మంచం పట్టిన పిల్లాపాప.. చావుబతుకుల్లో వృద్ధులు క్షయ వ్యాధితో తల్లడిల్లుతున్న చెంచులు అందని సర్కార్ వైద్యం.. నాటు వైద్యమే దిక్కు
August 19th, 2011
మహబూబ్‌నగర్, ఆగస్టు 18: నల్లమల అటవీ ప్రాంతంలో నివసించే ఆదిమ చెంచుజాతి తాండాలకు (పెంటలకు) విష జ్వరం సోకింది. విష జ్వరాలు, క్షయవ్యాధి, కీళ్లనొప్పులు, కంటి చూపు కోల్పోవడం, చిన్నపిల్లలకు వయస్సు పైబడుతున్న శారీరకంగా ఎదగలేకపోవడం, గర్భిణీ స్ర్తిలకు సోకుతున్న రోగాలు, వృద్ధులకు వచ్చిన విష జ్వరాలు చెంచు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. వచ్చిన రోగాలను ఎవరికి చెప్పుకోలేక నాటు వైద్యమే దిక్కుగా భావిస్తూ అడవిలో ఉన్న ఆకులు అలములతో నాటువైద్యం చేసుకుంటున్నారు. అయనా జ్వరాలు తగ్గకపోవడంతో చెంచుజాతి మనుగడకే ప్రశ్నార్థకంగా మారింది. మహబూబ్‌నగర్, ప్రకాశం, కర్నూల్, గుంటూరు, నల్గొండ జిల్లాల్లో సుమారు ఆరువేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న దట్టమైన అడవిలో ఆదిమ చెంచుజాతీయులకు సంబంధించిన 650కి పైగా పెంటలు ఉన్నాయి. ఈ చెంచుపెంటల్లో దాదాపు 35వేలకు పైగా జనాభా ఉంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని నల్లమల లోతట్టు, మైదాన ప్రాంతాలలో కలిపి దాదాపు 160 చెంచుపెంటలు, గ్రామాలు ఉన్నాయి. వీటిలో సుమారు ఎనిమిది వేలకు పైగా జనాభా ఉన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్, అచ్చంపేట, లింగాల, కొల్లాపూర్, బల్మూర్, పెద్దకొత్తపల్లి మండలాల పరిధిలో గల చెంచు ప్రజలు రోగాల బారినపడి మంచంపట్టారు. నల్లమలలోని దట్టమైన అటవీ ప్రాంతంలోని అప్పాపూర్, ఎర్రపెంట, ఈర్లపెంట, పుల్లాయపెంట, రాంపూర్‌పెంట, పరహాబాద్, కొమ్మెనపెంట, కొల్లంపెంట, తాటిగుండాల, సార్లపల్లి, పిల్లిగుండ్లు చెంచుపెంట, గీనుగండిపెంట, నర్సిములువాగు చెంచుపెంట, మల్లాపూర్‌పెంట, మెడిమలకలతో పాటు మరో 20 పెంటల్లో విష జ్వరాలు వచ్చి చెంచు ప్రజలు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. వీరికి సర్కార్ వైద్యం అందడం లేదు. వీరు నాటువైద్యాన్ని చేసుకుంటున్నారు. వందలాది మంది పిల్లలకు సైతం రోగాలు వచ్చాయి. గర్భిణీ స్ర్తిల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వారికి పోషకాహారం అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వందలాది మంది వృద్ధులు జ్వరాల బారిన పడి కంటి చూపు పోతుండడంతో అడవిలో ఉన్న ఆకుల రసం కళ్లలో పోసుకుని నాటువైద్యం చేసుకుంటూ బాధపడుతున్నారు. తమ దగ్గరకు సర్కార్ డాక్టర్లు ఎవరు రావడం లేదని చెంచులు చెబుతున్నారు. కొన్ని పెంటలకు చెందిన చెంచులు తాము ఇప్పటి వరకు డాక్టర్లు ఎలా ఉంటారో చూడలేదని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చెంచుపెంటలకు సోకిన విషజ్వరాల బారి నుండి చెంచులను కాపాడకపోతే ఆదిమ చెంచుజాతి మనుగడనే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం పొంచి ఉంది.
No comments:
Post a Comment