Sunday, January 10, 2016

బెంగాల్ లో మమతాదే హవా...


న్యూఢిల్లీ, మే 10: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అలా ముగిసాయో లేదో వివిధ చానెళ్లు తమ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను మంగళవారం వెల్లడించాయి. దాదాపు మూడున్నర దశాబ్దాలుగా పశ్చిమ బెంగాల్‌ను ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలిస్తున్న వామపక్ష కూటమి ఈ ఎన్నికల్లో తుడిచిపెట్టుకు పోతుందని అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడించాయి. తృణమూల్ కాంగ్రెస్ కూటమి విజయదుందుభి మోగిస్తుందని పేర్కొన్నాయి. అయితే మిగతా రాష్ట్రాల్లో మాత్రం వివిధ చానెళ్ల ఎగ్జిట్ పోల్ సర్వేల ఫలితాలు వేర్వేరుగా ఉన్నాయి. తమిళనాడులో ఎఐఎడిఎంకె కూటమి ఆధిక్యంలో ఉందని సిఎన్‌ఎన్-ఐబిఎన్-సిఎస్‌డిఎస్ సర్వే పేర్కొనగా, ఎఐఎడిఎంకె, డిఎంకె కూటములకు మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు ఉందని హెడ్‌లైన్స్ టుడే-ఓఆర్‌జి సర్వే తెలిపింది. అలాగే కేరళలో వామపక్ష ప్రజాతంత్ర కూటమి (ఎల్‌డిఎఫ్) స్వల్ప ఆధిక్యంలో ఉందని సిఎన్‌ఎన్-ఐబిఎన్ సర్వే పేర్కొనగా, కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్) స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వస్తుందని హెడ్‌లైన్స్ టుడే తెలిపింది. అసోంలో కాంగ్రెస్ మూడోసారి అధికారంలోకి వస్తుందని సిఎన్‌ఎన్-ఐబిఎన్ పేర్కొనగా, హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని హెడ్‌లైన్స్ టుడే వెల్లడించింది. పరిశోధనా సంస్థ సి-వోటర్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం.. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధిస్తుంది. తమిళనాడులో ఎఐఎడిఎంకె మంచి మెజారిటీ సాధిస్తుంది. అసోంలో హంగ్ ఏర్పడుతుంది. కేరళలో కాంగ్రెస్ కూటమి స్పష్టమైన మెజారిటీ సాధిస్తుంది. కేరళలో వామపక్ష కూటమి ఓడిపోతుందని, యుడిఎఫ్ అధికారంలోకి వస్తుందని స్టార్ న్యూస్ టెలివిజన్ చానెల్ సర్వే కూడా తెలిపింది.
హెడ్‌లైన్స్ టుడే-ఓఆర్‌జి సర్వే ప్రకారం.. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్- కాంగ్రెస్ కూటమి మూడింట రెండు వంతుల ఆధిక్యంతో అధికారంలోకి వస్తుంది. 294 స్థానాలున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో తృణమూల్ కూటమికి 210 నుంచి 220 స్థానాలు వస్తాయి. ఈ ఎన్నికల్లో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) నేతృత్వంలోని వామపక్ష కూటమి కేవలం 65 నుంచి 70 స్థానాల్లో మాత్రమే గెలుపొందుతుందని ఈ సర్వే సూచిస్తోంది. అలాగే 10 నుంచి 15 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు, ఇతర పార్టీల అభ్యర్థులు గెలుపొందుతారని సర్వే వెల్లడించింది. స్టార్ న్యూస్ టెలివిజన్ చానెల్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం తృణమూల్ కాంగ్రెస్ 181, కాంగ్రెస్ 40 స్థానాల్లో విజయపతాకం ఎగురవేస్తాయి. లెఫ్ట్ ఫ్రంట్ బలం ప్రస్తుతం ఉన్న 227 స్థానాల నుంచి 62 స్థానాలకు పడిపోతుంది.
కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ 88 స్థానాల్లో గెలుపొంది అధికారంలోకి వస్తుందని స్టార్ న్యూస్ టెలివిజన్ చానెల్ ఎగ్జిట్ పోల్ సర్వే తెలిపింది. సిపిఎం నేతృత్వంలోని వామపక్ష కూటమి కేవలం 49 స్థానాల్లో మాత్రమే గెలుపొందుతుందని పేర్కొంది.
అదో చెత్త సర్వే: సిపిఎం
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష కూటమి ఓడిపోతుందనే హెడ్‌లైన్స్ టుడే-ఓఆర్‌జి సర్వేను చెత్త సర్వేగా సిపిఎం కొట్టిపారేసింది. ఈ సర్వేకు శాస్ర్తియ ఆధారం లేదని సిపిఎం పశ్చిమబెంగాల్ రాష్ట్ర కార్యదర్శి, లెఫ్ట్ ఫ్రంట్ చైర్మన్ బిమన్ బసు పేర్కొన్నారు. మంగళవారం ఆయన కోల్‌కతాలో విలేఖరులతో మాట్లాడుతూ.. వామపక్ష కూటమి ఓడిపోతుందనే జోస్యాన్ని టివి చానెళ్లు పోటీ పడి ప్రసారం చేస్తున్నాయని, అయితే వాస్తవం మరోలా ఉంటుందని రుజువవుతుందని అన్నారు. 2001 నుంచి బెంగాల్‌లో ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు తప్పని రుజువవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. లెఫ్ట్ ఫ్రంట్ వరుసగా అధికారంలోకి వస్తుండడాన్ని అడ్డుకోవడానికి, ప్రజల మనసులను ప్రభావితం చేయడానికి ఇలాంటి సర్వేలు విఫలయత్నం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. వరుసగా ఆరోసారి లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు. పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని గోపిబల్లవ్‌పూర్, బిన్‌పూర్‌లలో కొన్ని బూత్‌లలో సిపిఎం ఏజెంట్లను తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు, మావోయిస్టులు బెదిరించారని బిమన్ బసు ఆరోపించారు. ఈ విషయమై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు.

No comments:

Post a Comment