* ఓ.సి సామాజిక వర్గాల్లో పెరుగుతున్న అసహనం
* పదేళ్ల వెసులుబాటు శాశ్వత హక్కెలా అయ్యింది
* నిజానికి అంబేద్కర్ కాంక్షించిందేమిటీ?
* ఉన్నత వర్గాల్లో సామాజిక అంతరాల మాటేమిటి?
* రాష్ట్రానికో విధానమా..!?
వాస్తవాల ప్రాతిపదికన రిజర్వేషన్‌ల వర్గీకరణ చేయక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్వాతంత్ర్యం సిద్దించి దాదాపు ఏడు దశాబ్దాలు కావస్తున్నా..ఇంకా కాలం చెల్లిన కులాల వారీ రిజర్వేషన్లు సరిచేయకపోవడంతో రిజర్వేషన్ల వల్ల నష్టపోతున్నామన్న భావనతో ఉన్న OC సామాజిక వర్గాలలో అసహనం తీవ్రతరమవుతోంది.
ఇప్పటికే గుజరాత్‌లో పటేల్ వర్గం నుండి తమకూ రిజర్వేషన్లలో భాగం కల్పించాలంటూ హర్థిక్ పటేల్ సారథ్యంలో ఉధ్యమం ఊపందుకుంది. మహరాష్ట్ర లో మరాఠాలు అదే దారిలో ఉన్నారు. అక్కడ ప్రభుత్వం ప్రత్యేకంగా మరాఠా సామాజిక వర్గానికి18% రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నా కోర్టు జోక్యంతో నిలిపేశారు. ఇక్కడ తెలంగాణాలో రెడ్డి సామాజిక వర్గం రిజర్వేషన్లు రద్దు కోరుతూ ఉద్యమం నిర్మాణం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కాపు సామాజిక వర్గాన్ని బిసి జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ పద్మనాభం అద్వర్యాన ఎప్పటి నుంచో ఉద్యమం జరుగుతున్నా ఈ మద్య దూకుడు పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎస్సీలను వర్గీకరణ చేయాలని మందకృష్ణ గళమెత్తుతున్నారు. దానాదీనా మొత్తంగా రిజర్వేషన్లు సమీక్షించి ఆర్థిక వెనుకబాటు ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలన్న డిమాండ్ ఓసి కులాల నుండి బలంగా వినిపిస్తోంది. వారి డిమాండ్ లోనూ న్యాయముంది.
ఉదా: రెడ్డి, వెలమ, బ్రహ్మణ , క్షత్రీయ, కమ్మ , వైశ్య వర్గాలు సామాజికంగా ఉన్నతవర్గంగా కొనసాగుతున్నప్పటికీ అందరూ కోటీశ్వరులు కాదు.. కూటికి కూడా గతిలేక కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న వారు కోకొల్లలు.. సామాజిక హోదా ఒక్కటే కూడు పెట్టదు కదా..!? అలాగే ఎస్సీ, ఎస్టీ, బిసి వర్గాలలో అపర కుబేరులూ..ఉన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా అర్హులైన వారిలో ఎంత మందికి రిజర్వేషన్ల ఫలాలు అందుతున్నాయి? ఇక్కడా ధనవంతుల ప్రయోజనాలే కదా వాస్తవంగా నెరవేరుతున్నది..!? నిజానికి ఉన్నత వర్గాలని చెప్పబడుతున్న సామాజిక వర్గాలలోనూ అంతర్గతంగా ఎన్నో వైరుధ్యాలు.. మరెంతో వివక్ష ఉంది. రెడ్డిలలో గుడాటి కాపు, ముఠాఠి ( వీరినే మరాఠీ) కాపు, గోనే కాపు, చౌదరి రెడ్డి, క్యాథలిక్ రెడ్డిలని, అలాగే బ్రహ్మణుల్లో వైదికులు, వైష్ణవులు, శ్రీ వైష్ణవులు, నియోగులనీ.. వైశ్యుల్లో కోమట్లు, అరవ కోమట్లు అని భిన్నమైన తెగలున్నాయి.
ఇందులో ఆర్థికంగా కనీసం ఒక పూట కూడా తిండికి నోచుకోని వారి జనాభా లక్షల్లో ఉంది.
ఇకపోతే సామాజికంగా వెనకబడిన వర్గాలలోనూ సామాజిక అంతరాలు ఉన్నాయి. ఆర్థికంగా బలవంతులైన వారికి రిజర్వేషన్‌లు అవసరమా? అందుకే క్రిమిలేయర్ నిబంధనను అమలు చేయాలన్న వాదన ఉంది. రిజర్వేషన్లు దర్జాగా అనుభవిస్తున్న వారు వ్యతిరేకిస్తున్నారంటే అర్థముంది..! ఎందుకంటే ఆ నిబందన అమలు చేస్తే ఆర్థిక ప్రయోజనాల కంటే రాజకీయంగా తమ పట్టు సడలిపోతుంది కాబట్టి..! కానీ...దానిని కుల సంఘాల నాయకులే వ్యతిరేకిస్తున్నారంటే ఏమనుకోవాలి? వారు ఏవరి ప్రయోజనాల కోసం పోరాడుతున్నారని భావించాలి?
ప్రభుత్వాల ఓటు బ్యాంక్ మార్క్ రాజకీయాల పాపాల ఫలితంగా సామాజిక అసమానతల స్థానం లో ఆర్థిక అసమానతలు.. పొడసూపుతున్నాయి. రిజర్వేషన్ సిస్టం అంతిమంగా సామాజిక సంఘర్షణలకు దారితీస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా అక్కడక్కడా ఇలాంటి పరిణామాలకు సంబందించిన సంకేతాలు కనిపిస్తున్నాయి.
భారత్ రిపబ్లిక్ గా అవతరించే క్రమంలో రాజ్యాంగ రచనా సంఘం ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన షెడ్యూల్డ్ కులాలు, తెగలు, బలహీనమైన వర్గాలను ప్రధాన స్రవంతిలోకి తేవాలని లక్ష్యించి కేవలం పదేళ్ల పాటు మాత్రమే రిజర్వేషన్లు అమలు చేయాలని స్పష్టంగా పేర్కొన్నా తదనంతర కాలంలోనూ అది ఇంకా కొనసాగుతుండటానికి కారణాలు బహిరంగ రహస్యమే...!.
పాలకుల నిర్వాకం ఫలితంగా రాను రాను రిజర్వేషన్ల ఫలాలను అనుభవిస్తున్న వర్గాలు అవి తమ శాశ్వత హక్కులు గా పరిగణించే స్థాయికి చేరింది పరిస్థితి. ఫలితంగా సామాజికంగా ఉన్నతమైన వర్గంలో ఉన్నా అర్థికంగా వెనకబడ్డ వర్గాలలో అసహనం మొదలైంది. రాజ్యాంగం ఏ లక్ష్యంతోనైతే రిజర్వేషన్లు అమలు చేయాలని తలచిందో అది నెరవేరకపోగా అందుకు విరుద్ధంగా పరిస్థితులు మరింత దిగజారేందుకు కారణంగా మారిపోయింది.
రిజర్వేషన్ల రుచి మరిగిన పొలిటికల్ పార్టీలు ఫక్తు రాజకీయ ప్రయోజనాల కోసం అమలు చేస్తున్న ఇలాంటి రిజర్వేషన్ల రాష్టానికోరకంగా ఉండటాన్ని పరిశీలిస్తే వాటి అంతిమ లక్ష్యం ఏమిటో మనకు స్పష్టం గా అవగతమవుతుంది. ఇలాంటి తప్పుడు విధానాల వల్ల ఆర్థిక అంతరాలు పెరిగి సామాజిక అసమానతలు పెచ్చరిల్లుతున్నాయి. మద్యలో ఒకటి..రెండు సార్లు రిజర్వేషన్ సిస్టంను సంస్కరించేందుకు ప్రయత్నాలు జరిగినా పెద్ద ఎత్తున చెలరేగిన ఆందోళనలు ప్రభుత్వాల చేతులు కట్టిపడేశాయి.
నిజంగా అంబేద్కర్ గనుక ఇప్పుడు బ్రతికి ఉండి ఉంటే ప్రస్తుత దయనీయ పరిస్థితికి ఎంతగానో పశ్చత్తాప పడి ఉండే వారు.
Sadanand Bembre
Sr. Journalist
Vanchanagiri, Warangal
9985871111
No comments:
Post a Comment