Friday, April 6, 2012

డాలర్ కల..దళారుల వల..!


సదానంద్ బెంబిరే
--------------------
ఆంధ్రభూమి బ్యూరో, కరీంనగర్,

ఏప్రిల్ 6:    డాలర్ కలల్లో మునిగి తేలుతున్న రాష్ట్ర యువకులు ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి దొడ్డిదారిన పరాయి దేశానికి పయనమవుతున్నారు. ప్రధానంగా అంతర్యుద్ధంతో కొట్టుమిట్టాడిన ఇరాక్‌లో పెద్దఎత్తున ప్రారంభమైన పునర్‌నిర్మాణ కార్యక్రమాలు ఇక్కడి కార్మికులకు కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయి. అన్ని వసతులు కల్పించి ప్రతీ నెల 325 నుంచి 500 డాలర్ల వరకు వేతనాలు చెల్లిస్తుండడంతో ఇరాక్‌కు వెళ్లేందుకు ఎగబడుతున్నారు. దీన్ని పసిగట్టిన విదేశీ నకిలీ మ్యాన్‌పవర్ కన్సల్టెన్సీలు బోగస్ వీసాలను సృష్టించి దొడ్డిదారిన తరలించినట్లు అనధికారిక గణాంకాల ద్వారా తెలుస్తోంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచే ఈ తరహా వలసలు అధికంగా కనిపిస్తుండగా కర్నూలు, కడప, తూర్పు గోదావరి జిల్లాల నుంచి కూడా భారీగానే ఉన్నట్లు చెబుతున్నారు. మానవ వనరులు చౌకగా లభించే దక్షిణాసియా ప్రాంతంలోని ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్ వంటి దేశాలకు చెందిన కార్మికులను మాత్రమే లక్ష్యంగా చేసుకొని ఏజెన్సీలు పెద్దఎత్తున అక్రమ నియామకాలకు పాల్పడుతున్నట్లు భావిస్తున్నారు. దౌత్యపరమైన అడ్డంకులు ఎదురవుతున్న దృష్ట్యా సౌదీ అరేబియా, ఓమన్ దేశాలకు చెందిన ఏజెంట్లు నకిలీ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీలను సృష్టించి ఇక్కడి కార్మికులకు ఓమన్‌లో ఉపాధి కల్పిస్తున్నట్లు నకిలీ వీసాలు సృష్టించి కార్మికులను ఢిల్లీ నుంచి ఓమన్‌కు తరలిస్తున్నారు. రెండు నెలలు మొదలుకొని ఆరు నెలల కాల పరిమితితో కూడిన విజిట్ వీసాలను ఇచ్చి ఇరాక్‌లోని కుర్దిస్థాన్‌కు తరలిస్తున్నారు. కాలపరిమితి ముగిసిన తరువాత కూడా అక్కడే మకాం వేయడంతో కుర్దిష్ పోలీసులు ఇలాంటి సుమారు 400 మంది కార్మికులను అరెస్టు చేసి జైళ్లలోకి తోయడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది. దురదృష్టవశాత్తు కార్మికులు మరణిస్తే వారి మృతదేహాలను తీసుకొచ్చేందుకు దౌత్యపరంగా కూడా అనేక చిక్కులు తలెత్తుతున్నట్లు చెబుతున్నారు. గతంలో మనుషుల అక్రమ రవాణాపై పెద్దఎత్తున ఆరోపణలు రావడంతో స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందాలు తెలంగాణ జిల్లాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి వందల సంఖ్యలో ఏజెంట్లను అరెస్టు చేశారు. దాంతో రూటు మార్చిన మ్యాన్‌పవర్ కన్సల్టెన్సీలు ఇరాక్‌లో ఉపాధి పొందుతున్న స్థానికుల సహాయంతో ఫోన్ టు ఫోన్ నెట్‌వర్క్‌తో పనులు చక్కబెట్టుకుంటూ ఓమన్ ఏజెన్సీల ద్వారా ఇండియాకు వీసాలు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
కరీంనగర్ జిల్లా ధర్మపురి మండలం దొంతాపూర్ గ్రామం విదేశీ రాకపోకలతో ఎపుడు సందడిగా ఉంటుంది. ఊరి జనాభా మూడు వేలు ఉంటే ప్రస్తుతం 1200 ల మందికి పైగా సౌదీ అరేబియా, ఓమన్, ఖతర్‌తో సహా ఇరాక్ వంటి దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. ఈ ఊళ్లో 50 ఏళ్లు పైబడిన వృద్ధులు, 17 ఏళ్లలోపు పిల్లలు,మహిళలు మాత్రమే కనిపిస్తారు.

No comments:

Post a Comment