Tuesday, November 29, 2011

మిగిలేదెవరు?!

November 19th, 2011

ఛఛ! ఇదేం బాగో లేదు! వారి మీద కేసులు, వీరికి రిమాండ్లు భలే బాగున్నాయని అందరూ పళ్లికిలిస్తున్నారే తప్ప అరవై ఏళ్లుగా మన మహానేతలు కడు జాగ్రత్తగా కలిసికట్టుగా కాపాడుకొస్తున్న ఎంచక్కని ఏర్పాటుకు ముంచుకొస్తున్న ముప్పును ఎవరూ గ్రహించటమే లేదు!
పేరు మోసిన మన పార్టీల మధ్య, వాటిని నడిపే నేతల మధ్య పైకి చెప్పుకోని, చెప్పుకోకూడని పెద్ద మనుషుల ఒప్పందం చాలా ఏళ్లుగా ఉంది. ఒకసారి గెలిచి తాము పవర్లోకి వస్తే జనానికి రోతపుట్టి మళ్లీ ఎన్నికల్లో తమను తన్ని తగలెయ్యటం ఖాయం. (పూర్తికాలం అధికారం చలాయంచీ మళ్లీ గద్దెనెక్కగలిగింది ఇటీవలి రాజశేఖరరెడ్డి ఒక్కడే) తమ మీద అసహ్యంతో ఎగస్పార్టీని నెత్తిన పెట్టుకున్నా, తప్పుడు పనుల్లో వాళ్లూ తమకు తోడు బోయిన వారే కనుక, మళ్లీ వచ్చే ఎన్నికల్లో వారినీ గెంటేయటం దాదాపు గ్యారంటీ! వాళ్లకు శాస్తి చెయ్యాలంటే ఇష్టమున్నా లేకున్నా మళ్లీ తమనే పిలిచి పల్లకి ఎక్కించటం మినహా వెర్రిజనానికి వేరే దారి ఉండదు. కాబట్టి గద్దెమీద ఉన్నప్పుడు అడ్డగోలుగా నొక్కేసినదాన్ని అపోజిషన్లో ఉన్న ఐదేళ్లూ దర్జాగా ఎంజాయ్ చేస్తే తరువాయి ఎన్నికల్లో వద్దన్నా పవరు తమ కాళ్లదగ్గరికి నడిచొస్తుంది.
ఈ అధర్మ సూక్ష్మం అన్ని పార్టీలకీ అర్థమైంది. తమ చేతిలో అధికారం ఉన్నప్పుడు అపోజిషను వాళ్ల పాత పాపాలను కెలక్కుండా ఉంటే వాళ్ల ‘వంతు’ వచ్చినప్పుడు వాళ్లూ తమను తిప్పలు పెట్టకుండా ఉంటారు. అందుకే - ‘తిను-తిననివ్వు; బతుకు-బతకనివ్వు’ అన్న పాలిసీతో అన్ని పార్టీల అందరు లీడర్లూ పైకి మాత్రం కలహించుకుంటూ, అవసరమైనప్పుడు సహకరించుకుంటూ జనాల చెవిలో పూలు పెడుతూ వచ్చారు. అధికార పార్టీ వాళ్లు అక్కడ ఇంత తిన్నారు, ఇందులో ఇంత బొక్కారు; మాకే కనుక అధికారం వస్తే వాళ్లు తిన్నది మొత్తం కక్కిస్తాం... జైల్లో కుక్కేస్తాం... విచారణలు జరిపించి, పాపాల చిట్టా విప్పిస్తాం... అని రంకెలేసే విపక్ష మేళం వాళ్లకు పవరు చేతికొచ్చాక ఆ ఊసే గుర్తుండదు. కాంగ్రెసు పోయి ‘దేశం’ వచ్చినా, ‘దేశం’ పోయి కాంగ్రెసు వచ్చినా ఏ పార్టీ వాడి ఏ అక్రమ ఆస్తీ చెక్కు చెదరదు. పట్టుకుంటారేమోనన్న భయమూ ఎవరికీ ఉండదు.
ఇంతకాలమూ బహు చక్కగా, అందరికీ వాటంగా నడుస్తున్న ఈ భలే మంచి ఏర్పాటు కాస్తా ఇప్పుడు భళ్లున బద్దలైంది. ఏ పార్టీ ప్రభువూ తనకు తానై మాజీ పాలకుల, వారి ఇలాకావాళ్ల అక్రమ ఆర్జనల జోలికి పోకుండా ఎంత గొప్ప సంయమం చూపితేనేమి? పనిలేని కోర్టులు తీరికూర్చుని మారాజుల బంగారు పుట్టలో వేలు పెట్టటంతో అంతులేని కథ కాస్తా అడ్డం తిరిగింది. పరిపాలకుల పెంపుడు జంతువులా బుద్ధిగా ఒదిగి ఉండి, వారు కరవమన్న వారిని మాత్రమే కరవమన్న మేరకే కరుస్తూ, నమ్మినబంటులా సేవ చేసిన సిబిఐకి కూడా కోర్టుల చేతిలో పడ్డాక కోరలొచ్చాయి. కొమ్ములూ మొలిచాయి. వాటితో పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఎవరిని పడితే వారిని కుమ్ముతూ... విచారణలు, అరెస్టులు అంటూ కుళ్లబొడిచేస్తున్నది. మరీ ఇంత ఓఘాయిత్యమైతే మన రాజకీయ మణిమాణిక్యాలు ఇక ఎవరితో మొరపెట్టుకోవాలి?!
కృష్ణపక్షంలో చంద్రుడికాంతి అంతకంతకూ క్షీణించి అంతరించినట్టు, ఎన్నికలు దగ్గరపడే కొద్దీ సర్కారు ప్రకాశం సన్నగిల్లుతుంది. అపోజిషను మీద మోజు నానాటికీ పెరుగుతుంది. ఎన్నికల అమావాశ్య నాటికి పాలకపక్షం పరువు నేలమట్టమైతే అపోజిషను కళ అదే దామాషాలో పెరగుతూపోయి, పాత ప్రత్యామ్నాయాన్ని దుమ్ము దులిపి మళ్లీ కళ్లకద్దుకోవటం ఓటరయ్యలకు సులువవుతుంది.
కాని - ఇప్పుడో? రూలింగు పార్టీ షరామామూలుగా డీలాపడింది. పాత పహిల్వాన్‌కు తోడు కొత్త వస్తాదు గోదాలోకి దిగటంతో అపోజిషను సీను మారింది. బిగ్ ఫైటు అంతా బాబు, జగన్‌ల మధ్యే హోరాహోరీగా నడుస్తోంది. ‘పవర’మాల చివరికి వీరిలో ఎవరి మెళ్లో పడవచ్చునని జనాలు తర్కిస్తున్న సమయంలో ఉరుములేని పిడుగులా ఇద్దరి నెత్తినా సిబిఐ కేసుల బండలు పడ్డాయి. తన బద్ధ శత్రువైన కాంగ్రెసు జగన్ మీద పెట్టించిన కేసుకు టి.డి.పి. పక్క తాళం వేస్తే.. తమరు మాత్రం తక్కువ తిన్నారా బాబూ అని జగనమ్మ కోర్టుకెక్కి బాబు ఆస్తుల మీద సిబిఐ దర్యాప్తు వేయించింది. మళ్లీ ఎన్నికల్లో అధికార దండం అందుకోవాలనుకుంటున్న ఇద్దరు నేతాశ్రీలూ అవినీతి ఆరోపణల ఊబిలో ఇరుక్కుని, కాంగ్రెసుకు దీటుగా కుదేలైతే ఇక జనం ఎవరికి ఓటెయ్యాలి? అధికారం మార్పిడి ఎలా జరుగుతుంది? సిబిఐ వాళ్లొచ్చి ఆటంతా మార్చేస్తే ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్షం మీద కొరడా ఝళిపిస్తే పవిత్ర ప్రజాస్వామ్యం ఏమి కావాలి? ఇదీ సమస్య.
ఎప్పుడో రెండేళ్ల తరవాత వచ్చే ఎన్నికల్లో ప్రత్యామ్నాయం మాట దేవుడెరుగు. ముందు మన ధర్మ ప్రభుత్వం నడిచేదెలా? ‘‘ఊబ నా మగడు ఉండీ ఒకటే లేకా ఒకటే’’ అన్నట్టు మంత్రిశ్రీలు కొలువులో ఉన్నా ఒకటే. లేకున్నా ఒకటే. ఆ సంగతి మొన్న తెలంగాణ ‘సకలం’లోనే అందరికీ తెలిసి వచ్చింది. మంత్రులు లేకుంటే పోయేగానీ సర్కారు రథాన్ని నడపటానికి పై ఎత్తున అధికారులైతే కావాలి కదా? జమానా మారినా తమ జోలికి ఎవరు రారు అన్నది అనుభవంలో రూఢి కావటంతో అధికార గణానికి పట్టపగ్గాలు లేవు. వారిది ఆలిండియా సర్వీసు కనుక తప్పుడు పనులు చేసేది లేదని కరాఖండిగా తిరస్కరించినా రాజకీయ నాయకులు చేయగలిగింది పెద్దగా ఉండదు. అయినా ఆ సోయి బతకనేర్చిన అధికార్లకు ఉండదు. స్వామిని మించిన స్వామి భక్తితో పాలకపక్షానికి తాబేదారులా తమను తాము దిగజార్జుకుని, ముఖ్యమంత్రి మెహర్బానీకి అంగలార్చి, కనుసైగ చేస్తే చాలు ఎలాంటి తప్పుడు పనినైనా చేసి, రూల్సు నడ్డి విరిచి ‘పై’వాళ్లను ఖుషీ చేసి, అత్తసొత్తును అల్లుడు దానం చేసినట్టు గనాఘనులకు లీజులు, పర్మిషన్లు అడ్డగోలుగా కట్టబెట్టిన ఆఫీసరు రత్నాలకు ఇప్పుడు మూడింది.
ఒక్క గాలి కేసుకే ఇంత గోలైంది. ఇప్పటికే ఇద్దరు ఐ.ఎ.ఎస్. పెద్ద్ఫాసర్లు జైలుదారిలో ఉన్నారు. ఇక జగన్ ఆస్తుల తబిసేళ్లలోనూ ఉచ్చు బిగిసి, పనిలో పనిగా అనేక ఆరోపణలలో ఆరియు తేరిన బాబు మీదా సిబిఐ కోర్టు పురమాయింపుపై కేసుల బండలు పడి... తొమ్మిదేళ్ల ‘సైకిల్’ రాజ్యంలో బాబు అడుగులకు మడుగులెత్తిన బాబుశ్రీల మీదా కేసుల నోళ్లు తెరచుకుంటే ఎన్ని డజన్ల అధికారుల మీద, మంత్రుల మీద కేసులు పెట్టాలి? ఈ తీగలతో కేసుల డొంకలు ఒకటొకటిగా కదులుతూ పోతే, పట్టువదలని శంకరరావు మంత్రిగా ఉండీ సాటి మంత్రుల మీద, ముఖ్యమంత్రి మీద యుద్ధం ప్రకటించి ఇలాగే ముందుకు పోతే ప్రభుత్వంలో మిగిలేదెందరు? జైలు విడిదిలో సెటిలయ్యేదెందరు? ఎక్కువమంది జైల్లో ఉంటే సర్కారు ఎలా నడుస్తుంది. ఈ వరస ఇలాగే కొనసాగి అధికారులు, మంత్రులు సచివాలయానికి రాలేకపోతే సచివాలయం బ్రాంచి ఆఫీసును వారున్న చోటే పెడితే బాగుంటుందేమో?

No comments:

Post a Comment