే సీమాంధ్రులు సంతోషించాలి. సంతోషించి కాంగ్రెసు పార్టీనే ఎప్పటివలె బలపరుస్తూ పోవాలి. ఇంకో చెంప తెలంగాణవాళ్లు తెలంగాణపై ప్రకటన త్వరలో విడుదల అని ఇంకో ఎఐసిసి పెద్దాయన పొక్కించిన వార్తనే పటంకట్టించి, అది నిజమయ్యే రోజు కోసమే ఎదురుచూస్తూ కూచోవాలి. అది నిజమయ్యేదాకా కాంగ్రెసునే పల్లకీ ఎక్కించి ఊరేగిస్తుండాలి. భలే వ్యూహం!
రాజీనామాలిస్తే రాజ్యాంగ సంక్షోభం వస్తుందనో, ఇలా రాజీనామాలందగానే సోనియమ్మ అలా తెలంగాణను ఇచ్చేస్తుందనో వారూ వీరూ చెప్పిన కబుర్లను నమ్మి ఎరక్కపోయ ఇరుకున్న టి-కాంగ్రెస్ ఎంపీలు రాజీనామాల సంకటం నుంచి ఒళ్లు చెడకుండా, పరువుగా ఎలా బయటపడతారన్నదే రాజకీయ రంగస్థలం మీద తరువాయ అంకంలో చూడబోయే తమాషా.

మిగిలేదెవరు?!

November 19th, 2011

ఛఛ! ఇదేం బాగో లేదు! వారి మీద కేసులు, వీరికి రిమాండ్లు భలే బాగున్నాయని అందరూ పళ్లికిలిస్తున్నారే తప్ప అరవై ఏళ్లుగా మన మహానేతలు కడు జాగ్రత్తగా కలిసికట్టుగా కాపాడుకొస్తున్న ఎంచక్కని ఏర్పాటుకు ముంచుకొస్తున్న ముప్పును ఎవరూ గ్రహించటమే లేదు!
పేరు మోసిన మన పార్టీల మధ్య, వాటిని నడిపే నేతల మధ్య పైకి చెప్పుకోని, చెప్పుకోకూడని పెద్ద మనుషుల ఒప్పందం చాలా ఏళ్లుగా ఉంది. ఒకసారి గెలిచి తాము పవర్లోకి వస్తే జనానికి రోతపుట్టి మళ్లీ ఎన్నికల్లో తమను తన్ని తగలెయ్యటం ఖాయం. (పూర్తికాలం అధికారం చలాయంచీ మళ్లీ గద్దెనెక్కగలిగింది ఇటీవలి రాజశేఖరరెడ్డి ఒక్కడే) తమ మీద అసహ్యంతో ఎగస్పార్టీని నెత్తిన పెట్టుకున్నా, తప్పుడు పనుల్లో వాళ్లూ తమకు తోడు బోయిన వారే కనుక, మళ్లీ వచ్చే ఎన్నికల్లో వారినీ గెంటేయటం దాదాపు గ్యారంటీ! వాళ్లకు శాస్తి చెయ్యాలంటే ఇష్టమున్నా లేకున్నా మళ్లీ తమనే పిలిచి పల్లకి ఎక్కించటం మినహా వెర్రిజనానికి వేరే దారి ఉండదు. కాబట్టి గద్దెమీద ఉన్నప్పుడు అడ్డగోలుగా నొక్కేసినదాన్ని అపోజిషన్లో ఉన్న ఐదేళ్లూ దర్జాగా ఎంజాయ్ చేస్తే తరువాయి ఎన్నికల్లో వద్దన్నా పవరు తమ కాళ్లదగ్గరికి నడిచొస్తుంది.
ఈ అధర్మ సూక్ష్మం అన్ని పార్టీలకీ అర్థమైంది. తమ చేతిలో అధికారం ఉన్నప్పుడు అపోజిషను వాళ్ల పాత పాపాలను కెలక్కుండా ఉంటే వాళ్ల ‘వంతు’ వచ్చినప్పుడు వాళ్లూ తమను తిప్పలు పెట్టకుండా ఉంటారు. అందుకే - ‘తిను-తిననివ్వు; బతుకు-బతకనివ్వు’ అన్న పాలిసీతో అన్ని పార్టీల అందరు లీడర్లూ పైకి మాత్రం కలహించుకుంటూ, అవసరమైనప్పుడు సహకరించుకుంటూ జనాల చెవిలో పూలు పెడుతూ వచ్చారు. అధికార పార్టీ వాళ్లు అక్కడ ఇంత తిన్నారు, ఇందులో ఇంత బొక్కారు; మాకే కనుక అధికారం వస్తే వాళ్లు తిన్నది మొత్తం కక్కిస్తాం... జైల్లో కుక్కేస్తాం... విచారణలు జరిపించి, పాపాల చిట్టా విప్పిస్తాం... అని రంకెలేసే విపక్ష మేళం వాళ్లకు పవరు చేతికొచ్చాక ఆ ఊసే గుర్తుండదు. కాంగ్రెసు పోయి ‘దేశం’ వచ్చినా, ‘దేశం’ పోయి కాంగ్రెసు వచ్చినా ఏ పార్టీ వాడి ఏ అక్రమ ఆస్తీ చెక్కు చెదరదు. పట్టుకుంటారేమోనన్న భయమూ ఎవరికీ ఉండదు.
ఇంతకాలమూ బహు చక్కగా, అందరికీ వాటంగా నడుస్తున్న ఈ భలే మంచి ఏర్పాటు కాస్తా ఇప్పుడు భళ్లున బద్దలైంది. ఏ పార్టీ ప్రభువూ తనకు తానై మాజీ పాలకుల, వారి ఇలాకావాళ్ల అక్రమ ఆర్జనల జోలికి పోకుండా ఎంత గొప్ప సంయమం చూపితేనేమి? పనిలేని కోర్టులు తీరికూర్చుని మారాజుల బంగారు పుట్టలో వేలు పెట్టటంతో అంతులేని కథ కాస్తా అడ్డం తిరిగింది. పరిపాలకుల పెంపుడు జంతువులా బుద్ధిగా ఒదిగి ఉండి, వారు కరవమన్న వారిని మాత్రమే కరవమన్న మేరకే కరుస్తూ, నమ్మినబంటులా సేవ చేసిన సిబిఐకి కూడా కోర్టుల చేతిలో పడ్డాక కోరలొచ్చాయి. కొమ్ములూ మొలిచాయి. వాటితో పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఎవరిని పడితే వారిని కుమ్ముతూ... విచారణలు, అరెస్టులు అంటూ కుళ్లబొడిచేస్తున్నది. మరీ ఇంత ఓఘాయిత్యమైతే మన రాజకీయ మణిమాణిక్యాలు ఇక ఎవరితో మొరపెట్టుకోవాలి?!
కృష్ణపక్షంలో చంద్రుడికాంతి అంతకంతకూ క్షీణించి అంతరించినట్టు, ఎన్నికలు దగ్గరపడే కొద్దీ సర్కారు ప్రకాశం సన్నగిల్లుతుంది. అపోజిషను మీద మోజు నానాటికీ పెరుగుతుంది. ఎన్నికల అమావాశ్య నాటికి పాలకపక్షం పరువు నేలమట్టమైతే అపోజిషను కళ అదే దామాషాలో పెరగుతూపోయి, పాత ప్రత్యామ్నాయాన్ని దుమ్ము దులిపి మళ్లీ కళ్లకద్దుకోవటం ఓటరయ్యలకు సులువవుతుంది.
కాని - ఇప్పుడో? రూలింగు పార్టీ షరామామూలుగా డీలాపడింది. పాత పహిల్వాన్‌కు తోడు కొత్త వస్తాదు గోదాలోకి దిగటంతో అపోజిషను సీను మారింది. బిగ్ ఫైటు అంతా బాబు, జగన్‌ల మధ్యే హోరాహోరీగా నడుస్తోంది. ‘పవర’మాల చివరికి వీరిలో ఎవరి మెళ్లో పడవచ్చునని జనాలు తర్కిస్తున్న సమయంలో ఉరుములేని పిడుగులా ఇద్దరి నెత్తినా సిబిఐ కేసుల బండలు పడ్డాయి. తన బద్ధ శత్రువైన కాంగ్రెసు జగన్ మీద పెట్టించిన కేసుకు టి.డి.పి. పక్క తాళం వేస్తే.. తమరు మాత్రం తక్కువ తిన్నారా బాబూ అని జగనమ్మ కోర్టుకెక్కి బాబు ఆస్తుల మీద సిబిఐ దర్యాప్తు వేయించింది. మళ్లీ ఎన్నికల్లో అధికార దండం అందుకోవాలనుకుంటున్న ఇద్దరు నేతాశ్రీలూ అవినీతి ఆరోపణల ఊబిలో ఇరుక్కుని, కాంగ్రెసుకు దీటుగా కుదేలైతే ఇక జనం ఎవరికి ఓటెయ్యాలి? అధికారం మార్పిడి ఎలా జరుగుతుంది? సిబిఐ వాళ్లొచ్చి ఆటంతా మార్చేస్తే ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్షం మీద కొరడా ఝళిపిస్తే పవిత్ర ప్రజాస్వామ్యం ఏమి కావాలి? ఇదీ సమస్య.
ఎప్పుడో రెండేళ్ల తరవాత వచ్చే ఎన్నికల్లో ప్రత్యామ్నాయం మాట దేవుడెరుగు. ముందు మన ధర్మ ప్రభుత్వం నడిచేదెలా? ‘‘ఊబ నా మగడు ఉండీ ఒకటే లేకా ఒకటే’’ అన్నట్టు మంత్రిశ్రీలు కొలువులో ఉన్నా ఒకటే. లేకున్నా ఒకటే. ఆ సంగతి మొన్న తెలంగాణ ‘సకలం’లోనే అందరికీ తెలిసి వచ్చింది. మంత్రులు లేకుంటే పోయేగానీ సర్కారు రథాన్ని నడపటానికి పై ఎత్తున అధికారులైతే కావాలి కదా? జమానా మారినా తమ జోలికి ఎవరు రారు అన్నది అనుభవంలో రూఢి కావటంతో అధికార గణానికి పట్టపగ్గాలు లేవు. వారిది ఆలిండియా సర్వీసు కనుక తప్పుడు పనులు చేసేది లేదని కరాఖండిగా తిరస్కరించినా రాజకీయ నాయకులు చేయగలిగింది పెద్దగా ఉండదు. అయినా ఆ సోయి బతకనేర్చిన అధికార్లకు ఉండదు. స్వామిని మించిన స్వామి భక్తితో పాలకపక్షానికి తాబేదారులా తమను తాము దిగజార్జుకుని, ముఖ్యమంత్రి మెహర్బానీకి అంగలార్చి, కనుసైగ చేస్తే చాలు ఎలాంటి తప్పుడు పనినైనా చేసి, రూల్సు నడ్డి విరిచి ‘పై’వాళ్లను ఖుషీ చేసి, అత్తసొత్తును అల్లుడు దానం చేసినట్టు గనాఘనులకు లీజులు, పర్మిషన్లు అడ్డగోలుగా కట్టబెట్టిన ఆఫీసరు రత్నాలకు ఇప్పుడు మూడింది.
ఒక్క గాలి కేసుకే ఇంత గోలైంది. ఇప్పటికే ఇద్దరు ఐ.ఎ.ఎస్. పెద్ద్ఫాసర్లు జైలుదారిలో ఉన్నారు. ఇక జగన్ ఆస్తుల తబిసేళ్లలోనూ ఉచ్చు బిగిసి, పనిలో పనిగా అనేక ఆరోపణలలో ఆరియు తేరిన బాబు మీదా సిబిఐ కోర్టు పురమాయింపుపై కేసుల బండలు పడి... తొమ్మిదేళ్ల ‘సైకిల్’ రాజ్యంలో బాబు అడుగులకు మడుగులెత్తిన బాబుశ్రీల మీదా కేసుల నోళ్లు తెరచుకుంటే ఎన్ని డజన్ల అధికారుల మీద, మంత్రుల మీద కేసులు పెట్టాలి? ఈ తీగలతో కేసుల డొంకలు ఒకటొకటిగా కదులుతూ పోతే, పట్టువదలని శంకరరావు మంత్రిగా ఉండీ సాటి మంత్రుల మీద, ముఖ్యమంత్రి మీద యుద్ధం ప్రకటించి ఇలాగే ముందుకు పోతే ప్రభుత్వంలో మిగిలేదెందరు? జైలు విడిదిలో సెటిలయ్యేదెందరు? ఎక్కువమంది జైల్లో ఉంటే సర్కారు ఎలా నడుస్తుంది. ఈ వరస ఇలాగే కొనసాగి అధికారులు, మంత్రులు సచివాలయానికి రాలేకపోతే సచివాలయం బ్రాంచి ఆఫీసును వారున్న చోటే పెడితే బాగుంటుందేమో?

జంతర్‌మంతర్

---సాక్షి

కుక్క పని కుక్క చెయ్యాలి. గాడిద పని గాడిద చెయ్యాలి. ఇది పంచతంత్రం నీతి. ఇప్పుడు నడుస్తున్న రాజకీయ తంత్రం దీనికి సరిగ్గా రివర్సు!
మామూలుగా సర్కారీ పక్షం సర్కారు కొమ్ము గాస్తుంది. విపక్షమేమో సందు దొరికితే చాలు సర్కారును పడగొట్టాలని కాచుకుని ఉంటుంది. చిత్రవిచిత్ర ఆంధ్రా రాజకీయం లోనో?! విపక్షం కూలీ లేకుండా గవర్నమెంటుకు కావలి కాస్తుంది. పడగొట్టేందుకు లక్కీచాన్సు నడుచుకుంటూ కాళ్ల దగ్గరికి వచ్చినా కళ్లు మూసేసుకుని, చేతులు కట్టేసుకుని, ఓటి సర్కారుకు ఢోకా లేకుండా కంటికి రెప్పలా కాపాడుతుంది.
సాధారణంగా అధికార పక్షంలో చిన్నపాటి తిరుగుబాటు లేస్తేనే... మెజారిటీకి ముప్పులేదని తెలిసినప్పటికీ... ప్రతిపక్షం రెచ్చిపోతుంది. వెంటనే అసెంబ్లీని పిలిచి విశ్వాస పరీక్ష పెట్టాలని గవర్నరుకు డిమాండు మీద డిమాండు చేస్తుంది. నెగ్గే ఆశ ఏకోశానా లేదని తెలిసినా, అవిశ్వాస తీర్మానం పెట్టి గవర్నమెంటును దెబ్బతీయటానికి ఉవ్విళ్లూరుతుంది. అలాంటిది - నిజంగా పెద్ద తిరుగుబాట్లే లేచి గవర్నమెంటు మనుగడే గండంలో పడితే...? విశ్వాసమో అవిశ్వాసమో తరుముకొచ్చి పరీక్ష పెడితే గవర్నమెంటు గట్టెక్కటం అనుమానమేనని కళ్లముందు కనపడుతూంటే...? ఎగిరి గంతేసి, ప్రభుత్వం దుంప తెంచకుండా ఏ ప్రతిపక్షమైనా ఊరకుంటుందా?
ఉంటుంది! జంతర్ మంతర్ ఆంధ్రా పాలిటిక్సులో! నారా నాయుడిగారి లోకోత్తర నిర్వాహకంలో!!
రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం సీట్లు 294. అందులో ఒకటి ఖాళీ. కనీసం 147 మంది వద్దు పొమ్మంటే చాలు కాంగ్రెసు సర్కారు కుప్పకూలుతుంది. ఒక్క తెలుగుదేశానికే 90 మంది ఎమ్మెల్యేలున్నారు. (వారిలో ముగ్గురు తిరగబడినా, ఇప్పుడున్న పరిస్థితుల్లో కిరణ్ జమానాకు పల్లకి మోయరు.) తెరాస, బిజెపి, కమ్యూనిస్టులు, అమాంబాపతులను కలిపితే 21. కాంగ్రెస్, ప్రజారాజ్యాల నుంచి ఇప్పటికే 27గురు జగన్‌కు జైకొట్టి కాంగ్రెస్ మీద కత్తి కట్టారు. ఈ మధ్యే ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెరాస వైపు దూకారు. 90+21+27+3=141. సర్కారును కూల్చేందుకు కావలసిన ‘మాజిక్ ఫిగర్’ 147కి ఇది అరడజను మాత్రమే తక్కువ. తెలంగాణ సెంటిమెంటు, కాంగ్రెసులో లుకలుకలు ఇప్పుడున్న స్థితిలో వ్యవహారం అంతదాకా వస్తే కిరణ్ సర్కారును సాగనంపడానికి ఆరుగురిని కూడగట్టటం మంచినీళ్ల ప్రాయం. ఏదైనా... ప్రధాన ప్రతిపక్షమైన ‘సైకిలు’వారు సై అన్నప్పుడు మాత్రమే సాధ్యం. అంటే... కాంగ్రెసు సర్కారును ఉంచటమా, ఊడగొట్టటమా అనేది తెలుగుదేశాధీశుడి చేతుల్లోనే ఉంది. నాయుడుగారు నిజంగా కాంగ్రెసుకు పగవాడే అయితే శత్రువును కూల్చటానికి ఇంతకు మించిన సమయం దొరకదు.
కాని చిత్రం! మాయల ఫకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు దొరతనం ప్రాణం చంద్రబాబు చేతుల్లో ఉన్నా ఆయన కాంగ్రెసు చిలకను గుటుక్కుమనిపించకపోగా అల్లారుముద్దుగా కాపాడుతున్నాడు! గవర్నమెంటు ఎప్పుడు చిక్కుల్లో పడ్డా ఆపద్బాంధవుడిలా చక్రం అడ్డు వేస్తూ... అక్కర వచ్చినప్పుడు లోపాయకారీగా ఆదుకుంటూ... అధికార పార్టీలో ఎందరు ఎదురుతిరిగినా చూడనట్టే నటిస్తూ... పడగొడదాం రావయ్యా మగడా అని వేరేవాళ్లు పిలిచినా మాకేమి పట్టిందని వాదులాడుతూ... అవిశ్వాసాన్ని మీరు దంచండి; నేను పక్కలెగరేస్తానని తప్పించుకుంటూ అతి తెలివిగా కాపుకాసే నాయుడే ఇవాళ కాంగ్రెసు సర్కారుకు అసలైన ఇన్సూరెన్సు!
పాపం ఆయన మాత్రం ఏమిచేయగలడు? పీత కష్టాలు పీతవన్నట్టు బాబు కష్టాలు బాబువి. గవర్నమెంటును పడగొట్టగానే సంబరం కాదు. ఆ తరవాత ఎన్నికలొస్తే అటు తెలంగాణలో ఉప్పుపుట్టక, ఇటు సీమాంధ్రలో పరువు దక్కక, ఇటీవలి రివాజు ప్రకారం డిపాజిట్లు గల్లంతయితే తెదేపాకు ఏదీగతి? అందుకే ఎన్నికల సుడిగుండంలో మొత్తం మునిగే కన్నా, కాంగ్రెసుకు కర్ర పోలీసుగా బతుకు వెళ్లదియ్యటమే తెలుగు చాణక్యుడి దృష్టిలో తెలివైన పని!
కారణాలు ఏమైతేనేమి- ప్రధాన ప్రతిపక్షమే కొండంత అండగా నిలబడినప్పుడు కాంగ్రెసు హిప్పొపొటామసును ఏ తిరుగుబాటు బండా ఏమీ చెయ్యలేదు. బాగుంది. ప్రతిపక్షం పోయి పాలక పక్షం కొమ్ము కాస్తే మరి ప్రతిపక్షం పని ఎవరు చెయ్యాలి? ఎవరూ చెయ్యకపోతే ప్రజాస్వామ్యం ఏమి కావాలి? ఆ సంగతి ప్రజాస్వామ్యాన్ని కాచివడబోసిన కాంగ్రెసు వాళ్లకు ఒకరు చెప్పక్కర్లేదు. అందుకే ఒక చెంప ప్రభుత్వంలో భాగంగా ఉంటూనే ప్రభుత్వాన్ని దెబ్బతీసే ప్రతిపక్షం పాత్రనూ శ్రమ అనుకోకుండా వాళ్లే పోషిస్తూ ఏకకాలంలో ఎంచక్కా ద్విపాత్రాభినయం చేస్తున్నారు.
మా ప్రభుత్వంలో ఫలానా మంత్రులు అవినీతిపరులని ఇంకో మంత్రి గవర్నరుకు ఫిర్యాదుచేసి, పనిలో పనిగా లోకాయుక్తకూ చెవిన వేస్తాడు. మా ప్రభుత్వం ప్రకటించిన ఫలానా పథకం శుద్ధ దండుగని ఒక సీనియర్ మంత్రి మెటికలు విరిస్తే, మా ప్రభుత్వంలో ఫలానా విభాగాలు వేస్ట్ అని స్వయానా ఆ విభాగాలను చూసే ఇంకో మంత్రి మహోదయుడు లోకానికి చాటుతాడు. మంత్రికీ మంత్రికీ పడదు. ముఖ్యమంత్రిని మంత్రులు గుర్తించరు. మంత్రులను ఎమ్మెల్యేలు గుర్తించరు. అధికారుల మీద మంత్రులు, మంత్రుల మీద అధికారులు, వారిద్దరి మీద ఎమ్మెల్యేలు దుమ్మెత్తి పోస్తారు. ఆ రకంగా పాలక ప్రముఖులందరూ తలా ఒక చెయ్యి వేసి దీటైన ప్రతిపక్షం లేని లోటును బ్రహ్మాండంగా భర్తీ చేస్తున్నారు.
అంతేకాదు. ఏ పార్టీకి ఎంతమంది ఎమ్మెల్యేలున్నారో తెలియదు. ఏ ఎమ్మెల్యే ఏ పార్టీకి చెందుతాడో అర్థం కాదు. ఎవరు ఎమ్మెల్యేనో, ఎవరు కాదో అంతకన్నా అంతుబట్టదు. అసెంబ్లీ రికార్డుల్లో ఒకటుంటే బయట రాజకీయంలో వేరొకలా కనపడుతుంది. ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేస్తే పార్టీ నేత ఆమోదించరు. శాసనసభ్యత్వాలను త్యాగం చేస్తే సభాపతి ఒప్పుకోరు. ఎమ్మెల్యేలు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్లు పార్టీలు మార్చినా పార్టీల నాయకత్వాలు పట్టించుకోవు. రాష్ట్రంలో ప్రభుత్వంలాగే ఫిరాయింపుల నిరోధక శాసనం కూడా ఉండీ లేనట్టే! చట్టాలు, కట్టుబాట్లు ఇక్కడ చెల్లవు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయమే ఒక పెద్ద అబ్రకదబ్ర!

ఇదయ్యా మీడియా!

-సాక్షి

పెట్టుబడికి కట్టుకథకు
పుట్టిన విషపుత్రిక
-అంటూ సంసారపక్షపు నడిపాత ఆంధ్రపత్రికనే చడామడా దులిపాడు శ్రీశ్రీ! కూడబలుక్కున్నట్టు చెలరేగి తెలుగు జనానికి పిచ్చెత్తేలా బుద్ధి శుద్ధి చేస్తున్న గొప్ప పత్రికల దూకుడును ఈ కాలంలో చూసి ఉంటే మైకం ఠక్కున దిగి మహాకవి ఏమి చేసేవాడో! ఏమి రాసేవాడో!!
ప్రపంచం ఎంతో ముందుకు పోయినా, జర్నలిజం గురించి మన అవగాహన మాత్రం తాతలకాలం దగ్గరే ఆగిపోయింది. ఇది చాలా బోలెడు ఘోరం. కాకి బంగారపు దీపాల్లా ధగధగ వెలుగుతున్న రాజా పత్రికలను చూసైనా నిక్కమైన పత్రికా రచన అంటే ఏమిటో, ఎలా ఉండాలో తెలుసుకోవటం ప్రతి తెలుగువాడి తక్షణ కర్తవ్యం.
ఉదాహరణకు - ప్రజలకు దారి చూపాల్సిన పత్రికను నడిపే వాడికి కొంచెం నీతి, కాస్త నిజాయతి, రవంత వృత్తి నిబద్ధత, ఆవగింజలో వెయ్యోవంతు నిష్పాక్షికత, సత్యసంధత ఉంటాయని, ఉండాలని మనం చాదస్తంగా అనుకుంటున్నాం.
తప్పు! పత్రికను నడిపించేవాడికి కనీసం కిరోసిన్‌ను స్మగ్లింగ్ చేసిన లోకోత్తర పూర్వానుభవమైనా ఉండి ఉండాలి. వెధవది కిరసనాయిలునే సరిహద్దు దాటించి వేరే రాష్ట్రానికి చేరవేయలేనివాడు ప్రజాప్రయోజనాలను సమస్యలు దాటించి సురక్షిత గమ్యానికి ఎలా చేరవేయగలడు?
అలాగే - పాచినోటితో లోకానికి నీతులు ఉపదేశించే పత్రికాధిపతికి కనీసం ఒక పొలిటికల్ పార్టీలో పాలేరుగా పనిచేసి, ఓ మహానేతాశ్రీ పనుపున డబ్బు మూటలు బట్వాడా చేసిన పావన చరిత్ర ఉంటే మంచిది. మొన్నటిదాకా పూటకు ఠికానాలేని వాడివి ఏకంగా పెద్ద పత్రికనే ఎలా కొట్టెయ్యగలిగావంటే గాండ్రించి, డబాయించి, మీదపడి కరిచి నోళ్లు మూయించగల సత్తా ఉండటం బెటరు. తనకు ఏమీ తెలియకపోయినా అన్నీ తెలిసినట్టు నడమంత్రపు సిరితో కంపరం పుట్టేలా మిడిసిపడి, పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఎంతటి వాళ్లన్నయినా గడ్డిపరకల్లా తీసిపారేసి, లక్షలమందికి ఆరాధ్యులైన వారి మీద కూడా గిట్టనివారి పురమాయింపుపై అభాండాల బండలు రువ్వగలిగిన గొప్ప సంస్కారం ఎంత ఉంటే అంత మేలు.
అదే మాదిరిగా - పత్రికారంగాన్ని ఉద్ధరించేందుకే భూమి మీద అవతారమెత్తిన మహానుభావుడికి కనీసం తనది కాని భూమిని దర్జాగా కబ్జా చేసి, రామప్పంతులులా కేసులు బనాయించి, అసలు హక్కుదారులను బతికినంతకాలం ఏడిపించి, ఉసురు పోసుకోగలిగినంత మంచితనమైనా కంపల్సరీ! ఎన్నివేల ఎకరాలను ఎంత అప్పనంగా కాజేస్తే, ఎన్ని కంపెనీలు పెట్టి ఎన్ని నిబంధనల నడ్డి విరగ్గొట్టి ఎన్ని అక్రమాలకు పాల్పడితే... ఊసరవెల్లికి సిగ్గొచ్చేలా సమయానికి తగ్గట్టు ఎన్ని రంగులు మారిస్తే అంత పేరు! అంత పొగరు!!
గోబెల్స్, గోబెల్స్ అని అందరూ తెగ అంటారు కాని గోబెల్స్ గాడిది ఏమి గొప్ప? ఒక అబద్ధం పదేపదే చెబితే నిజమైపోతుందని కనిపెట్టటమే కదా అతగాడు ఊడబొడిచిందల్లా?! అదే మన పుణ్యఫలం కొద్దీ మన పాలబడ్డ పత్రికారాజాలను చూడండి. నిజాన్ని తిరగవేసి అబద్ధంగా, అబద్ధాన్ని మరగవేసి నికార్సయిన నిజంగా చూపించి... గోరంతను కొండంతగా, కొండంతను గోరంతగా అవసరాన్నిబట్టి, ఆయా వ్యక్తులనుబట్టి, వారి మీద తమ ఇష్టానిష్టాలనుబట్టి, కులదైవాల ప్రయోజనాలనుబట్టి, పక్కా వ్యాపార స్వార్థాలనుబట్టి ఎలా తారుమారుగా తిమ్మినిబమ్మి చేసెయ్య వచ్చో తెలుగు పత్రికా మణిదీపాలను చూసే ఎవరైనా నేర్చుకోవాలి!
మాటవరసకు - ఉషోదయంతో అసత్యం నినదించుగాక అని శపథం పట్టిన నీతుల మారి పెద్ద పత్రిక ఒకానొక గాలిరెడ్డి అవినీతి గనుల్ని కూలీ అడక్కుండా కష్టపడి, కళ్లు తిరిగేలా తవ్విపోసింది. ఫలానా గనుల్లో ఎన్ని వేల కోట్లు గోల్‌మాల్ అయిందీ కచ్చితంగా కాకుల లెక్క గట్టి వెరిజనాన్ని ఔరా అనిపించింది. నాలుగు రోజుల తరవాత మళ్లీ అదే నోటితో, అంతే నేర్పుతో... సదరు గనుల ఖనిజం బహు నాసిరకమని, దాని పేరు చెప్పుకుని వేరే రాష్ట్రంలో ఇంకెక్కడో తవ్వకాలు జరిగాయనీ కొత్త కథను అల్లింది. ఔను మరి! ఎప్పుడూ ఒకే కథ అయితే చదివేవాళ్లకు బోరు కదా?!
జగన్ అనే పరమపాపికి ఫలానా అధికారులు నోటీసు ఇచ్చారని సంబరంగా రాసే పత్రిక... అదే పరిస్థితి తమ అభిమాన నాయకుడికి ఎదురైతే ‘‘ఏదో లేఖ రాసారంతే’’ అని తక్కువ చేసేస్తుంది.
పుణ్యాత్ముడు బాబు మీద తస్మదీయుల కేసు అయితేనేమో ‘‘వై.ఎస్. విజయ పిటీషన్ విచారణకు స్వీకరణ’’ అని చప్పగా చెప్పే మేటి పత్రిక అదే తాము పగబట్టిన పాపాత్ముడిపై అస్మదీయుల కేసులో అలాంటి నిర్ణయమే వస్తే ‘‘సిబిఐ బోనులో జగన్’’ అని ఉత్సాహంగా ఉరకలేస్తుంది. తాము పగబట్టిన వాడికి ఎమ్మెల్యేలు జై కొట్టినా, మిడిమేలపు మీడియాకు అది చీకొట్టినట్టే వినపడుతుంది.
పాపిష్టి విరోధి ఢిల్లీకి వెళితే అక్కడి పెద్దల కాళ్లావేళ్లా పడి దేబిరించినట్టు!
మహారాజశ్రీ బాబుగారు అలాంటి టూరే చేస్తేనేమో జాతీయ నాయకులతో భేటీ వేసినట్టు!
మన వాళ్ల మీద దృష్టి పెడితే అది ‘కాంగ్రెసు బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్’!
అదే మన పగవాళ్లమీద కన్ను వేస్తేనేమో అది నిప్పులాంటి నిష్ఠాగరిష్ఠ దర్యాప్తు సంస్థ. ఇలా ప్లేటు మారుస్తారేమిటంటే - హైకోర్టు ఆర్డరు ప్రకారం దర్యాపు కాబట్టి వంకలేదని వింత వివరణ! ‘తమరు కళ్లకద్దుకుంటున్న ఆర్డరును ప్రసాదించిన వారికి వేరేదో పెద్ద కుర్చీ దక్కిందట కదా’ అని మనం అడగాకూడదు. వారు విననూ కూడదు!
సిబిఐ కచేరీ తమ సొంత టీవీ స్టూడియో అయినట్టు, సర్కారీ పత్తేదారులు తమ కొలువులోని యాంకర్లు అయినట్టు, అక్కడ ఎవరిని ఏమి అడిగేదీ, ఎవరు ఏమి చెప్పేదీ, తరవాత ఏమి జరగబోయేదీ కెమెరాలు పెట్టి ప్రత్యక్ష ప్రసారం చేయిస్తున్నట్టు అమాయక జనానికి చెవిలో పూలు పెట్టటం తెలుగు మీడియా మోతుబరుల ప్రత్యేకత! ముఖ్యమంత్రి మహాశయుడు ఎక్కడికి వెళ్లినా ఎదురయ్యే నిరసన నినాదాలను జయజయ ధ్వానాలుగా చిత్రించి... ప్రతిపక్ష మహానాయకుడితో భుజం కలిపి ఏలినవారి పల్లకి మోసి తరించే మీడియాను వీక్షించటం మన పూర్వజన్మ సుకృతం. శత్రువును పాతరెయ్యటం కోసం ఎంతకైనా బరితెగించి, ఎన్ని నిలువుల లోతైనా నిజాన్ని పాతిపెట్టగలగటమే ఈ కాలపు పత్రికా ధర్మం!!

Monday, November 28, 2011

ఎన్‌కౌంటరా..పెన్‌కౌంటరా..?

ఎన్‌కౌంటరా..పెన్‌కౌంటరా..?

జర్నలిస్టు కాల్‌తో కిషన్‌జీ ఉనికి గుర్తింపు? పార్టీ ద్రోహులపైనా అనుమానం


సదానంద్ బెంబ్రే 
(ఆంధ్రభూమి బ్యూరో) 

 కరీంనగర్, నవంబర్ 26: మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వర రావు అలియాస్ కిషన్‌జీది నిజంగా ఎన్‌కౌంటరేనా? లేకపోతే కిషన్‌జీకి ఉన్న మీడియా బలహీనతను సానుకూలంగా మలచుకొన్న పోలీసులు ఫోన్‌కాల్‌ను ట్రాప్ చేయడం ద్వారా పట్టుకొని కాల్చి చంపారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. సంఘటన జరిగిన తీరుతెన్నులు, కేంద్ర కమిటి స్థాయిలో రెండవ స్థానంలో ఉన్న నాయకుడికి ఉండాల్సిన రక్షణ లేకపోవడం, కేవలం నలుగురు వ్యక్తులే సంఘటనా స్థలంలో ఉన్నట్లు పోలీసులు చెబుతుండటం అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. అంతేకాకుండా పార్టీలో ఆంధ్రప్రదేశ్, ఉత్తరాది రాష్ట్రాల క్యాడర్‌కు చెందిన నేతల మధ్య ఇటీవలి కాలంలో బేధాభిప్రాయాలు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. కిషన్‌జీ ఎన్‌కౌంటర్ వెనుక పార్టీకి చెందిన ద్రోహుల పాత్ర ఏమైనా ఉందా? అన్న అనుమానాలూ లేకపోలేదు. పీపుల్స్‌వార్ ఆవిర్భావం నుంచి రెడ్‌కార్‌డార్ నిర్మాణం వరకు పార్టీలో కీలక పాత్ర పోషించిన కిషన్‌జీ మొదటి నుంచి పార్టీలో కొంతమందికి కొరకరాని కొయ్యగానే ఉన్నట్లు ప్రచారంలో ఉంది. తాజా పరిణామాల్లో గణపతి అనారోగ్యరీత్యా బాధ్యతల నుంచి తప్పుకోవచ్చన్న ఊహాగానాలు బలంగా విన్పిస్తున్నాయి. గణపతి తరువాత ఎవరు పగ్గాలు చేపట్టాలన్న అంశంపై మావోయిస్టు పార్టీ గత రెండేళ్లుగా విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీలో గణపతి కన్నా సీనియరైన కిషన్‌జీకే పగ్గాలు అప్పగించవచ్చని వార్తలు వెలువడుతున్న తరుణంలో పూర్వ ఎంసిసి అగ్రనాయకుడైన కిషోర్‌జీ అలియాస్ కిషన్‌దా కూడా మావోయిస్టు పార్టీ సుప్రీమ్ రేసులో ఉన్నారు. ఆయనేకాకుండా మన రాష్ట్రానికే చెందిన నంబాల కేశవరావు కూడా రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో ఉత్తరాది నేతలకు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాయకులకు మధ్య నాయకత్వం విషయంలో తీవ్రమైన అగాథం ఏర్పడినట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా పోలీసులు చేస్తున్న ప్రచారమేనని గతంలో అనేక సందర్భాల్లో కిషన్‌జీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కొట్టిపారేశారు. అయితే ఇటీవలి కాలంలో లొంగిపోయిన ఛత్తీస్‌గడ్, ఎఒబి ప్రాంతాలకు చెందిన మావోయిస్టులు పార్టీలో నెలకొన్న విభేదాలను పరోక్షంగా ధ్రువీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కిషన్‌జీ ఎన్‌కౌంటర్ చర్చనీయాంశమైంది. జార్ఖండ్, పశ్చిమబెంగాల్ ప్రాంతాల్లో 21 సంవత్సరాలుగా పార్టీని ముందుకు నడిపించిన కిషన్‌జీకి మావోయిస్టు పార్టీ అగ్రనేతలకు కల్పించే రక్షణను ఎందుకు కల్పించలేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సాధారణంగా పార్టీలో కీలక స్థానంలో ఉన్న అగ్రనేతలకు బయట ప్రజాప్రతినిధులకు కల్పించే జడ్ ఫ్లస్ కేటగిరీ రక్షణ తరహాలో 40 మందికి తగ్గకుండా సాయుధుల రక్షణ ఏర్పాటు చేయాలి. కానీ కిషన్‌జీ ఎన్‌కౌంటర్ సంఘటనలో కేవలం నలుగురు మాత్రమే ఉండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇదిలా ఉంటే కిషన్‌జీ బుధవారం మిడ్నాపూర్‌కు చెందిన ఓ పాత్రికేయుడితో జరిపిన టెలీఫోన్ సంభాషణే పోలీసులకు ఆయన ఉనికిని పట్టించి ఉండవచ్చని భావిస్తున్నారు. కిషన్‌జీ మొదటి నుంచీ పార్టీ కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మీడియానే బలమైన సాధనంగా నమ్మేవాడని తెలుస్తోంది. ఈ కారణంగానే కిషన్‌జీ మీడియా ప్రతినిధులతో సన్నిహితంగా మెలిగేవాడని చెబుతున్నారు. ఈక్రమంలో ఆయన బలహీనతను పసిగట్టి పోలీస్ వర్గాలతో సన్నిహితంగా ఉండే జర్నలిస్టులను ఆయనతో సంభాషణలకు ఉపయోగించుకొని ఉండవచ్చని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ సరిగ్గా ఇదే తరహాలో అనేక ఎన్‌కౌంటర్లు జరిగినట్లు ఆరోపణలు రావడం ఈ సందర్భంగా గమనార్హం. 2004 శాంతి చర్చల తరువాత మావోయిస్టు అగ్రనేతలు మీడియాతో జరిపిన సంభాషణలే వారి ఉనికిని ఇంటిలిజెన్స్‌కు పట్టించాయి. దాంతో కేవలం మూడేళ్ల వ్యవధిలో రాష్ట్ర కార్యదర్శి బుర్ర చిన్నన్న అలియాస్ మాధవ్ సహా అనేకమంది అగ్రనేతలు, జిల్లా కార్యదర్శులు, దళాలను పోలీసులు మట్టుబెట్టగలిగారు. కిషన్‌జీ విషయంలోనూ పోలీసులు సరిగ్గా ఇదే వ్యూహాన్ని అనుసరించినట్లు బెంగాల్‌కు చెందిన ఓ ప్రముఖ దినపత్రిక సీనియర్ జర్నలిస్టు ధ్రువీకరించడం ఎంతైనా ప్రస్తావనార్హం. లాల్‌గఢ్ సంఘటన జరిగిన సందర్భంలోనూ కిషన్‌జీ ఆచూకీని పోలీసులు ఇదే తరహాలో పసిగట్టి చుట్టుముట్టినట్లుగా వార్తలు వచ్చాయి.

తుపాకీ నీడలో అశ్రునివాళి

 

పోలీసు కనుసన్నల్లో కిషన్‌జీ అంతిమయాత్ర దారి మళ్లించేందుకు యత్నం ప్రజాసంఘాల వాగ్వాదంతో ఉద్రిక్తత నివాళులర్పించిన ఎంపి, ఎమ్మెల్యేలు విప్లవ నినాదాల మధ్య అంత్యక్రియలు

కరీంనగర్, నవంబర్ 27: పశ్చిమబెంగాల్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ పార్థివ దేహానికి ఆదివారం కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో వేలాదిమంది అశ్రునయనాల మధ్య విప్లవ నినాదాలతో తుది వీడ్కోలు పలికారు. సాయంత్రం 4.20 గంటలకు మావోయిస్టు వౌలిక సిద్ధాంతాన్ని అనుసరించి అంత్యక్రియలు నిర్వహించారు. ఇదిలాఉండగా కిషన్‌జీ భౌతికకాయం శనివారం అర్ధరాత్రి పెద్దపల్లికి చేరుకోవడంతో ఆదివారం ప్రజల సందర్శనకోసం పార్థివ దేహాన్ని స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో ఉంచేందుకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ప్రయత్నించారు. అయితే పోలీసులు అడ్డుకొని టెంట్లను తొలగించడంతో ఆయన ఇంటి ప్రాంగణంలోనే ఉంచారు. ఆదివారం ఉదయం నుంచే వేలాది మంది ప్రజలు, విద్యార్థులు, కిషన్‌జీ మాజీ సహచరులు, ప్రజాగాయకుడు గద్దర్, విరసం నేతలు వరవరరావు, కల్యాణ్ రావు, పౌరహక్కుల సంఘం నాయకుడు శేషయ్య, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకుడు వెంకట్రామయ్య, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తదితరులతో పాటు పెద్దపల్లి ఎంపి జి వివేక్, ఎమ్మెల్యేలు సిహెచ్ విజయ రమణారావు, కొప్పుల ఈశ్వర్, టిఆర్‌ఎస్‌ఎల్‌పి నేత ఈటెల రాజేందర్, వరంగల్ జిల్లా ములుగు ఎమ్మెల్యే సీతక్క, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు తదితర ప్రజాప్రతినిధులతో పాటు వివిధ పార్టీలకు చెందిన రాజకీయ ప్రముఖులు కిషన్‌జీ భౌతికకాయానికి ఘనంగా నివాళులర్పించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరైన నేపథ్యంలోనే వీలైనంత త్వరగా అంతిమయాత్ర ముగించాలని పోలీస్ అధికారులు కుటుంబీకులపై ఒత్తిడి తేవడంతోపాటు, పట్టణంలోకి ప్రవేశించకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో పోలీసులకు కిషన్‌జీ మాజీ సహచరులు, ప్రజాసంఘాల నేతలకు మధ్య ఘర్షణపూరిత వాతావరణం తలెత్తింది. అయితే పోలీసులు కొంత వెనక్కి తగ్గడంతో కిషన్‌జీ భౌతికకాయంతో ప్రధాన వీధులగుండా అంతిమయాత్ర నిర్వహించి, అవుసుల బావి శ్మశాన వాటికలో మావోయిస్టు పార్టీ లాంఛనాల ప్రకారం అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. విప్లవ యోధుడికి మత సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించకూడదన్న పార్టీ సిద్ధాంతం మేరకు కిషన్‌జీ అన్న సోదరుడితో పాటు వరవరరావు, విమలక్క, మందకృష్ణ తదితరులు చితికి నిప్పంటించారు. అంతిమయాత్ర ఆద్యంతం పోలీసుల కనుసన్నల్లో కొనసాగినా, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు ఏమాత్రం ఖాతరు చేయకుండా విప్లవగేయాలను ఆలపిస్తూ ప్రభుత్వ, పోలీస్ వ్యతిరేక నినాదాలతో ముందుకు సాగారు.
(చిత్రం) కిషన్‌జీ భౌతిక కాయం