Saturday, August 20, 2011

డీలాపడ్డ వైఎస్సార్ కాంగ్రెస్

 


కరీంనగర్, ఆగస్టు 19: జిల్లాలో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జగన్ ఆస్తులపై సిబిఐ చేపట్టిన దాడులతో పురిటిలోనే సంధికొట్టినట్లయింది. దాంతో నిన్న, మొన్నటి వరకు ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాలను చేపట్టిన శ్రేణులు ఒక్కసారిగా డీలాపడిపోయాయి. ఎంఆర్ ప్రాపర్టీస్ అవకతవకలతో పాటు అక్రమ ఆస్తులను కూడబెట్టారన్న ఆరోపణలపై రాష్ట్ర హైకో ర్టు ఆదేశాల మేరకు సిబిఐ విచారణ చేపట్టిన విషయం విధితమే. ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై దాడుల ప్రభావం తీవ్రంగా ఉండవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు తగ్గట్లుగానే కరీంనగర్ జిల్లాలో మొదటి నుంచి పడుతూ లేస్తూ ముందుకు నడుస్తున్న పార్టీ కార్యక్రమాలు గత నాలుగైదు రోజులుగా స్థబ్ధతకు గురయ్యాయి. కరీంనగర్ జిల్లాలో ఆ పార్టీకి బలమైన నాయకత్వం లేకుండా పోయింది. దాంతో మొదట్లో రామగుండంకు చెందిన రాజ్ ఠాకూర్ మక్కాన్‌సింగ్‌కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించి పార్టీని జిల్లాలో ముందుకు తీసుకెళ్లేందుకు నిర్ణయించారు. ఈ క్రమంలో వైఎస్‌కు బలమైన మద్ధతుదారులుగా గుర్తింపు పొందిన టిఆర్‌ఎస్ మాజీ రెబల్ కె.కె.మహేందర్ రెడ్డి, వేములవాడ దేవస్థానం మాజీ చైర్మన్ ఆది శ్రీనివాస్‌లు కాంగ్రెస్‌ను వీడి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. అదే సమయంలో మంథనికి చెందిన టిడిపి జడ్పీటిసి పుట్ట మధు కూడా వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరడంతో జిల్లాలో ఒక్కసారిగా ఆ పార్టీకి ఊపు లభించిన దాఖలాలు కన్పించాయి. పార్టీ శ్రేణులు కూడా రెట్టించిన ఉత్సాహంతో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఈ క్రమంలోనే మలివిడత తెలంగాణ ఉద్యమం పెద్దఎత్తున తెరపైకి రావడంతో సభ్యత్వ నమోదు ఆశించిన స్థాయిలో జరుగకుండా పోయింది. దానికి తోడు వైఎస్సార్ కాంగ్రెస్ మొదటి ప్లీనరీలో జగన్ గోడమీది పిల్లిలా ఆత్మరక్షణ దోరణి అనుసరించి తెలంగాణపై విధానాన్ని స్పష్టం చేయకపోవడంతో ప్రజల్లోకి వ్యతిరేక సంకేతాలు వెళ్లాయి. ఈ పరిణామాల క్రమంలో తెలంగాణ జిల్లాల నాయకత్వ బాధ్యతలను పునర్‌వ్యవస్థీకరించి కరీంనగర్ జిల్లా బాధ్యతలను పుట్టమధుకు అప్పగించారు. ఇప్పుడిప్పుడే పార్టీ కార్యక్రమాలు పట్టాలు ఎక్కుతున్న సమయాన ఊహించని రీతిలో హైకోర్టు జగన్ ఆస్తులను విచారించాలని తీర్పు వెలువరించడంతో పార్టీ శ్రేణులు ఒక్కసారిగా డీలాపడ్డాయి. రానున్న రోజుల్లో సిబిఐ చేపట్టిన విచారణలో ఎలాంటి అంశాలు వెలుగుచూస్తాయో, పార్టీ భవిష్యత్ ఎలా ఉండబోతుందోనన్న విషయమై పార్టీశ్రేణులు తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే రాజకీయ విశే్లషకులు మాత్రం జగన్‌పై సిబిఐ చేపట్టిన విచారణ నష్టం కంటే జగన్‌కు లాభమే అధికంగా చేకూర్చుతుందన్న భావనలు వ్యక్తమవుతుండడంతో జగన్‌పై కాంగ్రెస్,టిడిపిలు కుమ్మక్కై కక్షపూరితంగా వ్యవహరిస్తుండడం వల్లే సిబిఐ వంటి కక్ష పూరిత విచారణలు జరుగుతున్నాయన్న ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మంథని, గోదావరిఖని, కరీంనగర్‌లలో పార్టీ శ్రేణులు సిబిఐ విచారణకు నిరసనగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. మరో ఒకటి, రెండు రోజుల్లో పూర్తి స్థాయి కార్యాచరణతో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

No comments:

Post a Comment