Monday, August 8, 2011

ఎడతెగని పంచాయితీ


-
కేరళ రాష్ట్రంలోని తొట్టపల్లి గ్రామంలో ఉన్న క్రైస్తవ కుటుంబానికి, ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా సుండుపల్లి గ్రామంలో ఉన్న హిందూ కుటుంబానికి మధ్య ఉన్న దూరం 900 కిలోమీటర్లు. భిన్న భాషలు, సంస్కృతి వీరి మధ్య ఉన్నప్పటికీ కువైట్‌లో జరిగిన హత్య కేసులో వీరి మధ్య రాజీ కుదిరింది. కరీంగనర్ జిల్లా మానేరు నదీ తీరంలోని గ్రామం, బంగ్లాదేశ్‌లోని బ్రహ్మపుత్ర నదీ తీరంలోని మరో గ్రామంలో కుటుంబానికి మధ్య బంగాళాఖాతమంత వ్యత్యాసం ఉంది.

అయినా దుబాయిలోని ఒక హత్య కేసులో రాజీ కుదిరింది. భారత్, పాకిస్తాన్‌ల మధ్య భౌగోళిక దూరం పెద్దగా లేకున్నా సరిహద్దు ప్రాంతంలో రెండు దేశాల మధ్య పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా, ఘర్షణపూరితంగా ఉంటాయి. ఇంత ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగిన ఒక హత్య కేసులో ఇరు వర్గాల మధ్య రాజీ కుదిరింది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఇరుగుపొరుగున ఉన్న గ్రామాలు, అందునా సొంత గిరిజన తెగకు చెందిన వారి మధ్య ఒమాన్‌లోని ఒక హత్య కేసులో సయోధ్య కుదరడం లేదు.

గల్ఫ్ దేశాలలోని ఇస్లామిక్ చట్టాల ప్రకారం హత్య కేసుల్లో నయా పైసా లేకుండా హతుడి కుటుంబసభ్యులు క్షమాభిక్ష పెట్టి హంతకుడి ప్రాణాన్ని కాపాడవచ్చు లేదా 100 కోట్లు ఇవ్వజూపినా తిరస్కరించి శిక్షకు పట్టుపట్టవచ్చు. రియాద్‌లో ఒక సౌదీ జాతీయుడి మృతికి కారణమైన భారతీయుడిని నయాపైసా లేకుండా సౌదీ కుటుంబం క్షమి ంచి వదిలిపెట్టింది. మ రో కేసులో 120 మిలియన్ డాలర్ల దియా ను హంతకుని కుటుం బం ఇవ్వజూపినా హతుని కుటుంబం ససేమిరా అనడంతో హంతకుడికి మరణ శిక్ష అమలు చేశారు.

ముంబాయి మాఫియా డాన్లు ఛోటా రాజన్, దావూద్ ఇబ్రహీంల మధ్య తలెత్తిన వివాదంలో ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. మృతుని భార్య కోట్ల రూపాయల దియాకు ఆశపడి రాజీకి సిద్ధపడింది. దావూద్ ఇబ్రహీం ముఠా హెచ్చరికలతో రాజీ కుదరకపోవడంతో హంతకునికి దుబాయిలో మరణ శిక్షను అమలు చేశారు. దుబాయిలో ప్రమాదవశాత్తూ ఒక బంగ్లాదేశీ జాతీయుడి మృతికి కారణమైన కరీంనగర్ జిల్లా గంభీరావుపేట మండలానికి చెందిన అంబోట్టి శ్రీనివాస్‌ను మృతుని కుటుంబం 12 లక్షల రూపాయలు తీసుకొని క్షమించడంతో జైలు నుంచి విడుదలయ్యాడు.

తనపై అత్యాచారానికి ప్రయత్నించిన ఒమానీ జాతీయుడిని 17 సార్లు దారుణంగా పొడిచి హత్య చేసిన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలానికి చెందిన శ్రీనివాస్‌ను మస్కట్ న్యాయస్థానం ఎలాంటి శిక్ష లేకుండా విడుదల చేసింది. దురుద్దేశపూర్వకంగా చేసే హత్యలలో మాత్రం ఎలాంటి సానుభూతి లభించదు. కానీ దియా ద్వారా ఇరుపక్షాలు పరస్పరం సయోధ్య కుదుర్చుకుంటే హంతకులను విడుదల చేసే విధానం గల్ఫ్‌దేశాలలో ఉంది.

ఈ రకంగా నిన్న షార్జాలో మరణశిక్షను ఎదుర్కొంటున్న 17 మంది భారతీయులు ప్రాణగండం నుంచి తప్పించుకొన్నారు. లేబర్ క్యాంపులలో సారా విక్రయం కోసం ఆధిపత్య పోరులో భాగంగా ఒక పాకిస్తానీ జాతీయుడిని దారుణంగా హత్యచేసిన 16 మంది పంజాబీలు (ఒకరు హర్యానా వాసి) పాకిస్తాన్‌లో ని మృతుని కుటుంబానికి ముప్పై నా లుగు లక్షల దిర్హాం లు (సుమారు నా లుగు కోట్ల 15 లక్ష ల రూపాయలు) దియా చెల్లించడానికి ఒప్పుకోవడం తో న్యాయస్థానం శిక్షను రద్దు చేసేందుకు అంగీకరించింది. ఇం దులో ఒక్క నయాపైసా కూడా కేంద్రం గానీ పంజాబ్ ప్రభుత్వం గానీ ఇవ్వలేదు.

దుబాయిలో ఉన్న పంజాబీ సిక్కులు ఈ భారీ మొత్తాన్ని చెల్లిస్తున్నారు. సరిహద్దులకు ఇరువైపుల ఉన్న పంజాబీలు సయోధ్య కుదుర్చుకోనున్నారు. అంతకు ముందు కువైట్‌లో జరిగిన కడప జిల్లాకు చెందిన సుండుపల్లి సురేశ్ హత్య కేసులో కేరళకు చెందిన సీమాల్ రాజీని మొదట రెండు లక్షల రూపాయలు ది యాగా తీసుకొని క్షమిస్తామని సురేశ్ కుటుంబం ఒప్పుకుంది.

తర్వాత ఆరు లక్షలు, చివరకు 15 లక్షల రూపాయలు తీసుకొని అతనిని క్షమించింది. ఈ కేసులో కేరళ ప్రభుత్వం అధికారికంగా ఏమీ చేయలేదు, అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి వ్యక్తిగత శ్రద్ధ తీసుకున్నారు. ఈ 15 లక్షలకు తోడుగా కువైట్ న్యాయస్థానంలో కేసును వాదించిన న్యాయవాదికి అదనంగా రూ.6 లక్షలను సౌదీలోని ఒక మలయాళీ చెల్లించారు.

కానీ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేసరికి ఈ రకమైన రాజీ పరిష్కార మార్గాలు కనిపించడం లేదు. తీవ్ర నేరారోపణలు, ప్రత్యేకించి దొంగతనం చేస్తున్న సందర్భాలలో హత్యలు చేస్తూ ఆం«ద్రులు పలు కేసుల్లో ఇరుక్కుపోతున్నారు. రెండు సంవత్సరాల క్రితం షార్జాలో జరిగిన నిజామాబాద్ జిల్లా దెగ్గాం కేసులో హంతకులందరూ దొంగలే. ప్రస్తుతం ఉన్న కేసులో కూడా తమ దొంగతనానికి అడ్డుపడడంతో సెక్యూరిటీ గార్డును హతమార్చిన కేసులో అయిదుగురు కరీంనగర్ జిల్లా వాసులు శిక్షను అనుభవిస్తున్నారు.

ఇప్పుడు ఒమాన్ న్యాయస్థానంలో నడుస్తున్న ఒక కేసులో కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ప్రాంతానికి చెందిన ముగ్గురు గిరిజనులు తమతో పాటు ఉంటున్న మరో గిరిజనుడు లకావత్ నారాయణను 2009లో దారుణంగా హత్య చేసారు. దీనికి సంబంధించి పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయి. మృతుడి భార్యతో సయోధ్య కుదుర్చుకొని పరస్పరం అంగీకరించుకొని దియాను చెల్లిస్తే ముగ్గురు హంతకులకు శిక్షతగ్గి విడుదలయ్యే అవకాశం ఉంది.

కానీ ఈ కుటుంబాల మధ్య రాజీ కుదరడం లేదు. రాజీ అనేది ఇరు కుటుంబాలు పరస్పరం శాంతియుతంగా, స్నేహభావంతో, విశ్వాసంతో, క్షమాగుణంతో చేయాల్సిన పని. దీనికి గల్ఫ్ చట్టాలను ఆసరాగా చేసుకుని పెద్దమొత్తంలో నష్టపరిహారం కూడా తీసుకోవచ్చు. కానీ అధికారిక లేదా రాజకీయ ఒత్తిళ్ళతో రాజీ సాధించడం అనేది తప్పు. పైగా దొంగతనం, హత్య కేసు నిందితులని కూడా మనం మరవకూడదు. ఈ రకమైన కేసులు ఇంకా ఉన్నాయి.

బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లతో పాటు మన రాష్ట్రంలోని కేరళ కేసులో రాజీ కుదరగా లేనిది కేవలం 15 కిలోమీటర్ల దూరం లేని వట్టిమల్ల, వీరన్నపల్లి లంబాడీ తండాల మధ్య ఎందుకు సాధ్యం కావడం లేదు.

No comments:

Post a Comment