పోలీసు కనుసన్నల్లో కిషన్‌జీ అంతిమయాత్ర దారి మళ్లించేందుకు యత్నం ప్రజాసంఘాల వాగ్వాదంతో ఉద్రిక్తత నివాళులర్పించిన ఎంపి, ఎమ్మెల్యేలు విప్లవ నినాదాల మధ్య అంత్యక్రియలు
November 28th, 2011
కరీంనగర్, నవంబర్ 27: పశ్చిమబెంగాల్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ పార్థివ దేహానికి ఆదివారం కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో వేలాదిమంది అశ్రునయనాల మధ్య విప్లవ నినాదాలతో తుది వీడ్కోలు పలికారు. సాయంత్రం 4.20 గంటలకు మావోయిస్టు వౌలిక సిద్ధాంతాన్ని అనుసరించి అంత్యక్రియలు నిర్వహించారు. ఇదిలాఉండగా కిషన్‌జీ భౌతికకాయం శనివారం అర్ధరాత్రి పెద్దపల్లికి చేరుకోవడంతో ఆదివారం ప్రజల సందర్శనకోసం పార్థివ దేహాన్ని స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో ఉంచేందుకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ప్రయత్నించారు. అయితే పోలీసులు అడ్డుకొని టెంట్లను తొలగించడంతో ఆయన ఇంటి ప్రాంగణంలోనే ఉంచారు. ఆదివారం ఉదయం నుంచే వేలాది మంది ప్రజలు, విద్యార్థులు, కిషన్‌జీ మాజీ సహచరులు, ప్రజాగాయకుడు గద్దర్, విరసం నేతలు వరవరరావు, కల్యాణ్ రావు, పౌరహక్కుల సంఘం నాయకుడు శేషయ్య, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకుడు వెంకట్రామయ్య, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తదితరులతో పాటు పెద్దపల్లి ఎంపి జి వివేక్, ఎమ్మెల్యేలు సిహెచ్ విజయ రమణారావు, కొప్పుల ఈశ్వర్, టిఆర్‌ఎస్‌ఎల్‌పి నేత ఈటెల రాజేందర్, వరంగల్ జిల్లా ములుగు ఎమ్మెల్యే సీతక్క, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు తదితర ప్రజాప్రతినిధులతో పాటు వివిధ పార్టీలకు చెందిన రాజకీయ ప్రముఖులు కిషన్‌జీ భౌతికకాయానికి ఘనంగా నివాళులర్పించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరైన నేపథ్యంలోనే వీలైనంత త్వరగా అంతిమయాత్ర ముగించాలని పోలీస్ అధికారులు కుటుంబీకులపై ఒత్తిడి తేవడంతోపాటు, పట్టణంలోకి ప్రవేశించకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో పోలీసులకు కిషన్‌జీ మాజీ సహచరులు, ప్రజాసంఘాల నేతలకు మధ్య ఘర్షణపూరిత వాతావరణం తలెత్తింది. అయితే పోలీసులు కొంత వెనక్కి తగ్గడంతో కిషన్‌జీ భౌతికకాయంతో ప్రధాన వీధులగుండా అంతిమయాత్ర నిర్వహించి, అవుసుల బావి శ్మశాన వాటికలో మావోయిస్టు పార్టీ లాంఛనాల ప్రకారం అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. విప్లవ యోధుడికి మత సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించకూడదన్న పార్టీ సిద్ధాంతం మేరకు కిషన్‌జీ అన్న సోదరుడితో పాటు వరవరరావు, విమలక్క, మందకృష్ణ తదితరులు చితికి నిప్పంటించారు. అంతిమయాత్ర ఆద్యంతం పోలీసుల కనుసన్నల్లో కొనసాగినా, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు ఏమాత్రం ఖాతరు చేయకుండా విప్లవగేయాలను ఆలపిస్తూ ప్రభుత్వ, పోలీస్ వ్యతిరేక నినాదాలతో ముందుకు సాగారు.
(చిత్రం) కిషన్‌జీ భౌతిక కాయం
No comments:
Post a Comment