---సాక్షి
November 5th, 2011
కుక్క పని కుక్క చెయ్యాలి. గాడిద పని గాడిద చెయ్యాలి. ఇది పంచతంత్రం నీతి. ఇప్పుడు నడుస్తున్న రాజకీయ తంత్రం దీనికి సరిగ్గా రివర్సు!
మామూలుగా సర్కారీ పక్షం సర్కారు కొమ్ము గాస్తుంది. విపక్షమేమో సందు దొరికితే చాలు సర్కారును పడగొట్టాలని కాచుకుని ఉంటుంది. చిత్రవిచిత్ర ఆంధ్రా రాజకీయం లోనో?! విపక్షం కూలీ లేకుండా గవర్నమెంటుకు కావలి కాస్తుంది. పడగొట్టేందుకు లక్కీచాన్సు నడుచుకుంటూ కాళ్ల దగ్గరికి వచ్చినా కళ్లు మూసేసుకుని, చేతులు కట్టేసుకుని, ఓటి సర్కారుకు ఢోకా లేకుండా కంటికి రెప్పలా కాపాడుతుంది.
సాధారణంగా అధికార పక్షంలో చిన్నపాటి తిరుగుబాటు లేస్తేనే... మెజారిటీకి ముప్పులేదని తెలిసినప్పటికీ... ప్రతిపక్షం రెచ్చిపోతుంది. వెంటనే అసెంబ్లీని పిలిచి విశ్వాస పరీక్ష పెట్టాలని గవర్నరుకు డిమాండు మీద డిమాండు చేస్తుంది. నెగ్గే ఆశ ఏకోశానా లేదని తెలిసినా, అవిశ్వాస తీర్మానం పెట్టి గవర్నమెంటును దెబ్బతీయటానికి ఉవ్విళ్లూరుతుంది. అలాంటిది - నిజంగా పెద్ద తిరుగుబాట్లే లేచి గవర్నమెంటు మనుగడే గండంలో పడితే...? విశ్వాసమో అవిశ్వాసమో తరుముకొచ్చి పరీక్ష పెడితే గవర్నమెంటు గట్టెక్కటం అనుమానమేనని కళ్లముందు కనపడుతూంటే...? ఎగిరి గంతేసి, ప్రభుత్వం దుంప తెంచకుండా ఏ ప్రతిపక్షమైనా ఊరకుంటుందా?
ఉంటుంది! జంతర్ మంతర్ ఆంధ్రా పాలిటిక్సులో! నారా నాయుడిగారి లోకోత్తర నిర్వాహకంలో!!
రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం సీట్లు 294. అందులో ఒకటి ఖాళీ. కనీసం 147 మంది వద్దు పొమ్మంటే చాలు కాంగ్రెసు సర్కారు కుప్పకూలుతుంది. ఒక్క తెలుగుదేశానికే 90 మంది ఎమ్మెల్యేలున్నారు. (వారిలో ముగ్గురు తిరగబడినా, ఇప్పుడున్న పరిస్థితుల్లో కిరణ్ జమానాకు పల్లకి మోయరు.) తెరాస, బిజెపి, కమ్యూనిస్టులు, అమాంబాపతులను కలిపితే 21. కాంగ్రెస్, ప్రజారాజ్యాల నుంచి ఇప్పటికే 27గురు జగన్‌కు జైకొట్టి కాంగ్రెస్ మీద కత్తి కట్టారు. ఈ మధ్యే ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెరాస వైపు దూకారు. 90+21+27+3=141. సర్కారును కూల్చేందుకు కావలసిన ‘మాజిక్ ఫిగర్’ 147కి ఇది అరడజను మాత్రమే తక్కువ. తెలంగాణ సెంటిమెంటు, కాంగ్రెసులో లుకలుకలు ఇప్పుడున్న స్థితిలో వ్యవహారం అంతదాకా వస్తే కిరణ్ సర్కారును సాగనంపడానికి ఆరుగురిని కూడగట్టటం మంచినీళ్ల ప్రాయం. ఏదైనా... ప్రధాన ప్రతిపక్షమైన ‘సైకిలు’వారు సై అన్నప్పుడు మాత్రమే సాధ్యం. అంటే... కాంగ్రెసు సర్కారును ఉంచటమా, ఊడగొట్టటమా అనేది తెలుగుదేశాధీశుడి చేతుల్లోనే ఉంది. నాయుడుగారు నిజంగా కాంగ్రెసుకు పగవాడే అయితే శత్రువును కూల్చటానికి ఇంతకు మించిన సమయం దొరకదు.
కాని చిత్రం! మాయల ఫకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు దొరతనం ప్రాణం చంద్రబాబు చేతుల్లో ఉన్నా ఆయన కాంగ్రెసు చిలకను గుటుక్కుమనిపించకపోగా అల్లారుముద్దుగా కాపాడుతున్నాడు! గవర్నమెంటు ఎప్పుడు చిక్కుల్లో పడ్డా ఆపద్బాంధవుడిలా చక్రం అడ్డు వేస్తూ... అక్కర వచ్చినప్పుడు లోపాయకారీగా ఆదుకుంటూ... అధికార పార్టీలో ఎందరు ఎదురుతిరిగినా చూడనట్టే నటిస్తూ... పడగొడదాం రావయ్యా మగడా అని వేరేవాళ్లు పిలిచినా మాకేమి పట్టిందని వాదులాడుతూ... అవిశ్వాసాన్ని మీరు దంచండి; నేను పక్కలెగరేస్తానని తప్పించుకుంటూ అతి తెలివిగా కాపుకాసే నాయుడే ఇవాళ కాంగ్రెసు సర్కారుకు అసలైన ఇన్సూరెన్సు!
పాపం ఆయన మాత్రం ఏమిచేయగలడు? పీత కష్టాలు పీతవన్నట్టు బాబు కష్టాలు బాబువి. గవర్నమెంటును పడగొట్టగానే సంబరం కాదు. ఆ తరవాత ఎన్నికలొస్తే అటు తెలంగాణలో ఉప్పుపుట్టక, ఇటు సీమాంధ్రలో పరువు దక్కక, ఇటీవలి రివాజు ప్రకారం డిపాజిట్లు గల్లంతయితే తెదేపాకు ఏదీగతి? అందుకే ఎన్నికల సుడిగుండంలో మొత్తం మునిగే కన్నా, కాంగ్రెసుకు కర్ర పోలీసుగా బతుకు వెళ్లదియ్యటమే తెలుగు చాణక్యుడి దృష్టిలో తెలివైన పని!
కారణాలు ఏమైతేనేమి- ప్రధాన ప్రతిపక్షమే కొండంత అండగా నిలబడినప్పుడు కాంగ్రెసు హిప్పొపొటామసును ఏ తిరుగుబాటు బండా ఏమీ చెయ్యలేదు. బాగుంది. ప్రతిపక్షం పోయి పాలక పక్షం కొమ్ము కాస్తే మరి ప్రతిపక్షం పని ఎవరు చెయ్యాలి? ఎవరూ చెయ్యకపోతే ప్రజాస్వామ్యం ఏమి కావాలి? ఆ సంగతి ప్రజాస్వామ్యాన్ని కాచివడబోసిన కాంగ్రెసు వాళ్లకు ఒకరు చెప్పక్కర్లేదు. అందుకే ఒక చెంప ప్రభుత్వంలో భాగంగా ఉంటూనే ప్రభుత్వాన్ని దెబ్బతీసే ప్రతిపక్షం పాత్రనూ శ్రమ అనుకోకుండా వాళ్లే పోషిస్తూ ఏకకాలంలో ఎంచక్కా ద్విపాత్రాభినయం చేస్తున్నారు.
మా ప్రభుత్వంలో ఫలానా మంత్రులు అవినీతిపరులని ఇంకో మంత్రి గవర్నరుకు ఫిర్యాదుచేసి, పనిలో పనిగా లోకాయుక్తకూ చెవిన వేస్తాడు. మా ప్రభుత్వం ప్రకటించిన ఫలానా పథకం శుద్ధ దండుగని ఒక సీనియర్ మంత్రి మెటికలు విరిస్తే, మా ప్రభుత్వంలో ఫలానా విభాగాలు వేస్ట్ అని స్వయానా ఆ విభాగాలను చూసే ఇంకో మంత్రి మహోదయుడు లోకానికి చాటుతాడు. మంత్రికీ మంత్రికీ పడదు. ముఖ్యమంత్రిని మంత్రులు గుర్తించరు. మంత్రులను ఎమ్మెల్యేలు గుర్తించరు. అధికారుల మీద మంత్రులు, మంత్రుల మీద అధికారులు, వారిద్దరి మీద ఎమ్మెల్యేలు దుమ్మెత్తి పోస్తారు. ఆ రకంగా పాలక ప్రముఖులందరూ తలా ఒక చెయ్యి వేసి దీటైన ప్రతిపక్షం లేని లోటును బ్రహ్మాండంగా భర్తీ చేస్తున్నారు.
అంతేకాదు. ఏ పార్టీకి ఎంతమంది ఎమ్మెల్యేలున్నారో తెలియదు. ఏ ఎమ్మెల్యే ఏ పార్టీకి చెందుతాడో అర్థం కాదు. ఎవరు ఎమ్మెల్యేనో, ఎవరు కాదో అంతకన్నా అంతుబట్టదు. అసెంబ్లీ రికార్డుల్లో ఒకటుంటే బయట రాజకీయంలో వేరొకలా కనపడుతుంది. ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేస్తే పార్టీ నేత ఆమోదించరు. శాసనసభ్యత్వాలను త్యాగం చేస్తే సభాపతి ఒప్పుకోరు. ఎమ్మెల్యేలు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్లు పార్టీలు మార్చినా పార్టీల నాయకత్వాలు పట్టించుకోవు. రాష్ట్రంలో ప్రభుత్వంలాగే ఫిరాయింపుల నిరోధక శాసనం కూడా ఉండీ లేనట్టే! చట్టాలు, కట్టుబాట్లు ఇక్కడ చెల్లవు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయమే ఒక పెద్ద అబ్రకదబ్ర!
No comments:
Post a Comment